Share News

జూలై 20: భయం బద్దలైన రోజు..

ABN , Publish Date - Jul 23 , 2026 | 01:53 AM

జూలై 20– భారత ప్రజాస్వామ్య చరిత్రలో గుర్తుండిపోయే రోజు. ఎందుకని? రాజనీతిశాస్త్ర విదుషీమణి వన్యా వైదేహి భార్గవ్‌ సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేసిన వ్యాఖ్యలే ఆ ప్రశ్నకు సమాధానం: ‘ఎంతోకాలంగా...

జూలై 20: భయం బద్దలైన రోజు..

జూలై 20– భారత ప్రజాస్వామ్య చరిత్రలో గుర్తుండిపోయే రోజు. ఎందుకని? రాజనీతిశాస్త్ర విదుషీమణి వన్యా వైదేహి భార్గవ్‌ సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేసిన వ్యాఖ్యలే ఆ ప్రశ్నకు సమాధానం: ‘ఎంతోకాలంగా అణచివేతకు గురవుతోన్న ప్రజాస్వామిక చైతన్యం తిరిగి కొత్త మొలకలా పునరుత్థానమవడాన్ని ఈ రోజు చూశాను– ఆ సజీవ స్ఫూర్తి నన్ను నిలువునా ఆవహించిన అనుభూతి చెందాను. అవ్యక్తానుభూతి అది’. సోమవారం (జూలై 20) మంగళవారం (జూలై 21)లోకి క్రమిస్తున్న తొలి ఘడియల్లో వైదేహి వ్యాఖ్యలను నేను చదివాను. క్రితం రోజు ఢిల్లీ వీధుల్లో కనిపించిన దృశ్యాలు మనసులో మరోసారి కదలాడుతుండగా, విన్న మాటలు జ్ఞాపకాలుగా ప్రవహిస్తుండగా ఆ కన్నంత విన్నంతలో స్ఫూర్తిదాయక నూతన వెలుగులను దర్శించాను.

మనం నియంతృత్వ పోకడల్లో పోటీలు పడే పరిస్థితి నుంచి ఎన్నికల ద్వారా గెలిచి సర్వం సహాధికారం చెలాయించే స్థితిలోకి జారిపోతున్న సందర్భంలో ఉన్నామనేది నా వాదన. ప్రతిపక్షం ఈ వాస్తవాన్ని గుర్తించి ఎన్నికల రాజకీయాల నుంచి ప్రతిఘటన రాజకీయాలకు మారాలని, మారితీరాలని నేను సునిశ్చితంగా విశ్వసిస్తున్నాను. జంతర్‌ మంతర్‌ వద్ద యువ భారతీయుల నిరసన. ప్రతిఘటన రాజకీయాలకు ఒక నిర్దుష్ట నిదర్శనం. ఈ నా అభిప్రాయాన్ని ఎనిమిది కారణాలతో విశదీకరిస్తాను.

ఒకటి– అంకెలు: జంతర్‌ మంతర్‌ నిరసన ర్యాలీలో ఎంతమంది పాల్గొన్నారనే విషయమై కచ్చితమైన, సబబైన అంచనా లేదు. 15 నుంచి 20 వేల మంది రావచ్చని నిర్వాహకులు భావించారు. ఆ ప్రకారం ఏర్పాట్లు చేశారు. అయితే నిరసన ప్రదర్శనలో పాల్గొన్న వారి సంఖ్య ఆ అంచనాకు మించి చాలా చాలా రెట్లు అధికంగా ఉన్నదనేది సందేహాతీతమైన వాస్తవం. లక్ష మందికి పైగా ఆ నిరసనలో పాల్గొని ఉంటారని డ్రోన్‌ కెమెరాలు తీసిన ఛాయాచిత్రాలు స్పష్టంగా సూచిస్తున్నాయి. తొలుత ఒక మార్చ్‌గా అనుకున్నది తరువాత నిరసన ప్రదర్శనగా పరిణమించింది. అంతేనా? ఎక్కడెక్కడి జనాలు వెల్లువెత్తి జనసంద్రంగా మారిన నిరసన అది. పార్లమెంటుకు వెళ్లే ప్రతి వీధీ, జనపథ్‌లోని ప్రతి బాటా మధ్యాహ్నానికి నిరసనకారులతో నిండిపోయింది. సందేహం లేదు, భారతదేశ ‘ఆక్యుపై’ ఉద్యమ సందర్భమిది.


