Share News

Amaravati Capital: అమరావతిపై జగన్‌ వికృత వ్యాఖ్యలు

ABN , Publish Date - Jan 14 , 2026 | 12:43 AM

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి నిర్మాణం వేగం అందుకున్న శుభతరుణంలో వాస్తవాలను వక్రీకరిస్తూ, స్వార్థబుద్ధితో, సంకుచిత వాదనలతో ప్రమాదకర రాజకీయ క్రీడను ఆరంభించాడు జగన్ రెడ్డి. ఆయన...

Amaravati Capital: అమరావతిపై జగన్‌ వికృత వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి నిర్మాణం వేగం అందుకున్న శుభతరుణంలో వాస్తవాలను వక్రీకరిస్తూ, స్వార్థబుద్ధితో, సంకుచిత వాదనలతో ప్రమాదకర రాజకీయ క్రీడను ఆరంభించాడు జగన్ రెడ్డి. ఆయన పసలేని పనికిమాలిన రాజకీయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి. మొదటి నుంచీ అమరావతికి పురిట్లోనే సంధి కొట్టాలని జగన్ రెడ్డి సృష్టించిన అడ్డంకులు అన్నీ ఇన్నీ కావు. అమరావతిని పడగొట్టడం, విడగొట్టడం, చెడగొట్టడమే లక్ష్యంగా గోముఖ వ్యాఘ్ర విన్యాసాన్ని జగన్‌ ప్రదర్శించాడు.

అమరావతిలో అద్భుత రాజధానిని నిర్మిస్తామన్న హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన జగన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చాక అమరావతికి మరణ శాసనం రాశాడు. మూడు రాజధానుల నాటకం ఆడి రాష్ట్రానికి రాజధానే లేకుండా చేశాడు. నాలుకను అడ్డదిడ్డంగా మడతేయడంలో జగన్ రెడ్డి ఊసరవెల్లికి సాటి రాగలడు. తాము అధికారంలోకి వచ్చాక హైదరాబాద్‌ను మించిన మహానగరాన్ని ఆంధ్రప్రదేశ్‌లో నిర్మిస్తామని 2014 ఎన్నికలకు ముందు ఆయన ఒట్టు వేశాడు. ఎన్నికల తర్వాత 2014 సెప్టెంబరు 4న తెలుగుదేశం ప్రభుత్వం అన్ని రాజకీయపక్షాల మద్దతుతో ఏకగ్రీవంగా అమరావతిని రాజధానిగా అంగీకరిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసింది. రాజధాని రాష్ట్రానికి నడిబొడ్డున ఉండాలనీ, రాజధానికి కనీసం 30వేల ఎకరాలు కావాలనీ, 13 జిల్లాల చిన్న రాష్ట్రం కాబట్టి ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టడం ఇష్టంలేక అమరావతి రాజధానిని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాననీ ఆనాడు జగన్‌ నమ్మబలికాడు. కానీ అధికారంలోకి రాగానే తాను చెప్పిన నీతులను తానే తుంగలో తొక్కి మూడు రాజధానులు అంటూ కొత్త పల్లవి అందుకున్నాడు. అనాగరిక విద్వేష రాజకీయాలతో ప్రాంతాల మధ్య వైషమ్యాలు ఎగదోసి కండ కావరంతో రాజధాని అమరావతిని నిర్వీర్యం చేశాడు. అందుకే జగన్‌రెడ్డిని 2024 ఎన్నికల్లో ప్రజలు చిత్తు చిత్తుగా ఓడించారు. ప్రతిపక్ష హోదా సైతం దక్కనంతగా తిరస్కరించారు. అయినా ఆయన బుద్ధి మార్చుకోవడం లేదు. అమరావతిపై వికృత వ్యాఖ్యలు చేస్తూ సైంధవుడిలా ఇంకా అడ్డుకోవాలని చూస్తున్నాడు.


రాజధాని అమరావతిని రివర్‌ బేసిన్‌లో కడుతున్నారనీ, అలా కట్టేందుకు వీల్లేదనీ, ఈ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలనీ అమరావతిపై జగన్ రెడ్డి చేస్తున్న అసంబద్ధ ప్రకటనలు హాస్యాస్పదంగా ఉన్నాయి. అంతే కాదు, రాజ్యాంగంలో రాజధాని అనే పదం లేదని ఆయన చెప్పడం రాజ్యాంగం పట్ల ఆయనకున్న అపరిపక్వ అవగాహనకు నిదర్శనం. దేశంలోని ఏదైనా రాష్ట్రాలకు సంబంధించిన రాజధానులను గెజిట్‌లో ప్రస్తావిస్తుంటారని జగన్‌ తెలుసుకోవాలి.

