Share News

జెన్‌ జీ చూస్తోంది జాగ్రత్త!

ABN , Publish Date - May 31 , 2026 | 12:27 AM

జెన్‌ జీ– జెన్‌ ఆల్ఫా! ఇప్పుడు కొత్తగా బొద్దింకలు! ఈ పదాలు వినపడినప్పుడల్లా మన దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలు ఉలిక్కిపడుతున్నాయి. నిన్నటి తరం ఆలోచనలతో, పాత చింతకాయ పచ్చడి విధానాలతో..

జెన్‌ జీ చూస్తోంది జాగ్రత్త!

జెన్‌ జీ– జెన్‌ ఆల్ఫా! ఇప్పుడు కొత్తగా బొద్దింకలు! ఈ పదాలు వినపడినప్పుడల్లా మన దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలు ఉలిక్కిపడుతున్నాయి. నిన్నటి తరం ఆలోచనలతో, పాత చింతకాయ పచ్చడి విధానాలతో నడుస్తున్న పార్టీలకు ఎన్నికలలో నవతరం నుంచి ప్రతిఘటన ఎదురవుతోంది. యువతరంలో ఆశలు–ఆకాంక్షలు పెరుగుతున్న సమయంలోనే నిరాశా నిస్పృహలు కూడా వారిని కమ్మేస్తున్నాయి. ఫలితంగానే జెన్‌ జీ–బొద్దింకలు వంటి నినాదాలు పుట్టుకొచ్చి సంప్రదాయ రాజకీయ పార్టీలను తుడిచిపెడుతున్నాయి. మా పార్టీకి సుదీర్ఘ చరిత్ర ఉందన్న నినాదానికి కాలం చెల్లింది. యవతరంతో కనెక్ట్‌ కాని పార్టీలు మెల్లగా తెరమరుగవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా జరిగిన తెలుగుదేశం పార్టీ మహానాడులో జెన్‌ జీ, జెన్‌ ఆల్ఫా పదాలను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రముఖంగా ప్రస్తావించారు. నవతరంతో పార్టీ అనుబంధాన్ని పటిష్ఠం చేసే ప్రయత్నం చేశారు. తమిళనాడు ఎన్నికల ఫలితాల నేపథ్యంలో చంద్రబాబు యువత ప్రాధాన్యాన్ని గుర్తించినట్టుంది. ప్రధాని నరేంద్ర మోదీ కూడా సామాజిక మాధ్యమాలలో యువతరం వెలిబుచ్చుతున్న అభిప్రాయాలను ఎప్పటికప్పుడు తెలుసుకొని తదనుగుణంగా వ్యూహాలు రూపొందించుకోవాలని పార్టీ నాయకులకు దిశా నిర్దేశం చేశారు. నిన్నటి తరానికి చెందిన ఈ ఇరువురు నాయకులూ రేపటి తరం గురించి ఆలోచించడానికి కారణం లేకపోలేదు. ఈ క్రమంలో ముందుగా కాంగ్రెస్‌ పార్టీ గురించి తెలుసుకుందాం. స్వాతంత్య్ర సంగ్రామాన్ని ముందుండి నడిపించిన కాంగ్రెస్‌ పార్టీ... ఆ తర్వాత దేశాన్ని సుదీర్ఘ కాలం పరిపాలించింది. తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ నుంచి లాల్‌బహదూర్‌ శాస్ర్తి, ఇందిరాగాంధీ, రాజీవ్‌ గాంధీ, పీవీ నరసింహారావు, మన్మోహన్‌సింగ్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి ప్రధానమంత్రులుగా పనిచేశారు. స్వాతంత్య్రం వచ్చి దాదాపు ఎనభై సంవత్సరాలు అవుతున్నందున స్వాతంత్య్ర పోరాటంలో అప్పటి కాంగ్రెస్‌ నాయకుల పాత్ర, తెల్ల దొరల పాలనలో ఈ దేశ ప్రజలు అనుభవించిన కష్టాల గురించి నేటి తరానికి అవగాహన లేకుండా పోయింది. దేశానికి స్వాతంత్య్రం ఆషామాషీగా రాలేదని, ఎంతో మంది ప్రాణత్యాగం చేశారనే విషయం కూడా నేటి తరం తెలుసుకోలేకపోతోంది. ఫలితంగా ప్రజల్లో జాతీయ భావం మసకబారింది.