రెండు– సహజసిద్ధమైన సమీకరణ: నిరసనకారుల సంఖ్య కంటే వారి సమీకరణ తీరు ఈ నిరసన ప్రదర్శనకు విశిష్టతను సంతరింపజేసింది. అవును, అది సహజసిద్ధమైన సమీకరణ. మన దేశంలో రాజకీయ పార్టీల ర్యాలీలకు డబ్బులు, ఇతర ప్రలోభాలతో జనాన్ని సమీకరించడం పరిపాటి. అయితే ఈ నిరసన ప్రదర్శన అలా జరగలేదు. జంతర్‌ మంతర్‌కు చేరిన వారందరూ తమకు తాముగా వచ్చినవారే. ప్రతి ఒక్కరూ సామాజిక మాధ్యమాలలో విజ్ఞప్తులకు ప్రతిస్పందించి స్వచ్ఛందంగా వచ్చినవారే. ఎవరి ప్రయాణ ఏర్పాట్లు వారే చేసుకున్నారు. సుదూర ప్రాంతాల నుంచి నడిచి వచ్చినవారు చాలామంది ఉన్నారు.

మూడు– నిరసనకారుల్లో కొట్టొచ్చినట్టు కనిపించిన వైవిధ్యం: ‘పూర్తిగా అసంగత వైవిధ్యం’ అని నా స్నేహితుడు ఒకరు అభిప్రాయపడ్డారు. జంతర్‌ మంతర్‌ నిరసన ప్రదర్శనకు అరుణాచల్‌ ప్రదేశ్‌ నుంచి వచ్చిన ఒక వ్యక్తిని నేను కలుసుకున్నాను. అలాగే హిమాచల్‌ ప్రదేశ్‌లోని ధర్మశాల నుంచి వచ్చిన వయోజనుల బృందం ఒకటి నాకు తటస్థించింది. స్పానిష్‌ భాషా సాహిత్యాల విద్యార్థి ఒకరు వీల్‌చైర్‌లో వచ్చారు. డెహ్రాడూన్‌ నుంచి వచ్చిన బాలికల బృందం నన్ను అబ్బురపరిచింది. ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, బిహార్‌ రాష్ట్రాలలోని అన్ని ప్రాంతాల నుంచి డజన్ల సంఖ్యలో బాల బాలికలు, యువతీ యువకులు వచ్చారు. సంపన్న కుటుంబాల పిల్లలకు మాత్రమే అందుబాటులో ఉండే ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాల విద్యార్థినీ విద్యార్థులు ఎంతోమంది వచ్చారు. మామూలు కళాశాలలకు చెందినవారు సైతం ఎంతోమంది వచ్చారు. సరే, ప్రతిష్ఠాత్మక సివిల్‌ సర్వీస్‌లకు ఎంపికయ్యేందుకు ఆరాటపడే ముఖర్జీనగర్ ‘ఆకాంక్షాపరులు’ సైతం చాలా పెద్ద సంఖ్యలో వచ్చినట్టు నేను గమనించాను. చెప్పితీరాల్సిన విషయమేమిటంటే ఈ ఆహూతులు అందరిలోను మహిళల శాతం అత్యధికంగా ఉండడం. ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొన్నవారిలో అత్యధికులు ఇటువంటి నిరసనలలో తొలిసారి పాల్గొన్నవారే కావడం మరో అవిస్మరణీయమైన వాస్తవం. అన్నట్టు, వారి కుటుంబాలు చాలావరకు భారతీయ జనతా పార్టీ మద్దతుదారులేనని నేను కచ్చితంగా చెప్పగలను. అలాగే నిన్నటిదాకా ఈ కొత్త యువ నిరసనకారులు కూడా. ఇది కొట్టివేయలేని వాస్తవం. ప్రస్తుత దేశ పాలకులను తప్పక కలవరపరిచే నిజమిది.

