చాయిస్ ఈజ్ యువర్స్ మిస్టర్ జగన్‌రెడ్డి!
ABN , Publish Date - May 24 , 2026 | 12:19 AM
ఒళ్లంతా బురద పులుముకున్న ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తాను పూసుకున్న బురదను ఇతరులకు అంటించాలనుకుంటున్నారు.
ఒళ్లంతా బురద పులుముకున్న ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తాను పూసుకున్న బురదను ఇతరులకు అంటించాలనుకుంటున్నారు. మానవ జాతిలో తనను మించిన ఉత్తమ పురుషుడు మరొకరు లేరని భ్రమిస్తున్న ఆయన, తనను వ్యతిరేకించే వారందరూ అవినీతిపరులని, హంతకులని చిత్రించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అయితే ఉగాది పంచాంగ శ్రవణంలో ఆయన పిలిపించుకున్న పండితుడు ఈ ఏడాది గ్రహబలం అనుకూలంగా లేదని చెప్పినట్టుగానే జగన్‌రెడ్డి గురువారంనాడు విలేకరుల సమావేశంలో చేసిన విన్యాసాలు ఆయనకే ఎదురు తగిలాయి. తన తాత రాజారెడ్డి హత్య, తండ్రి రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదాలను ప్రస్తావించడం ద్వారా జనం మరచిపోయిన విషయాలను ఆయన గుర్తుచేశారు. తమ కుటుంబంలో జరిగిన హత్యలతో పాటు కొన్ని దశాబ్దాలుగా తెలుగునాట జరిగిన అనేక హత్యల వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారని చెప్పే ప్రయత్నం చేయడం ద్వారా ‘ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే’ అనే సామెతను గుర్తుచేశారు. నిజానికి జగన్‌రెడ్డి తాత వైఎస్ రాజారెడ్డి గురించి ఈ తరానికి తెలియదు. ఆయనను ఎవరు.. ఎందుకు హత్య చేశారో కూడా తెలియదు. హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన రాజశేఖరరెడ్డిని మహా నేతగా భావిస్తున్న ఈ తరం వారికి ఆయనకు కూడా ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న సంగతి తెలియదు. ఇప్పుడు పాత విషయాలను ప్రస్తావించడం ద్వారా తండ్రీ తాతల నేపథ్యం గురించి ఈ తరం వారు తెలుసుకొనే పరిస్థితిని జగన్‌రెడ్డి కల్పించారు. వైసీపీ అంటే గొడ్డలి పార్టీ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవలి కాలంలో తరచుగా చురకలంటిస్తున్నారు. దీంతో జగన్‌రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి హత్యా రాజకీయాలకు చంద్రబాబు పెట్టింది పేరు అని, తాను మంచోడు కనుకే తాత రాజారెడ్డిని చంపినవాళ్లు ప్రశాంతంగా బతకగలుగుతున్నారని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. అయితే రాజారెడ్డి వర్గీయులు చేసిన హత్యాయత్నం నుంచి ప్రాణాలతో బయటపడి ఆ తర్వాత తన వర్గీయులతో రాజారెడ్డిని చంపించిన పేర్ల పార్థసారథిరెడ్డి అప్పుడేం జరిగిందో కుండబద్దలు కొట్టారు.
