Share News

జైత్రయాత్రా? ఆత్మ వంచ‌న‌ యాత్రా?

ABN , Publish Date - Apr 28 , 2026 | 12:52 AM

నిజాం నిరంకుశ పాల‌న నుంచి తెలంగాణ‌కు 1948లోనే స్వాతంత్య్రం ల‌భించింది. అయినా 1970వ ద‌శ‌కం వ‌ర‌కూ తెలంగాణ ప‌ల్లెల్లో దొర‌ల పెత్త‌నం సాగేది. జగిత్యాల ప్రాంతంలో ఇది మ‌రీ ఎక్కువ‌. పేద‌ల‌ను, రైతు...

జైత్రయాత్రా? ఆత్మ వంచ‌న‌ యాత్రా?

నిజాం నిరంకుశ పాల‌న నుంచి తెలంగాణ‌కు 1948లోనే స్వాతంత్య్రం ల‌భించింది. అయినా 1970వ ద‌శ‌కం వ‌ర‌కూ తెలంగాణ ప‌ల్లెల్లో దొర‌ల పెత్త‌నం సాగేది. జగిత్యాల ప్రాంతంలో ఇది మ‌రీ ఎక్కువ‌. పేద‌ల‌ను, రైతు కూలీల‌ను, శ్రామిక కులాల ప్ర‌జ‌ల‌ను దొర‌లు ప‌ట్టిపీడించేవారు. వారిచేత వెట్టి చాకిరీ చేయించుకునేవారు. దొర‌ల ఇళ్లే అన‌ధికార పోలీస్ స్టేష‌న్లు, న్యాయ‌స్థానాలు. దొర‌లు ఇచ్చిందే జీతం. పంచాయితీల పేరు మీద అడ్డ‌గోలుగా జ‌రిమానాలు విధించి శ్రామిక కులాల ప్ర‌జ‌ల‌ను పీల్చిపిప్పి చేసేవారు.. ఈ దురాగ‌తాలకు వ్య‌తిరేకంగా సీపీఐ (ఎం.ఎల్‌) కొండ‌ప‌ల్లి సీతారామ‌య్య వ‌ర్గం జ‌గిత్యాల‌లో గొప్ప ప్ర‌జా ప్ర‌ద‌ర్శ‌న నిర్వ‌హించింది. అదే జ‌గిత్యాల జైత్ర‌యాత్ర‌. ఇప్పుడు మావోయిస్టు అగ్రనేత‌గా ఉన్న గ‌ణ‌ప‌తితో పాటు పీపుల్స్‌వార్‌, మావోయిస్టు పార్టీల్లో అగ్రనేత‌లుగా ప‌నిచేసిన వారంతా నాటి జైత్ర‌యాత్ర‌లో సామాన్యులుగా, కార్య‌క‌ర్త‌లుగా పాల్గొన్నారు. ఎం.ఎల్‌ పార్టీలోని ఈ గ్రూపే త‌ర్వాత పీపుల్స్‌వార్‌గా, మావోయిస్టు పార్టీగా రూపాంత‌రం చెందింది. జ‌గిత్యాల జైత్ర‌యాత్ర త‌ర్వాత దొర‌లు గ‌డీలు వ‌దిలి పారిపోయారు. కొంద‌రిని న‌క్స‌ల్స్ హ‌త‌మార్చారు. ఆ త‌ర్వాతే అక్క‌డ ప్ర‌జ‌లు ప్ర‌శాంతంగా జీవించారు. అది జగిత్యాల జైత్ర‌యాత్ర క‌థ‌.