నాల్గవది– నిరసనకారుల ప్రేరణ: ప్రశ్నపత్రాల లీక్‌కు రగిలిపోయి మాత్రమే ఈ యువ భారతీయులు జంతర్‌ మంతర్‌ వద్ద ధర్నాకు రాలేదు. పెచ్చరిల్లుతోన్న నిరుద్యోగం, అవినీతిమయమైన అధికార వ్యవస్థలు, రాజకీయ పార్టీల కపటాలు వారిని ఈ నిరసనలో పాల్గొనేలా ప్రోద్బలించాయి. నీట్‌ పరీక్ష రద్దు, సీబీఎస్‌ఈ కుంభకోణం మూలంగా ఎంతోమంది విద్యార్థినీ విద్యార్థులు హతాశులయ్యారు. వారు మాత్రమేనా? ఆ యువత తల్లిదండ్రుల ఆవేదనను ఎలా విస్మరించగలం? మరీ ముఖ్యంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థినీ విద్యార్థుల జననీ జనకులు, తోబుట్టువుల బాధను ఉపేక్షించగలమా? విద్యాభ్యాసాన్ని పూర్తిచేసుకుని ఉద్యోగాలను వెతుక్కుంటున్నవారు, నియామకాలలో అవకతవకలకు బాధితులైనవారు ఎందరో ఆ నిరసనకారుల్లో ఉన్నారు. దేశ పాలనావ్యవస్థల్లో అవినీతి అక్రమాలకు సంభావ్య బాధితులే ఆ నిరసనకారులు. విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తన విధ్యుక్త ధర్మాన్ని సక్రమంగా నిర్వహించకపోవడాన్ని వారు తీవ్రంగా గర్హించారు. అంతకంటే ముఖ్యంగా ప్రభుత్వాలు తమకు నాణ్యమైన విద్యనందించలేదని, ఉద్యోగాలు కల్పించడాన్ని పూర్తిగా అలక్ష్యం చేస్తున్నారని ఆగ్రహించిన యువతీ యువకుల సమూహమది. 1974లో బిహార్‌లో లోక్‌ నాయక్‌ జేపీ ఉద్యమం తరువాత విద్యా ఉద్యోగాలను జాతీయ అజెండాలో ప్రధానాంశాలుగా చేసిన ప్రప్రథమ యువజన ఉద్యమమిది.


అయిదు– విశాల ప్రతిఘటనా స్ఫూర్తి: నిరసనకారులకు నిజమైన కథా నాయకుడు సోనమ్‌ వాంగ్‌చుక్‌. ఆయన్ని వారు అమితంగా గౌరవిస్తున్నారు. ఆరాధన స్థాయిలో ఆ గౌరవమున్నది. అయితే ఆ వీరారాధన పదిహేను సంవత్సరాల క్రితం అన్నా హజారే ఉద్యమంలో మాదిరిగా పెద్దపెట్టున లేదు. చిత్తశుద్ధి ఉన్న మౌన ఆరాధన ఇది. కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ), దాని నాయకత్వాన్ని విమర్శించేందుకు సైతం ఈ యువ నిరసనకారులు వెనుకాడలేదు.

ఆరు– ప్రధాన స్రవంతి మీడియాపై అసంతృప్తి: ‘విధేయ (గోదీ) మీడియా, వెనక్కి వెళ్లిపో’ అని నిరసనకారులు పలుమార్లు నినదించారు. ప్రధాన స్రవంతి మీడియా కథనాల పట్ల యువత అసంతృప్తికి ఇదొక నిదర్శనం. గత నెల రోజులుగా జంతర్‌ మంతర్‌ వద్ద ధర్నాను దేశ రాజధానిలోని టీవీ చానెల్స్‌, వివిధ పత్రికలు సరిగ్గా పట్టించుకోనే లేదు. పైగా పరిహసించాయి. అవాంఛనీయమైనవిగా చిత్రించాయి. అయితే ప్రభుత్వ మద్దతుదారుల కథనాలు పూర్తిగా వమ్మయ్యాయి. పాలకుల అంచనాలు తలకిందులయ్యాయి.