ఈ కారణంగానే కాంగ్రెస్‌ పార్టీ కూడా నేటి తరానికి దూరమైంది. కాంగ్రెస్‌ నాయకుల పెడ ధోరణులు కూడా మరో ప్రధాన కారణం. నాయకులు అవినీతి రొచ్చులో మునిగితేలడం వల్ల ప్రజలకు కాంగ్రెస్‌ దూరమైంది. ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ బలిదానాల గురించి ఈ తరానికి పెద్దగా తెలియదు. పార్టీని ఎప్పటికప్పుడు యువతతో కనెక్ట్‌ చేసుకునే పనిని కాంగ్రెస్‌ నాయకులు కూడా చేయలేదు. విధానాలను, ఆలోచనలను సవరించుకొని నవీకరించుకోలేదు. అధికారాన్ని బాధ్యతగా కాకుండా సంపాదనకు మార్గంగా భావించడం వల్ల కాంగ్రెస్‌ పార్టీ నాయకుల పట్ల ప్రజలకు ముఖం మొత్తింది. ఫలితంగా నవ తరానికి ఆ పార్టీ దూరమైంది. విచిత్రమేమిటంటే, డెబ్బై అయిదేళ్లు పైబడిన ప్రధాని నరేంద్ర మోదీ ఈ దేశం యువతతో కనెక్ట్‌ అవుతుండగా... వయసులో చిన్నవాడైన రాహుల్‌గాంధీ యువతను ఆకట్టుకోలేకపోతున్నారు. ఈ పరిస్థితికి కారణాలను అన్వేషించకుండా కాలం చెల్లిన విధానాలు, వివాదాలతోనే ఆ పార్టీ ముందుకు వెళుతోంది. ఈ కారణంగానే ఉత్తర భారతంలో ఆ పార్టీ తన అస్తిత్వాన్ని దాదాపుగా కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ప్రజలకు మనం ఎందుకు దూరమయ్యామనే ఆత్మపరిశీలన చేసుకోకుండా... ఐదారు దశాబ్దాల క్రితం కమ్యూనిస్టుల నోటి వెంట వెలువడిన నినాదాలను, వారు అనుసరించిన విధానాలను కాంగ్రెస్‌ పార్టీ అందిపుచ్చుకుంది. తరం మారినప్పుడల్లా ప్రజల ఆకాంక్షలు, ఆలోచనలు మారుతుంటాయని గుర్తించలేకపోతోంది.


చైనాను చూసైనా...

చైనాలో చోటుచేసుకున్న తియాన్మెన్‌ స్క్వేర్‌ ఉదంతాన్నే తీసుకుందాం. అక్కడి కమ్యూనిస్టు ప్రభుత్వం అమలు చేస్తున్న కఠిన ఆంక్షలకు వ్యతిరేకంగా యువత గొంతు వినిపించింది. నిరసనలు ఉద్యమ రూపం సంతరించుకున్నాయి. నాటి ఉద్యమాన్ని అక్కడి ప్రభుత్వం అణచివేసినప్పటికీ... ఆ తర్వాత తన విధానాలను సవరించుకుంది. అంతకు ముందు అమలు చేసిన కఠిన నిబంధనలను సడలించి అనేక వెసులుబాట్లను కల్పించింది. ఇప్పుడు చైనాలో పగటిపూట కమ్యూనిజం, రాత్రి పూట క్యాపిటలిజం అమల్లో ఉంటున్నాయి. సౌకర్యాలు, విలాసాల కోసం పాశ్చాత్య దేశాల వైపు చూసే అవసరం లేకుండా చేశారు. ఫలితంగానే ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిజం అంతరించిపోయినా చైనాలో మాత్రం వర్ధిల్లుతోంది. గ్లోబలైజేషన్‌ ప్రభావం ప్రపంచ దేశాలను చుట్టుముడుతున్న వేళ మన దేశంలో కాంగ్రెస్‌ పార్టీ సోషలిజం, సెక్యులరిజం వంటి విధానాలను సవరించుకోకుండా పాత విధానాలనే పట్టుకువేలాడింది. ప్రపంచీకరణ ప్రభావం మన దేశంలో గ్రామాలకు కూడా విస్తరించిన వాస్తవాన్ని విస్మరించింది. సెక్యులరిజం కూడా శ్రుతి మించుతోందని ప్రజలు భావిస్తున్న విషయాన్ని కాంగ్రెస్‌ నాయకులు గుర్తించలేదు. ఈ కారణంగానే ప్రధాని మోదీ తిరుగులేని నేతగా ఎదిగారు.


