విధ్వంసం.. విశేషాలు.. వెలుగులు!
ABN , Publish Date - Jun 12 , 2026 | 12:27 AM
యుద్ధ విధ్వంసాలూ దారుణాలూ లెక్కలేనన్ని బాధలనూ కలగచేస్తాయనే సంగతి అందరికీ తెలిసిందే. అందులో ప్రత్యేకత ఏమీలేదు. ప్రతి యుద్ధంలోనూ అవే పునరావృతం అవుతాయి. వాటిల్లో సమిధలు అయ్యేదీ...
యుద్ధ విధ్వంసాలూ దారుణాలూ లెక్కలేనన్ని బాధలనూ కలగచేస్తాయనే సంగతి అందరికీ తెలిసిందే. అందులో ప్రత్యేకత ఏమీలేదు. ప్రతి యుద్ధంలోనూ అవే పునరావృతం అవుతాయి. వాటిల్లో సమిధలు అయ్యేదీ సాధారణ ప్రజలే. లెబనాన్‌లో ఇజ్రాయెల్ సాగిస్తోన్న దాడులకూ దురాగతాలకూ హెజ్బుల్లా తీవ్రవాదులే మరణించటం లేదు. సాధారణ ప్రజలే ఎక్కువగా బలవుతున్నారు. అమెరికా–ఇజ్రాయెల్‌లు 40 రోజుల పాటు ఇరాన్‌పై చేసిన యుద్ధంలో ఎంతమంది చనిపోయారో అంతకుమించి లెబనాన్ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కటువుగా హెచ్చరికలు చేసినా లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులను ఆపటం లేదు. ఏదో ఒక మిషతో వాటిని కొనసాగిస్తూనే ఉంది. ఇక లెబనాన్‌లో దాడులనూ విధ్వంసాలనూ ఆపితేనే శాంతిప్రక్రియ కొలిక్కివస్తుందని అమెరికాకు ఇరాన్ తేల్చిచెబుతోంది. పశ్చిమాసియాలో శాంతి ఏర్పడి హోర్ముజ్ దిగ్బంధం తొలగిపోవాలంటే లెబనాన్‌లో పరిస్థితి కుదుటపడాలి. అదంత తేలికగా జరుగుతుందని చెప్పలేం. 1975 నుంచి ఇప్పటివరకూ ఏదో విధంగా సంక్షోభాన్ని లెబనాన్ ఎదుర్కొంటూనే ఉంది.
లెబనాన్ చాలా చిన్నదేశం. చమురు వనరులు పెద్దగా లేవు. ఆ దేశ ఉత్తరాది సరిహద్దు నుంచి దక్షిణాదికి మధ్య దూరం 217 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. ఇక తూర్పు, పశ్చిమాల మధ్య దూరం మరీ తక్కువ. 32 నుంచి 88 కిలోమీటర్ల మధ్యే ఉంటుంది. మొత్తంగా దేశ విస్తీర్ణమే 10,452 చదరపు కిలోమీటర్లు మాత్రమే. అంటే హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలెప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) పరిధికి సమానంగా లెబనాన్ విస్తీర్ణం ఉంటుంది. జనాభా 58 నుంచి 60 లక్షల లోపుగానే ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. అంచనాలేనని ఎందుకు అనుకోవాల్సి వస్తుందంటే 1932 నుంచి ఇప్పటివరకూ అక్కడ జనాభాను అధికారికంగా గణించలేదు. 1932 నాటి లెక్కల ప్రకారమే ఇప్పటికీ అక్కడ చాలావరకూ పదవులూ ఉద్యోగాల పంపకాలూ ఆధారపడి ఉన్నాయి. ఇంకో విచిత్రం కూడా లెబనాన్‌లో ఉంది. మొత్తం జనాభాలో దాదాపు 15 నుంచి 20 లక్షల మంది సిరియా, పాలస్తీనా నుంచి వచ్చిన శరణార్థులే ఉన్నారు. అంటే జనాభాలోని ప్రతి నలుగురిలో ఒకరు శరణార్థే అన్నమాట. ఈ పరిస్థితి ప్రపంచంలో మరే దేశంలోనూ లేదు.
