Share News

Modis India And The New Myth: మోదీ భారత్‌లో కొత్త మిథ్యావాదం

ABN , Publish Date - Jan 17 , 2026 | 05:39 AM

సంక్రాంతి పండుగ జరుపుకున్న ఆనందోత్సాహాలలో ఉండివుంటారు కదూ, శుభవార్తలే నివేదిస్తాను. ఎందుకంటే అవే వెల్లువెత్తుతున్నాయి మరి. రిటైల్‌ ద్రవ్యోల్బణం (వినియోగ వస్తువుల...

Modis India And The New Myth: మోదీ భారత్‌లో కొత్త మిథ్యావాదం

సంక్రాంతి పండుగ జరుపుకున్న ఆనందోత్సాహాలలో ఉండివుంటారు కదూ, శుభవార్తలే నివేదిస్తాను. ఎందుకంటే అవే వెల్లువెత్తుతున్నాయి మరి. రిటైల్‌ ద్రవ్యోల్బణం (వినియోగ వస్తువుల ధరల సూచీ ద్రవ్యోల్బణం అని కూడా అంటారు) 1.33 శాతం; 2025–26 ఆర్థిక సంవత్సరానికి స్థూల దేశీయోత్పత్తి పెరుగుదల రేటు 7.4 శాతంగా అంచనా వేశారు. భేష్‌. మరొక భేష్‌ను కూడా మనం జోడించి తీరాలని నేను భావిస్తున్నాను. ఎందుకు? మన సువిశాల భారతదేశంలో ఎక్కడా నిరుద్యోగమనేది లేదు. కనీసం మనకు కలవరపాటు కలిగించే లేదా కలవరం చెంది తీరాల్సిన తరహా నిరుద్యోగం లేనేలేదు!

ఉద్యోగాలు కోరుకునేవారే లేరు! సహేతుకమైన కారణాలతోనే నేను ఈ మాట అంటున్నాను. ప్రభుత్వంలోను, ప్రభుత్వ అనుబంధ సంస్థలలోను వేలాది ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. అయినా వాటిని కోరుకునేవారు లేరు. అవి ఎంతకూ భర్తీ కావడం లేదు. మంచి వేతనం (8వ వేతన సంఘం ఇంకా పెంచుతుంది), కరువు భత్యం, వార్షిక వేతన పెంపుదలలు, ప్రమోషన్లు, ఉద్యోగ భద్రత, వైద్య సదుపాయాలు, హెచ్‌ఆర్‌ఏ, ప్రయాణ రాయితీలు, వేతన లబ్ధితో సెలవులు, అడ్వాన్స్‌లు, రుణ సదుపాయాలు, యూనిఫైడ్‌ పెన్షన్‌ స్కీమ్‌ – సుఖవంతమైన జీవితానికి ఇంతకు మించిన భరోసా ఏముంటుంది? అయినా యువతీయువకులు ఈ ఉద్యోగాలను తీసుకోవడానికి ముందుకు రావడం లేదు. ఉద్యోగ ఆరాటం లేని తరం కాబోలు ఇది. ప్రభుత్వం వేలాది ఉద్యోగాలను మంజూరు చేసింది. అయినా అవి ఖాళీగానే ఉంటున్నాయి. ఈ అసాధారణ పరిస్థితిని చూస్తుంటే మీకేమనిపిస్తుంది? నిరుద్యోగం లేదని, ఉద్యోగాలకు అరాటడుతున్నవారు లేరనే కాదూ?

విద్యా మంత్రిత్వశాఖ సమాచారం ప్రకారం ఏప్రిల్‌ 1, 2024 నాటికి కేంద్రీయ విశ్వవిద్యాలయాలలో మంజూరు అయిన, ఖాళీగా ఉన్న ఉద్యోగాల లెక్కలు ఇలా ఉన్నాయి: బోధనా సిబ్బంది– మంజూరు అయినవి 18,940 కాగా ఖాళీగా ఉన్నవి/ భర్తీ కానివి 5,060; బోధనేతర సిబ్బంది ఉద్యోగాలు: మంజూరు అయినవి 35,640 కాగా ఖాళీగా ఉన్నవి, భర్తీ కానివి 16,719. మరింత స్పష్టంగా చెప్పాలంటే కేంద్రీయ విశ్వవిద్యాలయాలలో 27శాతం అధ్యాపక ఉద్యోగాలు, 47శాతం బోధనేతర సిబ్బంది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. జూన్‌ 2025 నాటికి కేవీఎస్‌ (కేంద్రీయ విద్యా సంగథన్‌)లో 7,765 బోధనా సిబ్బంది పోస్టులు, ఎన్‌వీఎస్‌ (నవోదయ విద్యాసమితి)లో 4,323 ఉపాధ్యాయ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అయినప్పటికీ విద్యారంగం ప్రవర్ధమానమవుతోందని ప్రభుత్వం నిశ్చిత స్వరంతో చెప్పుతోంది.


