కాలాన్ని దాటిన కలం
ABN , Publish Date - Aug 16 , 2026 | 12:37 AM
అక్షరాల అర్థాలు, అంతరార్థాలు నిఘంటువుల్లో ఉండవు. ఉపాసనలో, ఔపోసనలో ఉంటాయి. వేటూరి సుందరరామమూర్తి తెలుగు భాష పూర్వోత్తరాలను ఔపోసన పట్టిన అక్షరోపాసకులు. కావేరీ తీరాన సంగీతం, గోదారి తీరాన...
అక్షరాల అర్థాలు, అంతరార్థాలు నిఘంటువుల్లో ఉండవు. ఉపాసనలో, ఔపోసనలో ఉంటాయి. వేటూరి సుందరరామమూర్తి తెలుగు భాష పూర్వోత్తరాలను ఔపోసన పట్టిన అక్షరోపాసకులు. కావేరీ తీరాన సంగీతం, గోదారి తీరాన సాహిత్యం ఉంటాయని నానుడి. సంగీతం–సాహిత్యం కలగలిసిన కృష్ణా తీరాన శబ్దోపాసకుల కుటుంబంలో జన్మించిన వేటూరి, భావ సంపద, భాషా పాటవం కలగలిసిన తన సంగీత–సాహిత్య ప్రతిభా వరదల్లో ప్రేక్షకుల హృదయాలను ముంచెత్తారు. ‘‘అలలు కదిలినా పాటే, ఆకు మెదిలినా పాటే... కలలు చెదిరినా పాటే, కలత చెందినా పాటే... ఏ పాట నే పాడను, బ్రతుకే పాటైన పసివాడను’’ అంటూనే పాటల రచనలో పుంభావ సరస్వతిగా విశ్వరూపం ప్రదర్శించారు. పాట నిర్మాణ వేగాన్ని, ఆలాపన రాగాన్ని, శ్రోతల యోగాన్ని, దర్శకనిర్మాతల భోగాన్ని ఉమ్మడిగా మూడున్నర దశాబ్దాల పాటు ఓలలాడించారు.
పాటలు ఎవరైనా రాయవచ్చు, కానీ అవి ఎవరిపై చిత్రీకరిస్తున్నారు అనేది చాలా ముఖ్యమని వేటూరి వాదన. ఆయన వామనావతారం ఎత్తి తెలుగుపాటను అటు ఆకాశం దాటించారు, ఇటు పాతాళం లోతుల్లోకి చొప్పించారు. క్లాసికులు, మాసికులు, రసికులు.. అందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిపారు. సినిమా వంటి వాణిజ్య ప్రాధాన్య రంగంలోకి వచ్చాక స్వీయ అభిప్రాయాలకు తిలోదకాలు ఇవ్వాల్సిన అవసరం లేదంటూ ఆత్మాభిమానం నిలబెట్టుకుంటూనే అద్భుత పాటలు సృష్టించవచ్చునని వేటూరి నిరూపించారు. పాట రాసినవాడికి, చేసినవాడికి, పాడినవాడికి, వినేవాడికి ఆత్మసంతృప్తి కలగాలి. అందరికీ మనశ్శాంతి కలగాలి. మంచి పాట వింటే రోగాలు నయం కావాలనే సదాశయానికి ఆయనకన్నా ఎత్తుపీట వేసినవారు లేరు.