ప‌దేళ్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేసిన కేసీఆర్ త‌న హ‌యాంలో పాతకాలం దొర‌ల‌నే త‌ల‌పించారు. త‌న నివాసానికి కోట లాంటి ప్ర‌గ‌తి భ‌వ‌న్ క‌ట్టుకున్నారు. దాని ద‌గ్గ‌ర‌కు సామాన్యులే కాదు, ఉద్య‌మ నేప‌థ్యం ఉన్న ఈట‌ల రాజేంద‌ర్ లాంటి మంత్రి, ప్ర‌జా యుద్ధనౌక గ‌ద్ద‌ర్ లాంటి వారూ వెళ్ల‌లేక‌పోయారు. దొర బిడ్డ‌, కొడుకు, అల్లుడు, స‌డ్డ‌కుని కొడుకు... వీరి పెత్త‌నం, దోపిడీ, అహంకారం, అవినీతితో ప్ర‌జ‌లు విసిగిపోయారు. రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్య‌క్షుడు అయిన త‌ర్వాత కేసీఆర్ కుటుంబ అవినీతిపై, అహంకారంపై పోరాటాలు చేశారు. ఫ‌లితంగా, తర్వాతి ఎన్నికల అనంతరం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్ప‌డింది. ప్ర‌జా పాలన మొదలైంది. స‌న్న బియ్యం పంపిణీతో ప్ర‌తి పేద కుటుంబం పెద్ద కుటుంబాలు తినే స‌న్న బియ్యంతోనే భోజ‌నం చేస్తున్నది. ఉచిత బ‌స్సు ప్ర‌యాణంతో ఆడ‌బిడ్డ‌లు సంతోషంగా ఉన్నారు. 200 యూనిట్ల‌లోపు ఉచిత విద్యుత్‌తో ప‌ల్లెల్లో 80శాతం ఇళ్ల‌కు కరెంటు బిల్లులు రావ‌డం లేదు. ఇందిర‌మ్మ ఇళ్ల‌తో పేద‌వాళ్ల క‌ళ్ల‌లో వెలుగు క‌నిపిస్తోంది. సుమారు 10–12 ఏళ్ల త‌ర్వాత ప్ర‌తి ప‌ల్లెలో పేద‌ల ఇళ్ల నిర్మాణం జోరుగా సాగుతోంది. బీఆర్ఎస్ ప‌దేళ్ల కాలంలో రైతు రుణ‌మాఫీ చేయ‌లేదు. కానీ అధికారంలోకి వ‌చ్చిన ఏడాదిలోపే ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్ర‌జా ప్ర‌భుత్వం 25 ల‌క్ష‌ల రైతు కుటుంబాల‌కు చెందిన సుమారు రూ.21 వేల కోట్ల రుణాల‌ను మాఫీ చేసింది. అన్న‌దాత‌ల కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపింది. స‌న్న వ‌డ్ల‌కు క్వింటాల్‌కు రూ.500 బోన‌స్‌ను ప్ర‌జా ప్ర‌భుత్వం అందజేస్తోంది.


ఈ సంక్షేమ ప‌థ‌కాల‌ను కొన‌సాగిస్తూనే తెలంగాణ స‌మ‌గ్రాభివృద్ధికి తెలంగాణ విజ‌న్ రైజింగ్–2047కు రూప‌క‌ల్ప‌న చేసింది. ఇందులో భాగంగా అవుట‌ర్ రింగు రోడ్డు ప‌రిధిలోని కోర్ న‌గ‌రం అభివృద్ధికి CURE (కోర్‌ అర్బన్‌ రీజియన్‌ ఎకానమీ), ఓఆర్ఆర్‌– ఆర్ఆర్ఆర్‌ల మ‌ధ్య భాగాన్ని PURE (పెరీ అర్బన్‌ రీజియన్‌ ఎకానమీ), ఆర్ఆర్ఆర్ వెలుప‌ల భాగాన్ని RARE (రూరల్‌ అగ్రికల్చరల్‌ రీజియన్‌ ఎకానమీ)గా గుర్తించి వ‌రుస‌గా సేవ‌లు, ఉత్ప‌త్తి, వ్య‌వ‌సాయ రంగాల అభివృద్ధికి రాష్ట్ర ప్ర‌భుత్వం శ్రీ‌కారం చుట్టింది. నెట్ జీరో సిటీగా ఫ్యూచ‌ర్ సిటీని నిర్మిస్తోంది. ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న పారిశ్రామిక సానుకూల విధానాల‌తో రూ.ల‌క్ష‌ల కోట్ల పెట్టుబడులు కార్యరూపం దాల్చుతున్నాయి. హైద‌రాబాద్ జీసీసీ హ‌బ్‌గా నిలుస్తోంది. బీఆర్ఎస్ ప‌దేళ్ల కాలంలో ఏ ఒక్క‌రూ నోరెత్తే ప‌నిలేదు. జ‌ర్న‌లిస్టులకు సైతం స‌చివాలయ‌ంలోకి ప్ర‌వేశం లేదు. ఏ పార్టీకీ, సంఘానికీ నిర‌స‌న తెలియ‌జేసే హ‌క్కు లేదు. అస‌లు ధ‌ర్నాచౌకే లేదు. అంత‌టా నిరంకుశత్వం, గాఢ‌మైన అంధ‌కారం!‌

