Share News

మోదీదే ఈ శతాబ్ది!?

ABN , Publish Date - Mar 15 , 2026 | 01:23 AM

‘ఈ శతాబ్దం నాది’... అని కలం చేతబట్టి మరీ గర్జించాడు మహాకవి శ్రీశ్రీ! సాహిత్య రంగంలో తనకు ఎదురులేదన్న ఆత్మవిశ్వాసంతో ఆయన ఈ సవాలు విసిరారు. ఈ మాటల్లో అతిశయోక్తికానీ, అహంకారం కానీ లేదని ఆయనను బాగా ఎరిగినవారు....

మోదీదే ఈ శతాబ్ది!?

‘ఈ శతాబ్దం నాది’... అని కలం చేతబట్టి మరీ గర్జించాడు మహాకవి శ్రీశ్రీ! సాహిత్య రంగంలో తనకు ఎదురులేదన్న ఆత్మవిశ్వాసంతో ఆయన ఈ సవాలు విసిరారు. ఈ మాటల్లో అతిశయోక్తికానీ, అహంకారం కానీ లేదని ఆయనను బాగా ఎరిగినవారు చెప్పేవారు. ఐదు దశాబ్దాల క్రితం శ్రీశ్రీ విసిరిన సవాలు ఇది! మళ్లీ ఇంత కాలానికి ‘ఈ శతాబ్దం నాది’ అని రాజకీయ రంగంలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సవాలు విసురుతున్నారు. తనను కలిసిన రాజకీయ ప్రముఖుల వద్ద ప్రధాని ఈ మాటలు అన్నారట! మీ వంటి రాజకీయ నాయకులు మరో యాభై ఏళ్ల వరకు కనిపించరని తనను కలసిన ఒక ముఖ్యుడు అన్నప్పుడు ‘పచ్చాస్‌ సాల్‌ నహీ... సౌ సాల్‌ తక్‌’ అంటే, యాభై ఏళ్లు కాదు, వందేళ్ల వరకూ నా లాంటి వాడిని చూడరు అని ప్రధాని మోదీ అన్నారట. దేశ రాజకీయాల్లో తనకు ఉన్న పట్టు గురించి చెప్పడానికి ఆయన ఈ మాట అని ఉంటారు. ఈ మాటల్లో అతిశయోక్తి ఉందో లేదో తెలియదు. నిండైన ఆత్మవిశ్వాసంతో నరేంద్ర మోదీ ఈ మాట అని ఉంటారు. ఎందుకంటే, వర్తమాన రాజకీయాలలో ఆయనను ఢీకొనగల నాయకుడు కనిపించడం లేదు. రాజకీయాల్లో తన ప్రభావం వందేళ్లపాటు ఉంటుందని చెప్పడానికి మాత్రమే ఆయన పరిమితం కావడం లేదు. అందుకు అనుగుణంగా చర్యలు కూడా తీసుకుంటున్నారు. కార్యాచరణ రూపొందించుకుంటున్నారు. ఈ క్రమంలో రాజకీయాలలో అనేక వ్యూహాత్మక మార్పులకు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టబోతున్నారు. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఆయన... మరో రెండు పర్యాయాలు ప్రధానమంత్రిగా ఉండాలని కూడా కోరుకుంటున్నారట! ప్రస్తుతం మోదీ వయసు 75 ఏళ్లకు పైబడింది. మరో రెండు పర్యాయాలు అంటే ఆయన వయసు 90 ఏళ్లకు చేరుకుంటుంది. దేశాన్ని సుదీర్ఘ కాలంపాటు పాలించిన ప్రధానమంత్రిగా చరిత్రలో నిలిచిపోవాలన్నది ఆయన అభిలాష అయివుండవచ్చు. ఆయన ఆకాంక్ష నెరవేరుతుందో లేదో ఇప్పుడే చెప్పలేంగానీ రాజకీయాలలో తనకు ఎదురులేకుండా చేసుకోవడానికి వీలుగా మాత్రం ప్రధానమంత్రి అనేక మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఇందులో భాగంగా ఎప్పటి నుంచో చర్చలో ఉన్న జమిలి ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధం చేస్తున్నారు. 2029లో పార్లమెంటుతోపాటు వీలైనన్ని రాష్ర్టాల శాసనసభలకూ ఒకేసారి ఎన్నికలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదాహరణకు తెలంగాణ విషయమే తీసుకుందాం! తెలంగాణ శాసనసభకు గడువు 2028 డిసెంబరుతో ముగుస్తుంది. అయితే, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని మరో ఆరు నెలలు పొడిగించి 2029లో ఎన్నికలు నిర్వహించేలా చట్ట సవరణ చేస్తారు. బహుశా ఈ విషయం తెలిసినట్టుగా ఉంది, అందుకే తాను ఆరు నెలలు అదనంగా ముఖ్యమంత్రిగా కొనసాగుతానని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఆ మధ్య అన్నారు. తమిళనాడు శాసనసభకు వచ్చే నెల ఎన్నికలు జరగబోతున్నాయి. జమిలి ఎన్నికల నిర్వహణ కోసం చేపట్టబోతున్న చర్యలలో భాగంగా మూడేళ్ల కాలాన్ని పూర్తి చేసుకొనే తమిళనాడు వంటి రాష్ర్టాల శాసనసభలకు గడువు ముగియకపోయినా 2029లోనే ఎన్నికలు జరుపుతారు. మొత్తం మీద దేశవ్యాప్తంగా అన్ని రాష్ర్టాల శాసనసభలకు 2034లోగా జమిలి ఎన్నికలు నిర్వహించే విధంగా చట్టంలో మార్పులు చేయబోతున్నారు.