మల్లాది రామకృష్ణశాస్త్రి, పింగళి నాగేంద్రరావు, ఆచార్య ఆత్రేయ తనకు గురువులని ప్రకటించుకున్న నిగర్వి వేటూరి. 32 కలం పేర్లతో రచనలు చేసిన ఆయన పలు ప్రైవేట్ ఆల్బమ్‌లకు సైతం నిర్మాతగా వ్యవహరించారు. కేవలం సాహితీవేత్తగానే గాక సంగీతంపై కూడా మంచి పట్టు కలిగిన బహుముఖప్రజ్ఞాశాలి. ‘వేయిపడగల’ విశ్వనాథ నీడలో శిష్యరికం చేసిన వేటూరికి అప్పుడెప్పుడో 1993లో ‘మాతృదేవోభవ’లో గీతానికి ఒక జాతీయ పురస్కారం ఇచ్చారు. పద్మాలు, భూషణాలు, రత్నాల జాడే లేదు. తెలుగు సినీపాటకు కావ్యగౌరవమే కాదు, నంది గౌరవానికి నాంది కూడా వేటూరే. 1977లో ‘పంతులమ్మ’ చిత్రంలోని మానసవీణా మధుగీతం పాటకు వేటూరి అందుకున్న నంది మొదటిది. ప్రభుత్వం సినీపాటకు నంది ఇవ్వడం కూడా అదే మొదటిది. అయినా ఆయన రాసిన వేల కొలది అద్భుతమైన పాటలకు మరో జాతీయ పురస్కారం రాకపోవడానికి అడ్డంకులు ఏమిటి? కారణాలు ఏమిటి? ఆయన రాసిన పాటలకు అర్హత లేదా? లేక విశ్వనాథ, పింగళి, మల్లాది, ఆత్రేయలా గురుతుల్యులు కాదా? అవార్డులే ప్రతిభకు కొలమానమైతే ఆ అవార్డులు వేటూరి కలాన్ని చూసి చిందరవ్వాలి. అవి చేరలేని తీరం వేటూరి.
పునరుక్తిదోషం పట్టని ఆయన పాటలపై పరిశోధనలు చేసి పీహెచ్‌డీలు సంపాదించారంటే వ్యాసపీఠంపై ఆయన అధిరోహణ ఏ స్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చు. అందుకే వేటూరిని ఆప్యాయంగా అందరూ గురువుగారు అనేది. ఆయన కింగ్ మేకర్. రాక రాక తనకు వచ్చిన ఆ ఒక్క జాతీయ అవార్డుకు కూడా 2006లో దడపుట్టించారాయన! తెలుగుకు ప్రాచీన హోదా ఇవ్వకపోతే జాతీయ పురస్కారాన్ని త్యజించడానికి సైతం వెనుకాడని ఆత్మాభిమానుడు మన వేటూరి సుందరరామమూర్తి.
ఉత్తమ గురువు ప్రశ్నించాలి. ప్రతిభావంతుడైన శిష్యుడు ఆ ప్రశ్నలకు దీటైన సమాధానం ఇవ్వాలి. అందుకే ‘జీవనతరంగాల్లో’ ఆత్రేయ ప్రశ్న ‘‘నవమాసాలు మోసేదొకరు, నీతో కలిసి నడిచేదొకరు, కాటికి నిన్ను మోసేదొకరు, ఆపై నీతో నడిచేదెవ్వరు’’కు ఆయన శిష్యుడైన వేటూరి అదే స్థాయిలో తిరుగుటపా పంపుతూ ‘‘నాటకాల జగతిలో జాతకాల జావళి కాలుతున్న కట్టేరా చచ్చేనాడు నీ చెలీ’’ అన్నారు. దేవుడి గురించి అన్నమయ్య చెప్పారు. మరి అన్నమయ్య గురించి ఎవరు చెప్తారు? ‘‘తెలుగు పదానికి జన్మదినం, ఇది జానపదానికి జ్ఞానపథం’’ అంటూ వేటూరి కలమే సమాధానం చెప్పింది.
