అడవి నుంచి అసెంబ్లీకి!
ABN , Publish Date - Mar 06 , 2026 | 02:49 AM
భారతదేశ సామాజిక, రాజకీయ ముఖచిత్రంలో మావోయిస్ట్ పోరాటం ఒక విస్మరించలేని అధ్యాయం. దశాబ్దాల పోరాట చరిత్ర, వేలమంది అమరుల త్యాగాలు, పాలకుల క్రూరమైన అణచివేత...
భారతదేశ సామాజిక, రాజకీయ ముఖచిత్రంలో మావోయిస్ట్ పోరాటం ఒక విస్మరించలేని అధ్యాయం. దశాబ్దాల పోరాట చరిత్ర, వేలమంది అమరుల త్యాగాలు, పాలకుల క్రూరమైన అణచివేత నేపథ్యంలో నేడు ఈ ఉద్యమం ఒక చారిత్రక సందిగ్ధంలో ఉంది. ఈ తరుణంలో సాయుధ పంథా నుంచి ప్రజాస్వామ్య పోరాట వేదికపైకి రావడం అనేది లొంగుబాటు కాదు, అది అమరుల ఆశయాలను సాకారం చేసే వ్యూహాత్మక పరిణతి.
తుపాకీతో చేసే పోరాటంలో ప్రజలు కేవలం సాక్షులుగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. కానీ ప్రజాస్వామ్య పోరాటంలో ప్రతి సామాన్యుడు ఒక సైనికుడవుతాడు. నేటి రాజకీయాల్లోకి క్రమశిక్షణ, సిద్ధాంత బలం ఉన్న విప్లవ నాయకులు ప్రవేశిస్తే, అసెంబ్లీలో పేదవాడి గొంతుక మారుమోగుతుంది. రాజ్యాంగం కల్పించిన హక్కులతో (ఆర్టికల్ 19, 21 వంటివి) పోరాడితే, ప్రపంచం మొత్తం ఆ పోరాటం పక్షాన నిలుస్తుంది. అటవీ ప్రాంతాల్లో రక్తపాతం ఆగి, విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు హక్కులుగా మారుతాయి. గిరిజన యువతకు ఉజ్వల భవిష్యత్తు లభిస్తుంది. కార్పొరేట్ అజెండాల మధ్య నలిగిపోతున్న సామాన్యుడి కోసం ఒక శక్తిమంతమైన ప్రత్యామ్నాయ నైతిక రాజకీయశక్తి ఉద్భవిస్తుంది. అణగారిన వర్గాల ప్రతినిధులు నేరుగా అధికార పీఠాలపై కూర్చుని తమ సమస్యలకు తామే పరిష్కారాలు వెతుక్కుంటారు.
ఈ మార్పు పూలబాట కాదు. దశాబ్దాల శత్రుత్వం ఒక్క రోజులో మాయం కాదు. రాజ్యాంగబద్ధంగా పనిచేస్తామన్న వారికి ప్రభుత్వం రక్షణ కల్పించాలి. పాత కేసుల పేరుతో వేధించకుండా, పునరావాసం కల్పించి గౌరవప్రదమైన జీవితాన్ని ఇవ్వాలి. దశాబ్దాల పాటు ప్రాణత్యాగం చేసిన కుటుంబాలకు ఈ మార్పును ‘‘ఓటమి’’గా కాకుండా ‘‘వ్యూహాత్మక విజయం’’గా వివరించాల్సిన బాధ్యత నాయకత్వంపై ఉంది. ఆయుధాన్ని పక్కన పెట్టడం అంటే ఆశయాన్ని వీడటం కాదు, ప్రజలనే అత్యంత శక్తిమంతమైన ఆయుధంగా మలుచుకోగలిగితే అదే అసలైన విజయం.
