Share News

కాలంలో నిలిచిన నిష్కళంక కమ్యూనిస్టు

ABN , Publish Date - May 12 , 2026 | 12:31 AM

అవినీతికి, అవకాశవాదానికి తలొగ్గకుండా రాజకీయ విలువలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచి, నిస్వార్ధ జీవిగా, అందరూ మెచ్చిన ప్రజా నాయకునిగా పేరు పొందారు మద్దికాయల ఓంకార్. 1926 మే 12న నేటి సూర్యాపేట...

కాలంలో నిలిచిన నిష్కళంక కమ్యూనిస్టు

అవినీతికి, అవకాశవాదానికి తలొగ్గకుండా రాజకీయ విలువలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచి, నిస్వార్ధ జీవిగా, అందరూ మెచ్చిన ప్రజా నాయకునిగా పేరు పొందారు మద్దికాయల ఓంకార్. 1926 మే 12న నేటి సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్) మండలం, ఏపూరులో రామయ్య, అనంతలక్ష్మి దంపతులకు మొదటి సంతానంగా ఓంకార్ జన్మించారు. ఏపూరులో నాల్గవ తరగతి వరకు చదివి ఆ తరువాత పెద్దగా పై చదువులు చదువలేదు. నాటి రాజకీయ, సామాజిక పరిస్థితులు ఆయనని పదిహేనేళ్ళ వయస్సులో రాజకీయాలవైపు నడిపించాయి. నిజాం నవాబు దుర్మార్గపు పాలన... ప్రజల తిరుగుబాటుకు, సాయుధ పోరాటానికి దారితీసింది. ఆ పాలనే ఓంకార్ చేత తుపాకీ పట్టించింది. 1946 నుంచి 1951 వరకు విరామమెరుగక జరిగిన వీరతెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో నిజాం రజాకారులపై, భూస్వాములపై, దొరల గడీల పాలన, అరాచకాలు, అన్యాయాలపై ఓంకార్ పోరాడారు. దాంతో నిజాం ప్రభుత్వం ఆయన తలకు వెలకట్టింది. అయినా మొక్కవోని ధైర్యంతో పుచ్చలపల్లి సుందరయ్య, రావి నారాయణ రెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు, భీమిరెడ్డి నర్సింహారెడ్డి వంటి అగ్రనాయకులతో కలిసి ఆ పోరాటానికి చివరి వరకు నాయకత్వం వహించారు. అనంతరం ఆదివాసి, గిరిజనులను సమీకరించి వారి హక్కుల కోసం పోరాడారు. కౌలు రైతులను సమీకరించి కౌలుదారు చట్టాన్ని సాధించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో లక్ష అరవై వేల ఎకరాల భూస్వాముల భూములను పేదలకు పంచారు. మార్క్సిస్టు పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహించారు. పార్టీలో వచ్చిన సైద్ధాంతిక విభేదాల కారణంగా 1984లో ఎంసీపీఐని ఏర్పాటు చేశారు. కుల, మత, ఆర్థిక, సామాజిక అసమానతలు లేని భారతదేశ వ్యవస్థ ఉండాలంటే వర్గ–సామాజిక జమిలి పోరాటాలు బలపడాలని, చీలికలుగా ఉన్న కమ్యూనిస్టు పార్టీల ఐక్యతకు నిరంతరం యత్నించారు.


ఆయన జీవితకాలమంతా అట్టడుగు ప్రజల హక్కుల కోసం, వారి సమస్యల పరిష్కారం కోసం అలుపెరుగని పోరాటాలు చేశారు. సైద్ధాంతిక నిబద్ధత గల ఓంకార్‌ని వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గ ప్రజలు 1972 నుంచి 1994 వరకు అత్యధిక మెజార్టీతో ఐదుసార్లు శాసనసభకు ఎన్నుకున్నారు. నర్సంపేట నుంచి ప్రాతినిధ్యం వహించినా, ఉమ్మడి రాష్ట్ర ప్రజల సమస్యలపై చట్టసభలలో ప్రజల గళం వినిపించేవారు. పీవీ నర్సింహారావు, వెంగళరావు, చెన్నారెడ్డి, అంజయ్య, విజయ భాస్కర్‌రెడ్డి, ఎన్టీఆర్, నాదెండ్ల, భవనం వెంకట్రామ్‌, నేదురుమల్లి వంటి ముఖ్యమంత్రుల హయాంలో ప్రతిపక్ష నాయకుడిగా, ప్రజలపక్ష నాయకుడిగా అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహించారు. చట్టాల అమలులో అవకతవకలపై, భూసమస్యలపై, విద్య–వైద్య విధానం, ఉద్యోగాల కల్పన, రాష్ట్ర సమగ్రాభివృద్ధి, నీళ్లు, నిధుల పంపకాలపై అసెంబ్లీలో ధారళంగా మాట్లాడి అనేక సూచనలు చేసేవారు. ప్రజా సమస్యలపై గర్జించిన ఓంకార్‌ని ‘అసెంబ్లీ టైగర్‌’గా ప్రజలు అభివర్ణించారు. బూటకపు ఎన్‌కౌంటర్లను వ్యతిరేకిస్తూ ‘నక్సలిజం– ప్రభుత్వ వైఖరి’ అనే అంశంపై శాసనసభలో ఏకధాటిగా రెండున్నర గంటలు ప్రసంగించి శాంతిభద్రతల విషయంలో ఏకసభ్య కమిషన్ వేయించడంలో ఓంకార్ పాత్ర అమోఘం. కేంద్ర ప్రభుత్వం చేతిలో పరిమిత అధికారాలు ఉండి, రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో అధిక అధికారాలు ఉండాలని శాసనసభలో అనేకసార్లు పోరాడారు. అనేక కుంభకోణాలను వెలికితీసి బాధ్యులపై చర్యలు తీసుకునే విధంగా కృషి చేశారు. ఆయన పోరాట ధోరణి, ముక్కుసూటి తత్వం, అనుసరించే రాజకీయ పంథాను జీర్ణించుకోలేని భూస్వాములు, గూండాలు, రాజకీయ ప్రత్యర్థులు ఆయనపై అరడజనుసార్లు హత్యాయత్నం చేశారు.

ఉద్యమాల గడ్డ వరంగల్ జిల్లా నర్సంపేటలో 2026 మే 12న కమ్యూనిస్టు, సామాజిక శక్తుల ఐక్యతలో అమరజీవి మద్దికాయల ఓంకార్ శతజయంతి వార్షికోత్సవ ముగింపు సభ జరుగుతున్నది. ఓంకార్‌ శతజయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆయన పేరున హైదరాబాద్, వరంగల్, నర్సంపేటలలో స్మారక చిహ్నాలను ఏర్పాటు చేయాలి.

వనం సుధాకర్

యంసీపీఐ(యు) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు

ఈ వార్తలు కూడా చదవండి...

మా ఇంటికి ప్రధాని రావడం గొప్ప గౌరవం: సీఎం చంద్రబాబు

జగన్ హయాంలో ఆలయాలకు భద్రత కొరవడింది: మంత్రి ఆనం

కైలాసగిరి త్రిశూలం ఆధ్యాత్మిక పునరుజ్జీవనానికి ప్రతీక: మంత్రి నారా లోకేశ్

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 12 , 2026 | 12:31 AM