నాలుగు కోడ్‌ల రద్దుకై ఉద్యమిద్దాం!
ABN , Publish Date - May 01 , 2026 | 01:50 AM
19వ శతాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా ప్రారంభమైన పారిశ్రామిక విధానం వల్ల కార్మికుల జీవితాలు దుర్భరంగా మారాయి. నిర్ణీత పని గంటలు, హక్కులూ లేకపోవటంతో పాటు, రోజులో 14 నుంచి 15 గంటల...
19వ శతాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా ప్రారంభమైన పారిశ్రామిక విధానం వల్ల కార్మికుల జీవితాలు దుర్భరంగా మారాయి. నిర్ణీత పని గంటలు, హక్కులూ లేకపోవటంతో పాటు, రోజులో 14 నుంచి 15 గంటల నిర్భంద పని అమలయింది. ఈ దుర్భర పరిస్థితుల నుంచి బయటపడాలనే ఆలోచన కార్మికుల్లో ప్రారంభమైంది. 1886 మే ఒకటిన అమెరికా అంతటా సమ్మె సైరన్ మోగింది. 3 లక్షల మంది కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. పోలీసుల జరిపిన కాల్పుల్లో ఆరుగురు కార్మికులు నేలకొరిగారు. ఆ తర్వాత కూడా ఘర్షణ కొనసాగింది. చివరకు షికాగో నగర కార్మికుల ప్రాణ త్యాగం వల్ల అమెరికాలో 8 గంటల పని దినం అమలుకు చట్టం చేశారు.
భారతదేశంలోనూ అనేక కార్మిక పోరాటాలు జరిగాయి. పాలక ప్రభుత్వాలు సామ్రాజ్యవాదుల, బడా పెట్టుబడిదారుల ప్రయోజనాలను కాపాడుతూ కార్మిక వ్యతిరేక విధానాలు అనుసరించాయి. 2014లో అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం ఎన్నో పోరాటాల ద్వారా సాధించుకున్న 44 కార్మిక చట్టాలను... వేతనాల కోడ్, సామాజిక భద్రత కోడ్, పారిశ్రామిక సంబంధాలు, భద్రత–ఆరోగ్యం–పని పరిస్థితుల అని నాలుగు కోడ్‌లకు చట్టబద్ధత కల్పించి వాటిని అమలు చేస్తూ కార్మిక హక్కులను కాలరాస్తున్నది. ఇంతకు ముందు కార్మికుల డిమాండ్లపై సమ్మె నోటీసు ఇవ్వటానికి 14 రోజుల వ్యవధి సరిపోయేది. ఇప్పుడు దాన్ని 60 రోజులకు పెంచారు. సమ్మెకు వ్యతిరేకంగా ట్రిబ్యునల్‌కు వెళ్లే అవకాశం యజమానులకు కల్పించారు. గతంలో 10 కంటే ఎక్కువ మంది పని చేసే సంస్థలను పరిశ్రమలుగా గుర్తించేవారు. ఇప్పుడు ఆ సంఖ్య 20కి పెంచారు. విద్యుత్ సంస్థల్లో 40 మందికి పెరిగింది. ఏ సంఘానికైనా కార్మికుల డిమాండ్లపై చర్చించే అవకాశం ఇంతకు ముందు ఉంటే, ఇప్పుడు 51శాతం సభ్యత్వం ఉన్న సంఘాన్ని గుర్తింపు సంఘంగా పరిగణిస్తారు. నాలుగు కోడ్‌లు రాక ముందు పరిశ్రమల్లో జరిగే ప్రమాదాలకు యజమానుల బాధ్యత ఉండేది. ఇప్పుడు కార్మికులే ప్రమాదాలకు బాధ్యత వహించాలి. ప్రమాదాలకు కారణమని కార్మికునికి 10వేల జరిమానా, జైలుశిక్ష విధించవచ్చు. యజమానులు కోరితే 10 నుంచి 12 గంటలు పనిచేయాలి. మోదీ ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాయడమే కాకుండా ప్రభుత్వరంగ పరిశ్రమలను ప్రైవేటీకరించడం లేదా మూసివేయడం వల్ల లక్షలాది మంది కార్మికులు నిరుద్యోగులుగా మారుతున్నారు.
గత కార్మిక వర్గ ఉద్యమాలను అవగాహన చేసుకుని వర్గ దృక్పథంతో ఆర్థిక, రాజకీయ హక్కుల కోసం దీర్ఘకాలిక పోరాటాలకు కార్మిక వర్గం సిద్ధం కావాలి. అప్పుడు మాత్రమే మోదీ ప్రభుత్వ వెనక్కి తగ్గుతుంది. అందుకు మే డే నాంది పలకాలి.
m బొల్లిముంత సాంబశివరావు
రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఆం.ప్ర. రైతు కూలీ సంఘం
ఈ వార్తలు కూడా చదవండి...
న్యాయవ్యవస్థపై గౌరవం.. కానీ సత్యాగ్రహం తప్పదు: కేజ్రీవాల్
హైకోర్టును ఆశ్రయించిన నటి అషురెడ్డి.. ఎందుకంటే..
Read Latest Telangana News And AP News And International News And Telugu News