మొదట రాజారెడ్డి వర్గీయులు తనపై దాడి చేసి చంపే ప్రయత్నం చేశారని, ఆ సందర్భంగా తన శరీరంపై 26 కత్తిపోట్లు పడ్డాయని, తాను చనిపోయాననుకొని వదిలి వెళ్లిపోయారని ఆయన వివరించారు. అనంతరం తన వర్గీయులు రాజారెడ్డిపై దాడి చేసి చంపారని ఆయన జరిగింది జరిగినట్టుగా చెప్పుకొచ్చారు. వైఎస్ కుటుంబం వల్ల తన కుటుంబం ఆర్థికంగా చితికిపోయిందని కూడా ఆయన ఏకరువు పెట్టారు. పార్థసారథిరెడ్డిపై జరిగిన హత్యాయత్నం, ఆ తర్వాత జరిగిన రాజారెడ్డి హత్య ఫ్యాక్షన్ రాజకీయాలలో భాగమే! దాదాపు మూడు దశాబ్దాల క్రితం ఇవి జరిగాయి. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నారు. ఇప్పుడు నేను అంత మంచివాడిని, ఇంత మంచివాడిని అని చెప్పుకొంటున్న జగన్మోహన్‌రెడ్డి అప్పట్లో తన తాత రాజారెడ్డిపై దాడి చేసిన వారిని చంపాలనుకున్నారు. ఈ విషయాన్ని వైఎస్ రాజశేఖరరెడ్డి స్వయంగా అప్పటి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, అందరూ కాకాగా పిలుచుకొనే దివంగత వెంకటస్వామి వద్ద ప్రస్తావించారు. ‘మా నాన్నను చంపినవాళ్లను చంపుతానని మా వాడు కత్తి పట్టుకొని తిరుగుతున్నాడు. జరగరానిది జరిగితే నా రాజకీయ జీవితం దెబ్బతింటుంది. ఏదైనా సలహా ఇవ్వండి’ అని కాకాను రాజశేఖరరెడ్డి అప్పట్లో కోరారు. ఈ విషయాన్ని దివంగత వెంకటస్వామి ఓ సందర్భంలో నా వద్ద ప్రస్తావించారు. ‘నీ కొడుకుని పులివెందుల పరిసరాల్లో ఉండనివ్వొద్దు’ అని తాను రాజశేఖరరెడ్డికి సూచించినట్టు కాకా తెలిపారు. దీన్నిబట్టి జగన్‌రెడ్డి ఇప్పుడు చెప్పుకొంటున్నట్టుగా అంత మంచోడు కాదని స్పష్టమవుతోంది. తండ్రి రాజశేఖరరెడ్డి అడ్డుపడి ఉండకపోతే జగన్‌రెడ్డి చేతులకు కూడా రక్తం అంటి ఉండేదన్నమాట! కత్తి చేతబట్టినవాడు ఆ కత్తికే బలవుతాడు అని అంటారు. అప్పట్లో రెండు వర్గాలకు నాయకత్వం వహించిన రాజారెడ్డి, పార్థసారథిరెడ్డి ఫ్యాక్షన్ దాడులు జరిపించారు. రాజారెడ్డి మరణించగా, పార్థసారథిరెడ్డి ప్రాణాలు దక్కించుకున్నారు. ఇదంతా గతం. నిజానికి గురువారంనాడు ఏబీఎన్ డిబేట్‌లో పార్థసారథిరెడ్డి పాల్గొనే వరకు ఆయనే రాజారెడ్డిని చంపిన వారికి నాయకుడు అని ఈ తరానికి తెలియదు. రాజారెడ్డి హత్యా రాజకీయాలు చేసేవారన్న విషయం కూడా తెలియదు. ఇప్పుడు జగన్‌రెడ్డి పుణ్యమా అని వైఎస్ కుటుంబ నేర చరిత్ర గురించి తెలుసుకొనే అవకాశం ఈ తరానికి లభించింది. 2019–2024 మధ్య ఆంధ్రప్రదేశ్‌లో అమలైన ‘రాజారెడ్డి రాజ్యాంగం’ అంటే ఏమిటో ఇప్పుడు జనబాహుళ్యానికి మరింతగా అర్థమవుతోంది.
పాపాలే.. శాపాలై!