విద్యారంగంలోనే కాదు, ఇతర రంగాలలోనూ ఉద్యోగ ఖాళీలు పుష్కలంగా ఉన్నాయి. కేంద్ర సాయుధ పోలీసు దళాలు (సీఏపీఎఫ్‌)లో 25,487 కానిస్టేబుల్‌ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. రాజస్థాన్‌లో ఎల్‌డీసీ/క్లర్క్‌ కేడర్‌–2 లో 10,664 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. బిహార్‌లో 12,199 ఖాళీలు ఉన్నాయి. యూపీలో 60,244 కానిస్టేబుల్‌ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. తమిళనాడులో 2,255 స్టాఫ్‌ నర్సు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నర్సింగ్‌ ఉద్యోగాలు ఆశించేవారు పాఠశాల విద్య పూర్తి చేసిన లేదా పట్టభద్రులు అయిన దిగువ మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారయి ఉండడం కద్దు.

దేశవ్యాప్తంగా 21 ఏఐఐఎమ్‌ఎస్‌ (ఆల్‌ ఇండియా ఇనిస్టిట్యూట్స్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌)లో 3,485 మంది అధ్యాపక పోస్టులు ఉండగా 1,731 అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఒడిషాలోని కేంద్రపారా జిల్లాలో 1,087 డాక్టర్లు, పారా మెడిక్స్‌ ఉండగా 805 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మన సమాజంలో బ్యాంకు ఉద్యోగాలు ప్రతిష్ఠాత్మకమైనవిగా ఉన్నాయి. వాటి వేతనభత్యాలే అందుకొక కారణం. 12 ప్రభుత్వ రంగ బ్యాంకులలో ఉద్యోగాల పరిస్థితి ఇలా ఉంది: ఆఫీసర్లు 4,20,599; క్లర్క్‌లు–2,43,817; సబ్‌ స్టాఫ్‌–84,092. ఉద్యోగ ఖాళీలు: ఆఫీసర్లు 17,500; క్లర్క్‌లు 12,861; సబ్‌ స్టాఫ్‌ 2,206. కలత చెందవద్దు. ఆంతరంగిక భద్రత, ఆరోగ్య భద్రత, బ్యాంకింగ్‌ రంగాలలో అంతా సవ్యంగా ఉంది. నిర్దిష్ట విద్య, ఉద్యోగ నైపుణ్యాలు ఉన్న యువతను అగ్రశ్రేణి కంపెనీలతో అనుసంధానించేందుకు ప్రభుత్వ మద్దతు ఉన్న కార్యక్రమం ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్‌ స్కీమ్‌ అక్టోబర్‌ 2024లో ప్రారంభించారు. కంపెనీలకు రెండు విడతలుగా చేసిన 1,65,000 ప్రతిపాదనలలో 20 శాతం మాత్రమే ఆమోదం పొందాయని డిసెంబర్‌ 2, 2025న ఒక జాతీయ దినపత్రిక వెల్లడించింది. వీరిలో ఐదోవంతు మంది ఇంటర్న్‌షిప్‌ పూర్తికాకముందే వెళ్లిపోయారని కూడా ఆ పత్రిక పేర్కొంది.


అభివృద్ధి చెందుతున్న భారత్‌లో నిరుద్యోగం ఒక సమస్య కాదని విశ్వసిస్తున్నవారు ఈ వ్యాసాన్ని ఇంతటితో చదవడం ఆపివేయవచ్చు. నిరుద్యోగం ఒక తీవ్ర సమస్యగా ఉందని భావిస్తున్నవారు వ్యాసాన్ని పూర్తిగా చదవండి. సత్యాన్ని ఒప్పుకోవాలి. ప్రభుత్వ వ్యవస్థల్లో ఉద్యోగ ఖాళీలు పెద్ద సంఖ్యలో ఉండడం, అవి భర్తీ కాకపోవడం అనేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ పాలన లోనే కాదు, అంతకు ముందు నుంచీ ఉన్నది. దశాబ్దాలుగా ఉన్నది అనేది ఒక చేదు సత్యం. అయితే బీజేపీ పాలనలో సంభవించిన రెండు సంఘటనలతో ఆ పరిస్థితి మరింతగా పెచ్చరిల్లింది.

