విజ్ఞానం, నాగరికత, కర్తవ్యం!
ABN , Publish Date - Apr 25 , 2026 | 03:25 AM
భారతీయ నాగరికతకు మాత్రమే ప్రత్యేకమైన అనేకానేక ప్రాచీన గ్రంథాలు... తాత్విక, వైదిక సంప్రదాయాలు, అసమానతలను ఎక్కడా ప్రస్ఫుటంగా పేర్కొనలేదు. మానవులంతా సామర్థ్యంలో సమానంగా పుడతారని...
భారతీయ నాగరికతకు మాత్రమే ప్రత్యేకమైన అనేకానేక ప్రాచీన గ్రంథాలు... తాత్విక, వైదిక సంప్రదాయాలు, అసమానతలను ఎక్కడా ప్రస్ఫుటంగా పేర్కొనలేదు. మానవులంతా సామర్థ్యంలో సమానంగా పుడతారని అవి ఘోషించాయి. జన్మించిన ప్రతి వ్యక్తినీ, ‘జన్మతో శూద్రుడు’ అనే వర్ణిస్తాయి అవన్నీ. అభ్యాసం, నియమశీలత, ధర్మాచరణ, సత్యావగాహన ద్వారా మాత్రమే ఎవరైనా ‘బ్రాహ్మణ స్థితి’ని సాధిస్తారు. పరమ సత్యాన్ని, జ్ఞానాన్ని, విశ్వ సూత్రాన్ని సూచిస్తుంది బ్రాహ్మణ్. వేదాలు, ఉపనిషత్తులు, ఇతర సంబంధిత గ్రంథాల ద్వారా జ్ఞానాన్ని అభ్యసించి, అధ్యయనం చేసి, సంరక్షించి, ప్రచారం చేసి, విజ్ఞానాన్ని ఆబాలగోపాలానికి పంచినవారిని ‘బ్రాహ్మణులు’ అని సమాజం గుర్తించింది. వారి కర్తవ్యాలలో అభ్యాసం, బోధన, యజ్ఞాలు, కర్మకాండలు నిర్వహించడం; సమాజానికి నైతిక మార్గదర్శకత్వం ఇవ్వడం; జ్ఞాన పరంపరను కొనసాగించడం ఉన్నాయి. ‘స్వచ్ఛంద దారిద్ర్యం’ అనే మహత్తర, మానవీయ సిద్ధాంతాన్ని త్రికరణశుద్ధిగా ఆచరించడం కూడా బ్రాహ్మణులకు ప్రధానం. వైదిక తాత్త్విక గ్రంథాలలో వివరించిన విధంగా, మహర్షులు ఆచరించినట్లుగా, బ్రాహ్మణ జీవనయానానికి నిస్వార్థం ప్రధాన లక్షణం. బ్రాహ్మణుడు తపస్సు, నియమశీలత, సరళమైన జీవితం గడుపుతాడు. ఇవన్నీ ఆచరించడానికి ప్రాచీన సమాజం మాదిరిగానే, ఆధునిక సమాజం తోడ్పాటు అత్యంత అవశ్యం. వారి విధానాలను గౌరవించాలి.
మహర్షి అగస్త్యుడు అనేక సంవత్సరాల తపస్సుతో సంపాదించిన తన సంపూర్ణ తపోశక్తిని రాజ్యంలో కరువు నివారణ కోసం త్యాగం చేసిన బ్రాహ్మణుడు. తన కుమార్తె వివాహం కోసం నిధులను సమకూర్చుకోవడానికి భిక్షాటన చేశాడు. రాజు తనకు ఇస్తానన్న సంపదను వాగ్గేయకారుడు త్యాగరాజు సున్నితంగా తిరస్కరించాడు. సమాజానికి సేవచేసిన ఎందరో బ్రాహ్మణులు ప్రతిఫలాపేక్ష లేకుండా ఈ సిద్ధాంతాన్ని కఠినంగా ఆచరించారు. బ్రాహ్మణులు ‘స్వచ్ఛంద దారిద్ర్యం’ అనే ఆదర్శాన్ని యుగయుగాలుగా నిబద్ధతతో పాటిస్తూవచ్చారు.
బ్రాహ్మణుల కృషి ఆధ్యాత్మిక, మేధో, సాంస్కృతిక, రాజకీయ రంగాలన్నింటినీ ఆవరించిన మాట వాస్తవమే. కానీ వారు ఎన్నడూ ‘ఆక్రమించుకోలేదు.’ పరిమిత ఆలోచనతో మాట్లాడేవారికి, బ్రాహ్మణులు కర్మకాండల నిర్వహణతో సహా, సంస్కరణ, అభివృద్ధి, సామాజిక పరిరక్షణకు ప్రేరకశక్తులుగా నిలుస్తూ వస్తున్న విషయం, మహోన్నత భారతీయ తాత్విక, సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుతూ వస్తున్న విషయం అవగాహనలో లేదు. విదేశీ దండయాత్రలు, పాలన సాగినా, భారతదేశ నాగరిక స్వరూపం నిలదొక్కుకుంది. కీలక గ్రంథాలను, సంప్రదాయాలను, విలువలను కాపాడిన వారిలో గణనీయంగా బ్రాహ్మణులు కూడా ఉన్నారనేది వాస్తవం.