ప్ర‌జా ప్ర‌భుత్వంలో ఓ వైపు అభివృద్ధి, మ‌రో వైపు సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు, అన్నింటికీ మించి పూర్తి ప్ర‌జాస్వామిక వాతావ‌ర‌ణం... ఇవేవీ కేసీఆర్‌కు న‌చ్చ‌డం లేదు. అందుకే ప్ర‌తిప‌క్షంలోకి వ‌చ్చిన తొలి రోజు నుంచే ప్ర‌జా ప్ర‌భుత్వంపైనా, ముఖ్యంగా ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డిపైనా త‌న కుటుంబం, అనుచ‌ర‌గ‌ణం, రూ.కోట్లు ఖ‌ర్చు చేసి పెంచిపోషిస్తున్న సోష‌ల్ మీడియాతో విషం క‌క్కిస్తున్నారు. ఒక సామాన్యుడు, రైతుబిడ్డ ముఖ్య‌మంత్రి కావ‌డం, ఒక ద‌ళితుడు శాస‌న స‌భాప‌తి కావ‌డం దొర జీర్ణించుకోలేక‌పోయారు. అందుకే శాస‌న‌స‌భ స‌మా వేశాలకు హాజ‌రు కావ‌డం లేదు. అదే స‌మ‌యంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత హోదాలో వ‌చ్చే అన్ని సౌక‌ర్యాల‌ను అనుభ‌విస్తున్నారు. కేసీఆర్‌ అధికారంలో ఉన్న‌ప్పుడు ఢిల్లీకి వెళితే కేంద్ర మంత్రుల‌ను సైతం క‌లిసేవాడు కాదు. అయితే ప్ర‌ధాన‌మంత్రి లేదా కేంద్ర హోం మంత్రిని మాత్ర‌మే క‌లిసేవారు. ప్ర‌ధాన‌మంత్రి రాష్ట్రానికి వ‌చ్చినా, కేసీఆర్‌ మాత్రం తన గ‌డీ దాటి బ‌య‌ట‌కు వ‌చ్చేవాడు కాదు. అంత అహంకారం దొర‌ది. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవ‌డం, పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో గుండు సున్నా ద‌క్క‌డం, కొడుకు, అల్లుడు, సడ్డ‌కుని కొడుకు పెత్త‌నంతో బిడ్డ కుటుంబాన్నీ, పార్టీనీ వ‌దిలి సొంత కుంప‌టి పెట్టుకోవ‌డం కేసీఆర్ అహాన్ని మ‌రింత దెబ్బ‌తీసింది. దీంతో ఆయన మాన‌సిక స్థైర్యాన్ని కోల్పోయారు.


