మనువు... రాజకీయ బలిపశువు
ABN , Publish Date - Sep 27 , 2026 | 02:37 AM
‘రాజకీయాల్లో నినాదాలే ఉంటాయి, విధానాలు ఉండవు’ అని ఎస్.జైపాల్‌రెడ్డి ఒక సందర్భంలో అన్నారు. పైగా, ఆ మాట తనది కాదని తన రాజకీయ గురువు నీలం సంజీవరెడ్డి తమిళనాడులోని...
‘రాజకీయాల్లో నినాదాలే ఉంటాయి, విధానాలు ఉండవు’ అని ఎస్.జైపాల్‌రెడ్డి ఒక సందర్భంలో అన్నారు. పైగా, ఆ మాట తనది కాదని తన రాజకీయ గురువు నీలం సంజీవరెడ్డి తమిళనాడులోని ఆవడిలో 1955లో జరిగిన ఏఐసీసీ సమావేశంలో పాల్గొన్న తెలుగు ప్రతినిధులతో చెప్పినది అని వివరించారు. నాడు సంజీవరెడ్డి అన్న మాట నిజమేనని అన్ని పార్టీలూ నేటివరకూ నిరూపిస్తూనే ఉన్నాయి.
నినాదానికి పెద్దపీట వేసే రాజకీయంలో భాగమే నేడు రాజకీయ ప్రసంగాలలో వినిపిస్తున్న మనువు, మనుస్మృతి, మనువాదం, మనువాదులు అనే పదాలు. 1990లలో కాన్షీరామ్ బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) ప్రారంభించినప్పుడు ఎంచుకున్న ‘మనువాదులు’ అనే పదం ఆ పార్టీని మాయవతి నాయకత్వంలో యూపీలో అధికారంలోకి వచ్చేలా చేసింది. అది నినాదమే కానీ విధానపరంగా ఏమీ మార్పు తీసుకురానిదని అర్థమైన తర్వాత బీఎస్పీకి దూరంగా జరిగారు యూపీ ఓటర్లు. ఇప్పుడు యూపీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ మనువు, మనుస్మృతి పదాలను కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ అందిపుచ్చుకున్నారు. మనువు, ఆయన రాసిన స్మృతి వల్ల హిందూ మహిళలకు తీవ్రమైన అన్యాయం జరిగిందని, మహిళా సాధికారత కోసం మనువాదాన్ని అంతం చేయాలని రాహుల్ పిలుపు ఇస్తున్నారు. రాహుల్ సహా మనువాదం అనే దానిని రాజకీయ ఆయుధంగా వాడుకుంటున్న ఏ నాయకుడు కూడా మనువు ఏ కాలం వాడో స్పష్టంగా చెప్పలేదు. మనుస్మృతిని నిరసిస్తూ, మహిళా సాధికారత గురించి రాహుల్‌గాంధీ ప్రసంగాలు చేస్తున్న సమయంలోనే, ఆయన పార్టీ అధికారంలో ఉన్న కేరళంకు చెందిన ఇస్లామిక్ పండితుడు కాంతాపురం అబూబకర్ ముస్లియార్ ‘మహిళలు ఇంటి గడప దాటి బయటకు రాకూడదని, అదే ఖురాన్‌లో ఉంది’ అని ప్రకటించాడు. ఆ ఇద్దరు నేతల ప్రకటనలు, ఖురాన్–మనుస్మృతులను పోలుస్తూ వర్గీస్ జార్జ్ సెప్టెంబర్ 6న ‘ది హిందూ’ పత్రికలో ఒక వ్యాసం రాశాడు. అందులో మనుస్మృతి క్రీ.పూ 2వ శతాబ్దం నుంచి క్రీ.శ 3వ శతాబ్దం మధ్యలో రాశారని అన్నాడు. అంటే దాదాపు రెండు వేల సంవత్సరాల క్రితం నివసించినవాడు మనువు అని అర్థమవుతోంది.