‘కాక్రోచ్‌’ కలకలం

మోదీ అధికారంలోకి వచ్చి పన్నెండేళ్లు అవుతోంది. ప్రజల్లో ఆయన పట్ల కూడా కొంత విముఖత ఏర్పడటం మొదలైంది. ప్రతిపక్షం బలంగా లేనప్పుడు ప్రజలే ప్రతిపక్షం బాధ్యత తీసుకుంటారు. బొద్దింకల ఉద్యమమే ఇందుకు నిదర్శనం. అభిజిత్‌ అనే ఒక దళిత యువకుడు సోషల్‌ మీడియా వేదికగా ప్రారంభించిన కాక్రోచ్‌ జనతా పార్టీకి ఫాలోవర్ల సంఖ్య భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్‌ పార్టీలను మించిపోయింది. ఇదంతా రోజుల వ్యవధిలోనే జరగడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కాక్రోచ్‌ జనతా పార్టీకి ఫాలోవర్లు అమాంతం పెరగడం వెనుక ఏదో ఉందని భావించిన కేంద్ర ప్రభుత్వం సోషల్‌ మీడియాలో ఆ పార్టీ ఖాతాలను స్తంభింపజేసింది. అంతటితో పనైపోయిందని ప్రధాని మోదీ రిలాక్స్‌ అవలేదు. నవతరం ఏం కోరుకుంటున్నదో తెలుసుకొనే పనిలో ప్రస్తుతం ఆయన ఉన్నారు. యువతరంలో అసంతృప్తి నెలకొంటే ఏం జరుగుతుందో ప్రధానికి బాగా తెలుసు. తమిళనాడు ఎన్నికల్లో ఏం జరిగిందో చూశాం కదా! ఆ రాష్ట్రంలో ద్రవిడ పార్టీలకు తప్ప మరో పార్టీకి చోటు ఉండదన్న భావన ఉండేది. ఈ కారణంగానే డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు రిలాక్స్‌ అయ్యాయి. ద్రవిడ వాదానికి నేటి తరం దూరమైందని– పెరియార్‌, అన్నాదురైల ప్రభావం నవ తరంపై లేదని గుర్తించలేకపోయారు. ఫలితంగానే సినీ నటుడు జోసెఫ్‌ విజయ్‌ నాయకత్వంలో టీవీకే పార్టీ ఆవిర్భవించింది. తమిళ యువత మూకుమ్మడిగా విజయ్‌ వైపు ఆకర్షితులయ్యారు. దశాబ్దాల చరిత్ర ఉన్న డీఎంకే, అన్నాడీఎంకేలు ఓటమిపాలయ్యాయి. ఆ పార్టీలకు ఇప్పుడు మిగిలింది చరిత్ర మాత్రమే. డీఎంకే పార్టీ వారసుడిగా యువకుడైన ఉదయనిధి స్టాలిన్‌ తెర మీదకు వచ్చారు. అయినా యువతరం జోసెఫ్‌ విజయ్‌ వైపే మొగ్గు చూపారు. అంటే యువతరం కేవలం యువ నాయకత్వాన్నే కాదు– కొత్తదనం ఏదో కోరుకుంటోందని భావించాలి. యువ నాయకత్వం ఉంటే చాలు అని అనుకోవడానికి లేదు.