జమిలి ఎందుకంటే...

జమిలి ఎన్నికల కోసం ప్రధాని మోదీ ఎందుకు ఇంతగా పట్టుపడుతున్నారంటే, కారణం లేకపోలేదు. పార్లమెంటుకు జరిగే ఎన్నికల్లో జాతీయ పార్టీలకు కొన్ని అనుకూలతలు ఉంటాయి. ఓటర్లు జాతీయ పార్టీల వైపు కొంత మొగ్గు చూపుతారు. తెలంగాణ విషయమే తీసుకుందాం! ఈ అనుకూలతలను దృష్టిలో పెట్టుకొనే ప్రాంతీయ పార్టీగా ఉన్న తమకు నష్టం జరగకూడదన్న ఉద్దేశంతో 2019లో జరగవలసిన అసెంబ్లీ ఎన్నికలను అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆరు నెలలు ముందుకు జరిపించుకున్నారు. ఫలితంగా 2018లోనే అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. జాతీయ స్థాయి ఎన్నికల్లో జాతీయ పార్టీలకు తప్పనిసరిగా అనుకూలతలు ఉంటాయని చెప్పడానికి 2024లో ‍తెలంగాణలో జరిగిన లోక్‌సభ ఎన్నికల ఫలితాలే నిదర్శనం. ఆరు నెలల ముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ప్రధాన ప్రతిపక్షంగా అవతరించగా, బీజేపీకి ఎనిమిది అసెంబ్లీ స్థానాలే లభించాయి. అదే పార్టీ ఆరు నెలల తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఎనిమిది స్థానాలు గెలుచుకోగలిగింది. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్‌కు ఒక్క సీటు కూడా రాలేదు. దీన్నిబట్టి 2029లో జమిలి ఎన్నికలు జరిపితే ప్రధాన పోటీ కాంగ్రెస్‌–బీజేపీ మధ్యే కేంద్రీకృతమయ్యే అవకాశముంది. ప్రజలు గంపగుత్తగా మొగ్గు చూపితే తప్ప బీఆర్‌ఎస్‌ జాతీయ పార్టీలను ఎదుర్కొనే పరిస్థితి ఉండకపోవచ్చు. బహుశా ఈ కారణంగానే తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చి తమది జాతీయ పార్టీ అని కేసీఆర్‌ ప్రకటించి ఉండవచ్చు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అంతరంగం ప్రాంతీయ పార్టీలకు వ్యతిరేకం. దేశంలో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉండకూడదని, జాతీయ పార్టీలు మాత్రమే ఉండాలని మోదీ తలపోస్తుంటారట! ఈ నేపథ్యంలోనే, ‘జమిలి ఎన్నికలకు సహకరించండి, మరో రెండు పర్యాయాలు నేనే ప్రధానమంత్రిగా ఉంటా. ఆ తర్వాత కాలం కలసి వస్తే కాంగ్రెస్‌ అధికారంలోకి రావొచ్చు, బీజేపీ–కాంగ్రెస్‌ పార్టీలు మాత్రమే మిగులుతాయి’ అని ప్రధానమంత్రి తనను కలసిన కాంగ్రెస్‌ ముఖ్యుల వద్ద కూడా అన్నారట!