అయితే మనువు ఏ ప్రాంతంలో నివసించాడు? ఆయన పురాణపురుషుడా లేక చారిత్రక పురుషుడా? ఋషియా లేక పాలకుడా? అనే విషయాలకు మనువును సామాజిక శత్రువుగా చిత్రీకరించిన వారెవ్వరూ స్పష్టత నివ్వటం లేదు. సరే, మనువు ఉన్నాడు, ఆయన ఒక స్మృతి రాశాడు అని అంగీకరిద్దాం. మన దేశంలో మరో 18 స్మృతులు ఉన్నాయి. ఒక్కొక్కరూ వారికి తోచిన విధంగా స్మృతులను రాశారు. మనువు సామాజిక అంశాలను స్పృశిస్తూ తన స్మృతి రాశాడని అంగీకరిద్దాం. మనువు వల్ల నిచ్చెనమెట్ల కుల వ్యవస్థ ఏర్పడిందని, అంటరానితనం ఆయన సృష్టించిందేనని నిందిస్తుంటారు. అది కూడా మనువు చేసిన సామాజిక ద్రోహం అని అంగీకరిద్దాం.
అయితే ఆ మనుస్మృతిని అమలు చేసిందెవరు? దానిని రాసి, అమలు చేయించగలిగిన శక్తి మనువుకు ఉన్నదా? మనుస్మృతిని నేటి రాజ్యాంగంతో పోల్చి చూద్దాం. అంబేడ్కర్ ఆధ్వర్యంలోని ఒక కమిటీ భారత రాజ్యాంగ రచన చేసింది. రాజ్యాంగసభ డా. బి.ఆర్ అంబేడ్కర్‌ను రాజ్యాంగ రచనకు నియమించకపోతే, ఆయన ఆ రచనకు పూనుకునేవాడు కాదు. రాజ్యాంగ రచన పూర్తి చేసినా దానిని అమలు చేసే అధికారం అంబేడ్కర్‌కు లేదు. అది పార్లమెంట్‌కే ఉంది. ఆ పార్లమెంట్‌కు ఎన్నికైన ప్రజాప్రతినిధులు, వారి ద్వారా ఏర్పడిన ప్రభుత్వమే రాజ్యాంగంలోని అంశాలను అమలు చెయ్యగలవు. అలాగే మనువు చేత ఆ స్మృతి రాయించిందెవరు? ఆ స్మృతిలోని అంశాలను అమలు చేయించిన పాలకుడు ఎవరు? ఏదో ఒక ప్రాంతానికి చెందిన వ్యక్తి రాసిన ‘మనుస్మృతి’ దేశమంతటా ఎలా, ఎందుకు అమలు అయింది?
మనుస్మృతి క్రీస్తు పూర్వం రెండో శతాబ్దం నుంచి క్రీస్తుశకం మూడో శతాబ్దం మధ్యలో రాసిన మాట నిజమైతే అది మన దేశంలో బౌద్ధ మతం విస్తృతమవుతున్న సమయం. అశోక చక్రవర్తి సహితం బౌద్ధం అనుసరించిన కాలం అది. గౌతమ బుద్ధుడు హైందవ సమాజంలోని ఎన్నో అంశాలను విమర్శించి తన కొత్త మార్గం ప్రజలకు పరిచయం చేశాడు. కానీ బుద్ధుడు నిరసించిన అంశాలలో అంటరానితనం అనేది ఎక్కడా కనిపించదు. అశోకుడు తన శాసనాల్లో సమాజంలోని కొందరిని అంటరానివారిగా చూస్తున్నారని, అది తప్పు అని, మనుషులంతా ఒక్కటే కాబట్టి తాను అంటరానితనాన్ని అంతం చేస్తున్నానన్న మాట ఎక్కడా రాయలేదే! కాబట్టి మనుస్మృతి ఆ కాలంలో లేదనుకోవాలా, లేక మనుస్మృతిలో సామాజిక వివక్షకు సంబంధించిన శ్లోకాలు లేవనుకోవాలా? అశోక చక్రవర్తి కాలంలో బౌద్ధం అధికారిక మతంగా మారిన కాలంలో మనుస్మృతికి విలువ లేకపోతే ఆ తర్వాత మనుస్మృతిలోని అంశాలకు విలువ ఎలా వచ్చింది? మరుగునపడిన మనుస్మృతిని తిరిగి వెలుగులోకి తెచ్చి, వివక్షతో కూడిన ఆ స్మృతిని అమలు చేసిన రాజు ఎవరు?