భారత ప్రభుత్వం ప్రతి ఏటా అంతర్గత భద్రత కోసం, ముఖ్యంగా వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో వేల కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేస్తోంది. ‘సెక్యూరిటీ రిలేటెడ్ ఎక్స్‌పెండిచర్’ పథకం కింద కేంద్రం ఏటా రూ.1,500 కోట్లు కేవలం ప్రభావిత రాష్ట్రాలకు కేటాయిస్తోంది. పోరాటం ప్రజాస్వామ్యయుతంగా మారినప్పుడు ఈ భారీ నిధులు నేరుగా గిరిజన ప్రాంతాల్లోని పాఠశాలలు (ఏకలవ్య స్కూల్స్), ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల బలోపేతానికి మరలుతాయి. మావోయిస్ట్ ఉద్యమానికి ప్రధాన ఇంధనం ‘భూమి’. ఫారెస్ట్ రైట్స్ యాక్ట్–2006 కింద నేటికీ గిరిజన ప్రాంతాల్లో లక్షలాది క్లెయిమ్‌లు పెండింగ్‌లో ఉన్నాయి, లేదా తిరస్కరణకు గురైనాయి. సుమారు 40శాతానికి పైగా దరఖాస్తులు సాంకేతిక కారణాలతో కొట్టుకుపోతున్నాయి. సాయుధ పోరాటం ద్వారా భూమిని పంచడం కంటే, ప్రజాస్వామ్య వ్యవస్థలో భాగమై అటవీ హక్కుల చట్టాన్ని పక్కాగా అమలు చేయించడం ద్వారా, లక్షలాది గిరిజన కుటుంబాలకు చట్టబద్ధమైన యాజమాన్య హక్కులను కల్పించవచ్చు. ఇది వారిని శాశ్వత భూ యజమానులుగా మారుస్తుంది. భారతదేశంలోని ఖనిజ సంపదలో దాదాపు 80శాతం నుంచి 90శాతం వరకు గిరిజన ప్రాంతాల్లోనే ఉంది (ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఒడిశా). వేల కోట్ల రూపాయల ఖనిజాలు తరలిపోతున్నా, స్థానిక గిరిజనుల తలసరి ఆదాయం జాతీయ సగటు కంటే 50శాతం తక్కువగా ఉంటోంది. దీనికి ప్రధాన కారణం కార్పొరేట్ దోపిడీ – వనరుల విధ్వంసం. వ్యూహాత్మక మార్పుతో మావోయిస్టులు అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహిస్తే, ‘పెసా – 1996’ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయవచ్చు. గ్రామసభల అనుమతి లేకుండా కార్పొరేట్ శక్తులు ఒక్క ఇంచు భూమిని కూడా తీసుకోలేని పరిస్థితిని రాజ్యాంగబద్ధంగా సృష్టించవచ్చు. గత రెండు దశాబ్దాలలో హింసాత్మక ఘటనల కారణంగా వేలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. అపారమైన మానవ వనరుల నష్టం జరిగింది. వివిధ ప్రభుత్వ నివేదికల ప్రకారం గడిచిన ఇరవై ఏళ్లలో 10,000 నుంచి 12,000 మంది మరణించారు. తుపాకీ వీడి ఓటును ఆయుధంగా చేపడితే ఈ మానవ వనరులు దేశ నిర్మాణంలో భాగమవుతాయి. గిరిజన యువతకు ఉన్నత విద్య, సివిల్ సర్వీసెస్, రాజకీయాల్లో రిజర్వేషన్ల ద్వారా కీలక పాత్ర లభిస్తుంది. సాయుధ పోరాట స్థితిలో భద్రత కోసం వేలకోట్ల రూపాయల బడ్జెట్‌ను ఆయుధాలకే కేటాయిస్తున్నారు. ఆ బడ్జెట్‌ను విద్య, వైద్యం, వ్యవసాయం వైపు మళ్లించవచ్చు. గిరిజనులకు భూమిపై శాశ్వత చట్టబద్ధ హక్కులు లభిస్తాయి. గిరిజన యువత గెరిల్లా సైనికులుగా కాకుండా రాజకీయ నాయకులుగా, అధికారులుగా ఎదిగే అవకాశం ఉన్నది. అడవిలో ఉంటే వినిపించని మావోయిస్ట్ ముఖ్య నాయకుల గొంతు, ప్రజాస్వామ్య వేదికలపై వినిపిస్తే అది పాలకులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఆశయం సజీవమే, ఆయుధమే మారుతోంది.
అవినీతిమయమైన ప్రస్తుత రాజకీయాల్లో మావోయిస్ట్ భావజాలం ఒక ‘శుద్ధీకరణ ప్రక్రియ’లా పనిచేస్తుంది. ఆయుధం ఇచ్చే విజయం తాత్కాలికం, కానీ ఆలోచన తెచ్చే మార్పు శాశ్వతం. రాజ్యాంగం అనేది కేవలం ఒక పుస్తకం కాదు, అది కోట్లాది భారతీయుల ఆకాంక్షలకు ప్రతిరూపం. మావోయిస్టులు ఆ ప్రతిరూపంలో భాగస్వాములైతే, దేశంలోని అణగారిన వర్గాలకు ఒక కొత్త ఆశ చిగురిస్తుంది. ఇది రక్తపాతం లేని విప్లవం, ఇది ప్రజాస్వామ్య విప్లవం!
విశ్వ జంపాల
తెలంగాణ విద్యావంతుల వేదిక ఉపాధ్యక్షులు
ఇవి కూడా చదవండి...
లేట్ నైట్ రివ్యూలు తగ్గించండి.. మంత్రికి ఎమ్మెల్యే సూచన
అసెంబ్లీలో అందరూ ఉంటేనే మసాలా: స్పీకర్ అయ్యన్న పాత్రుడు
Read Latest AP News And Telugu News