Share News

ప్రజాసేవకు ప్రతిరూపం కోడెల

ABN , Publish Date - Sep 16 , 2026 | 02:22 AM

నిత్యం ఎంతోమంది పుడుతూ, గిడుతూ ఉంటారు. కానీ చనిపోయిన తర్వాత కూడా కొందరు ప్రజల మధ్య ఇంకా కీర్తి పొందుతూ, వారి తలంపుల్లో జీవిస్తూనే ఉంటారు. అలాంటి అరుదైన ప్రజా నాయకులలో...

ప్రజాసేవకు ప్రతిరూపం కోడెల

నిత్యం ఎంతోమంది పుడుతూ, గిడుతూ ఉంటారు. కానీ చనిపోయిన తర్వాత కూడా కొందరు ప్రజల మధ్య ఇంకా కీర్తి పొందుతూ, వారి తలంపుల్లో జీవిస్తూనే ఉంటారు. అలాంటి అరుదైన ప్రజా నాయకులలో ఒకరు, సేవా తత్పరతకు నిలువుటద్దంగా నిలిచిన ధీశాలి డాక్టర్ కోడెల శివప్రసాద్. పల్నాడు రాజకీయాలకు వన్నె తెచ్చిన నేత. రాజకీయాలను కేవలం అధికారం కోసమేగాక, అణగారిన వర్గాల అభ్యున్నతికి, ప్రజా సంక్షేమానికి ఒక వేదికగా మలచిన మహానేత.

గుంటూరు జిల్లా, నకరికల్లు మండలంలోని కండ్లగుంట గ్రామంలో 1947 మే 2న, ఓ సామాన్య వ్యవసాయ కుటుంబంలో కోడెల శివప్రసాద్‌ జన్మించారు. చిన్ననాడే ఎన్నో కష్టాలను చవిచూశారు. సరైన వైద్య సదుపాయాలు అందక కళ్లముందే తోబుట్టువులను, కన్నతల్లిని కోల్పోయిన విషాదం ఆయన బాల్యాన్ని వెంటాడింది. తాను అనుభవించిన ఆ బాధ మరే కుటుంబానికీ రాకూడదన్న పట్టుదలతోనే వైద్యవృత్తిని ఎంచుకున్నారు. డాక్టరుగా నరసరావుపేటలో ఆస్పత్రిని స్థాపించారు. అందరికీ వైద్యం అందిస్తూ ‘రూపాయి డాక్టర్‌’గా ప్రజల గుండెల్లో స్థానం సంపాదించారు. కేవలం వైద్యుడిగానే కాకుండా, ప్రజల కష్టాన్ని తన కష్టంగా భావించిన సేవామూర్తిగా ఎదిగారు.

ప్రజల కష్టాలను దగ్గరగా చూసిన కోడెల, కేవలం ఒక డాక్టర్‌గా మాత్రమే సమాజంలో మార్పు తీసుకురాలేమని గ్రహించారు. ఎన్టీఆర్ పిలుపునకు స్పందించి, ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీని బలోపేతం చేయడంలోనూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలోనూ ఆయన సేవలు ఎనలేనివి. కోడెల అంటే గుర్తొచ్చేది అభిమానం, ఆప్యాయత, అభివృద్ధి, అలుపెరగని పోరాటం. అందరినీ ఆప్యాయంగా పేరు పెట్టి పిలుస్తూ... సదా వారికి అందుబాటులో ఉంటూ తాను నమ్మిన నాయకుడి కోసం, తనను నమ్ముకున్న కార్యకర్తల కోసం, ప్రజల కోసం నిత్యం పరితపించిన ప్రజానాయకుడు కోడెల.


నేడు ఆయన వర్ధంతి సందర్భంగా.. తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి, ముఖ్యంగా పల్నాడు ప్రాంత సర్వతోముఖాభివృద్ధికి ఆయన చేసిన సేవలను స్మరించుకోవడం మన బాధ్యత. మూడున్నర దశాబ్దాల ఆయన సుదీర్ఘ రాజకీయ జీవితం– ఎన్నో సంక్షోభాలు, సవాళ్లు, పోరాటాలు, విజయాల సమ్మేళనం. 1983లో నరసరావుపేట నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అలనాటి అరాచకాలకు ఎదురు తిరిగి, పల్నాటి గడ్డపై అభివృద్ధికి బాటలు వేశారు. 1983 నుంచి 1999 వరకు వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై రికార్డు సృష్టించారు. 2014 లో ఆరోసారి సత్తెనపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల అభివృద్ధికి ఆయన చేసిన సేవలు అనన్యసామాన్యం.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హోం, ఇరిగేషన్, పంచాయతీరాజ్, సివిల్ సప్లైస్, వైద్య ఆరోగ్య శాఖలలో మంత్రిగా పనిచేసిన కోడెల.. తనకు చంద్రబాబు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు. ప్రభుత్వంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, కోడెల నిరంతరం ప్రజా సమస్యలపై గళమెత్తారు. కోటప్పకొండ పవిత్రతను కాపాడేందుకు, ఆలయ అభివృద్ధికి ఆయన చేసిన కృషి అనుపమానం. యువత కోసం విద్యా వాతావరణాన్ని కల్పించడంలో కీలకపాత్ర పోషించారు. పల్నాడు ప్రాంతంలో సాగు, తాగునీరు అందించే వివిధ ఎత్తిపోతల పథకాలు, తాగునీటి ప్రాజెక్టుల సాకారానికి కృషి చేశారు.