అలా అయితే రాహుల్‌ గాంధీ ముందు ప్రధాని మోదీ నిలబడలేరుకదా! నవతరం మనసులో ఏముందో గుర్తించి అందుకు అనుగుణంగా పార్టీ విధానాలు, నినాదాలను సవరించుకుంటేనే భవిష్యత్తు ఉంటుందని తమిళనాడు ఫలితం రుజువు చేస్తోంది. ఎన్నికలు రాగానే సరికొత్త సంక్షేమ పథకాలను ప్రకటించి ఓటర్లకు డబ్బు పంచితే చాలన్న భావన ఇప్పటివరకు ఉండింది. తమిళనాడు ఎన్నికలు ఇందులో నిజం లేదని రుజువుచేశాయి. టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్‌ డబ్బు పంచలేదు. అయినా యువతరం మద్దతుతో అధికారంలోకి వచ్చారు. విజయ్‌ కూడా ద్రవిడ పార్టీలతో పోటీపడి సంక్షేమ పథకాలు ప్రకటించారు కానీ ప్రజలు వాటి గురించి పట్టించుకోలేదు. నిజానికి నేటి తరానికి చెందిన యువత కేవలం సంక్షేమ పథకాలను మాత్రమే కోరుకోవడం లేదు. ప్రభుత్వంలో జవాబుదారీతనం కోరుకుంటున్నారు. ఢిల్లీ నుంచి గల్లీ దాకా వివిధ స్థాయిల్లో జవాబుదారీతనం ఇప్పుడు లోపించింది. అధికార దుర్వినియోగం పెచ్చరిల్లింది. ప్రభుత్వాలలో ఏ స్థాయిలో కూడా జవాబుదారీతనం కనిపించడం లేదు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ ఒక్క ఫైలు కూడా దానంతట అది కదిలే పరిస్థితి లేదు. లంచం ఇవ్వనిదే కాగితం కదలని పరిస్థితి. ఈ కారణంగానే ఈ దేశ యువతలో ఆశలు, ఆకాంక్షలతో పాటు నిరాశా నిస్పృహలు చోటుచేసుకుంటున్నాయి. అందుకే అవకాశం రాగానే మార్పును ఆహ్వానిస్తున్నారు. దురదృష్టవశాత్తు ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా ఈ మౌలిక సమస్యపై దృష్టి పెట్టడం లేదు. వ్యవస్థలలో జవాబుదారీతనం తీసుకురావడానికి ప్రయత్నించడం లేదు. పథకాలు ప్రకటించి ప్రజలకు డబ్బులు పంచితే చాలు అన్న మూస విధానాన్ని పట్టుకొని వేలాడుతున్నాయి ఫలితంగా జెన్‌ జీ ఉద్యమాలు, బొద్దింకల పార్టీలు పుట్టుకొస్తున్నాయి.


నేతలూ... వైఖరులూ...

కేంద్ర మంత్రులలో అవినీతిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చాలా మటుకు అదుపు చేయగలిగారు. వ్యవస్థల్లో జవాబుదారీతనం కూడా తీసుకురాగలిగితే ఆయన నాయకత్వాన్ని దేశ ప్రజలు మరింత కాలం ఆదరిస్తారు. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న రాష్ర్టాలలో కూడా దురదృష్టవశాత్తు జవాబుదారీతనం లోపించింది. అవినీతి పెచ్చరిల్లుతోంది. ప్రారంభంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసిన ప్రాంతీయ పార్టీలు క్రమంగా ఆశయాలకు దూరమవుతున్నాయి. 1983లో తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చినప్పటికీ నేటి పరిస్థితులకూ పోలికే లేదు. 2014లో కేసీఆర్‌ అధికారంలోకి వచ్చినప్పటితో పోల్చితే 2023 నాటికి పరిస్థితులు మారిపోయాయి. వ్యవస్థల పతనం, ప్రజల ఆలోచనా విధానం మారడం కూడా ఇందుకు కారణం కావచ్చు. తమిళనాడులో ద్రవిడ పార్టీలది కూడా ఇదే పరిస్థితి. ‘ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తెలిస్తే’... అన్న ఊహే కేంద్ర మంత్రులను, బీజేపీ నాయకులను వణికిస్తోంది. కేంద్రంలోనే కాకుండా అనేక రాష్ర్టాలలో అధికారంలో ఉన్న జాతీయ పార్టీ బీజేపీపైనే ప్రధాని మోదీకి ఇంత పట్టు ఉన్నప్పుడు ఒకే ఒక రాష్ట్రంలో మనుగడ సాగించే ప్రాంతీయ పార్టీల అధిపతులకు ఎందుకంత పట్టు ఉండటం లేదన్న ప్రశ్న సహజంగానే ఉత్పన్నం అవుతోంది. తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్‌ రాజకీయాలకు కొత్త. పార్టీ పెట్టిన తొమ్మిది నెలలకే అధికారంలోకి వచ్చి ఆయన సృష్టించిన రికార్డు ఇప్పటికీ చెక్కు చెదరలేదు.


