దేశీయ ఆయుర్వేద దార్శనికుడు
ABN , Publish Date - May 30 , 2026 | 03:09 AM
సమాజానికి ఎంతో ఉపకారం చేసిన కొందరు పెద్దలు మహా నిశ్శబ్దంగా నిష్క్రమిస్తుంటారు. అటువంటి కోవకు చెందినవారే మోటూరి కృష్ణప్రసాద్ (64). ఈ నెల 19న ఆయన తనువు చాలించారు. బాల్య స్నేహితులు...
సమాజానికి ఎంతో ఉపకారం చేసిన కొందరు పెద్దలు మహా నిశ్శబ్దంగా నిష్క్రమిస్తుంటారు. అటువంటి కోవకు చెందినవారే మోటూరి కృష్ణప్రసాద్ (64). ఈ నెల 19న ఆయన తనువు చాలించారు. బాల్య స్నేహితులు, కుటుంబసభ్యులు, వివిధ రంగాల ప్రముఖులు, వామపక్ష పార్టీల ప్రతినిధులు ఆయనకు అంతిమ నివాళులు అర్పించారు. ఆయుర్వేదంతో కొన్ని రకాల బయో మాలిక్యులర్ ఔషధాలు తయారుచేసిన మన కాలపు ధన్వంతరి. క్యాన్సర్‌కి, మోకాళ్ల నొప్పుల ఉపశమనానికి ఆయన విశేష ప్రయోగాలు చేసి ఔషధాలు రూపొందించారు. కరోనా కాలంలో మూలికా వైద్యంతో ఆయన సాధించిన అద్భుత ఫలితాల గురించి ఎంత చెప్పినా తక్కువే.
కృష్ణప్రసాద్ తల్లి వెంకటరత్నమ్మ, తండ్రి అప్పలనర్సయ్య చౌదరి. వారి స్వస్థలం కృష్ణా జిల్లాలోని కొమరవోలు. కానీ స్థిరపడింది హైదరాబాద్‌లోని పురానాపూల్ ప్రాంతంలో. కృష్ణప్రసాద్ ఇక్కడే పుట్టి పెరిగారు. పాతబస్తీలోని సెంట్ మార్క్స్ బాయిస్ టౌన్ హైస్కూల్లో చదివారు. కోఠీలోని చైతన్య కళాశాలలో ఇంటర్ బైపీసీ చేశారు. ఆ సమయంలో ఏఐఎస్ఎఫ్‌లో చేరి చురుకైన కార్యకర్తగా వ్యవహరించారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ స్పిన్నింగ్ మిల్స్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా కొన్నాళ్లు వ్యవహరించారు. వివిధ రంగాల్లో అనేక కంపెనీలను నెలకొల్పిన కృష్ణప్రసాద్, ఆ తర్వాత ‘ట్రైడెంట్ కంట్రోల్స్ ప్రైవేట్ లిమిటెడ్’ సంస్థని స్థాపించి టాటా స్టీల్స్‌కి ‘సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్’ రిపోర్టులు తయారుచేసే బాధ్యతలు స్వీకరించారు. ఇలా ఒకటి కాదు- బహు రూపాల్లో ఆయన కృషి కొనసాగింది.
నిజానికి ఆయన జీవనయానంలో 2008 అత్యంత కీలక సంవత్సరం. ఆ ఏడాది ఆయనకు డయాబెటిక్ న్యూరోపతి వచ్చి కదలలేని స్థితి వచ్చింది. దానికి సరైన మందులు లేక తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. సైన్స్ విద్యార్థి కావడంతో పాటు ప్రాచీన భారత ఆయుర్వేదం పట్ల అపారమైన గురి ఉండటంతో బయో మాలిక్యులర్ మెడిసిన్స్ దిశగా పరిశోధనలు మొదలుపెట్టారు. తనే లాబొరేటరీగా, తన శరీరమే క్లినికల్ ట్రయల్స్‌కి వేదికగా అనేక ప్రయోగాలు చేసి 2010 నాటికి మందు తయారుచేసి, వాడారు. మళ్లీ నడక వచ్చింది. తర్వాత ఆ మందు వాడిన ఎందరో కోలుకున్నారు. అలా ఆయుర్వేదంతో ప్రయాణం మొదలుపెట్టి క్యాన్సర్‌కి, కీళ్లనొప్పులకి ఉపశమన మందులు తయారుచేశారు. మంచి ఫలితాలతో పాటు ప్రచారమూ లభించింది. పేదలకు ఉచితంగా లేదా స్వల్ప రుసుముతో మందులు అందించాలన్నది ఆయన ప్రధాన ధ్యేయం.
