ఎద్దడి
ABN , Publish Date - Feb 23 , 2026 | 05:49 AM
గయ్యాళి గగనం నోరు సగమైనా తెరవలేదు వెండిపూత కంచు మేఘాలు ఒకటే లొడలొడ! పల్లంరాయి మీద వరదపాశం పారనేలేదు...
గయ్యాళి గగనం
నోరు సగమైనా తెరవలేదు
వెండిపూత కంచు మేఘాలు
ఒకటే లొడలొడ!
పల్లంరాయి మీద
వరదపాశం పారనేలేదు
ఎండిన చెరువు గుమ్మిల్లో
కప్పల బెకబెక!
ఊళ పెట్టే గాలి ఉడుకు
చల్లబడనేలేదు
చిగురాశల కొమ్మ చివర
మొగ్గ కలల రద్దీ!
చెరువు గర్భంలో
పగుళ్ల మధ్య పదునే లేదు
దప్పికతో మోరసాచి
మోకాళ్ళొంచింది జింక!
పాదాలకు బెడ్డమట్టి
బంకయినా అంటలేదు
ఏసంగి ఏనుగు కాళ్ళు కరిచి
మొగులు మొసలి వీరంగం!
పిత్తపరిగ మొప్ప తడిపే
దిక్కయినా లేదు
ఎండ ఎద్దు అడుగుల్లో
ఏడేసి సవడలున్నట్టు ప్రచారం!
చినుకు లేదు చిగురు లేదు
ఎప్పటిలాగే
యముడి దున్నపోతు
కొమ్ము చిగూరునే
పొద్దెక్కింది మళ్ళీ!
కంచరాన భుజంగరావు
94415 89602
ఈ వార్తలు కూడా చదవండి..
తపాలాశాఖ సేవలను మరువలేం: సీఎం చంద్రబాబు
శ్రీవారి లడ్డూలో నెయ్యికి బదులు రసాయనాలు కలిపారు.. జగన్‌పై మంత్రి నిమ్మల ధ్వజం..
Read Latest Telangana News And AP News And Telugu News