Share News

మోదీ వల.. విపక్షం విలవిల

ABN , Publish Date - Jun 14 , 2026 | 12:04 AM

దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఏకబిగిన మూడు సార్వత్రక ఎన్నికల్లో గెలిచి ప్రధానమంత్రిగా కొనసాగుతున్న నాయకుడిగా నరేంద్ర మోదీ దేశ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించారు.

మోదీ వల.. విపక్షం విలవిల

దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఏకబిగిన మూడు సార్వత్రక ఎన్నికల్లో గెలిచి ప్రధానమంత్రిగా కొనసాగుతున్న నాయకుడిగా నరేంద్ర మోదీ దేశ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించారు. ఈ సందర్భంగా ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు సంబరాలు జరుపుకోగా, మోదీని నిలువరించడం ఎలా? అని ప్రతిపక్ష ఇండియా కూటమి తల పట్టుకుంటోంది. నిజానికి భారత తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ, ఆయన కుమార్తె ఇందిరా గాంధీ... మోదీకంటే ఎక్కువ రోజులు ప్రధానమంత్రులుగా కొనసాగారు. నెహ్రూ సైతం మూడు పర్యాయాలు వరుసగా ఎన్నికల్లో విజయం సాధించినప్పటికీ వయోభారం, అనారోగ్య సమస్యలతో ప్రధానమంత్రిగా ఉండగానే కన్నుమూశారు. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడే హత్యకు గురయ్యారు. ఈ కారణంగా ప్రధాని మోదీ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. రాజకీయాలలో ఈ శతాబ్దం నాది అని మోదీ సగర్వంగా చెప్పుకోగలుగుతున్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజులతో పోల్చితే వర్తమాన రాజకీయాలలో ఎన్నో మార్పులు వచ్చాయి. రాజకీయాలలో విలువలు పతనమయ్యాయి. ‘జో జీతా వహీ సికందర్‌’ అన్నట్టుగా పరిస్థితి మారింది. ఎన్డీయే నాయకుడిగా ప్రధాని మోదీ బాహుబలిగా ఎదగగా, ప్రతిపక్ష ఇండియా కూటమి సమర్థ నాయకత్వం కొరవడి మోదీని ఢీకొనలేక డీలాపడిపోయింది. ప్రధాని మోదీ రాజకీయ ఎత్తుగడలను అర్థం చేసుకోలేని ఇండియా కూటమి తన ఉనికిని చాటుకోవడానికి సతమతమవుతోంది.


ఒకప్పుడు కాంగ్రెస్‌ పార్టీని ఎదుర్కోవడం ఎలా? అని ఇదే భారతీయ జనతా పార్టీతో సహా అనేక ప్రతిపక్షాలు తల పట్టుకోగా, ఇప్పుడు మోదీ శక్తియుక్తుల ముందు కాంగ్రెస్‌ సహా ఇతర విపక్షాలు నిస్సహాయంగా మిగిలాయి. ప్రధానమంత్రిగా ఇందిరా గాంధీ నియంతలా వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయం బలపడటంతోపాటు ఆమె దేశంలో అత్యవసర పరిస్థితిని విధించడంతో నాడు ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యాయి. లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌ నేతృత్వంలో రైటిస్టులు, లెఫ్టిస్టులు ఏకమై జనతా పార్టీకి పురుడు పోశారు. 1977 ఎన్నికల్లో జేపీ ఆధ్వర్యంలో జనతా పార్టీ ఇందిరా గాంధీని ఓడించి మొరార్జీ దేశాయ్‌ నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే, నాయకుల మధ్య విభేదాల కారణంగా జనతా పార్టీ ప్రభుత్వం ఎంతో కాలం నిలవలేదు. ఇందిరా గాంధీ మళ్లీ అధికారంలోకి వచ్చారు. అయితే, పదవీకాలం పూర్తి కాకుండానే ఆమె తన సొంత అంగరక్షకులైన సత్వంత్‌ సింగ్‌, బియాంత్‌ సింగ్‌ చేతిలో హత్యకు గురయ్యారు. ఇది చరిత్ర!


ఎవరు గొప్ప?

