ఆదర్శం విడిచి.. అరాచకం వైపు!
ABN , Publish Date - Jul 19 , 2026 | 02:40 AM
నాయకుడు ప్రజలకు ఆదర్శంగా ఉండాలా? ప్రజలే నాయకుడికి ఆదర్శంగా ఉండాలా? ప్రజలను ముందుండి నడిపించేవాడే నాయకుడు కనుక నాయకుడే ఆదర్శంగా ఉండాలి. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో...
నాయకుడు ప్రజలకు ఆదర్శంగా ఉండాలా? ప్రజలే నాయకుడికి ఆదర్శంగా ఉండాలా? ప్రజలను ముందుండి నడిపించేవాడే నాయకుడు కనుక నాయకుడే ఆదర్శంగా ఉండాలి. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో మన నాయకులు ప్రజలకు ఆదర్శంగా ఉండేవారు. మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి నాయకులు చెప్పిన మాటలను ప్రజలు తూచా తప్పకుండా ఆచరించేవారు. మహాత్మాగాంధీ ఒక్క పిలుపు ఇవ్వగానే మహిళలు ముందుకు వచ్చి తమ ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను విరాళంగా ఇవ్వడం మనకు తెలిసిందే. అప్పట్లో నాయకులపై ప్రజలకు అంత నమ్మకం ఉండేది. తాజాగా అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో బంగారం కొనుగోళ్లు చేయవద్దని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన విజ్ఞప్తికి కూడా ప్రజలు స్పందించారు. దీంతో దేశంలో బంగారం వినియోగం తగ్గుతోంది. అయితే, కాలక్రమంలో రాజకీయ నాయకులపై ప్రజలకు నమ్మకం పోతోంది. నాయకులు చెప్పే మాటలను ప్రజలు పెద్దగా విశ్వసించడం లేదు. ఎన్నికల సమయంలో నాయకులు ఇచ్చిన హామీలు మాత్రమే ప్రజలను ప్రభావితం చేస్తున్నాయి. అంతులేని హామీల విషయంలో రాజనీతిజ్ఞత మాత్రం కనిపించడం లేదు. రాష్ర్టాలతోపాటు దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్న ఉచిత పథకాలపై ప్రజల్లో ఆందోళన నెలకొంది. అయితే పిల్లి మెడలో ఎవరు గంట కట్టాలి? అన్న ప్రశ్న వేధిస్తున్న సమయంలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో చోటుచేసుకున్న పరిణామం ఒకింత ఉపశమనం కలిగిస్తోంది. ఆ ఎన్నికల్లో సినీ నటుడు జోసెఫ్ విజయ్ ఏర్పాటు చేసిన టీవీకే పార్టీ అధికారంలోకి వచ్చింది. అభ్యర్థులు ఎవరో ఓటర్లకు తెలియదు. తమ ఓటర్లు ఎవరో, నియోజకవర్గాల సరిహద్దులు ఏమిటో అభ్యర్థులకు తెలియదు. ఓట్ల కొనుగోలుకు పైసా ఖర్చు చేయలేదు. అయినా మెజారిటీ స్థానాలలో టీవీకే అభ్యర్థులు విజయం సాధించారు. ఎన్నికల్లో గెలుపోటములను డబ్బు మాత్రమే ప్రభావితం చేయజాలదని తమిళనాడు ఎన్నికలు రుజువు చేశాయి. ఈ ఎన్నికల సందర్భంగా ఆదర్శంగా వ్యవహరించిన జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా అంతే ఆదర్శంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రి పదవిని ఒక బాధ్యతగా నిర్వహిస్తున్నారు. ఉదయం 10.30 గంటలకు భోజనం క్యారియర్‌తో సచివాలయానికి వస్తున్న ముఖ్యమంత్రి... కార్యాలయ పనివేళలు ముగియగానే సాయంత్రం 5 గంటలకు ఇంటికి వెళ్లిపోతున్నారు. మనకు తెలిసిన రాజకీయాలలో జోసెఫ్ విజయ్ వ్యవహార శైలి వినూత్నంగా ఉంది. ప్రభుత్వంలో అవినీతికి స్థానం లేదని రుజువు చేయడానికి ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన తనను అభినందించడానికి వచ్చిన పారిశ్రామిక, వ్యాపారవేత్తలతో సీఎం విజయ్ డిప్లమాటిక్‌గా మెలుగుతున్నారు. వివిధ శాఖలలో టెండర్లు, ఇతరత్రా నిర్ణయాలు పారదర్శకంగా జరిగిపోతున్నాయి. టెండర్లు నిబంధనల ప్రకారం ఆటోమేటిగ్గా ఖరారవుతున్నాయి. లాలూచీలకు తావుండటం లేదు. అంతా ఆన్‌లైన్లో పారదర్శకంగా జరిగిపోతున్నాయి. ప్రభుత్వ అధికారులు లంచాలు డిమాండ్ చేస్తే ఫిర్యాదు చేసే వెసులుబాటు కూడా కల్పించారు. రాష్ర్టాలలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా మద్యం కొనుగోళ్లలో అధికార పార్టీకి మామూళ్లు అందడం ఆనవాయితీగా వస్తోంది. తమిళనాడులో ఈ ధోరణికి కూడా ఇప్పుడు అడ్డుకట్ట వేశారు. అధికార పార్టీకి కమీషన్లు ఇచ్చేవారు ఆ మేరకు ప్రభుత్వానికి సరఫరా చేసే మద్యం ధరలు తగ్గించాలని ముఖ్యమంత్రి విజయ్ ఆదేశించారట! దీంతో ప్రభుత్వ కొనుగోలు ధర తగ్గి ఆదాయం పెరిగింది. ముఖ్యమంత్రి అండ చూసుకొని ప్రజలు కూడా ప్రభుత్వ కార్యాలయాలలో అధికారులను ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. మొత్తం మీద జోసెఫ్ విజయ్ ప్రస్తుతం ఆదర్శ సీఎంగా పనిచేస్తున్నారు. ఫలితంగా ప్రజలకు ఆయనపై నమ్మకం మరింత పెరిగిందని చెబుతున్నారు. దండిగా డబ్బున్న వారికే పార్టీ టికెట్లు ఇవ్వడానికి అలవాటుపడిన రాజకీయ పార్టీలకు జోసెఫ్ ఆదర్శంగా నిలిచారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో రాజకీయాలు ఇంతే ఆదర్శంగా ఉండేవి.
నాడు తెలుగు నాట...
ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం చేశాక తెలుగునాట కూడా ఇటువంటి ఆదర్శ పోకడలను చూశాం. రాజకీయ నేపథ్యం లేని యువతీ యువకులకు ఎన్టీఆర్ టికెట్లు ఇచ్చి గెలిపించుకున్నారు. 1983లో తెలుగుదేశం పార్టీ టికెట్ పొందిన జీవన్‌రెడ్డి, ప్రతిభాభారతి, యనమల రామకృష్ణుడు వంటి వారు అతి స్వల్ప వ్యయంతో, అంటే పది నుంచి పదిహేను వేల రూపాయల ఖర్చుతో ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ తొమ్మిది నెలలకే అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించడమే కాకుండా ప్రభుత్వంలో అవినీతికి తావు లేకుండా చేశారు. మంత్రులు, శాసనసభ్యులు అవినీతికి పాల్పడాలంటే వణికిపోయేవారు. అప్పట్లో కూకట్‌పల్లి నుంచి గెలిచిన ఎం.రామచంద్రరావును కార్మిక శాఖ మంత్రిగా నియమించారు. ఆయన అవినీతికి పాల్పడుతున్నారని ఎన్టీఆర్‌కు సమాచారం అందింది. దీంతో సదరు మంత్రిపై నిఘా పెట్టవలసిందిగా అవినీతి నిరోధక శాఖను ఎన్టీఆర్ ఆదేశించారు. ఆ శాఖకు అప్పట్లో వి.అప్పారావు అధిపతిగా ఉండేవారు. ఎన్టీఆర్ ఆదేశాల మేరకు అవినీతి నిరోధక శాఖ అధికారులు వలపన్ని సచివాలయంలో మంత్రి రామచంద్రరావు పది వేల రూపాయలు తీసుకుంటుండగా నేరుగా పట్టుకున్నారు. లంచం తీసుకున్న కేసులో ఒక మంత్రిని పట్టుకోవడం అదే ప్రథమం. అప్పట్లో అదో సంచలనం. అయితే రాజకీయాల్లో ఆదర్శంగా ఉండటం అంత ఆషామాషీ కాదని తెలియడానికి ఎన్టీఆర్ అంతటి నాయకుడికీ ఎంతో కాలం పట్టలేదు. ఈ సంఘటన