లెబనాన్ అంటే హెజ్బుల్లాలు, ఇజ్రాయెల్‌పై వాళ్లు ప్రయోగించే రాకెట్లు మాత్రమే కాదు. అంతకు మించిన ఘనచరిత్రా లెబనాన్‌కు ఉంది. తొలి లిపి అక్కడే రూపుదిద్దుకున్నదని చెప్పే చరిత్రా మనకు ఎదురవుతుంది. యూరప్‌కూ ఆసియాకూ మధ్య శతాబ్దాలపాటు వారధిగా నిలిచింది. లెబనాన్‌లో అడుగుపెట్టని మహాసామ్రాజ్యం లేదు. మతహింస బాధితులందరికీ ఒకనాడు లెబనాన్ ఆశ్రయమిచ్చి అక్కున చేర్చుకొనేది. అందుకే ఈనాటి విధ్వంసాలు, ప్రతివిధ్వంసాలను దాటుకుని కాస్త వెనుకకు వెళ్లి చరిత్రను చూస్తే ఎన్నో విశేషాలూ, వెలుగులూ కనపడతాయి. కులాల జనాభా ప్రాతిపదిక మీద ఉద్యోగాలూ, పదవులూ ఇవ్వాలనే డిమాండు భారత్‌లో ఊపందుకుంటున్న వేళ లెబనాన్ ఎంతో ముందుగా ఆ తరహా పద్ధతిని మతప్రాతిపదికన ప్రవేశపెట్టి సాధించిన విజయాలనూ, తెచ్చిపెట్టుకున్న ఘోర సమస్యలనూ పరిశీలిస్తే ఇక్కడి సామాజిక సమస్యలపై ఎలాంటి వైఖరి అనుసరించాలో కొంతైనా తెలుస్తుంది.
పశ్చిమాసియాలో ఒకప్పుడు (1950, 1960ల్లో) లెబనాన్ చాలా వాటిల్లో ముందుండేది. బహుళపార్టీ రాజకీయ వ్యవస్థతో పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ తర్వాత ప్రజాస్వామ్యాన్ని కలిగిన దేశంగా గుర్తింపు ఉండేది. అంతర్జాతీయ బ్యాంకింగ్ వ్యవస్థకు కీలక దేశంగా రూపుదాల్చింది. దీంతోపాటు వినోదరంగం, ప్రసారమాధ్యమ రంగం, పర్యాటకరంగం బాగా అభివృద్ధి అయింది. విదేశీపెట్టుబడులకు ఎలాంటి ఆటంకం ఉండేది కాదు. పశ్చిమాసియాలో మిగులుధనం అంతా బీరూట్ బ్యాంకుల్లోకే ప్రవహించేది. పన్నులు సరళంగా ఉండటం పెట్టుబడులను బాగా ఆకర్షించటానికి తోడ్పడింది. తలసరి ఆదాయంలో లెబనాన్ 1950ల్లో పశ్చిమాసియాలో బాగా ముందుండేది. 1970ల మధ్యకు వచ్చేసరికి ఇదంతా మారిపోయింది. ఒకప్పుడు అన్ని మతాలకు రాజకీయపదవుల్లో, ఉద్యోగాల్లో ప్రాతినిధ్యం కల్పించటానికి ఏర్పాటైన వ్యవస్థ కాలక్రమంలో మతతత్వ ఆలోచనలు బలపడటానికి దోహదం చేసింది. జాతీయభావన అట్టడుగుకు వెళ్లిపోయి మత, తెగ పక్షపాత ఆలోచనలూ ప్రయోజనాలే ప్రధానం అయ్యాయి. లెబనాన్‌లో ప్రధానంగా 18 మతసమూహాలను గుర్తించారు. జనాభాలో వాటి సంఖ్యను బట్టి రాజకీయాధికారంలో ప్రాతినిధ్యం కల్పించారు. జనాభాను మతవర్గాల వారీగా చూసి, ఆ వర్గాల వారీగా అధికారాన్ని కొంతవరకూ విభజించటం లెబనాన్‌పై ఫ్రెంచ్ నియంత్రణ (1920–1943) ఉన్న కాలంలోనే మొదలైంది. వలసదేశాల్లో ప్రజలను విభజించి పాలించే పద్ధతిని బ్రిటిషు పాలకులతో పాటు ఫ్రెంచ్ పాలకులూ పాటించారు. మతపరమైన విభజనలనూ, అపనమ్మకాలనూ తొలగించే రీతిలో కాకుండా అవి మరింత బలపడేలా విధానాలను రూపొందించారు. లెబనాన్‌కు 1943లో స్వాతంత్య్రం లభించింది. అప్పుడే పెద్దమనుషుల ఒప్పందం లాంటిది కుదుర్చుకుని మతవర్గాల వారీగా (కన్ఫెనల్ సిస్టమ్) అధికారం కట్టబెట్టే విధానానికి సంపూర్ణ రాజ్యాంగబద్ధతను కల్పించారు.