తన తండ్రి రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడంపై ఇప్పటికీ అనుమానాలు ఉన్నాయని జగన్‌రెడ్డి తాజాగా చెప్పడం ఈ మొత్తం ఎపిసోడ్‌లో హైలెట్! ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్‌రెడ్డి తన తండ్రి రాజశేఖరరెడ్డి మరణంపై అనుమానాలు ఉన్నాయని ఒక్కసారి కూడా చెప్పలేదు. నాటి సంఘటనపై విచారణ జరిపించే ఆలోచనా చేయలేదు. రాజశేఖరరెడ్డి మరణం వల్ల ప్రజల్లో పెల్లుబికిన సానుభూతిని తన రాజకీయ పరమపద సోపానానికి వాడుకున్న జగన్‌రెడ్డి, అధికారంలోకి రాగానే అన్నీ మరచిపోయారు. పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో రాజశేఖరరెడ్డి పేరు కూడా ప్రస్తావనకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. రాజశేఖరరెడ్డి మరణం తర్వాత హెలికాప్టర్ ప్రమాదం వెనుక కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ హస్తం ఉందని కొంతకాలం, ఆ తర్వాత రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ హస్తం ఉందని మరికొంత కాలం ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. విచిత్రమేమిటంటే, అవినీతి కేసులలో జైలు జీవితం అనుభవించిన జగన్‌రెడ్డి బెయిల్ కోసం అదే సోనియాగాంధీని, అదే ముఖేశ్ అంబానీని ఆశ్రయించారు. ముఖ్యమంత్రి అయ్యాక ఈ ఇరువురి గురించి ఎక్కడా, ఎప్పుడూ ప్రస్తావించలేదు. పైగా ముఖేశ్ అంబానీని, ఆయన కుమారుడు అనంత్ అంబానీని తన ఇంటికి ఆహ్వానించి అతిథి మర్యాదలు చేశారు. ముఖేశ్ అంబానీ కోరికను మన్నించి పరిమళ్ నత్వానీకి తమ పార్టీ తరఫున రాజ్యసభ టికెట్ ఇచ్చి సత్కరించారు. దీన్నిబట్టి హెలికాప్టర్ ప్రమాదం తర్వాత జగన్‌రెడ్డి చేసిన ఆరోపణలన్నీ పచ్చి అబద్ధాలని స్పష్టమవుతోంది. ఇంత కాలానికి మళ్లీ తండ్రి మరణంపై అనుమానాలు ఉన్నాయని చెబుతున్నారంటే శవ రాజకీయాలకు మళ్లీ తెర లేస్తోందన్న మాట! ఇప్పుడు తాజాగా ఆయన చంద్రబాబుపై అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. అయితే ఈ మొత్తం ఎపిసోడ్‌లో ఒక విషయం గమనించాలి. రాజారెడ్డి హత్య జరిగినప్పుడు ఆయనపై దాడి చేసిన వారిపై పగ తీర్చుకోవాలని భావించిన జగన్‌రెడ్డి, తన తండ్రి మరణం తర్వాత ఆరోపణలు ఎన్ని చేసినా పగ, ప్రతీకారాల జోలికి పోకుండా ముఖ్యమంత్రి పదవి కోసం అర్రులు చాచారు.