స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కన్వీనర్‌గా నరసరావుపేట, సత్తెనపల్లిలో స్వచ్ఛతా కార్యక్రమాలను రికార్డు స్థాయిలో నిర్వహించారు. సత్తెనపల్లిలో లక్ష మరుగుదొడ్లు నిర్మించి ‘లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌’లో స్థానం సంపాదించారు. శ్మశానవాటికల నిర్మాణాలు, స్వచ్ఛ భారత్ కార్యక్రమాలతో నియోజకవర్గాన్ని దేశానికి ఆదర్శంగా నిలిపారు. ఆడబిడ్డల ఆత్మగౌరవం కోసం రాష్ట్రంలోనే తొలిసారిగా డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి, దేశంలోనే తొలిసారిగా మహిళా పార్లమెంట్‌ను నిర్వహించిన ఘనత కోడెల శివప్రసాద్‌ది.

గ్రామీణ, పేద, వెనుకబడిన వర్గాల ప్రాంతాల్లో మౌలిక వసతులను మెరుగుపరచి సమగ్ర అభివృద్ధికి కోడెల ఆదర్శంగా నిలిచారు. ఒకేసారి యాభై వేల ఇంకుడు గుంతలు తవ్వించి రికార్డు సృష్టించారు. 2017 మే 2న నరసరావుపేటలో 11,987 మంది అవయవదాన పత్రాలు సమర్పించే కార్యక్రమాన్ని నిర్వహించి గిన్నిస్ బుక్‌ రికార్డు సాధించారు. అన్నగారి కల అయిన బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిని స్థాపించి, దానిని ఆసియాలోనే అత్యుత్తమ ఆస్పత్రిగా తీర్చిదిద్దడంలో కోడెల పాత్ర అమూల్యం. నిజాయితీకి నిలువెత్తు రూపమైన కోడెలపై 2019లో అధికారంలోకి వచ్చిన దుర్మార్గపు ప్రభుత్వం చేసిన తప్పుడు ఆరోపణలు, నిందలు ఆయనను మానసికంగా కుంగదీశాయి. ఈ అవమానాలను తట్టుకోలేక, పరువు కోసం ఆయన తన ప్రాణాలను త్యాగం చేయాల్సి వచ్చింది.


డాక్టర్ కోడెల శివప్రసాద్ ఆశయాలకు అనుగుణంగా వారి కుటుంబ సభ్యులు తిరుమల శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకాన్ని, శ్రీశైలం దేవస్థానంలో భక్తుల కోసం వసతిగృహాన్ని ప్రారంభించారు. ప్రజాశ్రేయస్సే ఊపిరిగా బతికిన ఆ మహానేత భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన చేసిన అభివృద్ధి పనులు తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే ఉంటాయి. నవ్యాంధ్ర తొలి శాసనసభాపతిగా నాకు ఆయనతో కలిసి పనిచేసే మహత్తరమైన అవకాశం దక్కడం నా అదృష్టంగా భావిస్తున్నాను. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గుండె ధైర్యంలో, ప్రజల అభిమానంలో, తాను చేసిన అభివృద్ధి పనుల్లో ఎప్పటికీ ఆయన సజీవంగానే ఉంటారు.

మహ్మద్‌ అహ్మద్‌ షరీఫ్‌

శాసనమండలి మాజీ చైర్మన్‌

(నేడు కోడెల శివప్రసాద్‌ వర్ధంతి)

ఈ వార్తలు కూడా చదవండి..

ఆళ్ల నాని మృతిని తొలుత గుర్తించింది ‘మ్యాక్సీ’నే: వాచ్‌మన్

మాట తప్పడం, మడమ తిప్పడమే సీఎం రేవంత్ రెడ్డి ట్రేడ్ మార్క్: కవిత

For More TG News And Telugu News

Updated Date - Sep 16 , 2026 | 02:22 AM