జరిగిన కొంత కాలానికే నాదెండ్ల భాస్కరరావు రూపంలో ఎమ్మెల్యేలు సంఘటితమై అప్రజాస్వామికంగా ఎన్టీఆర్‌ను గద్దె దించారు. ఆ తర్వాత జరిగిన ప్రజాస్వామ్య పరిరక్షణ పోరాటం, ఎన్టీఆర్ తిరిగి ముఖ్యమంత్రి కావడం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ ఎంత కాలం నిక్కచ్చిగా రాజకీయాలు చేయగలరో వేచి చూడాలి. రాజకీయాల్లో డబ్బు ప్రభావం లేని రోజుల్లోనే నిజాయితీగా ప్రభుత్వాన్ని నడపడం కష్టతరమని ఎన్టీఆర్ ఉదంతంలో రుజువైంది. ఇప్పుడు అవినీతి ప్రజల దైనందిన జీవితంలో భాగమైపోయింది. రాజకీయాల్లో కూడా అవినీతి ఒక భాగమైంది. ప్రజలు కూడా అవినీతిని పట్టించుకోవడం లేదు. దానికి అలవాటు పడిపోయారు. ఎన్టీఆర్ తర్వాత రాజకీయాల్లో మార్పు సాధ్యమని జోసెఫ్ విజయ్ నిరూపిస్తున్నారు. అయితే, ఇది ఎంత కాలం? అన్న ప్రశ్న ఉండనే ఉంది.
వ్యవస్థీకృత అవినీతి
ఎన్టీఆర్ తర్వాత రాజకీయాల్లో విలువలు క్రమంగా క్షీణిస్తూ వచ్చాయి. దేశవ్యాప్తంగా నెలకొన్న ఈ ధోరణి తెలుగు రాష్ర్టాలను కూడా కమ్మేసింది. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో అవినీతి వ్యవస్థీకృతం అయింది. టెండర్ల వ్యవస్థకు నిర్వచనం మారిపోయింది. ప్రభుత్వ పెద్దలు ఎంపిక చేసిన వారికే టెండర్లు దక్కే విధానం అమల్లోకి వచ్చింది. టెండర్లు పొందిన వారు నాయకులకు ఆరు శాతం కమీషన్ ఇవ్వడం ఒక రకంగా చట్టబద్ధమైపోయింది. రాజశేఖరరెడ్డి అమలు చేసిన ఈ విధానం ఆ తర్వాత దేశంలోని అన్ని రాష్ర్టాలకూ విస్తరించింది. ఫలితంగా అవినీతి వ్యవస్థీకృతం అయింది. తెలుగునాట విలువల క్షీణత దాదాపు మూడు దశాబ్దాల క్రితమే మొదలైంది. అయితే రాజకీయ వైషమ్యాలు ఒక స్థాయికి మించి దిగజారలేదు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ముందు కాంగ్రెస్‌కు కాంగ్రెస్ పార్టీయే ప్రధాన ప్రత్యర్థిగా ఉండేది. తెలుగుదేశం పార్టీ ఏర్పాటు తర్వాత రాజకీయాల్లో ఉద్రిక్తతలు చోటుచేసుకోవడం మొదలైంది. కులాలను కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. ఈ పాపానికి కాంగ్రెస్ నాయకులే కారణం. అప్పటి నుంచీ తెలుగునాట కులాల కుంపట్లు రాజుకున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత పరిస్థితి మరింత వికటించింది. తెలంగాణలో కులాల రొచ్చు ఉండేది కాదు. అలాంటిది ఇప్పుడు తెలంగాణలో కూడా ఈ జాడ్యం విస్తరిస్తోంది. నాయకుల మధ్య వైషమ్యాలు పెరిగిపోయాయి. రాజకీయ విభేదాల స్థానంలో వ్యక్తిగత కక్షలు రంగప్రవేశం చేశాయి. తెలంగాణలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబానికి, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మధ్య వ్యక్తిగత స్థాయిలో వైరం ఏర్పడింది. ఇరుపక్షాలు కళ్లలో కళ్లు పెట్టి చూసుకోలేని పరిస్థితి. ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు మరింత దిగజారాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు–మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. ఈ కక్షలు, కార్పణ్యాలు కార్యకర్తల స్థాయి వరకు విస్తరించాయి. సత్యం ‘వధ’ – ధర్మం ‘చెర’ అన్నట్టుగా పరిస్థితి తయారైంది. నాయకులు చెబుతున్న దాంట్లో ఏది నిజమో, ఏది అబద్ధమో తెలుసుకోలేని పరిస్థితి. తెలుసుకోవాలన్న ఆసక్తి కూడా ప్రజల్లో ఉండటం లేదు. ఎందుకంటే ప్రజలు కూడా రెండు శిబిరాలుగా విడిపోయారు. ఒక వర్గం కూటమికి కొమ్ము కాస్తుండగా, మరో వర్గం జగన్‌రెడ్డి వైపు నిలబడుతోంది. దీంతో అధికారం నిలబెట్టుకోవడం కోసం కూటమి నాయకులు, కోల్పోయిన అధికారాన్ని తిరిగి పొందడం కోసం జగన్మోహన్‌రెడ్డి ఆపసోపాలు పడుతున్నారు. ఈ క్రమంలో అన్ని హద్దులూ చెరిగిపోతున్నాయి. ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన నాయకులు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయంలో జగన్మోహన్‌రెడ్డికి మరెవరూ సాటిరారు అన్నట్టుగా పరిస్థితి ఉంది.

బాధ్యత మరిచిన నాయకుడు...
అధికారంలో ఉన్న కూటమిని రాజకీయంగా ఇబ్బంది పెట్టాలన్న తపనతో జగన్‌రెడ్డి తప్పు చేసిన వారిని కూడా గుడ్డిగా సమర్థిస్తున్నారు. గత కొంత కాలంగా ఆయన చేస్తున్న పరామర్శలు, జరుపుతున్న పర్యటనలు ఈ విషయాన్ని రుజువు చేస్తున్నాయి. ముఖ్యమంత్రిగా ఐదేళ్లు పనిచేసి, మళ్లీ ముఖ్యమంత్రి కావాలనుకుంటున్న వ్యక్తి బాధ్యతగా వ్యవహరించాలని ప్రజలకు చెప్పాల్సింది పోయి తప్పు చేసిన వారిని సమర్థించడం దిగజారుతున్న రాజకీయాలకు నిదర్శనమని చెప్పక తప్పదు. గుంటూరు జిల్లాలో గంజాయి వ్యాపారంతో సంబంధం ఉన్న వారిని పోలీసులు బహిరంగంగా కొట్టారు. చట్ట ప్రకారం అది నేరమే. అయితే పరామర్శ పేరిట అక్కడకు వెళ్లిన జగన్‌రెడ్డి గంజాయి వ్యాపారం చేసిన రౌడీ మూకను సుద్దపూసలుగా పేర్కొంటూ సమర్థించడంతో ప్రజలు నివ్వెరపోయారు. అప్పటి నుంచి సందర్భం ఏదైనా జగన్‌రెడ్డి తన విపరీత పోకడలను ప్రదర్శిస్తున్నారు. పార్టీపరంగానే కాకుండా తన సొంత మీడియా ద్వారా కూడా ఆయన నేర ప్రవృత్తికి అండగా నిలిచే ప్రయత్నం చేస్తున్నారు. విజయవాడ లాకప్ డెత్ కేసు విషయంలో కూడా కులాన్ని తెర మీదకు తెచ్చారు. తాజాగా మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు చేసిన మోటర్ సైకిల్ ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించగా, పద్దెనిమిదేళ్ల చిన్న పిల్లాడు ఏదో తెలియక యాక్సిడెంట్ చేస్తే మానవత్వం లేకుండా శిక్షించాలని ప్రభుత్వం అనుకోవడం ఏమిటని ప్రశ్నించారు. భారత ప్రభుత్వం రూపొందించిన శాసనం ప్రకారం పద్దెనిమిదేళ్లు నిండితే మేజర్ అవుతారు. పద్దెనిమిదేళ్లు నిండితే ముఖ్యమంత్రిని, ప్రధానమంత్రిని ఎన్నుకొనే విధంగా ఓటు హక్కు పొందుతున్నారు. అలాంటి పద్దెనిమిదేళ్లు నిండిన వాడిని చిన్న పిల్లాడు అని అతను చేసిన తప్పును సమర్థించడం ఏమిటి? అప్పలరాజు కొడుకు ఉద్దేశపూర్వకంగా ఆ ప్రమాదం చేసి ఉండకపోవచ్చు. అయితే పిల్లలను పద్ధతిగా పెంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉండదా? పిల్లలను బాధ్యతగా పెంచాలని సూచించాల్సిన స్థానంలో ఉన్న జగన్‌రెడ్డి... రాజకీయాలకోసం తప్పులను సమర్థించాలని అనుకోవడం క్షమార్హం కాదు.