తొలి ప్రధాని నెహ్రూకంటే ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ గొప్పవారా? అంటే ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి. వర్తమాన రాజకీయాలలో మోదీ మహాబలుడని మాత్రం చెప్పవచ్చు. ఒక నాయకుడు మూడు ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత బలహీనపడటం, ప్రతిపక్షాలు బలం పుంజుకోవడం సహజం. అయితే ఇప్పుడు దేశ రాజకీయాలలో ఆ పరిస్థితి లేదు. ప్రధాని మోదీ గత ఎన్నికల్లో కొంత బలహీనపడినా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మరింత బలపడ్డారు. ప్రధాని మోదీని ఢీకొనడమే లక్ష్యంగా ప్రతిపక్షాలు తమ సైద్ధాంతిక విభేదాలను పక్కనపెట్టి ఇండియా కూటమిగా ఏర్పడ్డాయి. అయితే, ఆ కూటమికి 1977లో వలె జయప్రకాశ్‌ నారాయణ్‌ వంటి సమర్థ నాయకత్వం లేకపోవడంతో పుంజుకోలేక పోతోంది. ఇండియా కూటమిలో ప్రధాన భాగస్వామి అయిన కాంగ్రెస్‌ పార్టీకి చెందిన రాహుల్‌ గాంధీ నాయకత్వంపై భాగస్వామ్య పక్షాలకు విశ్వాసం లేకపోవడంతో ఎవరికి వారు తామే ప్రధానమంత్రి అభ్యర్థిగా ఊహల పల్లకిలో ఊరేగారు. ఇండియా కూటమిలో కాంగ్రెస్‌ తర్వాత తృణమూల్‌ కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ, డీఎంకే ప్రధాన పార్టీలుగా ఉండేవి. ఇది గమనించిన మోదీ ఆ పార్టీలపై దృష్టి కేంద్రీకరించారు. ఆమ్‌ ఆద్మీ పార్టీకి కేంద్ర స్థానమైన ఢిల్లీపై నజర్‌ పెట్టారు. అరవింద్‌ కేజ్రీవాల్‌ను ఢిల్లీలోనే ఓడించి బీజేపీని అధికార పీఠంపై కూర్చోబెట్టారు. ఎన్నికల్లో ఓటమితో పాటు లిక్కర్‌ స్కాంలో జైలుకు కూడా వెళ్లిన కేజ్రీవాల్‌ ప్రస్తుతం ఇండియా కూటమితో అంటీముట్టనట్టుగా ఉంటున్నారు. రాజకీయంగా ఎదురుదెబ్బలు తగలక ముందు కాంగ్రెస్‌ పార్టీ కంటే తమదే పెద్ద పార్టీ అని, ఇండియా కూటమికి తానే నాయకత్వం వహిస్తానని, కుదిరితే తానే ప్రధానమంత్రి కావాలని కేజ్రీవాల్‌ కలల ప్రపంచంలో విహరించారు. కారణం తెలియదుకానీ ప్రస్తుతం ఆయన సైలెంట్‌గా ఉంటున్నారు.


నిన్నటి వరకు పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రిగా ఉన్న మమతా బెనర్జీ కూడా ప్రధాని కావాలని ఉవ్విళ్లూరారు. ఇండియా కూటమిలో కాంగ్రెస్‌ పార్టీ భాగస్వామిగా ఉన్నప్పటికీ కూటమికి ఆ పార్టీ నాయకత్వం వహించడాన్ని ఆమె వ్యతిరేకిస్తూ వచ్చారు. కూటమిలోని మిగతా పార్టీల నాయకులు ప్రధానమంత్రి పదవిని కోరుకోకపోయినా సొంత ఎజెండాలతో ముందుకు సాగారు. అదే సమయంలో ఇండియా కూటమికి బలమైన నాయకత్వం అందించడంలో కాంగ్రెస్‌ పార్టీ విఫలమైంది. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌, తమిళనాడులో జరిగిన తాజా ఎన్నికల్లో భాగస్వామ్య పక్షాలైన తృణమూల్‌, డీఎంకే పార్టీలు ఓడిపోయాయి. ఓటమి తర్వాత అంతర్గత తిరుగుబాటుతో మమతా బెనర్జీ సతమతమవుతూ ఉండగా, ఎన్నికల ఫలితాల తర్వాత మాట మాత్రం చెప్పకుండా కాంగ్రెస్‌ పార్టీ తమను కాదని జోసెఫ్‌ విజయ్‌కి మద్దతు ప్రకటించడంపై డీఎంకే అధినేత స్టాలిన్‌ ఆగ్రహం చెందారు. దీంతో ఇండియా కూటమిపై ఆయన అలిగారు. కాంగ్రెస్‌ పార్టీతో దశాబ్దాలుగా కొనసాగిన స్నేహానికి కటీఫ్‌ చెప్పారు. ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌, స్టాలిన్‌ దూరం కావడంతో ఇండియా కూటమి బలహీనపడింది. మమతా బెనర్జీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. క్షవరం అయితేగానీ వివరం తెలియదు అన్నట్టుగా ఇండియా కూటమి ఉలిక్కిపడి తాజాగా సమావేశమై కూటమి బలోపేతంపై చర్చలు జరిపింది. అయితే, ఈ సమావేశంలో కూడా వినూత్నంగా ఆలోచించకుండా... ప్రజలను ఆకట్టుకోలేకపోయిన ‘సర్‌’ వంటి అంశాలతోనే ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. ప్రధాని మోదీ దేశ ప్రజలు, ముఖ్యంగా యువత మనోభావాలను పసిగట్టి అందుకు తగిన వ్యూహాలను రూపొందించుకొని ఎన్నికల్లో విజయాలు సాధిస్తుండగా, ఇండియా కూటమి నేతలు మాత్రం పాత చింతకాయ పచ్చడి ఆలోచనలతోనే అడుగులు వేస్తున్నారు. దీంతో ఇండియా కూటమి పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారింది. ఎన్డీయే కూటమిలో ప్రధాన పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ నానాటికీ బలపడుతుండగా, ఇండియా కూటమిలోని ప్రధాన పక్షమైన కాంగ్రెస్‌ పార్టీ బలం పుంజుకోలేక పోతున్నది. ప్రధాని మోదీ ఎత్తుగడలతో పాటు ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి.


