Madhurakavi Mallavarapu John: జాషువా అడుగుజాడల్లో మధురకవి మల్లవరపు
ABN , Publish Date - Jan 19 , 2026 | 12:48 AM
కవి హృదయానికి అనివార్యంగా అమ్మతనం ఉండాలి. అమ్మ బలవర్ధకమూ జీర్ణయోగ్యమైన ఆహారాన్ని మాత్రమే బిడ్డకు అందించినట్లుగా కవి కూడా సమాజానికి అవసరమైన తాత్త్వికస్ఫూర్తిని...
కవి హృదయానికి అనివార్యంగా అమ్మతనం ఉండాలి. అమ్మ బలవర్ధకమూ జీర్ణయోగ్యమైన ఆహారాన్ని మాత్రమే బిడ్డకు అందించినట్లుగా కవి కూడా సమాజానికి అవసరమైన తాత్త్వికస్ఫూర్తిని పాఠకవిధేయంగా కవిత్వంలో ప్రబోధించాలి. వేమన నుండి గద్దర్ వరకూ అనేకమంది మహాకవులు ఈ కర్తవ్యాన్ని నిర్వర్తించి సాహిత్యానికి సమున్నత విలువనూ విస్తృతినీ సమకూర్చారు. ఇదే ఎరుకతో జాషువా లాంటి కవులు పద్యకవిత్వాన్ని మరోమలుపు తిప్పారు. ఆధునిక తెలుగు సాహిత్యంలో జాషువా మార్గంలో మడమ తిప్పకుండా పయనించిన సాహితీమూర్తుల్లో విశిష్టకవి మల్లవరపు జాన్.
జాన్ పేరు ఈ తరం వచన కవులకు పరిచయం లేకపోవచ్చు. దివాకర్ల వెంకటావధాని, విశ్వనాథ సత్యనారాయణ, ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి, కరుణశ్రీ, సినారె, బోయి భీమన్న, కొలకలూరి ఇనాక్, నాగభైరవ కోటేశ్వరరావు, బేతవోలు రామబ్రహ్మం వంటి సుప్రసిద్ధ కవి పండితులకు మాత్రం నులివెచ్చని రాగిముద్ద లాంటి ఆయన పద్యకవిత్వం పరమ ఇష్టం. ‘‘తేనెలూరు తెల్గు తీరు గనుంగొన కోర్కె వొడమువారు’’ మల్లవరపు జాన్ కావ్యాలను పరిశీలించమని తుమ్మల సీతారామమూర్తి రసహృదయులకు పిలుపునిచ్చాడు. ‘‘జాన్ పద్యం మాధుర్యగుణ భూయిష్ఠమైన’’దని ‘అతుకుల బ్రతుకులు’ కావ్య పీఠికలో దాశరథి కితాబిచ్చాడు.
‘మధురకవి’గా ప్రఖ్యాతిగాంచిన మల్లవరపు జాన్ 1927 జనవరి 22న ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో ఒంగోలు తాలూకా చీమకుర్తిలో దావీదు, రత్నమ్మ దంపతులకు జన్మించాడు. ‘‘చెప్పులు కుట్టి జీవనము సేయు కుటుంబము నందు బుట్టి, చిన్నప్పటి నుండి శారద పదార్చన జేసితి’’ అని ఈ కవి చెప్పుకున్నట్లుగానే– అనేక ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని, కఠోర కృషితో జ్ఞానార్జన చేసి, ఉద్దండ పండితులను ఢీకొని, ప్రభావశీలమైన పద్యకవిగా జాన్ రాణించాడు. ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన జాన్ తర్వాత ప్రథమశ్రేణి తెలుగు పండితుడై వందలాదిమంది శిష్యులకు భాషా సాహిత్యాను బోధించి, ఉత్తమ గురువుగా ప్రకాశంజిల్లాలో పేరు గాంచాడు.