తల్లిదండ్రుల బాధ్యత...
ఇవాళ సమాజంలో బాధ్యతారహిత ధోరణులు పెరిగిపోతుండటం, తల్లిదండ్రులు పట్టించుకోకపోవడం వల్ల పిల్లలు చెడిపోవడాన్ని చూస్తున్నాం. ప్రస్తుతం రాజకీయ నాయకుల పిల్లలు, ధనవంతుల కుటుంబాలకు చెందినవారు బాధ్యతారహితంగా వ్యవహరించడం సర్వసాధారణం అయింది. నిన్నగాక మొన్న ఒక కేంద్రమంత్రి కుమారుడు పోక్సో కేసులో జైలుకు వెళ్లి వచ్చాడు. హైదరాబాద్‌లో పలువురు రాజకీయ నాయకులు, ధనవంతుల పిల్లలు డ్రగ్స్ కేసుల్లో చిక్కుకుంటున్నారు. డ్రగ్స్ కేసుల్లో పోలీసులకు దొరికిపోయిన సందర్భాలలో పలువురు రాజకీయ నాయకులు మీడియా సంస్థలకు ఫోన్లు చేసి తమ బిడ్డల పేర్లు ప్రస్తావించవద్దని వేడుకుంటున్నారు. పిల్లల పెంపకంలో జాగ్రత్తలు తీసుకుని ఉంటే వారికి ఈ దుస్థితి వచ్చేది కాదు కదా? ఉభయ తెలుగు రాష్ర్టాలలో యువత డ్రగ్స్‌కు బానిసలవుతున్నారని ఆందోళన చెందుతున్నాం కదా! మరోవైపు యువత ఖరీదైన కార్లు, బైకులు వినియోగిస్తూ ప్రమాదాలు చేస్తున్నారు. కొన్ని సందర్భాలలో ప్రమాదానికి కారణమైనవారు కూడా చనిపోతున్నారు. ఇలాంటి సందర్భాలలో రాజకీయ నాయకులు, ఇతర ప్రముఖులు పుత్ర శోకానికి గురయ్యారు కదా? ఈ నేపథ్యంలో ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సిన జగన్‌రెడ్డి లాంటి వారు ప్రమాద కారకుల్ని సమర్థించడం దేనికి సంకేతం? పిల్లల్ని బాధ్యతగా పెంచకపోతే తల్లిదండ్రులే మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని జగన్‌రెడ్డికి తెలియదా? తన విషయంలో తన తండ్రి రాజశేఖరరెడ్డి ఎంత క్షోభ అనుభవించారో జగన్‌రెడ్డికి తెలియదా? తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తనను హైదరాబాద్‌కు రావొద్దని, బెంగళూరుకే పరిమితం కావాలని ఎందుకు కోరేవారో తెలియదా? చిన్న వయసులోనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఎస్‌ఐని జగన్మోహన్‌రెడ్డి కొట్టినప్పుడే రాజశేఖరరెడ్డి కట్టడి చేసి ఉంటే... కుమారుడి గురించి తండ్రిగా మథనపడే పరిస్థితి ఏర్పడి ఉండేది కాదు కదా? జగన్‌రెడ్డిలో ఇప్పటి విపరీత పోకడలూ ఉండేవి కావు కదా? నాయకుడి స్థానానికి ఎదిగిన తర్వాత కూడా తప్పుచేసిన వారిని జగన్‌రెడ్డి సమర్థించడం ఏమిటి? చిన్న పిల్లోళ్లు అని తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తప్పు