మొదటి ప్రపంచయుద్ధం తర్వాత బ్రిటన్, ఫ్రాన్స్‌లు పశ్చిమాసియాలోని భూభాగాలను తమకు ఇష్టం వచ్చినట్లు పంచుకున్నాయి. రాజకీయ సరిహద్దులను తమ ప్రయోజనాల కోసమే నిర్ణయించాయి. అక్కడ నివసించే ప్రజల భావాలను పరిగణనలోకి తీసుకోలేదు. దీర్ఘకాలికంగా తలెత్తే సమస్యలనూ పట్టించుకోలేదు. ఏ దేశంలో ఏ భూభాగం ఉంటే సాంస్కృతికంగా ప్రజల మధ్య సారూప్యత ఉంటుందో గ్రహించలేదు. స్వార్థప్రయోజనాలే ప్రధానంగా అప్పట్లో తీసుకున్న నిర్ణయాలతో ఇప్పటికీ పశ్చిమాసియా భగ్గుమంటూనే ఉంది. యూదులకు పాలస్తీనాలో ప్రత్యేక దేశం ఏర్పాటుచేస్తామని బ్రిటన్ ఏకపక్షంగా ప్రకటించి, క్రమేపీ స్థానిక అరబ్బులను నిర్వాసితులను చేయటంతోనే అసలు నిప్పు రాజుకుంది. మొదట్లో మౌంట్ లెబనాన్ అనేది ఒక రాష్ట్రంగా టర్కీ సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. అప్పటికి అక్కడ క్రైస్తవుల జనాభానే ఎక్కువగా ఉండేది. కొన్ని ఇతర భూభాగాలను కలిపి ఒక కొత్త దేశంగా గ్రేటర్ లెబనాన్ (1920)ను ఫ్రాన్స్ ఏర్పాటు చేసింది. కొత్త ప్రాంతాలు వచ్చి చేరటంతో ముస్లింల జనాభా పెరిగింది. అయినా 1943 నాటికి ఒకటి రెండు శాతం ఎక్కువగా క్రైస్తవులే ఎక్కువగా ఉండేవారు. వివిధ మతాలను సంతృప్తిపరచటానికి ఏర్పాటుచేసిన కన్ఫెనల్ సిస్టంతో లెబనాన్ అధ్యక్షుడిగా క్రైస్తవ మతానికి (మరొనైట్) చెందిన వ్యక్తినే ఎన్నుకోవాలి. ప్రధానమంత్రి సున్నీ మతానికి చెందిన వ్యక్తే అయివుండాలి. పార్లమెంట్ స్పీకర్ పదవికి షియా ముస్లిమే ఎన్నిక కావాలి. మొదట్లో ఇతర రాజకీయ పదవులన్నీ ౬:5 పద్ధతిలో నింపేవారు. అంటే ఆరు పదవులు క్రైస్తవులకు ఉంటే మిగతా అయిదూ ముస్లింలకు లభించేవి. 1989లో దీన్ని 5:5కు మార్చారు. పౌర, సైనిక ఉద్యోగాల్లో కూడా మతపరమైన కోటాల వ్యవస్థే అమలైంది. దీన్ని క్రమేపీ ప్రతిభ ఆధారితంగా మార్చాలని 1989లోనే ఒక అంగీకారానికి వచ్చినా అనుకున్న విధంగా ఇప్పటికీ దాన్ని అమలు చేయలేకపోతున్నారు. పార్లమెంటులో 128 స్థానాలుంటే వాటిని సగంసగం చొప్పున క్రైస్తవులకు, ముస్లింలకు కేటాయిస్తున్నారు. క్రైస్తవుల్లో ఏడు వర్గాలకు 64 సీట్లను పంచారు. అలాగే ముస్లింల్లో నాలుగు విభాగాలకు వాటిని కేటాయించారు. మరొనైట్ క్రైస్తవుడికి కేటాయించిన సీటులో ఆ వర్గానికి చెందిన వ్యక్తులే పోటీచేయాలి. ఓటర్లుగా అన్ని మతాలకు చెందినవారూ ఉంటారు. అభ్యర్థులూ ఓటర్లూ ఒక మతానికి చెందినవారే ఉండాలనే విధానాన్ని ప్రవేశపెడితే పరిస్థితి బాగా ఘోరంగా మారేది.