‘ఇండియా’లో ఎవరికి వారే

ఇండియా కూటమిలోని ప్రధాన పార్టీలు బలహీనపడటానికి కారణాలు స్పష్టమే. కాంగ్రెస్‌ పార్టీ బూజు పట్టిన సిద్ధాంతాలను పట్టుకొని వేలాడుతుండగా, కూటమిలోని మిగతా భాగస్వామ్య పక్షాల నేతలు వివిధ కారణాలతో బలహీనపడ్డారు. అరవింద్‌ కేజ్రీవాల్‌ మితిమీరిన ఆత్మవిశ్వాసంతోపాటు లిక్కర్‌ కుంభకోణంలో చిక్కుకోవడం వల్ల ప్రజల్లో పలుచనయ్యారు. చివరకు ఆయన అధికారం కోల్పోయారు. మమతా బెనర్జీ అధికారంలో ఉన్నంత కాలం అహంకారపూరితంగానే వ్యవహరించారు. తృణమూల్‌ కాంగ్రెస్‌లో అంతర్గత ప్రజాస్వామ్యం లేకుండా చేశారు. ఫలితంగానే ఆ పార్టీలో ఇప్పుడు తిరుగుబాట్లు చూస్తున్నాం. అధికారం కోల్పోగానే ఎంపీలు, ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడం సమర్థనీయమా? అంటే ఏం చెప్పగలం! వర్తమాన రాజకీయాల్లో అన్ని పార్టీలకూ ఈ బెడద తప్పడం లేదు. ప్రాంతీయ పార్టీలలో అధినేతల పోకడలే ఆయా పార్టీల భవిష్యత్తును నిర్ణయిస్తాయి. అధినేతలు అహంకారపూరితంగా వ్యవహరించినా, అవినీతి ఊబిలో కూరుకుపోయినా ఆయా పార్టీలు చావుదెబ్బ తింటాయి. ఒకప్పుడు జాతీయ పార్టీలైనా, ప్రాంతీయ పార్టీలైనా అధినేతల పోకడలు నచ్చనప్పుడు.. బలమైన నాయకులు ఆ పార్టీల నుంచి బయటకు వెళ్లి సొంత పార్టీలు పెట్టుకోవడం లేదా ఇతర పార్టీలతో చేతులు కలపడం చేసేవారు. రాజీవ్‌ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు విశ్వనాథ్‌ ప్రతాప్‌ సింగ్‌ ఈ విధంగానే కాంగ్రెస్‌తో విభేదించి ఎన్టీఆర్‌తో చేతులు కలిపి నేషనల్‌ ఫ్రంట్‌ను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 1989 ఎన్నికల్లో విజయం సాధించిన వీపీ సింగ్‌ ప్రధానమంత్రి అయ్యారు.


కాంగ్రెస్‌ అలా... మోదీ ఇలా!