భారతదేశం అనే భావననే నిరసించే చరిత్రకారులు మన దేశంలో ఉన్నారు. వారి రాతల ప్రకారం భారతదేశమనేది ఏ ఒక్క కాలంలో కూడా ఒక రాజవంశ పాలనలో లేదు. ఏ ప్రాంతాన్ని ఎవరు జయించుకుంటే అది వారి పాలనలో ఉంది. అటువంటప్పుడు దేశంలోని అన్ని ప్రాంతాలలో మనుస్మృతి ఎలా అమలవుతుంది? మన దేశ దక్షిణ భాగమైన తమిళ ప్రాంతాలు ఉత్తర భారతదేశ వంశాల పాలనలో ఎన్నడూ లేవు. కాబట్టి మనుస్మృతి అమలు ఈ ప్రాంతంలో జరిగే అవకాశం లేదు. కానీ మనుస్మృతికి వ్యతిరేకంగా రాజకీయ ఉద్యమాలు తీవ్రంగా నడిచింది తమిళ ప్రాంతంలోనే. తమిళ ప్రాంతంలోకి మనుస్మృతి తెచ్చిందెవరు?
భారతదేశం వైవిధ్యభరితమైనది. భిన్నభాష, సంస్కృతుల సమూహాల కలయిక. ఎవరి ప్రాంతంలో వారే హీరోలు, మతపరమైన ఆచారాలు, ఆరాధనలు అన్నింటిలోనూ భిన్నత్వమే. అంతగా తమ అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేసిన ఈ సమూహాలు ఒక్క మనుస్మృతి అమలులో మాత్రం ఏకమయ్యాయనుకోవాలా? ఎన్నో చిన్న చిన్న సామాజిక అంశాలకు స్థానికంగా తిరగబడిన సమూహాలు మన దేశంలో చిరకాలంగా ఉన్నాయి. అటువంటి తిరుగుబాటు మనస్తత్వం కలిగిన భారతదేశ సమూహాలు మనువు వచ్చి తన స్మృతిని అమలు చేస్తుంటే తిరగబడకుండా ఉంటాయా? మనుస్మృతి అమలుకు వ్యతిరేకంగా అటువంటి తిరుగుబాట్లు ఈస్ట్ ఇండియా కంపెనీ రాక ముందు ఎక్కడా జరిగిన సాక్ష్యాధారాలు లేవు.
మనువు చారిత్రక పురుషుడు అవునో కాదో తెలియదు. మనువు తన స్మృతి రాసింది సంస్కృతంలో. ఆ కాలానికి తాళపత్రాలు ఉన్నాయో లేదో! కాబట్టి మనుస్మృతి మౌఖికమే. మౌఖిక స్మృతిని ఎవరైనా సవరించి తమ సొంత శ్లోకాలను జత చేసే అవకాశముంది. ఈ విషయం ఆర్యసమాజ్ వారు తమ పరిశోధనా గ్రంథంలో ప్రస్తావించారు. నేడు అమలులో ఉన్నది భారత రాజ్యాంగం. మనుస్మృతి అమలులో లేదు. దానిని ఎవరూ అమలు చెయ్యలేదు కూడా. అయినా మనుస్మృతి, మనువాదం అనే మాటలు ఎవరైనా మాట్లాడుతున్నారంటే అది వారి వారి రాజకీయ ప్రయోజనాల కోసమే. బీఎస్పీకి ఒక సమయంలో మనువాద నినాదం రాజకీయంగా లబ్ధి చేకూర్చింది. ఇప్పుడు రాహుల్‌గాంధీ ఆ నినాదంతో లబ్ధి పొందాలని చూస్తున్నారు. ఏ మేరకు అనేది 2027 యూపీ ఎన్నికల్లో తేలుతుంది.
డా. దుగ్గరాజు శ్రీనివాసరావు
ఈ వార్తలు కూడా చదవండి..
అమరావతి గ్రామకంఠం మినహాయింపులపై సీఆర్డీఏ స్పష్టత
సీఈసీపై పోరుకు ఇండియా కూటమి సిద్ధం.. సెప్టెంబర్ 30న కీలక సమావేశం
Read Latest AP News And Telugu News