ఇదంతా ఒక ఎత్తయితే ప్రపంచంపై కొవిడ్ విజృంభణ మొదలు కాక ముందు అంటే- 2019 సెప్టెంబర్ ప్రాంతంలో కృష్ణప్రసాద్ సన్నిహితులు ఇద్దరికి జ్వరం,- దగ్గు-, తలపోటు-, ఒళ్లు నొప్పులు వచ్చి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అంతకు ముందు వారు చైనాలో పర్యటించి వచ్చారు. కృష్ణప్రసాద్‌ని సంప్రదిస్తే ఆయన వారికి ఒక కషాయం తయారుచేసి ఇచ్చారు. అది బాగా పనిచేసింది. మూడు రోజుల్లోనే వారిద్దరూ పూర్తిగా కోలుకున్నారు. చైనా వెళ్లి వచ్చిన మరో ఐదారుగురు కూడా ఆ మందుతో తెరిపినపడ్డారు. 2019 చివరిలో చైనాని వణికించిన కరోనా వైరస్ 2020 జనవరి నాటికి ప్రపంచమంతా విస్తరించింది. మన దేశంలో లాక్‌డౌన్ ప్రకటించారు. జనజీవితం స్తంభించిపోయింది. కృష్ణప్రసాద్ తయారుచేసిన మందు కరోనా వైరస్‌ని తట్టుకునేలా రోగనిరోధక శక్తిని పెంచుతోందని ఆ నోటా ఆ నోటా తెలుసుకున్న చాలా మంది ఆ మందు వాడారు. ఉపశమనం కనిపించింది. పరిస్థితి తీవ్రత దృష్ట్యా కొవిడ్ మందుకి బాగా డిమాండ్ ఉందన్న విషయాన్ని కృష్ణప్రసాద్ గ్రహించారు. ప్రత్యేక శ్రద్ధతో అస్సోం, ఉత్తరాఖండ్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు శేషాచలం వంటి దట్టమైన అడవుల నుంచి ఔషధ గుణాలున్న మూలికలు తెప్పించి భారీ స్థాయిలో ఉత్పత్తి మొదలుపెట్టారు. కొవిడ్ కిట్ రూపొందించారు. సన్నిహిత మిత్రుల సహకారంతో పంపిణీని చేపట్టారు. ఆయన తయారుచేసిన కొవిడ్ మందు సమర్థతని సీసీఎంబీ ధృవీకరించింది.
కృష్ణప్రసాద్ స్వయంగా కొవిడ్ మందుల తయారీ కోసం ‘బయోగ్రీన్ రెమిడీస్ ప్రైవేట్ లిమిటెడ్’, ‘మెడ్యూర్’ అనే కంపెనీలు స్థాపించారు. సొంత వనరులు ఉపయోగించి మందులు తయారుచేసి తన మిత్రబృందం ద్వారా పంపిణీ చేశారు. ఎవరికి వారు సొంత ఖర్చులతో అనేక ప్రాంతాలకు వెళ్లి కొవిడ్ నివారణ మందులు అందజేసేవారు. లాక్‌డౌన్‌లో రవాణాకి అనుమతులు ఉన్న వాహనాల డ్రైవర్లు, గూడ్స్ ట్రైన్ డ్రైవర్లు, గార్డుల ద్వారా కూడా పంపిణీ చేసేవారు. కొవిడ్ పాసులు సంపాదించి సొంత వాహనాల్లో తిరుగుతూ మందులు పంచేవారు. ఆసుపత్రుల్లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పేషెంట్లకి కూడా ఈ మందు అందేలా చేశారు. వేలాది మందికి ఇదొక ‘బయో వ్యాక్సిన్’ మాదిరిగా పనిచేసింది. టాలీవుడ్‌కి చెందిన ఎందరో ప్రముఖులు ప్రత్యేకంగా ఫోన్ చేసి మరీ ఈ మందు తెప్పించుకుని వాడిన సందర్భాలున్నాయి. ఆయన తయారుచేసిన మందు 22 రకాల వైరస్‌ల ప్రభావాన్ని నియంత్రిస్తుందని కొందరు పరిశోధకులు చెప్పారు!
ఏమీ ఆశించకుండానే ఇంత గొప్ప సేవ చేసిన కృష్ణప్రసాద్ లాంటి వ్యక్తులు అరుదుగా ఉంటారు. గుండెపోటు వల్ల ఆయన మనందరికీ దూరమయ్యారు. మన దేశం కంటే ముందే ఇతర దేశాలవారు ఆయన ఘనతని గుర్తించారు. గత ఏడాది మలేసియా యూనివర్శిటీ ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. లండన్‌కి చెందిన ఒక సంస్థ ఆయనను ‘బెస్ట్ బయో మాలిక్యులర్ మెడిసిన్స్ ఇన్వెంటర్’ అనే అవార్డుతో సత్కరించింది. ‘లివ్ లైఫ్ కింగ్ సైజ్’ పేరుతో కృష్ణప్రసాద్ ఆంగ్లంలో ఓ పుస్తకం రాశారు. దానిని మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ ఆవిష్కరించారు. తను ఏ పనిలో ఉన్నా సరే సామాజిక ఉద్యమాలవైపు కృష్ణప్రసాద్ ఓ చూపు ఉంచేవారు. ఆ మధ్య ఖమ్మం జిల్లాలోని భూదాన్ భూముల పరిరక్షణ కోసం జరిపిన రౌండ్ టేబుల్ సమావేశంలో గట్టిగా గొంతెత్తారు. ఇండియన్ నేషనల్ యాక్టివిస్ట్స్ మూమెంట్ అనే సంస్థకి ఆయన జాతీయ అధ్యక్షులుగా కొనసాగారు. తన తండ్రి అప్పలనర్సయ్య చౌదరి 1942లో పశ్చిమబెంగాల్‌లోని ఖరగ్‌పూర్‌లో ‘తెలుగు విద్యాపీఠం’ పేరుతో ఏర్పాటుచేసిన పాఠశాలకి అనేక దఫాలు ఆర్థిక సాయం అందించారు. ఏ పార్శ్వం నుంచి చూసినా ఎన్నదగిన విశిష్ట వ్యక్తిత్వం కలిగిన కృష్ణప్రసాద్ ఆకస్మికంగా మన మధ్య నుంచి వెళ్లిపోవడం విషాదకరం.
ఒమ్మి రమేష్‌బాబు
(రేపు హైదరాబాద్‌లో మోటూరి కృష్ణప్రసాద్ సంస్మరణ)
ఈ వార్తలు కూడా చదవండి..
మహానాడు 2026 విజయం.. మీ అందరికీ అంకితం: మంత్రి లోకేశ్
మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి కన్నుమూత
For More AP News And Telugu News