అప్పట్లో ఆయన కళ్లలో కళ్లు పెట్టి చూడటానికి కూడా మంత్రులు, నాయకులు భయపడేవారు. ఎన్టీఆర్‌ అంతలా కాకపోయినా కేసీఆర్‌కు కూడా తొలి టర్మ్‌లో పార్టీపైన, ప్రభుత్వంపైన అంత పట్టు ఉండేది. కొన్ని ప్రత్యేక పరిస్థితులలో ప్రభుత్వ బాధ్యతలతోపాటు పార్టీ నాయకత్వాన్ని కూడా చేపట్టిన చంద్రబాబుకు అంత పట్టు చిక్కలేదు. 1999–2004 మధ్య ఆయన ముఖ్యమంత్రిగా కొంత కటువుగా ఉన్నప్పటికీ దానివల్ల రాజకీయంగా నష్టపోయారు. కార్యకర్తలు, నాయకులకు దూరమయ్యారు. అధికారం కోల్పోయిన తర్వాత, అంటే 2004 తర్వాత పార్టీని కాపాడుకునేందుకు అనేక సందర్భాలలో అనేక మందితో రాజీపడవలసి వచ్చింది. దీని ప్రభావం ఇప్పటికీ ఆయనపై కనబడుతూనే ఉంటుంది. ఈ కారణంగానే మంత్రులు, శాసనసభ్యుల్లో ఆయనంటే భయం పోయింది. భయం ఉన్నట్టు నటిస్తారంతే! ఫలితంగానే భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చినప్పటికీ ప్రభుత్వంలోని వివిధ స్థాయిల్లో జవాబుదారీతనాన్ని నెలకొల్పలేక పోతున్నారు. వ్యవస్థల పతనం ఇందుకు ప్రతిబంధకం అయితే అయి ఉండవచ్చునుగానీ ఆ విషయం అర్థం చేసుకొనే ఓపిక నేటి తరానికి లేదు.


బాబుదే బాధ్యత...

తెలుగుదేశం పార్టీ ఏర్పడి 44 ఏళ్లయింది. ఏ పరిస్థితుల్లో ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీని స్థాపించిందీ, ఆ పార్టీ దేశ రాజకీయాలలో పోషించిన ప్రత్యేక పాత్ర గురించి, ఈ నాలుగున్నర దశాబ్దాల ప్రయాణంలో ఎదురైన ఒడిదుడుకుల గురించి ఈ తరానికి మాత్రమే కాదు– తెలుగుదేశం పార్టీలో చాలా మందికి తెలియదు. జెన్‌ జీ తరం కానీ, బొద్దింకలు గానీ ఇవేవీ ఆలోచించవు. ఇవాళ తమకు ఎదురవుతున్న ఇబ్బందుల గురించి మాత్రమే వారు ఆందోళన చెందుతారు. ద్రవిడ పార్టీల తర్వాత అంతటి సుదీర్ఘ చరిత్ర ఉన్న ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం మాత్రమే. అయితే చరిత్ర గురించి మాత్రమే చెప్పుకొని మురిసిపోతే సరిపోదు. వర్తమానాన్ని అనుసంధానం చేసుకుంటూ భవిష్యత్తుపై నవతరంలో ఆశలు చిగురింపజేయాల్సిన అవసరం రాజకీయ పార్టీలకే ఉంటుంది. తెలుగుదేశం పార్టీ కూడా ఇందుకు మినహాయింపు కాదు. పార్టీకి ఈ తరం దూరం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పార్టీ అధినేతగా చంద్రబాబుపై ఉంది. మహిళలను పార్టీ వైపు ఆకర్షించడానికి మహానాడులో గట్టి ప్రయత్నమే చేశారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన లోకేశ్‌ వచ్చే ఎన్నికల నుంచి చట్టంతో సంబంధం లేకుండా మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలుచేస్తామని ప్రకటించడం ఆహ్వానించదగిన పరిణామం. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించాలన్న చారిత్రక నిర్ణయం కూడా ఎన్టీఆర్‌ హయాంలోనే జరిగింది. చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు అనేది రాజకీయపరమైన వ్యూహం మాత్రమే. చట్టసభల్లో మహిళల సంఖ్య పెరిగినంత మాత్రాన సమస్యలు పరిష్కారమైపోవు. బొద్దింకల పార్టీ ప్రధాన నినాదం కూడా జవాబుదారీతనమే. నేపాల్‌లో గానీ, బంగ్లాదేశ్‌లో గానీ ప్రజల్లో తిరుగుబాటు రావడానికి ప్రభుత్వాలలో జవాబుదారీతనం లోపించడమే ప్రధాన కారణంగా చెబుతున్నారు. దురదృష్టవశాత్తు మన దేశంలో కూడా రాజకీయ వ్యవస్థ మీదే కాదు – కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, మీడియా పట్ల కూడా ప్రజల్లో అసంతృప్తి ఉంది. న్యాయ వ్యవస్థలో కూడా జవాబుదారీతనం లోపించిందన్న అభిప్రాయం విస్తృతంగా ఉంది. ఈ కారణంగానే భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో బొద్దింకల పార్టీ పుట్టుకొచ్చింది. హైబ్రిడ్‌ విధానంలో మహానాడును ఘనంగా నిర్వహించుకున్న తెలుగుదేశం పార్టీ ఈ పరిణామాలన్నింటినీ దృష్టిలో పెట్టుకోవాలి. మిగతా పార్టీల కన్నా తెలుగుదేశం పార్టీ ఎందుకు భిన్నమైనదో ఈ తరానికి తెలియజెప్పాలి.