జనాల్లో సానుభూతి పెంపొందించి అదంతా తన రాజకీయ ఎదుగుదలకు ఉపయోగపడేలా జాగ్రత్తపడ్డారు. తాత మరణం నుంచి తండ్రి మరణం వరకు జగన్‌రెడ్డిలో వచ్చిన మార్పు ఇదన్నమాట! ఇంత కాలం తర్వాత ఇప్పుడు మళ్లీ చంద్రబాబుపై అనుమానాలు ఉన్నాయని చెప్పడం వల్ల ప్రయోజనం ఏమిటో జగన్‌కే తెలియాలి. తమ కుటుంబంలో జరిగిన మూడు మరణాలను ప్రస్తావించడం ద్వారా మళ్లీ సానుభూతి పొందాలని జగన్ ప్రయత్నిస్తున్నారేమో తెలియదుగానీ తమ కుటుంబ రక్త చరిత్రను ఆయనే బయటపెట్టుకున్నారు. రాజారెడ్డి ఎలాంటి వారు? ఎన్ని నేరాలు చేశారు? వంటి విషయాలను ముఖ్యమంత్రి అయ్యాక ప్రజలు మరచిపోయేలా రాజశేఖరరెడ్డి చేయగలిగారు. తమ కుటుంబానికి గౌరవ ప్రతిష్ఠలు లభించేలా కృషి చేశారు. రాజశేఖరరెడ్డి రాజకీయాలలో రాణించక ముందు రాజారెడ్డిని సాదాసీదా పాలెగాడిగానే ప్రజలు చూశారు. పులివెందుల వరకే అతని ప్రభావం ఉండేది. రాజశేఖరరెడ్డి రాజకీయాలలో అంచెలంచెలుగా ఎదిగి ముఖ్యమంత్రి అయ్యాక వైఎస్ కుటుంబానికి ఉన్న ఫ్యాక్షన్ నేపథ్యాన్ని ప్రజలు మరచిపోయారు. ఇప్పుడు పార్థసారథిరెడ్డి గురువారంనాడు ‘ఏబీఎన్’ డిబేట్‌లో చెప్పిన విషయాలతో వైఎస్ కుటుంబ నేపథ్యం మళ్లీ ప్రజల్లో చర్చకు వచ్చింది. తన తాత ఎలాంటివాడో ఇప్పటి ప్రజలకు తెలియడానికి జగన్‌రెడ్డి కారకుడు కావడం గమనార్హం! రాజశేఖరరెడ్డి మరణం తర్వాత ఆయన కుటుంబం ఛిన్నాభిన్నం అయింది. కుటుంబ పెద్ద పోతే ఎంత పెద్ద కుటుంబం అయినా ఇలా అయిపోతుందా అని ఆశ్చర్యపోవడం ప్రజల వంతయింది. రాజశేఖరరెడ్డి సోదరుడు వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. కుటుంబంలో అంతఃకలహాలు, ఆస్తి తగాదాలు పరాకాష్ఠకు చేరాయి. రాజశేఖరరెడ్డి సతీమణి విజయలక్ష్మి అడకత్తెరలో పోకలా కొడుకు–కుమార్తె మధ్య నలిగిపోతున్నారు. ఈ పరిస్థితికి జగన్‌రెడ్డి కారణం కాదా? రాజశేఖరరెడ్డి కుటుంబానికి చెందిన ఒకరిని ఇదే విషయమై ప్రశ్నించగా, పుణ్యంకొద్దీ పురుషుడు.. దానంకొద్దీ బిడ్డలు అని చెబుతారని వ్యాఖ్యానించారు. జగన్‌రెడ్డి స్థానంలో తాను ఉండి ఉంటే ఆస్తి అంతా షర్మిలకు ఇచ్చి ఉండేవాడినని ఆయన అన్నారు. నిజానికి వైఎస్ కుటుంబానికి ప్రారంభంలో ఆస్తిపాస్తులు పెద్దగా లేవు. రాజారెడ్డి తండ్రి వెంకటరెడ్డి చాలా చిన్న రైతు. రాజారెడ్డి ఫ్యాక్షన్ మార్గాన్ని ఎంచుకున్న తర్వాత వైఎస్ కుటుంబానికి ఆస్తులు సమకూరడం మొదలైంది. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక జగన్‌రెడ్డి విన్యాసాలు చూశాం. ఈ దేశ చరిత్రలోనే ఎవరూ నిర్మించలేని విధంగా వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. పేర్ల పార్థసారథిరెడ్డి చెబుతున్నట్టుగా రాజారెడ్డి కుటుంబం రక్తపు కూడు తిని పెరిగిందన్న మాట! బహుశా నాటి పాపాలే నేటి శాపాలుగా మారి రాజశేఖరరెడ్డి కుటుంబాన్ని వేధిస్తున్నాయని భావించాలేమో.
తులసి మొక్కా.. అదెలా?