జాతీయ పార్టీలలోనైనా, ప్రాంతీయ పార్టీలలోనైనా అంతర్గత ప్రజాస్వామ్యం లోపించి నియంతృత్వ పోకడలు పొడచూపినప్పుడు ఆయా పార్టీలలో తిరుగుబాట్లు రావడం సహజం. ఈ కారణంగానే బలమైన పార్టీలుగా భావిస్తూ వచ్చిన అనేక పార్టీలు బలహీనపడ్డాయి. కాంగ్రెస్‌ పార్టీనే ఇందుకు ఉదాహరణ! రాష్ర్టాలలో బలమైన నాయకత్వాలను పక్కనపెట్టడం వల్ల కాంగ్రెస్‌ భారీ మూల్యం చెల్లించుకుంది. ప్రస్తుత దుస్థితికి ఇదే ప్రధాన కారణం. ప్రధాని మోదీ ఈ విషయంలో జాగ్రత్తపడ్డారు. బీజేపీ బలంగా ఉన్న రాష్ర్టాల్లో ఒక విధంగా, బలహీనంగా ఉన్న రాష్ర్టాల్లో మరో విధంగా ద్విముఖ వ్యూహాలతో ఆయన విజయాలు అందుకుంటున్నారు. రాజకీయ ప్రత్యర్థులను బలహీనపరచగల సమర్థత ఉన్న నాయకులను గుర్తించి వారిని చేరదీయడంపై ప్రధాని మోదీ దృష్టి సారిస్తారు. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి సువేందు అధికారి ఇందుకు నిదర్శనం. తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిపై ప్రస్తుతం ప్రధాని మోదీ కన్ను పడింది. భారత రాష్ట్ర సమితికి చెందిన హరీశ్‌ రావును తమ వైపునకు లాక్కోవాలని ప్రయత్నిస్తూనే... రేవంత్‌ రెడ్డిపై కూడా ఆయన దృష్టి సారించారు. ప్రాంతీయ పార్టీలు, కాంగ్రెస్‌ పార్టీ బలంగా ఉన్న రాష్ర్టాల్లో బలమైన నాయకుల కోసం మోదీ అన్వేషణ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే హరీశ్‌ రావు కోసం తెర వెనుక ప్రయత్నాలు కొనసాగిస్తూనే ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని తనతో చేతులు కలపవలసిందిగా బహిరంగంగానే ఆయన కోరారు. ఈ మాట సరదాగా అన్నట్టు పైకి అనిపించినా ప్రధాని ఆంతర్యం అర్థం కావాల్సిన వారికి అర్థమైంది. ఆ ఇరువురిలో ఎవరో ఒకరు వారికి కావాలి.


తెలంగాణతోపాటు తమిళనాడుపై ప్రస్తుతం ప్రధాని మోదీ దృష్టి సారించారు. ఎన్నికల ఫలితాలు వెలువడగానే డీఎంకే పార్టీకి ఆయన స్నేహ హస్తం చాస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ పట్ల గుర్రుగా ఉన్న స్టాలిన్‌ను తమ వైపునకు తిప్పుకొనే ప్రయత్నాలు ఇప్పటికే మొదలయ్యాయి. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన జోసఫ్‌ విజయ్‌ తొలిసారిగా ఢిల్లీ వెళ్లినప్పుడు ప్రధానమంత్రి మోదీని కలిశారు. ఆ తర్వాత హోం మంత్రి అమిత్‌ షాను కూడా కలవాలనుకున్నారు. నిజానికి విజయ్‌కి అమిత్‌ షా అప్పాయింట్‌మెంట్‌ కూడా ఇచ్చారు. అయితే చివరి నిమిషంలో అది రద్దయింది. స్టాలిన్‌ విజ్ఞప్తి మేరకే విజయ్‌కి ఇచ్చిన అప్పాయింట్‌మెంట్‌ను అమిత్‌ షా రద్దు చేసుకున్నారన్న వాదన ప్రచారంలో ఉంది. దీన్నిబట్టి బీజేపీ–డీఎంకే మధ్య స్నేహం చిగురించే అవకాశం లేకపోలేదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఈ విధంగా మోదీ–షాల ఆలోచనలు ఇండియా కూటమి నాయకులకు అంతుబట్టని రీతిలో ఉంటున్నాయి.