ప్రాంతీయ పార్టీల పోరు...

దక్షిణాది రాష్ర్టాలను మినహాయిస్తే, మిగతా రాష్ర్టాలలో ప్రాంతీయ పార్టీలు బలహీనపడుతున్నాయి. తృణమూల్‌ కాంగ్రెస్‌ ఒక్కటే బలంగా ఉంది. బిహార్‌లో ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌తో రాజీనామా చేయిస్తున్నందున అక్కడ జేడీయూ కూడా బలహీనపడవచ్చు. ఎన్నికల తర్వాత నితీశ్‌తో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయించాలన్నది ఎన్నికలకు ముందే కుదుర్చుకున్న అవగాహన. వయోభారం, అనారోగ్యం కారణంగా ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవడానికి నితీశ్‌ కూడా అంగీకరించారు. అయితే, ఈ పరిణామాన్ని దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా జాతీయ రాజకీయాల్లోకి వెళతారని, ఉపప్రధాని అవుతారని ప్రచారం చేశారు. లోకేశ్‌ ముఖ్యమంత్రి అవుతారని కూడా ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారాల్లో వాస్తవం లేదని తేలిపోతోంది. జమిలి ఎన్నికల వల్ల జాతీయ పార్టీలకు కలిగే లాభాలను గుర్తించడం వల్లనే కేసీఆర్‌ అండ్‌ కో వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తుకు ప్రయత్నిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి పెద్దగా బలం లేకపోయినా పొత్తులు పెట్టుకొని కూటమిగా పోటీ చేసి గత ఎన్నికల్లో స్వీప్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌తో పోల్చితే తెలంగాణలో బీజేపీ పటిష్ఠంగా ఉంది. సొంతంగా అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తోంది. ప్రస్తుతానికి బీజేపీతో పోల్చితే బీఆర్‌ఎస్‌ బలంగా ఉంది. అయితే ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ను అనారోగ్య సమస్యలు వేధిస్తుండటం పార్టీ శ్రేణులను కలవరానికి గురి చేస్తోంది. ఈ కారణంగానే వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తుపై ఆశలు పెంచుకుంటున్నారు. పొత్తులకు సంబంధించి బీఆర్‌ఎస్‌ నుంచి ఎన్ని ప్రతిపాదనలు వస్తున్నప్పటికీ బీజేపీ అగ్రనాయకత్వం మాత్రం గుంభనంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో రాజకీయ సమీకరణలు ఎలా ఉంటాయో వేచి చూడాలి.

మోదీ మదిలో...

జమిలి ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ పనిలో పనిగా వచ్చే ఎన్నికల నాటికి పార్లమెంటు స్థానాల సంఖ్య పెంచడంతోపాటు మహిళలకు మూడోవంతు రిజర్వేషన్లు కల్పించే దిశగా కూడా చర్యలు తీసుకుంటున్నారు. పార్లమెంటు స్థానాల సంఖ్యను 33 శాతం వరకు పెంచబోతున్నారు. జనాభా ప్రాతిపదికన ఈ ప్రతిపాదనను అమలు చేస్తారా లేదా అన్నది ఇంకా స్పష్టం కాలేదు.