ఇప్పుడు జగన్‌రెడ్డి నోటి వెంట వెలువడిన ఆణిముత్యాల గురించి చర్చించుకుందాం. ప్రస్తుత రాజకీయాలను గంజాయి వనంగా పోల్చుతూ అందులో తాను తులసి మొక్కను అని జగన్ చెప్పుకొంటున్నారు. విలువలు, విశ్వసనీయతతో కూడిన రాజకీయం చేస్తానని నమ్మబలుకుతున్నారు. జగన్‌రెడ్డి నోటి వెంట ఇలాంటి పదాలు వెలువడినప్పుడు అతని వెనుక ఉన్న వాళ్లకు కూడా నవ్వు ఆగడం లేదు. జగన్‌రెడ్డి నిజంగా తులసి మొక్కే అయితే గత ఎన్నికల్లో తులసి మొక్కను ప్రజలు ఎందుకు పీకి పక్కన పడేశారన్న ప్రశ్న ఉత్పన్నం అవుతుంది కదా? కన్నతల్లిని క్షోభకు గురిచేస్తూ, రక్తం పంచుకు పుట్టిన చెల్లిని ఆస్తి కోసం తరిమేసిన జగన్‌రెడ్డి మంచోడు ఎలా అవుతారు? తులసి మొక్క ఎలా అవుతారు? అయితే అలాంటి తులసి మొక్కను పీకి పడేసిన ప్రజలు గంజాయి మొక్కలా? ‘చారిటీ బిగిన్స్ ఎట్ హోం’ అని అంటారు. మనం మంచివాళ్లం అవునా కాదా అన్నది ముందుగా మన కుటుంబ సభ్యులే సర్టిఫికెట్ ఇవ్వాలి. జగన్‌రెడ్డి ఉత్తమ మానవుడు అని రాజశేఖరరెడ్డి కుటుంబ సభ్యుల్లో ఒక్కరైనా సర్టిఫికెట్ ఎందుకు ఇవ్వడం లేదన్న ప్రశ్నకు సమాధానం రావాలి కదా? జగన్‌రెడ్డి వివాహం.. డాక్టర్ సునీత వివాహం ఒకే రోజు, ఒకే చోట జరిగాయి. అలా కలసి మెలసి ఉండిన కుటుంబం ఇప్పుడు చెల్లాచెదరు కావడానికి జగన్‌రెడ్డి కారణం కాదా? మా జగనన్న మంచోడు అని డాక్టర్ సునీత ఇప్పుడు చెప్పగలరా? తన తండ్రి వివేకాను చంపించిన వారికి శిక్ష పడేలా చేయమని అర్థించిన ఆమెను పట్టించుకోని జగన్‌రెడ్డి మంచోడు ఎలా అవుతారు? జగనాజ్ఞ లేనిదే చీమైనా కుట్టని పులివెందులలో స్వయానా ఆయన బాబాయ్‌ని చంపే ధైర్యం ఎవరికుంటుంది? కనీసం వివేకా హంతకులెవరో కూడా తెలియనంత అమాయకుడా జగన్? వివేకా హంతకుల్ని ఆయనే కాపాడుతున్నారన్న బాధితుల ఆరోపణలకు ఎదురుదాడే సమాధానం ఎలా అవుతుంది? జగన్ లాంటి అన్న మరెవరికీ ఉండకూడదు అని రక్తం పంచుకుపుట్టిన షర్మిల అన్నారంటే జగన్ ఉత్తమ పురుషుడు ఎలా అవుతారు? తాను తులసి మొక్కను అని చెప్పుకొంటే నమ్మడం ఎలా? మళ్లీ అధికారంలోకి వస్తే చంపుతాం నరుకుతాం అని రంకెలు వేస్తున్నవాళ్లు తులసి మొక్కలు అవుతారా? నిజానికి వైఎస్ కుటుంబం రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత కుట్రలు, కుతంత్రాలకు తెర లేచిందని అప్పట్లో కాంగ్రెస్ నాయకులే ఆరోపించేవారు.