కోలుకోకుండా దెబ్బమీద దెబ్బ

ఇండియా కూటమి నాయకులు నిన్నటి గురించి ఆలోచిస్తుండగా, మోదీ–షాలు రేపటి గురించి ఆలోచిస్తున్నారు. ఎన్నికల్లో ఓడిన పార్టీలను అంతటితో వదిలేయకుండా ఆయా పార్టీలు తిరిగి కోలుకోకుండా చేస్తున్నారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రస్తుత దుస్థితే ఇందుకు నిదర్శనం. ఎన్నికల ఫలితాలు వెలువడగానే టీఎంసీ ఎమ్మెల్యేలలో తిరుగుబాటు వచ్చిందంటే దాని వెనుక మోదీ–షాల హస్తం లేదని ఎలా భావించగలం? రెండేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో నెగ్గిన ఎంపీలలో మెజారిటీ సభ్యులు ఎన్డీయేలో చేరడానికి సిద్ధపడుతున్నారంటే అందుకు మోదీ–షా మంత్రాంగం కారణం కాకుండా ఉంటుందా? ఈ నేపథ్యంలోనే తమ పార్టీ ఉనికిని కాపాడుకునేందుకు డీఎంకే అధినేత స్టాలిన్‌ బీజేపీతో సన్నిహితంగా మెలగడానికి సిద్ధపడుతున్నట్టు భావించాలి. మోదీ–షాలను ధిక్కరించే నాయకులకు, పార్టీలకు మనుగడ ఉండదన్న భావన వ్యాప్తి చెందుతోంది. ఇది వాంఛనీయమా? కాదా? అన్నది పక్కన పెడితే... అది వాస్తవం! నిన్నటి వరకు కేంద్రంలో బీజేపీని గద్దె దించుతామని గర్జించిన దీదీ మమతా బెనర్జీ ఇప్పుడు తన అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు తృణమూల్‌ను కాంగ్రెస్‌ పార్టీలో విలీనం చేయడానికి కూడా సిద్ధపడుతున్నట్టు వార్తలొస్తున్నాయి. ఒకప్పుడు కాంగ్రెస్‌లోనే ఉండిన ఆమె ఆ పార్టీతో విభేదించి తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీని ఏర్పాటుచేయడం గమనార్హం. విచిత్రం ఏమిటంటే, మోదీ–షాల మంత్రాంగం వల్ల ప్రాంతీయ పార్టీలను చీల్చుకొని బయటకొస్తున్న నేతలు బలపడుతుండగా... ఒరిజినల్‌ పార్టీ నేతలు బలహీనపడుతున్నారు. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌ పరిణామాలే ఇందుకు నిదర్శనం. ఈ నేపథ్యంలో దేశ రాజకీయాలలో మరింతగా బలపడటానికి ఎన్డీయే వ్యూహ రచన చేస్తుండగా, ఉనికిని కాపాడుకునేందుకు ఇండియా కూటమి ఆపసోపాలు పడుతోంది. ఇండియా కూటమిలోని పార్టీలలో సీరియస్‌నెస్‌ లోపించడమే ప్రస్తుతానికి ఎన్డీయేకు ప్రధాన బలంగా ఉంది.


కాలాతీత అ....న్యాయం!