జనాభా ప్రాతిపదికన సీట్ల సంఖ్యను పెంచడాన్ని దక్షిణాది రాష్ర్టాలు వ్యతిరేకిస్తున్నాయి. ఉత్తరాది రాష్ర్టాలతో పోలిస్తే దక్షిణాది రాష్ర్టాలలో జనాభా పెరుగుదల తక్కువగా ఉంటోంది. జనాభా ప్రాతిపదికన అయితే పార్లమెంటులో దక్షిణాది రాష్ర్టాలకు ప్రాతినిధ్యం తగ్గుతుందన్న అభిప్రాయం ఉంది. ఇప్పటికే జాతీయ రాజకీయాలను ఉత్తరాది రాష్ట్రాలే ప్రభావితం చేస్తున్నాయి. ఈ కారణంగా జనాభా ప్రాతిపదికను దక్షిణాది రాష్ర్టాలు బలంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ సమస్యను అధిగమించేందుకు అన్ని రాష్ర్టాలలో 33శాతం వంతున లోక్‌సభ సీట్లను పెంచే అవకాశముంది. అదే జరిగితే తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 17 స్థానాలు 22 వరకు పెరిగే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో 25 నుంచి 33కు పెరగవచ్చు. తెలంగాణలో హైదరాబాద్‌ మహానగరం, దాని చుట్టుపక్కలే జనాభా కేంద్రీకృతం అయింది. అందువల్ల లోక్‌సభ సీట్లు పెరిగితే అవన్నీ హైదరాబాద్‌లోనే ఉంటాయి. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, మల్కాజ్‌గిరి, చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గాలను విడగొట్టి సంఖ్య పెంచుతారు. ఇవి కాకుండా వరంగల్‌, హనుమకొండలో మరొక స్థానం పెరగవచ్చునని చెబుతున్నారు. పార్లమెంటు స్థానాలతోపాటు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ర్టాలలో శాసనసభ స్థానాలను కూడా పెంచబోతున్నారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ఈ రెండు రాష్ర్టాలలో అసెంబ్లీ సీట్లు పెరగబోతున్నాయి. తెలంగాణలో ప్రస్తుతం 119గా ఉన్న అసెంబ్లీ సీట్లు 150 కావొచ్చునని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం 175గా ఉన్న సీట్లను 225కు పెంచుతారని అంచనాలు ఉన్నాయి. ఓటర్ల సమగ్ర జాబితా సవరణ తర్వాత జనాభా లెక్కలు పరిగణనలోకి తీసుకొని లోక్‌సభ, శాసనసభ నియోజకవర్గాల సంఖ్యను పెంచుతారు. అసెంబ్లీ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరగబోతున్నందున అది అధికారంలో ఉన్న పార్టీలకు ఎంతో కొంత లాభిస్తుంది. 2009 ఎన్నికలకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ నియోజకవర్గాలను పునర్‌ వ్యవస్థీకరించారు. ఈ సందర్భంగా చేసిన మ్యాజిక్‌ వల్లనే వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆ ఎన్నికల్లో బొటాబొటీ మెజారిటీతో గెలిచారంటారు. అప్పట్లో ప్రతిపక్షమైన తెలుగుదేశం బలంగా ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలను చీలికలు పేలికలు చేయడం ద్వారా ఆ పార్టీ విజయావకాశాలను రాజశేఖరరెడ్డి దెబ్బతీశారని అంటారు. తెలుగుదేశం బలంగా ఉన్న నియోజకవర్గాలలోని కొన్ని ప్రాంతాలను ఇతర నియోజకవర్గాలలో కలిపారు. ఇప్పుడు తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ, ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న కూటమి పార్టీలు కూడా ఈ దిశగానే చర్యలు తీసుకొనే అవకాశం ఉంది. అసెంబ్లీ నియోజకవర్గాలంటూ పెరిగితే తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్‌ మహానగరంలోనే ఎక్కువగా పెరుగుతాయి. ఈ కారణంగానే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌పై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. మూసీ సుందరీకరణ ప్రాజెక్టు కూడా ఇందులో భాగమే. హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థను ఇప్పటికే మూడుగా విభజించారు.