పోయినోళ్లందరూ మంచోళ్లని సర్దుకుపోయే ఉదారవాదం మన నైజం కాబట్టే మరణానంతరం వైఎస్ ‘మహానేతగా’ మారిపోయారు. నిజానికి రాజారెడ్డి కంటే రాజశేఖరరెడ్డే ‘డేంజరస్’ అని రాయలసీమకు చెందిన, మరీ ముఖ్యంగా కడప జిల్లాకు చెందిన ఆయన ప్రత్యర్థులు గజగజ వణుకుతూ వారికి ఎదురైన భయానక అనుభవాలను చెబుతుంటారు. అసలు చావులను రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నవారు తులసి మొక్కలు ఎలా అవుతారు? రాజశేఖరరెడ్డి మరణాన్ని కొంతకాలం, వివేకానందరెడ్డి హత్యను మరికొంత కాలం రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్న జగన్‌రెడ్డి తాను తులసి మొక్కను అని చెప్పుకోవడాన్ని మించిన జోక్ మరేమి ఉంటుంది? కోడికత్తి, గులకరాయి సంఘటనలను రాజకీయాలకు వాడుకున్నది ఎవరు? జగన్‌రెడ్డి నిజంగా మంచోడైతే డాక్టర్ సునీతకు న్యాయం చేసేవారు కదా? రాజశేఖరరెడ్డి మరణం వెనుక నిజంగా కుట్ర దాగి ఉంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మౌనంగా ఎందుకున్నారో జగన్‌రెడ్డి చెప్పాలి. తాను ఏది చెప్పినా జనం నమ్ముతారని జగన్ బలంగా విశ్వసిస్తున్నట్టుగా ఉంది. ఈ క్రమంలోనే ఫేక్ ప్రచారాలకు శ్రీకారం చుట్టారు. తమిళనాడు ముఖ్యమంత్రి జోసఫ్ విజయ్‌తో పోల్చి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను తక్కువ చేసి చూపించడం కోసం వైసీపీ కార్యకర్త మెడలో టీవీకే పార్టీ కండువా వేసి ఏదేదో చెప్పించే ప్రయత్నం చేసి అడ్డంగా దొరికిపోయారు. నిన్నగాక మొన్న ఒక పాస్టర్‌తో దొంగ దాడి డ్రామా ఆడించి మళ్లీ దొరికిపోయారు. కులాలు, మతాల మధ్య కుంపట్లు రాజేసి చలి కాచుకోవాలని అనుకొనేవారు తులసి మొక్కలు ఎలా అవుతారు? గ్రహ బలం అనుకూలంగా లేనందునే కాబోలు జగన్ అండ్ కో డ్రామాలు ఇట్టే బయట పడిపోతున్నాయి.
నిరూపిస్తే.. రాసిచ్చేస్తాం!
ఇక రాజధాని అమరావతిపై అంతులేని ద్వేషం పెంచుకున్న జగన్‌రెడ్డి మళ్లీ మావిగన్ ప్రస్తావన తెచ్చారు. తాను చేసిన మావిగన్ ప్రతిపాదనకు ప్రజల మద్దతు విశేషంగా ఉందని, ఆ కారణంగానే మావిగన్ పేరు వినబడితే ముఖ్యమంత్రి చంద్రబాబుకు గుండెపోటు వచ్చి పోతాడని జగన్ నోరు పారేసుకున్నారు. ఫేక్ ప్రచారం చేసి రాజకీయ ప్రయోజనం పొందుతూ వచ్చిన జగన్ అండ్ కో తాము చేస్తున్న ఫేక్ ప్రచారం ప్రభావానికి తామూ గురవుతూ భ్రమల్లో బతుకుతున్నారు. మావిగన్ ప్రతిపాదనకు ప్రజల్లో అంతులేని ఆదరణ ఉందనుకోవడం భ్రమ కాక మరేమిటి? తన కుటుంబ చరిత్రను బయటపెట్టుకోవడం ద్వారా జగన్‌రెడ్డి సెల్ఫ్ గోల్ చేసుకున్నారని పలువురు అభిప్రాయపడుతుండగా, విలేకరుల