ప్రారంభ దశలో ముత్యాల సరాల శైలిలో గేయ కవిత్వం రాశాడు. ఒంగోలులోని శఠగోపనాచార్యుని సహకారంతో సంస్కృతాంధ్ర భాషా సాహిత్యాలను, పంచకావ్యాలను అధ్యయనం చేసి, పద్యకవిత్వం వైపు కలం సారించాడు. పౌరాణిక పద్య నాటకాల ప్రభావంతో క్రైస్తవ ఇతివృత్తం నేపథ్యంలో జాన్ రాసిన ‘సాంసన్ డెలీల’ (1967) పద్యనాటకం ఆయనకు ఎంతగానో పేరు తెచ్చింది. ‘విశ్వప్రకాశం’ (1973), ‘అతుకుల బ్రతుకులు’ (1981), ‘కాంతిరేఖలు’ (1987), ‘సూక్తిశతకం’, ‘సరసవినోదిని’ (1991), ‘చిరస్మరణీయులు’ (1993), ‘భావ విపంచి’ (1996), ‘పుణ్య పురుషుడు’ (2005) వంటి ఖండకావ్యాలతో, కృతులతో మల్లవరపు జాన్ ఆధునిక పద్య కవిత్వంలో సుస్థిరస్థానాన్ని సంపాదించుకున్నాడు. మైసూరు తదితర విశ్వవిద్యాలయాల్లో జాన్ రచనలు పాఠ్య గ్రంథాలుగా ఉండటం అరుదైన విషయం. అవిద్య, పేదరికం, మద్యపానం, అధిక జనాభా, కుటుంబ నియంత్రణ, అవినీతి, లంచగొండితనం, వరకట్నం, మహిళాభ్యుదయం, దళితుల సంక్షేమం, కులనిర్మూలన, దేశభక్తి లాంటి అంశాలపట్ల ప్రజల్లో సదావగాహన కల్పించడానికి కవిత్వం ద్వారా జాన్ కృషి చేశాడు. అభ్యుదయ కవితా ప్రభంజనం తీరం దాటుతున్న సాహిత్య సందర్భంలో కవిగా రంగప్రవేశం చేసిన మల్లవరపు జాన్, అస్తిత్వ ఉద్యమాలు సాహిత్యాన్ని సుసంపన్నం చేస్తున్న సందర్భంలో కన్ను మూశాడు (2006 ఆగస్ట్ 12).
ఈ నాలుగు దశాబ్దాల్లో సాగిన సామాజిక ఉద్యమాల మౌలిక ఆశయాలను ప్రతిభావంతంగా జాన్ అక్షరబద్ధం చేశాడు. ‘‘పనులు జేయకుండ పంచభక్ష్యములను/ తేరగా భుజించి తిరుగువారు/ కష్టజీవి సొమ్ము కాజేయు గజదొంగల’’ని అభ్యుదయ కవిలా గర్జించాడు. ‘‘సామ్రాజ్యవాదుల సాహచర్యంబున, స్వార్థ జీవనుల హస్తములజిక్కి’’ మాతృదేశం
విలవిలలాడుతుందని జాతీయోద్యమ కవిలా ఆవేదన చెందాడు. సంప్రదాయ ఛందోబంధోబస్తుల రహదారుల్లో ప్రయాణం చేస్తూనే, ఆధునిక దృష్టితో నిరాడంబరమైన శిల్పచాతుర్యంతో ప్రజాకవిత్వాన్ని సృజించి, జాన్ సమకాలీన పద్యకవులకు ఆదర్శంగా నిలిచాడు
అస్తిత్వ ఉద్యమాల నేపథ్యంతో వెలువడే వర్తమాన సాహిత్యానికి జాన్ కవిత్వం సరికొత్త ఉత్తేజాన్ని అందిస్తుంది. అసమ సమాజ దుర్నీతిని, మతరాజకీయాల పెనుప్రమాదాలను మల్లవరపు జాన్ తీవ్రంగా వ్యతిరేకించాడు. రామ జన్మభూమి, బాబ్రీ మసీదు గొడవల నెత్తురు మడుగుల్లో బ్రతుకు దుంపతెగుతుందని’’ బాధపడుతూనే ‘‘ఓమన్న, ఆమెన్ నన్న, రహీమన్న పదాలు సన్నిహిత తుల్యార్ధ/ స్తోమము’’ లని (‘భావ విపంచి’) మతసామరస్యాన్ని ప్రబోధించాడు. ‘‘హరిపదాల బుట్టి అరుగుదెంచిన గంగ/ పాప జనుల శుద్ధి పరచుచుండ/ అజుని పాదజనితు లస్పృశ్యులెట్లైరి?’’ అని పౌరాణిక దృష్టితోనే కులవ్యవస్థ కుటిలత్వాన్ని ప్రశ్నించాడు. విష్ణుపాదాల నుండి పుట్టిన గంగ పవిత్రమైనదైతే, బ్రహ్మ పాదాల నుండి జనించినట్లు చెప్పబడుతున్న అతిశూద్రులైన దళితులు అంటరానివారు ఎందుకయ్యారని తర్కబద్ధంగా జాన్ వాదించాడు. ‘‘పురుషులతో సమానంగా సర్వకార్యములు నెరపిడి శక్తియుక్తులు నేర్చిన’’ ఆధునిక స్త్రీలను అణచివేయడం సభ్యసమాజానికి సిగ్గుచేటు అన్నాడు.