అర్థం కావడం వేరు. అనుభూతికి రావడం వేరు. రెండింటికీ మధ్య అక్షరం అనే ఆయుధం ఉన్నప్పుడే అది సాధ్యపడుతుంది. మేధస్సు కృత్రిమం అయిపోయి, మానవత్వం మరుగునపడిపోయి, మనిషి–మనస్సు–మమతానురాగాలు మాయమైపోయి, మాట మౌనమైపోయి రేపటి మీద దిగులుతో నేటి ఇరుసందెల నడుమ గుబులు మొదలైనప్పుడు బదులుగా వినపడే ఓంకారనాదం.. వేటూరి పాట. అనుభూతిని అర్థానికి దగ్గర చేసే అక్షరాలు మూట. తెలుగు అక్షరమాల, వ్యాకరణం, కనీస మౌలిక సూత్రాలు ఒంటబట్టని నా లాంటి ఆంగ్ల మాధ్యమ ఉత్పత్తులైన వారెందరికో తెలుగు భాష పట్ల జిజ్ఞాస జ్వలింపజేసిన వేటూరి మనం జీవితంలో ఏమి సాధించామనే అనుమానం వచ్చినప్పుడల్లా ‘‘ప్రాప్తమనుకో ఈ క్షణమే బ్రతుకు లాగా... పండెననుకో ఈ బ్రతుకే మనసు తీరా’’ అని సాంత్వన ఇస్తూనే ‘‘కోరుకున్నవన్నీ చేరువైనా దూరమైనా ఆనందమేగా మహదానందమేగా పరమానందమేగా’’ అంటూ జీవనవేదాన్ని అందించారు. ఖండాలు దాటి ప్రవాసం వెళ్లిన వారందరికీ నల్లనివన్నీ నీళ్లని తెల్లనివన్నీ పాలని అనుకోవద్దంటూ, సూర్యుడల్లే సూదిగుచ్చి సుప్రభాతంలా వినపడుతోన్న వేటూరి పాట నేడు పుస్తకాల రూపంలో పట్టు పరికిణి కట్టుకుని అమెరికాలో తకిట తథిమి తకిట తథిమి తందానా ఆడటానికి సిద్ధమైన సందర్భంగా హర్షాతిరేకాలు మిన్నంటుతున్నాయి.
ఆయనలా రాయాలనుకునే కవికుల ఆలోచనకు నాయకుడు, ఆ ఆలోచన సృష్టించే కవిదళ అక్షరానికి చోదకుడు – సుందరరాముడు. అందుకే ఆయన కవి కుల దళాధిపతి – కవి దళ కులాధిపతి. కాలాన్ని దాటిన ఆయన కలం కలకాలం రంజింపజేసే అద్భుతమైన పాటలను అందించింది. నేడు వేటూరి సాహిత్యాభిమాన సమితి ఆఫ్ అమెరికా ఆధ్వర్యంలో వేటూరి సమగ్ర సాహితీ సంకలనం విడుదల తెలుగు సాహితీ ప్రియులకు ఒక పండుగ రోజు. వేటూరి పాళీవైభవాన్ని ఒకేచోట చేర్చి ఆయన కథను ముందు తరాల వారికి అందించే ఈ ప్రయత్నం అభినందనీయం. వేణువై వచ్చి గాలినైపోయినా.. గతించిపోని గాథ వేటూరి. మూడు అక్షరాలు, ఆరుకాలాలు, వందేళ్లు. స్మరామి స్మరామి స్మరామీ. నమామి నమామి నమామీ!
కిలారు గోకుల్‌కృష్ణ
ఆంధ్రజ్యోతి ప్రతినిధి–డల్లాస్
(ఆగస్టు 16న డల్లాస్‌లో వేటూరి సుందరరామమూర్తి
సాహితీమహోత్సవం, జొన్నవిత్తుల చేతుల మీదుగా
‘వేటూరి సమగ్ర సాహితీ సంకలనం’ ఆవిష్కరణ)
ఇవి కూడా చదవండి...
అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర్య వేడుకలు.. జెండా ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
ఏపీ వ్యాప్తంగా ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు.. ఊరూవాడా జాతీయ జెండా రెపరెపలు
Read Latest AP News And Telugu News