చేసిన వాళ్లను ఆయన వదిలేశారా? బాధితులకు అండగా నిలిచారా? అమర్నాథ్ గౌడ్ అనే మైనర్‌ను చంపిన సంఘటనలోనే కాకుండా, తన తమ్ముడి మరణంపై పిడికిలి బిగించిన అమర్నాథ్ గౌడ్ సోదరిని ఎలా వేధించిందీ మనకు ఇంకా గుర్తుంది కదా? చెప్పేటందుకే నీతులు ఉంటాయని ఒక సినీ కవి అన్నట్టుగా జగన్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు. అధికార పక్షాన్ని నిలదీయడానికి ప్రజా సమస్యలు ఎన్నో ఉంటాయి. అవన్నీ వదిలేసి నేరస్థులకు వత్తాసు పలకడం దేనికి సంకేతం? సమాజాన్ని కులాలు, మతాల వారీగా విభజించి ప్రజల్లో నేర ప్రవృత్తిని పెంపొందించాలని అనుకోవడం ఏమిటి? ప్రజలకు ఆదర్శంగా నిలబడాల్సిన నాయకుడు ఇలా ప్రవర్తిస్తే సమాజంలో పెడధోరణులు ప్రబలవా? ‘యథా రాజా తథా ప్రజా’ అంటారు.
ఈ కారణంగానే జగన్‌రెడ్డి అనుచరులు 2029 తర్వాత నరుకుతాం, చంపుతాం అని రెచ్చిపోతున్నారు. ఆక్వా సభ పేరిట భీమవరంలో తాజాగా నిర్వహించిన సభ సందర్భంగా జగన్ అనుచరుల వీరంగం చూశాం. ఏ మాత్రం వెరపు లేకుండా... చట్టమన్నా, పోలీసులన్నా భయం లేకుండా రప్పా రప్పా అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిపై యథేచ్ఛగా బూతులు ప్రయోగించారు. ఇలాంటి విపరీత పోకడలను నిలువరించాల్సిన జగన్‌రెడ్డి వాటిని ప్రోత్సహించడాన్ని మించిన విషాదం ఏముంటుంది? ప్రజాస్వామ్యంలో హింసకు తావుండదు. తమిళనాడులో ఒక చిన్న హింసాత్మక సంఘటన కూడా జరగకుండానే అధికార మార్పిడి జరిగింది కదా? జోసెఫ్ విజయ్ ఎన్నికల్లో గెలుపొందడానికి తమ నాయకుడు కూడా కారణమని జగన్‌రెడ్డి అనుచరులు ప్రచారం చేసుకుంటున్నారు కదా? అదే నిజమైతే విజయ్ రాజకీయాలను జగన్‌రెడ్డి ఆదర్శంగా తీసుకోవాలి కదా? ప్రజలకు, ముఖ్యంగా తల్లిదండ్రులకు బాధ్యతగా వ్యవహరించాలని సూచించడం ద్వారా ఆదర్శంగా నిలబడాల్సిన జగన్‌రెడ్డి వంటి వారికి, ఇది తగదు అని ఎవరు చెప్పాలి? జగన్‌ను సన్మార్గంలో నడపడానికి ఆయన తండ్రి కూడా ఇప్పుడు మన మధ్య లేరే! ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలే ఆ తండ్రి లేని బిడ్డను సంస్కరించే బాధ్యత తీసుకోవాలేమో!
ఆర్కే
ఇవి కూడా చదవండి:
ఇంగ్లండ్‌తో తుది వన్డేకు భారత్ సిద్ధం.. లార్డ్స్ గడ్డపై రికార్డు మారేనా?
'రక్తానికి రక్తం'.. ట్రంప్ కుటుంబమే లక్ష్యంగా ఇరాన్ భారీ బ్యానర్లు!