పద్యకవుల్లో మృగ్యమైన అంతర్జాతీయ రాజకీయస్పృహ జాన్ కవిత్వంలో దర్శనమిస్తుంది. కువైట్‌ను కబళించిన అమెరికా ఆధిపత్యం, గల్ఫ్ యుద్ధాల దుష్ప్రభావం లాంటి అంశాలను తన పద్యాల్లో అక్షరబద్ధం చేశాడు. అమెరికా యుద్ధోన్మాదాన్ని నిరసిస్తూ ‘‘ఒక సద్దాము పట్టగా సకలోర్వీ నాశనముసల్పుట తగునా? ఐక్య రాజ్యపున్ సమితి ప్రపంచ శాంతికై సత్వరయత్నము చేయదేలకో?’’ అని ఆక్షేపించాడు. ‘‘సాకు మోపి గర్వమున ‘నిరాకు’ ప్రజల/ అసువులను దీయు నమెరికానడ్డగించు/ పరమ ధీరులు లేరా ప్రపంచమందు?’’ (‘పైశాచిక ప్రవృత్తి’) అంటూ జాన్ కవి వేసిన సూటి ప్రశ్నలకు నేటికీ ప్రాసంగికత ఉంది. విశ్వమానవాళికి సమతా సందేశాన్నందించిన గౌతమ బుద్ధుని ‘‘లోకపరివర్తన దృక్పథమున్న గొప్ప సన్యాసి’’ అని, ‘‘మానవాభ్యుదయద్రష్ట’’ అని ప్రస్తు తించాడు. అంబేడ్కర్ స్ఫూర్తిదాయక ప్రస్థానాన్ని ‘భారత రత్న’ పద్య ఖండికలో చిత్రించాడు. ‘‘జాతి భవిష్యదభీప్సుతుండు’’ అని రాజ్యాంగ నిర్మాతకు జేజేలు పలికాడు.
‘‘లలితకళా విలాస విపులార్ధ పరిస్ఫుట భక్తిభావనోజ్వలతర కౌముది విభవ సారము’’లాంటి సంస్కృత సమాసభూయిష్ట రచనాసంవిధానంతో పద్యాలు రాసినప్పటికీ, ఈ శైలికి భిన్నంగా జాన్ శుద్ధవ్యవహారిక భాషకు పట్టం కట్టాడు. అణగారిన వర్గాల నుండి వచ్చిన పద్య కవులు తమనిత్య వ్యవహారంలోని పలుకుబడులను నుడికారాలను ప్రయోగించి తెలుగు పద్యానికి కొత్త ఊపిరిపోశారు. ‘పని తెమలదు’, ‘తేప తేపకు’, ‘తిమ్మిరెక్కినది’, ‘మిడిమేలము’, ‘తుంపులు తుంపులై’, ‘తాటాడిపోయి’, ‘తిప్పలుబడి దుంపద్రెంచు’, ‘మొమాటం’... లాంటి పల్లె పదాలను సమర్థవంతంగా ప్రయోగించి జాన్ తెలుగు పద్యానికి అరుదైన డిక్షన్ అందించాడు. జాన్ పాఠక సులభుడు. జాన్ కవిత్వం చిటారు కొమ్మన మిఠాయిపొట్లం కాదు. ఆబాలగోపాలానికి దాహం తీర్చే చలివేంద్రం. ఇందువల్లనే మల్లవరపు కవిత్వంలో మధురత్వం అంతకంటే మించిన సజీవత్వం నిలువెల్లా పరిమళిస్తుంది.
వస్తురూపాల్లో జాషువా ప్రభావం జాన్ కవిత్వంలో సర్వత్రా కనబడుతుంది. అయితే ఆ ప్రభావం కార్బన్ కాపీలా యథాతథంగా కాక, అన్న పోలికలు తమ్ముడి రూపంలో ప్రతిఫలించినట్లు ఉంటుంది. జాషువా మార్కు పద్య కవిత్వానికి అసలైన వారసునిగా మల్లవరపు జాన్ కనిపిస్తాడు.
(జనవరి 22న మల్లవరపు జాన్ శతజయంతి)
కోయి కోటేశ్వరరావు
94404 80274
ఈ వార్తలు కూడా చదవండి..
అభివృద్ధిని అడ్డుకుంటున్న బీఆర్ఎస్‌ను బొందపెట్టాలి.. సీఎం స్ట్రాంగ్ వార్నింగ్
మేడారంలో కేబినెట్ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ
For More TG News And Telugu News