లాభాలు.. కష్టాలు

నియోజకవర్గాల సంఖ్య పెరిగి జమిలి ఎన్నికలు జరిగితే ఉభయ తెలుగు రాష్ర్టాల్లో అధికారంలో ఉన్న పార్టీలకు అదనపు ప్రయోజనం చేకూరుతుందనడంలో సందేహం లేదు. ఈ పరిణామాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొనే బీజేపీకి స్నేహ హస్తం చాపాలని బీఆర్‌ఎస్‌ తహతహలాడుతోంది. తెలంగాణలో కాంగ్రెస్‌కు ఉపయోగపడే విధంగా ప్రధాని మోదీ ఎందుకు వ్యవహరిస్తారన్న సందేహం రావడం సహజం. జాతీయ పార్టీలకు చెందిన జాతీయ నాయకులకు లోక్‌సభ సీట్లు గెలుచుకోవడం ముఖ్యం. కేంద్రంలో అధికారంలోకి రావడానికే వారు ప్రాధాన్యం ఇస్తారు. ఈ క్రమంలో ఒకటి రెండు రాష్ర్టాలలో అధికారం రాకపోయినా పట్టించుకోరు. ఒకప్పుడు కాంగ్రెస్‌ పార్టీ కూడా ఇదే విధంగా వ్యవహరించింది. జమిలి ఎన్నికలు జరిగితే తెలంగాణలోనే కాదు– దేశవ్యాప్తంగా బీజేపీకి ప్రయోజనం చేకూరుతుంది. జమిలి ప్రభావం అసెంబ్లీ ఎన్నికలపై కూడా పడుతుంది. అంతంత మాత్రంగా ఉన్న ప్రాంతీయ పార్టీలు బీజేపీతో పొత్తు పెట్టుకోక తప్పని పరిస్థితులు ఏర్పడే అవకాశముంది. బీజేపీ ప్రధాన భాగస్వామిగా అవతరిస్తుంది. తమిళనాడునే ఉదాహరణగా తీసుకుందాం. అక్కడ బీజేపీ బలం అంతంత మాత్రమే. అయితే అంతో ఇంతో బలంగా ఉన్న అన్నాడీఎంకే అక్కడ బీజేపీకి ఉపగ్రహంగా మారిపోయింది. కూటమిపై బీజేపీ పెత్తనమే నడుస్తోంది. తెలంగాణలో బీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకున్నప్పటికీ బీజేపీ ఆధిపత్యమే కొనసాగుతుంది. సీట్ల పంపిణీలో కూడా ఈ ఆధిపత్యం కొనసాగుతుంది. ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్నందునే ప్రధాని మోదీ జమిలి ఎన్నికల పట్ల అంత ఆసక్తి చూపుతున్నారు. కాలక్రమంలో ప్రాంతీయ పార్టీలు లేకుండా చేయడం, బీజేపీని అజేయ శక్తిగా నిలపడం అనే రెండు లక్ష్యాలతో జమిలి ఎన్నికలకు ప్రధాని శ్రీకారం చుడుతున్నారు. ఇక మహిళా రిజర్వేషన్ల విషయానికి వద్దాం! చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు ఉండాలన్న డిమాండ్‌ ఎప్పటి నుంచో ఉంది. గతంలో రాజకీయ పార్టీలు ఈ మేరకు హామీ ఇవ్వడం మినహా చట్టం చేయడానికి చొరవ తీసుకోలేదు. బిల్లులను రూపొందించి కూడా కోల్డు స్టోరేజీలో పెట్టారు. ప్రధాని మోదీ చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న కృతనిశ్చయంతో చట్టం తెచ్చారు. ఇది అమలులోకి వస్తే మహిళల్లో ఆయన పట్ల ఆదరణ అమాంతం పెరుగుతుంది. ప్రజల సైకాలజీని గమనించే మోదీ ఆ దిశగా చర్యలు తీసుకొని రాజకీయాల్లో అనుకూల ఫలితాలు సాధిస్తూ వస్తున్నారు. ట్రిపుల్‌ తలాఖ్‌ విషయమే తీసుకోండి! నోటి మాటగా ముస్లిం పురుషులు తమ భార్యలకు విడాకులు ఇవ్వవచ్చు. ఈ వ్యవహారంపై ముస్లిం మహిళల్లో అసంతృప్తి, ఆవేదన గూడుకట్టుకొని ఉన్నాయి. అది గమనించిన ప్రధాని మోదీ ట్రిపుల్‌ తలాఖ్‌ చెల్లదంటూ చట్టం తెచ్చారు. ఈ కారణంగానే ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్న నియోజకవర్గాల్లో కూడా బీజేపీ గెలుస్తోంది. అంటే ముస్లిం మహిళల మనస్సు గెలుచుకున్నారు. ఈ నేపథ్యంలో మహిళా రిజర్వేషన్లు కూడా చూడాలి. ఉత్తరాదికి చెందిన ప్రాంతీయపార్టీల మొండితనం వల్ల గతంలో మహిళా రిజర్వేషన్లు చట్టరూపం దాల్చలేదు. ఇప్పుడు సదరు ప్రాంతీయ పార్టీలు ప్రధాని మోదీని నిలువరించే స్థితిలో లేవు. జమిలి ఎన్నికలు, నియోజకవర్గాల పెంపు, మహిళా రిజర్వేషన్లు వంటి అన్ని ప్రయోగాలను ఏకకాలంలో అమలు చేయడానికి ప్రధాని మోదీ పూనుకున్నారు. అందుకే కాబోలు వందేళ్ల వరకు నా వంటి రాజకీయ నాయకుడిని చూడలేరు అని ఆయన చెబుతూ ఉండవచ్చు. జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ఈ మాటల్లో అతిశయోక్తి కనిపించడం లేదు.