శాస‌న‌స‌భ‌, పార్ల‌మెంట్ ఎన్నిక‌లు, రెండు శాస‌న‌స‌భ స్థానాల ఉప ఎన్నిక‌ల్లో ఓట‌మి, స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో ప‌రాభవం... ఇలా ఎటూ చూసినా ఆశ మ‌చ్చుకైనా క‌నిపించ‌డం లేదు. ఇప్పుడు దొర‌త‌నం లేదు, పైస‌లు ఇచ్చి చేయించుకునే భ‌జ‌న మాత్రమే మిగిలింది. అన్ని ఆశ‌లూ అణ‌గారిపోవ‌డంతో ఒక‌ప్పుడు ప్ర‌ధాన‌మంత్రికి సైతం స్వాగ‌తం ప‌ల‌క‌ని పెద్ద మ‌నిషి... వ‌రుస ఓట‌ముల‌తో ప్ర‌జ‌ల‌కు దూర‌మైన ఓ వృద్ధ నేత చేరిక‌కు మాత్రం స్వ‌యంగా జగిత్యాల‌కు వెళ్లారు. దానిని జ‌గిత్యాల జైత్ర‌యాత్ర ఎలా అంటాం? అది సొంత పార్టీ ఉనికిని చాటుకునేందుకు చేసిన మోకాళ్ల యాత్ర‌. రెండు వ‌రుస శాస‌న‌స‌భ ఎన్నిక‌ల్లో, ఒక లోక్‌స‌భ ఎన్నిక‌లో ప్ర‌జ‌ల తిర‌స్కారానికి గురైన వృద్ధ నేత చేరిక‌తో మూడు జిల్లాల్లో త‌మ పార్టీకి మేలు జ‌రుగుతుందంటూ దిగ‌జారుడు ప్ర‌క‌ట‌న‌ల‌కు వేదికైన ఆత్మవంచ‌న యాత్ర‌ ఇది.

కేసీఆర్ ఆత్మ వంచ‌న యాత్ర‌నే జ‌గిత్యాల జైత్ర‌యాత్ర 2.0 అంటూ నెల రోజులుగా బీఆర్ఎస్ నాయ‌కులు, వంత మీడియా హోరెత్తించాయి. స‌భ ముగిసిన త‌ర్వాత దొర ఆస్థాన ప‌త్రిక‌లో జైత్ర‌యాత్ర పేరుతో సంపాద‌కీయం రాసుకున్నారు. మాజీ మావోయిస్టుల‌మ‌ని చెప్పుకునేవారు, ప్ర‌గతిశీల వాదుల‌మ‌ని ఫోజులు కొట్టే ముసుగు మేధావులు, నెల‌వారీ జీతాల‌తో రెచ్చిపోయే సోష‌ల్ మీడియా బానిస రాతగాళ్లు, కేసీఆర్ జ‌గిత్యాల నుంచి జైత్ర‌యాత్ర ప్రారంభించార‌ని... ఇక భూకంపం సృష్టిస్తామ‌ని ప్ర‌క‌ట‌న‌లు గుప్పిస్తున్నారు.

ఈ త‌రానికి జ‌గిత్యాల జైత్ర‌యాత్ర అంటే ఏమిటో తెలియ‌దు. జ‌గిత్యాల జైత్ర‌యాత్ర నాటికి 20–25 ఏళ్ల వ‌య‌సున్న వారంతా ఇప్ప‌డు 70 ఏళ్ల‌ పైబ‌డినవారే. దీంతో జైత్ర‌యాత్ర పేరుతో ఇప్పుడు బీఆర్ఎస్ నేత‌లు ఊద‌ర‌గొడుతున్నారు. ఇక‌నైనా బీఆర్ఎస్ నేత‌లు, వారి ఆస్థాన మీడియా, బానిస సోష‌ల్ మీడియా రాత‌గాళ్లు త‌మ నాయ‌కునిది జైత్ర‌యాత్ర కాదు, ఆత్మ‌వంచ‌న యాత్ర‌ అని గుర్తించాలి.

ఆది శ్రీ‌నివాస్‌

రాష్ట్ర ప్ర‌భుత్వ విప్‌

ఈ వార్తలు కూడా చదవండి..

తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఒక్కరూ అడ్డుకోలేదు: కేసీఆర్

కవిత కొత్త పొలిటికల్ పార్టీని ఎందుకు పెట్టారో చెప్పండి కేటీఆర్: ఎమ్మెల్యే సామేల్

For More AP News And Telugu News

Updated Date - Apr 28 , 2026 | 12:52 AM