ఈ విషయం అలా ఉంచితే, మన న్యాయ వ్యవస్థలో వింత పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. దిగువ కోర్టుల పనితీరుపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేయడం మాత్రమే ఇప్పటివరకు మనం చూశాం. ఇప్పుడు దిగువ కోర్టులే సుప్రీంకోర్టు పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. సుప్రీంకోర్టు తీరుతో పాటు దాని తీర్పులను కూడా హైకోర్టులు తప్పుపట్టడాన్ని ఇటీవలే చూస్తున్నాం. ఎన్నికల పిటిషన్లను సత్వరమే పరిష్కరించాలన్న సుప్రీంకోర్టు తీర్పును సుప్రీంకోర్టే విస్మరిస్తే ఎలా? అని మద్రాస్‌ హైకోర్టు ఇప్పటికే ప్రశ్నించింది. పిటిషన్‌ను ఆరేళ్లపాటు పెండింగ్‌లో పెట్టి తుది పరిశీలన కోసం మళ్లీ తమ వద్దకు పంపడం ఏమిటి? న్యాయ వ్యవస్థ పట్ల తీవ్ర పరిహాసానికి ఈ కేసు రుజువు కాదా? అని మద్రాస్‌ హైకోర్టు సుప్రీంకోర్టును నిలదీసింది. ఎన్నికల పిటిషన్లను ఐదేళ్లలోపు పరిశీలించకపోతే ఆ తర్వాత వెలువడే తీర్పులకు అర్థం ఉండదు. తమిళనాడు అసెంబ్లీ మాజీ స్పీకర్‌, డీఎంకే నేత ఎం.అప్పావుకు సంబంధించి 2016 ఎన్నికల వివాదంలో సుప్రీంకోర్టు తీరుపై మద్రాస్‌ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ కేసులో అప్పావును విజేతగా ప్రకటిస్తూ గతంలో చెన్నయ్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఆ తర్వాత కేసును ఆరేళ్లపాటు పెండింగ్‌లో పెట్టి ఇటీవల మళ్లీ హైకోర్టుకు పంపారు. తాజాగా ఈ కేసులో అప్పావును విజేతగా హైకోర్టు మళ్లీ ప్రకటించింది. అయితే, ఈ తీర్పు వల్ల ప్రయోజనం ఏమిటి? 2016 ఎన్నికల అనంతరం ఏర్పడిన శాసనసభా కాలం ముగిసింది. ఆ తర్వాత 2021, 2026 రెండు పర్యాయాలు శాసనసభకు ఎన్నికలు జరిగాయి. కేసు పరిష్కారంలో అంతులేని జాప్యం జరిగినందున పరాజితుడే ఎమ్మెల్యేగా ఐదేళ్లపాటు కొనసాగారు. హైకోర్టు న్యాయమూర్తి జయచంద్రన్‌ వ్యాఖ్యానించినట్టుగా సుప్రీంకోర్టు ఇక్కడ తప్పు చేసింది. ఏ స్థాయి న్యాయస్థానమైనా వాటి చర్యలు న్యాయ వ్యవస్థ ఔన్నత్యాన్ని పెంచాలేగానీ వ్యవస్థ పట్ల నమ్మకాన్ని పోగొట్టకూడదు. మరో సందర్భంలో సుప్రీంకోర్టు తీర్పును అలహాబాద్‌ హైకోర్టు తప్పు పట్టింది.


చార్జిషీటు తర్వాత రిమాండ్‌ తప్పు అంటే ఎలా? ఆ దశలో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ను ఎలా అనుమతించడం? ఇలాంటి వాటిని అనుమతించే సుప్రీంకోర్టు తీర్పు అసంబద్ధం అని అలహాబాద్‌ హైకోర్టు అభిప్రాయపడింది. సుప్రీంకోర్టు తీర్పును ఒక హైకోర్టు తప్పు పట్టడం అసాధారణం. అలహాబాద్‌ హైకోర్టు వ్యాఖ్యలతో సుప్రీంకోర్టు తీర్పులు కూడా అసంబద్ధంగా ఉంటాయన్న అభిప్రాయం ప్రజల్లో ఏర్పడుతోంది. ఒక కేసుకు సంబంధించి కింది కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు అన్ని స్థాయిలలో బెయిల్‌ పిటిషన్‌ తిరస్కరణకు గురైన తర్వాత నిందితుల తరఫు న్యాయవాదులు కేసు ప్రారంభంలోనే నిందితుడిని నిర్బంధించడం అక్రమం అని హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ వేయడం ఏమిటి? ఇలాంటి పరిస్థితికి కారణమైన సుప్రీంకోర్టు తీర్పు అసంబద్ధంగా ఉందని అలహాబాద్‌ హైకోర్టు న్యాయమూర్తులు సిద్ధార్థ్‌, వినయ్‌ కుమార్‌ ద్వివేదీ అభిప్రాయపడ్డారు. నిందితుల అరెస్టు, రిమాండు, అక్రమ నిర్బంధాలకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన రెండు తీర్పులు పరస్పర విరుద్ధంగా ఉన్నాయని హైకోర్టు అభిప్రాయపడింది. నెల రోజుల వ్యవధిలోనే రెండు హైకోర్టుల న్యాయమూర్తులు సుప్రీంకోర్టు తీర్పులను తప్పు పట్టడం యాదృచ్ఛికం కాదు. న్యాయ వ్యవస్థలోని లోపాలను ఈ సంఘటనలు ఎత్తి చూపుతున్నాయి. ఇప్పటికైనా న్యాయ వ్యవస్థ ఆత్మపరిశీలన చేసుకోవాలి. లేని పక్షంలో మిగతా వ్యవస్థలపై ప్రజలకు నమ్మకం పోయినట్టుగానే న్యాయ వ్యవస్థపై కూడా పూర్తిగా నమ్మకం పోతుంది.

Updated Date - Jun 14 , 2026 | 12:04 AM