ప్రజల పట్ల పార్టీ జవాబుదారీతనంతో వ్యవహరిస్తుందన్న నమ్మకం కలిగించాలి. పాలనలో జవాబుదారీతనం అవసరాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పదవుల కేటాయింపుల్లో యువతకు పెద్ద పీట వేసినంత మాత్రాన యువతరం సంతృప్తి చెందదు. వ్యక్తులను చేరదీసి పదవులు కట్టబెట్టినంత మాత్రాన ఆయా వర్గాలు సంతృప్తి చెందవు. ఆయా వర్గాల సామూహిక ఎదుగుదలకు దోహదపడే విధానాలను అమలుచేయాలి. బీసీలు రాజకీయంగా ఎదగడానికి వీలుగా నాడు ఎన్టీఆర్‌ తీసుకున్న నిర్ణయాల వల్లే ఆ వర్గాలు ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ పట్ల సానుకూలత ప్రదర్శిస్తున్న విషయం మరువకూడదు. పార్టీని యువతరంతో నింపినంత మాత్రాన మొత్తం యువతరం సంతృప్తి చెందరు. వారిలోని నిరాశా నిస్పృహలు పెరగకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలి. అదే సమయంలో ప్రభుత్వ నిర్ణయాలు, విధానాలు వారి ఆశలు, ఆకాంక్షలను తీర్చే విధంగా ఉండాలి. ప్రస్తుతం కూటమికి చెందిన అనేక మంది ఎమ్మెల్యేలు రాజ్యం వీరభోజ్యం అన్నట్టుగా గత పాలకుల వలెనే వ్యవహరిస్తున్నారు. తాము ప్రజలకు జవాబుదారీ అన్న భావన వారిలో లోపించింది. ఈ ధోరణిని అరికట్టకపోతే భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది. నిజానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ర్టానికి బోలెడు పెట్టుబడులు సాధిస్తున్నారు. అనేక పరిశ్రమలు, సంస్థలు ఏపీకి వస్తున్నాయి. అయితే అవన్నీ కార్యరూపం దాల్చి ఫలితాలు రావడానికి సమయం పడుతుంది. ఈ లోపు మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి, పార్టీకి డ్యామేజ్‌ చేయకుండా కట్టడి చేయాలి. అభివృద్ధి మాత్రమే ఓట్లు తెచ్చి పెట్టదు. ప్రభుత్వం పట్ల ప్రజల్లో, ముఖ్యంగా యువతలో ఫీల్‌ గుడ్‌ భావన కల్పించాలి. అది రావాలంటే ఇటు ప్రభుత్వంలో, అటు పార్టీలో జవాబుదారీతనాన్ని నెలకొల్పాలి. రాష్ట్రంలో మూడో పార్టీకి చోటులేదని భావించడానికి లేదు. తమిళనాడులో ఏం జరిగిందో తెలిసిందే కదా! మహానాడులో జెన్‌ జీ, జెన్‌ ఆల్ఫా గురించి ప్రత్యేకంగా ప్రస్తావించిన చంద్రబాబు నాయుడు ఆ వర్గాన్ని పార్టీ వైపు ఆకర్షించగలిగితే లక్ష్య సాధనలో సక్సెస్‌ అయినట్టే! అప్పుడే తెలుగుదేశం పార్టీకి మంచి భవిష్యత్తు ఉంటుంది!

Updated Date - May 31 , 2026 | 12:35 AM