ఏడు– బీటలువారిన భయ సంకోచాలు: రాజ్యవ్యవస్థ పట్ల యువ భారతీయులలో భయ విహ్వలత తొలగిపోయిందని జూలై 20 నిరూపించింది. 2011లో రామ్‌లీలా మైదానంలో అవినీతి నిర్మూలనా ఉద్యమ సందర్భంలో ఉద్యమకారులపై నిఘా లేదు; అంతకంటే ముఖ్యంగా వారి వివరాలు పోలీసు రికార్డుల్లో నమోదు చేయడమనేది జరగలేదు. అయితే ఇప్పుడు మారిన పరిస్థితుల్లో తాము అటువంటి సమస్యలకు లోనవచ్చనే వాస్తవం నేటి యువతకు బాగా తెలుసు. ఆ కారణంగానే వారిలో చాలామంది మొదటి రెండు వారాల పాటు జంతర్‌ మంతర్‌ ధర్నాకు రాలేదు. అయితే సోమవారం నాడు వారిలో ఆ భయ సంకోచాలు అన్నీ తొలగిపోయాయి. నిరసనకు అనేకానేకమంది వస్తారని వారు ముందుగానే అర్థం చేసుకున్నారు. వారిలో భవిష్యత్తు పట్ల నెలకొన్న నైరాశ్యమే ఒక విధంగా వారిని తెగించేలా చేసిందేమో? ఒక అస్ఫుటమైన ఆశాభావం కూడా నిరసనలో పాల్గొనేందుకు వారిని ప్రేరేపించి ఉంటుంది. ఝంఝంలా వచ్చారు. తమ అభిప్రాయాలను వ్యక్తీకరించడానికి వారేమాత్రం సంకోచించలేదు. తమను ఫొటో తీయడానికి ప్రయత్నించిన వారికి పూర్తిగా సహకరించారు. లాఠీచార్జ్‌కు భయపడలేదు. బాష్పవాయువు నెదుర్కొన్నారు.

ఎనిమిది– సామాజిక న్యాయ రాజకీయాలు: చాలామంది గుర్తించని ఒక అంశం ఈ నిరసన ఉద్యమంలో ఉన్నది. ఈ నిరసన పోరు సామాజిక న్యాయ రాజకీయాలలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. ఒక దళితుడు అభిజీత్‌ దీప్కే నాయకత్వంలో, ఒక ఆదివాసీ సోనమ్‌ వాంగ్‌చుక్‌ స్ఫూర్తితో ఈ నిరసన ఉద్యమం ప్రజ్వరిల్లింది. ఎస్సీ, ఎస్టీ సమస్యలకు పరిమితమైన ఉద్యమంకాదిది. దేశ పాలనా వ్యవహారాలలో భాగస్వామ్యాన్ని డిమాండ్‌ చేయడానికి బదులుగా బహుజన్‌ రాజకీయాలే ఇప్పుడు జాతిని నిర్వచిస్తున్నాయి, నడిపిస్తున్నాయి.


ఇప్పటికి చాలా నెలలుగా ‘మన భారతదేశం భవిష్యత్తు ఏమిటి?’ అని ఎవరైనా నన్ను ప్రశ్నిస్తే నేను ఇలా చెబుతూ వస్తున్నాను: ‘ప్రజలు నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడడానికి ముందుకు వస్తారా లేదా అనేది అసలు సమస్య కాదు. ప్రజలు రోడ్డు మీదకు వచ్చి పోరాడుతున్నప్పుడు మనం వెనకడుగువేసి చూస్తుండిపోవటం సరికాదు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతిఒక్కరూ సరైన సమయంలో ముందుండాలి’. ఈ కర్తవ్య పాలనలో అసంఖ్యాకులు ఎలా పాల్గొన్నారో సోమవారం నాడు నేను చూశాను. నిరంకుశ పాలనా పద్ధతులకు వ్యతిరేకంగా ప్రజలు లేచి నిలబడ్డారు, నేనూ నిలబడ్డాను!

యోగేంద్ర యాదవ్

(వ్యాసకర్త ‘స్వరాజ్‌ ఇండియా’ అధ్యక్షుడు)

ఈ వార్తలు కూడా చదవండి..

ఘనంగా గాడిదలకు పెళ్లి ?.. వీడియో వైరల్

లాఠీఛార్జ్‌లో తీవ్రంగా గాయపడిన యువకుడు.. అంతలో తల్లి నుంచి ఫోన్.. వీడియో వైరల్

For More TG News And Telugu News

Updated Date - Jul 23 , 2026 | 01:53 AM