పదవులనూ ఉద్యోగాలనూ మతపరమైన కోటాలతో నింపటం మొదలైన తర్వాత అన్నీ మతం చుట్టూనే తిరగటం మొదలైంది. వ్యక్తులను పౌరులుగా చూడటం పోయి, మతానికి చెందిన వ్యక్తులుగా చూడటం బలపడింది. మతదృష్టి పెరిగిపోయిన తర్వాత కొన్ని విషయాలను ఆ దృష్టితోనూ మరికొన్ని విషయాలను లౌకిక దృష్టితోనూ చూడటం అసాధ్యంగా మారుతుంది. క్రైస్తవులు పాశ్చాత్యదేశాలతో సఖ్యత కోరుకుంటే ముస్లింలు అరబ్బుదేశాలతో సఖ్యతను ఆశించారు. పాలస్తీనా సమస్య లెబనాన్‌కు జీవన్మరణ సమస్యగా మారింది. పాలస్తీనా శరణార్థులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్‌పై దాడులు మొదలయ్యాయి. 1970ల తర్వాత కొన్నేళ్లపాటు లెబనానే పాలస్తీనా ఉద్యమకారులకు ప్రధానస్థావరంగా మారింది. ఇజ్రాయెల్ ప్రతి చిన్న సంఘటనను ఉపయోగించుకుని పెద్దఎత్తున దాడులకూ విధ్వంసాలకూ పాల్పడటం మొదలుపెట్టింది. పౌర నివాసాలను, ఆసుపత్రులను, పరిశ్రమలను, విమానాశ్రయాలను, మౌలిక రవాణా సదుపాయాలను నాశనం చేసింది. వీటితో బాగా నష్టపోయింది లెబనాన్ దక్షిణ భాగాన ఉన్న షియా ముస్లింలు. ఇతర ప్రధాన మత సమూహాలతో పోల్చితే అన్నిరకాలుగా బాగా వెనుకబడిన ఈ షియా ముస్లిం బాధితుల నుంచే హెజ్బుల్లా పుట్టుకొచ్చింది. సైన్యంలో కూడా మతపరమైన విభజనలు పొడచూపటంతో అంతర్యుద్ధ పరిస్థితులు (1975–1990) ఏర్పడి, మత సమూహాల మధ్య వీధిపోరాటాలు చెలరేగినప్పుడు కూడా అదేమీ చేయలేకపోయింది. ప్రతి మతం తరఫునా సాయుధబృందాలు ఏర్పాటయ్యాయి. 1982లో ఏర్పడిన హెజ్బుల్లాకు ఒకదశలో లెబనాన్ సైన్యం కంటే ఎక్కువమంది సాయుధులు ఉండేవాళ్లు. ఇరాన్ వెన్నుదన్నుగా నిలవటంతో హెజ్బుల్లా విపరీతంగా బలాన్ని సంపాదించుకుంది. హెజ్బుల్లా సాయుధ సమూహంగానే లేదు. లెబనాన్ ఎన్నికల్లో పోటీచేసి సీట్లనూ గెలుస్తోంది. 2005లో ప్రభుత్వంలోనూ చేరింది. ఇజ్రాయెల్–హెజ్బుల్లా దాడులు ప్రతిదాడులతో 1978 నుంచి ఇప్పటివరకూ 30 వేలమంది వరకూ లెబనాన్‌లో ప్రాణాలను కోల్పోయారు. 2023 అక్టోబరు నుంచి ఇప్పటివరకూ 6,500 మంది మరణించారు. ఇక అంతర్యుద్ధకాలంలో మూడోవంతు మంది ప్రజలు దేశం వదలి వెళ్లిపోయారు. మొత్తంగా విదేశాల్లో లెబనాన్ మూలాలున్న ప్రజలు 8 నుంచి 15 మిలియన్ల వరకూ ఉంటారనే అంచనాలు ఉన్నాయి. అంటే దేశంలో కంటే లెబనాన్ ప్రజలు విదేశాల్లోనే ఎక్కువగా ఉన్నట్లు లెక్క.
బహుళపార్టీ ప్రజాస్వామ్యాన్ని ఎక్కువకాలం కొనసాగించిన దేశంగా లెబనాన్ పశ్చిమాసియాలో నిలబడినప్పటికీ మతం ఆధారిత కోటాల వ్యవస్థ వల్ల లౌకిక దృష్టితో కూడిన ఆధునిక పౌరసత్వ భావన బలహీనపడిపోయింది. కాలపరిమితి లేని కోటాల వ్యవస్థ సృష్టించే అనర్థాలకు లెబనాన్ ఉదాహరణగా నిలిచిపోతుంది. కులం, మతం, తెగల పేరుతో అస్తిత్వాలను బలపరిచే రాజకీయాలను అనుసరించిన తర్వాత వాటిని తొలగించుకోవటం ఎక్కడైనా కష్టమే. లెబనాన్ చెప్పే గుణపాఠం అదే!
రాహుల్ కుమార్
(ఆంధ్రజ్యోతి ఎడిటర్)
ఈ వార్తలు కూడా చదవండి...
జగన్ హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు: హోంమంత్రి అనిత
ప్రధాని మోదీ దేశాన్ని సరికొత్త దిశగా తీసుకెళ్తున్నారు: సీఎం చంద్రబాబు
Read Latest AP News And Telangana News And National News
And Telugu News