బీజేపీ... మోదీకి ముందు, తర్వాత!

అంతర్జాతీయ పరిణామాలు, పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ప్రధాని మోదీ బలహీనపడ్డారన్న భావన కొంత మేర ఉంది. అయితే, దేశంలో ఏ ఎన్నికలు జరిగినా ఆయనే గెలుస్తున్నారు. ఎన్నిక ఏదైనా ఫలితం తమ పార్టీకే అనుకూలంగా ఉండాలని మోదీ తలపోస్తారు. ‘ఈ శతాబ్దం నాది’ అంటూ పగటి కలలు కనడానికే ఆయన పరిమితం కావడం లేదు. ప్రతి ఎన్నికనూ సవాలుగా తీసుకుంటారు. చాలా ముందుగానే వ్యూహ రచన చేసుకుంటారు. త్వరలో తమిళనాడు, కేరళం, పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు జరగనున్నందున గవర్నర్ల బదిలీతో ఎన్నికల వ్యూహ రచనకు శ్రీకారం చుట్టారు. పశ్చిమబెంగాల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీని పడగొట్టడం అత్యంత ముఖ్యమని భావిస్తున్న ప్రధానమంత్రి.. తమిళనాడు గవర్నర్‌గా స్టాలిన్‌కు కొరకరాని కొయ్యగా ఉండిన ఆర్‌.ఎన్‌. రవిని పశ్చిమ బెంగాల్‌కు బదిలీ చేశారు. ప్రధానమంత్రిగా ఉంటూ రాష్ర్టాలపై తన దృష్టిని ఇంతలా కేంద్రీకరించిన మరొకరిని మనం చూడలేదు. కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉండిన పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఇంతలా బలపడుతుందని ఎవరైనా ఊహించారా? సామ దాన భేద దండోపాయాలను ప్రయోగించడం ద్వారా అనుకున్న లక్ష్యాన్ని సాధించడం మోదీకి వెన్నతో పెట్టిన విద్య. స్వరాష్ట్రం గుజరాత్‌లో కాంగ్రెస్‌ పార్టీని కోలుకోకుండా చేయడంతో రాజకీయంగా బలమైన పునాదులు వేసుకున్న నరేంద్ర మోదీ ఇప్పుడు దేశంలోనే తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. రాజకీయ ప్రయోజనాలకోసం ప్రభుత్వ ఏజెన్సీలను నరేంద్ర మోదీ దుర్వినియోగం చేస్తున్నారన్న విమర్శలు ఉంటే ఉండవచ్చుగాక! ఆయనకు రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం. అయితే, అలా పైకి మాత్రం కనిపించకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటారు. జాతీయ రాజకీయాలలో తనకు ప్రత్యామ్నాయం లేదన్న అభిప్రాయం ప్రజల్లో కల్పించడం ద్వారా బీజేపీకి విజయాలు కల్పించుకుంటూ పోతున్నారు. బీజేపీ స్వరూపాన్ని కూడా పూర్తిగా మార్చివేశారు. ఆ పార్టీ పేరుకే జాతీయ పార్టీ. ఇప్పుడు నరేంద్రమోదీ నాయకత్వంలోకి వచ్చిన తర్వాత బీజేపీ జాతీయస్థాయి ప్రాంతీయ పార్టీగా రూపాంతరం చెందింది. అంటే ఏకవ్యక్తి నాయకత్వంలోకి వెళ్లింది. గతంలో బీజేపీపై ఆరెస్సెస్‌ వంటి సంస్థల ప్రభావం ఉండేది. ఇప్పుడు మోదీ నాయకత్వంలోకి వచ్చాక వాటి ప్రభ మసకబారింది. ఆయన సూచనల మేరకు బీజేపీ విజయంకోసం క్షేత్ర స్థాయిలో పని చేయడానికి మాత్రమే ఆయా సంస్థలు పరిమితమయ్యాయి. వరుస విజయాలతో సొంత పార్టీలో తనకు తిరుగులేకుండా చేసుకున్నారు.


