Share News

శ్రామికుల జీవితాల్లో చంద్రోదయ కాంతులు

ABN , Publish Date - May 01 , 2026 | 01:48 AM

శ్రమ దోపిడికి వ్యతిరేకంగా ఎందరో కార్మికులు జరిపిన పోరాట ఫలితంగా కార్మిక లోకంలో చైతన్యం వెల్లివిరిసింది. ఆనాటి దోపిడి విధానాలను సమూలంగా మార్చుకుని కార్మికులు తమ హక్కులను...

శ్రామికుల జీవితాల్లో చంద్రోదయ కాంతులు

శ్రమ దోపిడికి వ్యతిరేకంగా ఎందరో కార్మికులు జరిపిన పోరాట ఫలితంగా కార్మిక లోకంలో చైతన్యం వెల్లివిరిసింది. ఆనాటి దోపిడి విధానాలను సమూలంగా మార్చుకుని కార్మికులు తమ హక్కులను సాధించుకున్న రోజు మే డే. ఈ రోజు కార్మికుల ఐక్యత, పోరాటాలకు నిదర్శనంగా నిలుస్తుంది. నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలతో రాష్ట్ర శ్రామికుల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది.

19వ శతాబ్దంలో అమెరికాలో పెట్టుబడిదారులు శ్రామికులతో బానిసల్లాగా పని చేయించి, అధిక లాభాలు పొందేవారు. కనీస వసతులైన తిండి, బట్ట, నివాసం వంటివి కల్పించకుండా రోజుకు 16 నుంచి 20 గంటలు పని చేయించేవారు. పని స్థలాల్లో సరైన గాలి, వెలుతురు ఉండేవి కావు. దాంతో కొందరు కార్మికులు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోయేవారు. ఈ పరిస్థితికి భిన్నంగా, శ్రమదోపిడీ నుంచి బయటపడేందుకు కార్మికులు తమ హక్కుల కోసం రక్తం చిందించి పోరాడి సాధించుకున్న రోజే మే డే. కార్మికుల శ్రమకు తగిన గుర్తింపు ఇస్తూ ఎనిమిది గంటల పనిదినం అమల్లోకి వచ్చిన రోజు కార్మిక దినోత్సవం.

షికాగో పోరాటం కంటే ముందే భారతదేశంలో కలకత్తాలో కార్మికులు నిర్ణీత పని గంటల కోసం హౌరా రైల్వేస్టేషన్‌లో 1862లో సమ్మె చేశారు. అప్పటి వరకు రైల్వే కార్మికులు 10 గంటలు పని చేసేవారు. అయితే ఆ పోరాటం విస్తృత స్థాయిలో ప్రజాపోరుగా మారకపోవడంతో ఉద్యమ స్వరూపాన్ని అందుకోలేదు. 1920లో ట్రేడ్‌ యూనియన్‌ ఏర్పడటం వల్ల అప్పటి నుంచే కార్మికవర్గంలో చైతన్యం పెరిగింది. 1923లో మొదటిసారిగా భారతదేశంలో మే డేను పాటించారు.

కార్మిక శక్తి లేనిదే సమాజం ముందుకెళ్ళదని నమ్మే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని శ్రామికుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. కార్మికుల సంక్షేమంపై చంద్రన్న ముద్ర స్పష్టంగా కనిపిస్తున్నది. అసంఘటిత రంగం లోని భవన నిర్మాణ, ఇతర కార్మికులకు గతంలో అందించిన సంక్షేమ పథకాలను పునరుద్ధరించిన ఘనత ఆయనకే దక్కుతుంది. ప్రసూతికి రూ.20 వేలు, వివాహానికి రూ.40 వేలు, సహజ మరణానికి రూ.60 వేలు, అంత్యక్రియలకు రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నారు. అసంఘటిత రంగంలో ఉన్న కార్మికుల్లో ఆధునిక నైపుణ్యాలు, జీవన ప్రమాణాలను పెంచే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తున్నది.


నిర్మాణ రంగంలో ఉన్న ప్రముఖ కంపెనీలు ఎల్‌ అండ్‌ టి, ఎన్‌సీసీ, మిట్టల్‌ సహా వివిధ సంస్థల సహకారంతో వారికి అవసరమైన నైపుణ్య శిక్షణ ఇస్తున్నారు. దీని ద్వారా రాష్ట్రంలోని కార్మికులు దేశ, విదేశాల్లో ఉపాధి అవకాశాలు పొంది, అధిక ఆదాయం ఆర్జించేలా అవకాశాలు మెరుగుపడతాయి. ఇది కూటమి ప్రభుత్వం ఘనతే. నైపుణ్యం పోర్టల్‌ ద్వారా ఈ డేటాబేస్‌ను అనుసంధానించడంతో పాటు కార్మికులు లేటరల్‌ ఎంట్రీ ద్వారా వివిధ కోర్సులు అభ్యసించి ఉన్నత విద్యార్హతను సాధించేలా ప్రణాళిక రూపకల్పన జరుగుతున్నది. ఆధునిక పనిముట్లను కార్మికులకు అందించి నైపుణ్యాలు పెంచి అధిక ఆదాయాన్ని ఆర్జించే అవకాశం కల్పన దిశగా కసరత్తు సాగుతున్నది. రాష్ట్రంలోని 20 లక్షల మంది కార్మికులకు నైపుణ్యాలు పెంచేందుకు అనువుగా కార్యాచరణను కూటమి ప్రభుత్వం చేస్తున్నది. తరచు కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తూ తీవ్ర అనారోగ్య సమస్యలు ఉన్న వారిని గుర్తించి, యూనివర్సల్‌ హెల్త్‌ పాలసీతోపాటు కార్మిక శాఖ ద్వారా రూ.2.5 లక్షల వరకు ఉచిత వైద్య చికిత్సలు అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు.

కార్మిక, కర్షకులు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ ముందుకు వెళ్లడం ప్రస్తుతం అత్యంత అవసరం. కార్మిక వర్గం పక్షాన నిలబడి వారికి మేలు చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోంది. నాలా చట్టం రద్దు, ఉచిత ఇసుక విధానం, భవన నిర్మాణాలకు, లే అవుట్లకు అనుమతులు సరళతరం చేయడం వంటి నిర్ణయాలతో ఇప్పటికే నిర్మాణ రంగాన్ని నిలబెట్టి లక్షల మంది జీవితాలకు భద్రత కల్పించిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుంది. 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు, అన్ని ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుతో పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సృష్టిస్తూ కూటమి ప్రభుత్వం కార్మికుల ప్రభుత్వంగా, కష్టజీవుల ప్రభుత్వంగా మారింది. 140వ మే డే సందర్భంగా చంద్రన్న పాలనలో శ్రామికుల జీవితాల్లో మరిన్ని చంద్రోదయ క్రాంతులు ప్రసరించాలని ఆశిద్దాం.

వాసంశెట్టి సుభాష్

కార్మిక శాఖ మంత్రి

ఈ వార్తలు కూడా చదవండి...

న్యాయవ్యవస్థపై గౌరవం.. కానీ సత్యాగ్రహం తప్పదు: కేజ్రీవాల్

హైకోర్టును ఆశ్రయించిన నటి అషురెడ్డి.. ఎందుకంటే..

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - May 01 , 2026 | 01:48 AM