సమావేశం బ్రహ్మాండంగా ఉందని పార్టీ నాయకులు అధినాయకుడు జగన్‌రెడ్డిని ప్రశంసించారట. జగన్ అండ్ కో తమను తాము వంచించుకుంటూ ప్రజలను కూడా వంచించే ప్రయత్నం చేస్తున్నారు. యథావిధిగా జగన్మోహన్‌రెడ్డి గురువారంనాటి విలేకరుల సమావేశంలో నా పేరు కూడా ప్రస్తావించారు. పేరు ప్రస్తావనకే పరిమితం కాకుండా అమరావతిలో ప్లాట్ల కేటాయింపులో నా కుమారుడు, కుమార్తె అనుచిత లబ్ధి పొందినట్టుగా ఆరోపణలు చేశారు. నా పిల్లలకు ప్రధాన రహదారి పక్కన ప్లాట్లు కేటాయించి లబ్ధి చేకూర్చారని ఆరోపించారు. ఈ ఆరోపణలతోనే జగన్ రోత మీడియా వార్తా కథనాన్ని వండి వార్చినప్పుడు కడుపు నిండా గడ్డి పెట్టాం. దానిపై సదరు రోత పత్రిక నోరు మెదపలేదు. ఇప్పుడు జగన్‌రెడ్డి మళ్లీ అదే ఆరోపణ చేస్తున్నారు. తలపై గంపెడు అవినీతి కేసులను మోస్తున్న జగన్‌రెడ్డి ఇతరులకు కూడా అదే బురద పూయాలని అనుకుంటున్నారు.
నిజానికి నా కుమారుడు, కుమార్తెకు కేటాయించిన ప్లాట్లు ఎక్కడున్నాయో మాకు తెలియదు. ఇలాంటి తుచ్చమైన వాటిపై మమకారం ఉంటే భూ సమీకరణకు ముందే కోర్ క్యాపిటల్ సమీపంలోనే భూములు కొనుగోలు చేసేవాడిని. భూ సమీకరణ తర్వాత ధరలు పెరిగాక ఎక్కడో కోర్ క్యాపిటల్‌కు దూరంగా కురగల్లు వద్ద ఎందుకు కొనుగోలు చేస్తాం? నువ్వు ఆరోపణ చేయడం– నేను సమాధానం చెప్పడం కాదు గానీ, ఒక పని చేద్దాం! ప్లాట్ల కేటాయింపులో అధికారులను నేను గానీ, మా సిబ్బంది గానీ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రభావితం చేసినట్టుగా జగన్ అండ్ కో రుజువు చేస్తే సదరు ప్లాట్లను తిరుమల తిరుపతి దేవస్థానానికి విరాళంగా ఇచ్చేస్తాం. జగన్ అండ్ కో మాత్రమే కాదు ఇతరులు ఎవరైనా మేం అనుచిత లబ్ధి పొందినట్టు రుజువు చేసినా సదరు ప్లాట్లను వారికి ఉచితంగా ఇచ్చేస్తాం. ఇప్పటికీ మా కుటుంబానికి కేటాయించిన ప్లాట్లు ఎక్కడున్నాయో మాకు తెలియదు. వాటిని చూసుకొని మురిసిపోవాలన్న తపన కూడా మాకు లేదు. అవి ఉన్నా ఒక్కటే పోయినా ఒక్కటే. మేం తప్పు చేసినట్టు లేదా అయాచిత ప్రయోజనం పొందినట్టు రుజువు చేస్తే సదరు ప్లాట్లను జగన్‌రెడ్డికి ఇవ్వడానికి కూడా మేము సిద్ధం. మీ పేరు మీద వద్దనుకుంటే మీ పార్టీకైనా రాసి ఇచ్చేస్తాం. తాను చేసిన ఆరోపణలపై జగన్‌రెడ్డికి నమ్మకం ఉంటే ఈ సవాలును ఆయన స్వీకరించాలి. లేదంటే, మానవ జాతి పరిణామ క్రమంలోనే జగన్‌రెడ్డి వంటి వ్యక్తి మరొకరు ఉండరని మేం భావించాల్సి ఉంటుంది. మంచివాడినని చెప్పుకొంటున్న జగన్‌కు ఇదొక మంచి అవకాశం కదా! చాయిస్ ఈజ్ యువర్స్ ఓన్లీ మిస్టర్ జగన్‌రెడ్డి!