లేబర్ కోడ్స్ రద్దుకు ఉద్యమిద్దాం
ABN , Publish Date - May 01 , 2026 | 01:45 AM
అమెరికాలోని షికాగో నగరంలో ఎనిమిది గంటల పని దినం అమలు చేయాలని, పనికి తగిన ప్రతిఫలం ఇవ్వాలని, పని స్థలాల్లో మెరుగైన పరిస్థితులు కావాలని, పెట్టుబడిదారుల శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా...
అమెరికాలోని షికాగో నగరంలో ఎనిమిది గంటల పని దినం అమలు చేయాలని, పనికి తగిన ప్రతిఫలం ఇవ్వాలని, పని స్థలాల్లో మెరుగైన పరిస్థితులు కావాలని, పెట్టుబడిదారుల శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా పోరాడారు. హే మార్కెట్ వద్ద జరిగిన ఆందోళనలో 8 మంది కార్మిక నాయకుల త్యాగంతో, రక్త తర్పణతో ప్రపంచవ్యాప్తంగా నేడు 8 గంటల పని దినం అమలు అవుతున్నది. 1886లో మే ఒకటవ తేదీని శ్రామిక వర్గ, కార్మిక వర్గ పోరాట దినంగా పాటించాలని నిర్ణయించాయి. ఆ పోరాట స్ఫూర్తిని తీసుకుని నేడు కార్మిక వర్గంపై ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న పని భారానికి, పని గంటలు పెంపుకి, శ్రమ దోపీడీకి వ్యతిరేకంగా ఉద్యమించాలి.
భారతదేశంలో కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో, పరిశ్రమల్లో, షాపింగ్ మాల్స్‌లో పనిచేస్తున్న ఉద్యోగులకు, ఇతర అన్ని రంగాల్లో పనిచేస్తున్న శ్రమజీవులకు 10 గంటలు పని చేయించుకోవచ్చు అనే సవరణని కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. ఇది శ్రమ దోపిడీని తీవ్రం చేసింది. నేడు వేతనాల్లో తగ్గింపు, ఉద్యోగ భద్రత లేకపోవడం, సామాజిక భద్రత లేని స్థితిలో, మేడే స్ఫూర్తికి విఘాతం కలుగుతున్నది. మన దేశంలో కూడా ఇటీవల మానేసర్, నోయిడా, పానిపట్, రాజస్థాన్, గుజరాత్, తదితర ప్రాంతాల్లో జరిగిన కార్మిక పోరాటాలు ఇందుకు నిదర్శనం.
అమెరికా సామ్రాజ్యవాద దేశం ఇజ్రాయెల్‌తో జతకట్టి ఇరాన్‌పై యుద్ధం చేస్తోంది. పశ్చిమ ఆసియా దేశాలలోని ఆయిల్ సంపదపైన, రిఫైనరీలపైన, ఖనిజ వనరుల పైన ఆధిపత్యం కోసం, ఆయుధ తయారీ పరిశ్రమల లాభాల కోసం యుద్ధాన్ని చేపట్టి అనేక పరిశ్రమల మూతకు, విధ్వంసానికి కారణమైంది. అదే సమయంలో ఇరాన్ కూడా తన చుట్టూ ఉన్న దేశాల్లోని అమెరికా స్థావరాలపైన, ఆయిల్ రిఫైనరీలపైన మిస్సైల్, బాంబు దాడులను కురిపించింది. అనేక పరిశ్రమల మూతకు తెరలేపింది. ఉద్యోగాల కోతకు ఈ యుద్ధం కారణమయ్యింది. కాబట్టి ‘యుద్ధం వద్దు! ప్రపంచ శాంతి కావాలి’ అని కార్మిక వర్గం నినదించాలి. ఈ యుద్ధం పెట్టుబడిదారులకు లాభాలను ఆర్జించి పెడితే, కార్మిక వర్గానికి శూన్య హస్తాలను చూపుతుంది, బతుకులు లేకుండా చేస్తుంది. ప్రపంచ దేశాలలో కృత్రిమ మేధస్సు టెక్నాలజీని ఆవిర్భవించిన సాఫ్ట్‌వేర్ పరిశ్రమలు, వాటి పెట్టుబడిదారులు యుద్ధాన్ని సాకుగా చూపించి ఉద్యోగాల నుంచి కార్మికులను పనిలో నుంచి తొలగిస్తున్నారు. లేఆఫ్ ప్రకటించి నైపుణ్యం కలిగిన యువకులను వీధిన పడేశారు. సామ్రాజ్యవాద దేశాల్లోని సంక్షోభాన్ని, ప్రపంచ దేశాల మీదకి మళ్ళించడం అంటే ఇదే.
భారతదేశ కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులను మోదీ ప్రభుత్వం కాలరాస్తున్నది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు, కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా కార్మిక చట్టాల స్థానంలో నాలుగు లేబర్ కోడ్స్‌ను తీసుకువచ్చింది. భారతదేశ కార్మిక వర్గాన్ని మరింత శ్రమదోపిడికి గురి చేయడానికి, పని గంటల పెంపు, సమ్మె హక్కును కాలరాస్తూ, అతి తక్కువ వేతనాలతో కార్మిక వర్గంతో పని చేయిస్తూ తీవ్ర శ్రమ దోపిడీ చేయడానికి లేబర్ కోడ్స్ ద్వారా మార్పులు చేపట్టింది. కార్మికులపైన మరింత పనిభారాన్ని పెంచుతూ... ప్రశ్నించే హక్కును, హక్కులకై నినదించే, నిరసనలు తెలిపే హక్కును కాలరాస్తున్న సందర్భంలో భారతదేశ కార్మిక వర్గం ఐక్యమై 140వ మేడేను విజయవంతం చేయాలి. నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలని నినదించాలి. పనికి తగిన ప్రతిఫలం కోసం పోరాడాలి. వేతనాలు పెరగక, అక్రమ కోతల వల్ల వచ్చే వేతనం కుటుంబ పోషణకు సరిపోక కార్మిక వర్గ కుటుంబాలు తీవ్ర సంక్షోభంలోకి నెట్టబడ్డాయి. కార్మికులు అధిక ధరలతో కొట్టుమిట్టాడుతున్నారు. కాబట్టి, మేడే పోరాట స్ఫూర్తితో కార్మిక హక్కుల సాధనకై ఉద్యమించాలి. ఉద్యోగాల్లో కోతలకు వ్యతిరేకంగా పోరాడాలి.
ఎస్.ఎల్. పద్మ
రాష్ట్ర కార్యదర్శి, టీయూసీఐ, తెలంగాణ
ఈ వార్తలు కూడా చదవండి...
న్యాయవ్యవస్థపై గౌరవం.. కానీ సత్యాగ్రహం తప్పదు: కేజ్రీవాల్
హైకోర్టును ఆశ్రయించిన నటి అషురెడ్డి.. ఎందుకంటే..
Read Latest Telangana News And AP News And International News And Telugu News