బ్రాహ్మణుడు జ్ఞానాన్ని ఎప్పుడూ వ్యాపారంగా భావన చేసి అమ్మడు. బ్రాహ్మణుడికి బోధన వృత్తి కాదు, ఒక కర్తవ్యం. కర్మకాండల నిర్వహణ జ్ఞానశక్తి ప్రదర్శన కాదు, సమాజ ఆధ్యాత్మిక కొనసాగింపునకు, పునరుద్ధరణకు చేసే పవిత్ర కార్యం. చారిత్రకంగా బ్రాహ్మణులు సాధారణ జీవితం గడిపి, మేధోపరమైన ఆధ్యాత్మిక సాధనలకు అంకితమయ్యారు. అద్వైత వేదాంత సిద్ధాంతాన్ని ఏకీకృతం చేసిన భారతీయ బ్రాహ్మణ తత్వవేత్త, వేదాంతవేత్త ఆదిశంకరాచార్యుడు. సమతా దిశలో మహత్వపూర్ణమైన కార్యక్రమాలు నిర్వహించిన రామానుజాచార్యుడు సమాజంలోని అన్ని వర్గాలకు ఆధ్యాత్మిక సాధన ద్వారాలను తెరిచారు. ఇదే విధంగా మరొక బ్రాహ్మణుడు, ద్వైత తత్వవేత్త మధ్వాచార్యుడు కూడా తన వంతు కృషి చేశారు.
ఆధునిక యుగంలో కందుకూరి వీరేశలింగం తొలితరం సాంఘిక సంస్కర్తలలో ఒకరు. మహిళల విద్యను, వితంతు పునర్వివాహాన్ని ప్రోత్సహించారు. బాల్య వివాహాలకు, వరకట్న వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడారు. చూపు లోపం ఉన్నప్పటికీ, చిలకమర్తి లక్ష్మీనరసింహం సామాజిక సంస్కరణకు కొత్త దిశను చూపి, సమానత్వానికి కట్టుబడి నిలిచారు. గురజాడతో కలిసి, మధ్యయుగ ఆచారవాదాన్ని, సామాజిక దోషాలను, మూఢనమ్మకాలను, లింగ అసమానతను, అంటరానితనాన్ని, దళిత విద్యా వెనుకబాటుతనాన్ని వ్యతిరేకిస్తూ పునరుజ్జీవనానికి పునాది వేశారు. గిడుగు రామమూర్తి సాహిత్యం ద్వారా సంస్కరణకు కృషి చేసిన మరొక ప్రముఖుడు. వీరంతా సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబాల్లో జన్మించి, తొలితరం సామాజిక సంస్కర్తలుగా ప్రసిద్ధికెక్కారు. అక్కిరాజు హరగోపాల్ (రామకృష్ణ లేదా ఆర్‌కే) బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి, ఉపాధ్యాయ వృత్తిని విడిచిపెట్టి, మావోయిస్టు ఉద్యమానికి జీవితాంతం నాయకత్వం వహించారు. సామాజిక అవసరాలకు అనుగుణంగా మారడం బ్రాహ్మణుల ప్రత్యేకత.
జన్మ ఆధారంగా బ్రాహ్మణత్వం నిర్ణయమవుతుందనే భావనను ఖండించే ఉదాహరణలు అనేకం ఉన్నాయి. క్షత్రియుడిగా జన్మించిన ఋషి విశ్వామిత్రుడు తీవ్రమైన తపస్సు, ఆత్మసాక్షాత్కారం ద్వారా బ్రహ్మర్షి స్థాయిని సాధించాడు. బ్రాహ్మణేతర నేపథ్యం నుంచి వచ్చిన మహర్షి, బ్రహ్మర్షి వాల్మీకి రామాయణ మహాకావ్యాన్ని రచించాడు. వారి జీవితాలు అధ్యయనం చేస్తే, బ్రాహ్మణత్వం వారసత్వంగా, జన్మతః లభించేది మాత్రమే కాదని, అది సాధన ద్వారా పొందేదన్నది స్పష్టమవుతుంది.
‘సూతుడు శౌనకాది మహామునులకు..’ అని చెప్పే బ్రాహ్మణుల మాటలు వినని ఆస్తిక, నాస్తిక మహాశయులు బహుకొద్దిమందే! మహా పూజ్యనీయుడైన సూత మహర్షి వ్యక్తిత్వం తరతరాలుగా, యుగయుగాలుగా, అజరామరంగా భాసిల్లుతున్నది. బ్రాహ్మణుడిగా జన్మించకపోయినా, బ్రాహ్మణుడిగా మారకపోయినా, ‘అష్టాదశ పురాణ విజ్ఞానానికి’ పటిష్ఠమైన మూలాధారంగా నిలిచారు. ఆయన ద్వారా జ్ఞాన సముపార్జన చేసినవారిలో మహర్షులు, జన్మతః బ్రాహ్మణులు ఉన్నారు. ఈ ఉదాహరణలు ఒక అఖండమైన నాగరిక సూత్రాన్ని స్పష్టం చేస్తున్నాయి. సమాజ సేవ కోసం జ్ఞానాన్ని సంపాదించి, ఆ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టి, దానిని ఇతరులకు పంచిన వారిని ఆదికాలం నుంచి బ్రాహ్మణులుగా గౌరవించారు. ఇది ఒక వర్గానికి చెందిన ప్రత్యేక హక్కు కాదు. ఇది ఒక ఉన్నత సాధన మార్గం. బ్రాహ్మణత్వం అనేది అధికారం కాదు, ఆత్మాన్వేషణ. అది వారసత్వం కాదు, ఆచరణ. అది పేరులో కాదు.. పరమార్థంలో ఉంది.
వనం జ్వాలానరసింహారావు
ఈ వార్తలు కూడా చదవండి...
ఆ వీడియోలతో బ్లాక్ మెయిల్.. హనీట్రాప్ ముఠా సంచలనం
శబరిమల కేసు విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
బాలికల కాలేజీలో కోఎడ్యుకేషన్ ఏర్పాటుపై హైకోర్టు అసంతృప్తి
Read Latest AP News And Telangana News And International News