గతం పాపంలా వెంటాడుతోంది సుమా! ఆ రెండు సంఘటనల్లో మొదటిది నల్లధనంపై పోరాటం లేదా నోట్ల రద్దు (డీమానిటైజేషన్‌). ఇది మానవ తప్పిదమే. స్వయంగా చేసుకున్న తీవ్రగాయమిది. గతంలో నేను వ్యాఖ్యానించినట్టుగా ఈ నోట్ల రద్దు (డీమానిటైజేషన్‌) కచ్చితమైన అర్థంలో నోట్ల రద్దు కాదు. ఎందుకని? మోదీ సర్కార్‌ చేసిన నోట్ల రద్దులో ఏ కరెన్సీ నోట్లను చెల్లనివిగా చేయలేదు. అంటే రద్దు చేయలేదు. కరెన్సీ నోట్ల చెలామణి వ్యవస్థ నుంచి వాటిని తీసివేయనూ లేదు. ‘పాతనోట్లను తీసుకుని కొత్త నోట్లు ఇచ్చేందుకు’ ప్రతిపాదించిన పథకమది. చెలామణిలో ఉన్న కరెన్సీ మొత్తం విలువను పాత స్థాయికి పునరుద్ధరించిన పథకమది. నిజానికి పునరుద్ధరింపబడిన కరెన్సీ విలువ పాత స్థాయికి మించి ఉన్నది. నవంబర్‌ 4, 2016న చెలామణిలో ఉన్న కరెన్సీ మొత్తం విలువ రూ.17.97 లక్షల కోట్లు కాగా, డిసెంబర్‌ 2025 తుది రోజుల నాటికి చెలామణిలో ఉన్న కరెన్సీ మొత్తం విలువ రూ.39.24 లక్షల కోట్లు. అందుకు రెట్టింపు కంటే చాలా అధికంగా ఉన్నది. నోట్ల రద్దుతో వాటిల్లిన మహా దుష్ఫలితం వేలాది చిన్నతరహా, మధ్యతరహా పరిశ్రమల మూసివేత. లక్షలాది ఉద్యోగాలు ధ్వంసమయ్యాయి. ఈ వాస్తవాన్ని మోదీ ప్రభుత్వం ఈనాటికీ అంగీకరించడం లేదు అఖిల భారత వ్యాపార మండలి వెల్లడించిన వివరాల ప్రకారం 2016లో 6,25,00,000 చిన్న వ్యాపార సంస్థలు ఉండేవి. వాటిలో 48శాతం గత దశాబ్దంలో మూతపడ్డాయి.


రెండో సంఘటన కోవిడ్‌. ఈ మహమ్మారి కారణంగా 14శాతం సూక్ష్మ, చిన్నతరహా, మధ్యతరహా పరిశ్రమలు శాశ్వతంగా మూతపడ్డాయని 2022లో ఒక సర్వే వెల్లడించింది. జూలై 2020–ఫిబ్రవరి 2025 మధ్య అంటే కోవిడ్‌ అనంతర కాలంతో కూడా కలుపుకుని మొత్తం 75,000 రిజిస్టర్డ్‌ ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలు మూతపడ్డాయని ప్రభుత్వ నివేదిక ఒకటి వెల్లడించింది. ఫిబ్రవరి 2022 నాటికి భారత్‌లో 47శాతం ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలు శాశ్వతంగా గానీ లేక తాత్కాలికంగా గానీ మూతపడ్డాయని ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ అంక్టాడ్‌ (యునైటెడ్‌ నేషన్స్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ ట్రేడ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ) అంచనా వేసింది. ఈ అంకెలు అన్నీ ధ్రువీకరింపబడినవి కానప్పటికీ చాలావరకు విశ్వసనీయమైనవేనని ప్రజల అనుభవాలు, ఆర్థిక నిపుణుల పరిశీలనలు నిర్ధారిస్తున్నాయి. సూక్ష్మ, చిన్నతరహా, మధ్యతరహా పరిశ్రమలకు ఆర్థిక సహాయం అందిస్తామన్న హామీని ప్రభుత్వం నెరవేర్చలేదు. వాటి పునరుద్ధరణకు ఉదారంగా రుణ సదుపాయమూ కల్పించలేదు. కోవిడ్‌ మూలంగా మూతపడిన వ్యాపార సంస్థలతో లక్షలాది ఉద్యోగాలకు నష్టం వాటిల్లింది. ఈ ఉద్యోగాలను పునరుద్ధరించారా? కొత్త ఉద్యోగాలను సృష్టించారా? ఈ విషయమై ప్రభుత్వం మౌనం వహిస్తోంది.

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో సరఫరా ఆధారిత, భరోసానివ్వని, నిధుల కొరత తీవ్రంగా ఉండే పథకాన్ని ప్రవేశపెట్టారు. దీంతో గ్రామీణ పేదల పరిస్థితి మరింతగా దుర్భరమైపోయింది. అసలే ఉపాధి లేమితో సతమతమవుతున్న గ్రామీణ పేదల బతుకులు కొత్త పథకంతో మరింతగా కుదేలయిపోతున్నాయి. నిరుద్యోగం ఏమీ పెద్ద సమస్య కాదు అనేది ఒక కట్టుకథ, మోసపూరిత వాదన అది. కొత్త ఉపాధి పథకం వీబీ–జీ–రామ్‌ జీ విషయమై ప్రభుత్వం తనను తాను అభినందించుకుంటుంది కానీ కోట్లాది ప్రజలకు ఉపాధిరాహిత్యమనేది మన ఆర్థిక పురోగతిపై ఒక లజ్జాకరమైన, భయానకమైన మచ్చ.

పి. చిదంబరం

(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి,

కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)

ఇవి కూడా చదవండి...

రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి తుమ్మల

కేసీఆర్ హయాంలో వేములవాడ రాజన్న ఆలయాన్ని పట్టించుకోలేదు: మంత్రి సీతక్క

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 17 , 2026 | 05:39 AM