జాతీయ రాజకీయాల్లో తనకు ప్రత్యామ్నాయం లేదన్న భావన కల్పించారు. ఈ కారణంగానే మరో రెండు పర్యాయాలు తానే ప్రధానమంత్రిగా ఉంటానని ఆయన చెప్పుకోగలుగుతున్నారు. వయో భారం మీద పడుతున్నప్పటికీ ఆయన ఈ మాటలు అనగలగడం విశేషమే! 90 ఏళ్లు వచ్చేవరకు అధికారంలో ఉండాలనుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇది ఆత్మ విశ్వాసమా? అతి విశ్వాసమా? కాలమే నిర్ణయిస్తుంది. అయితే, ఈ శతాబ్దం నాది అని ఆయన అల్లాటప్పాగా చెప్పుకోవడం లేదు. నిర్ద్దిష్ట లక్ష్యం, ఆ లక్ష్య సాధనకు అవసరమైన వ్యూహాలను సిద్ధం చేసుకున్న మీదటే ప్రధాని నోట ఈ మాటలు వెలువడినట్టుగా అర్థం చేసుకోవాలి. ‘సౌ సాల్‌ తక్‌’ తన వంటి రాజకీయ నాయకుడిని చూడబోరన్న ప్రధాని మోదీ మాటలు నిజమవుతాయో లేదో వేచి చూద్దాం! బీజేపీ... మోదీకి ముందు, ఆ తర్వాత అని కూడా చెప్పుకోవలసి వస్తోంది. చరిత్రలో ఆయన స్థానం ఏమిటో నిర్వచించడానికి చరిత్ర పుటల్లో ప్రస్తుతానికి కొన్ని పేజీలు ఖాళీగా ఉన్నాయి!

ఆర్కే

3-eee.jpg

ఇవి కూడా చదవండి...

గ్యాస్‌ సరఫరాపై సీఎం చంద్రబాబు ఫోకస్.. మంత్రులతో చర్చ

కేంద్రమంత్రి అన్నపూర్ణా దేవితో మంత్రి సీతక్క భేటీ.. చర్చించిన అంశాలివే

Updated Date - Mar 15 , 2026 | 01:24 AM