2014–19 మధ్య కాలంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ వేర్వేరు సందర్భాలలో అమరావతి రాజధానిని నిర్మించడానికి 33 వేల ఎకరాల భూమి అవసరమన్నాడు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అమరావతితో సహా మూడు రాజధానులు అవసరం అన్నాడు. ఇప్పుడు మళ్ళీ రాజధాని అమరావతి నది స్థావరంలో ఉండకూడదంటున్నాడు. ఈ మూడు వేర్వేరు ప్రకటనలూ ఒక దానికొకటి భిన్నం! ఇలాంటి ప్రకటనలు చూస్తున్నప్పుడే జగన్‌ మానసిక స్థితిపై సందేహం కలుగుతుంది. అనేక జాతీయ రాజధానులు, ప్రధాన నగరాలు చరిత్రాత్మకంగా నదుల వెంబడి నెలకొన్నాయి. నాగరికత, నీటి సరఫరా, వాణిజ్యం, రవాణా వంటి ముఖ్యమైన కారణాల దీనికి దోహదపడ్డాయి. బహుళ జాతీయ రాజధానుల గుండా ప్రవహించే నదికి అత్యంత ప్రసిద్ధ ఉదాహరణ డానుబే నది. ఇది నాలుగు రాజధాని నగరాల గుండా వెళుతుంది, అవి– వియన్నా (ఆస్ట్రియా), బ్రాటిస్లావా (స్లోవేకియా), బుడాపెస్ట్ (హంగరీ), బెల్‌గ్రేడ్ (సెర్బియా). ముఖ్యమైన నదులపై ఉన్న ఇతర ప్రధాన రాజధాని నగరాల్లో నైలు నదిపై కైరో, థేమ్స్ నదిపై లండన్, సీన్ నదిపై పారిస్, పోటోమాక్ నదిపై వాషింగ్టన్ డీసీ ఉన్నాయి. రాజధానిగా అమరావతి అభివృద్ధి కాకూడదన్నదే జగన్ రెడ్డి ఉద్దేశ్యంగా అర్థమవుతున్నది. ఆంధ్రప్రదేశ్‌కి ఎటువంటి పెట్టుబడులు, లేదా గ్రాంట్లు రాకూడదు అన్నట్లుగా ఉంది ఆయన వ్యవహారం.


నాటి తెలుగుదేశం ప్రభుత్వం పైసా ఖర్చు లేకుండా రైతులను మెప్పించి, ఒప్పించి ముప్పయ్‌ వేల ఎకరాల పైచిలుకు భూములను సమీకరించి రాజధాని నిర్మాణం ప్రారంభించింది. ఫ్లడ్‌ లైట్ల వెలుగులో వేలమంది కార్మికులతో రాజధాని నిర్మాణ పనులు జరిగాయి. అడ్డు పడకుండా అనుకున్నట్టుగా జరిగి ఉంటే ఈపాటికి అమరావతి నిర్మాణం పూర్తయి ఉండేది. నేటికి ఆంధ్రప్రదేశ్‌కు అమరావతి ఒక ప్రధాన ఆర్థిక వనరుగా ఉండేది. కానీ 2019లో విధి వక్రించి రాష్ట్రంలో తుగ్లక్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అమరావతిని రాజధానిగా నిర్ణయిస్తూ శాసనసభలో తీర్మానం చేసినప్పుడు ఆమోదం తెలిపిన తుగ్లక్ ముఖ్యమంత్రి, ఆ తర్వాత మాట మార్చి, మూడు రాజధానులు అంటూ మూడు ముక్కలాటకు తెర తీశారు. ఆ వెంటనే ఆయన ముష్కర మూక కూడా అమరావతిపై విషపూరితమైన ప్రకటనలు చేయడం ఆరంభించింది. వాళ్ళు అమరావతిని ఎడారిగా, శ్మశానంగా అభివర్ణించారు. సొంత మీడియా సహకారంతో అమరావతిని భ్రమరావతిగా, కమ్మరావతిగా చిత్రించారు. రాజధాని భూముల వ్యవహారంలో భారీ కుంభకోణం జరిగిందని ప్రచారం చేసారు. ఆ తర్వాత హైకోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు అన్ని స్థాయిల్లో ఈ కేసులను కొట్టివేశారు. అంతేగాక అమరావతిలో కుంభకోణం, లంబకోణం ఏదీ జరగలేదని విస్పష్ట తీర్పు వెలువడింది. అయినప్పటికీ జగన్ ముష్కర మూక విష ప్రచారాన్ని ఆపలేదు. చంద్రబాబు ప్రారంభించిన రాజధాని కావడంతో వ్యక్తిగత ద్వేషం, రాజకీయ అహంకారం, ప్రతీకార భావజాలం ఈ మూడింటి మేళవింపుతో అమరావతిపై విషం కక్కారు. ప్రపంచంలో ఎక్కడా లేని మూడు రాజధానులు అనే కాన్సెప్ట్‌ తెచ్చేసరికి పెట్టుబడులు పారిపోయాయి, ఉద్యోగాలు ఆగిపోయాయి, రైతులు రోడ్డెక్కారు. రైతులపై వ్యవస్థాగత దాడి మొదలైంది. రోడ్లు, భవనాలు, కార్యాలయాల ధ్వంసం, కేసులు, అరెస్టులు, అణచివేత, అమరావతిపై జగన్ కక్కిన విషం ఏపీ విశ్వసనీయతను కూడా తీవ్రంగా దెబ్బతీసింది.

అమరావతిని రివర్‌ బేసిన్‌లో కడుతున్నారని, అలా కట్టేందుకు వీల్లేదనీ, ఈ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలనీ జగన్మోహన్‌ రెడ్డి డిమాండ్‌ చేసిన 48 గంటల్లో అదే పార్టీ కీలక నేత మాజీ సకల శాఖా మంత్రి సజ్జల రామకృష్ణా రెడ్డి మీడియా ముందుకు వచ్చి రాజధాని అమరావతిని వైసీపీ మనస్ఫూర్తిగా స్వాగతిస్తుందనీ, తాము అమరావతిని వ్యతిరేకించలేదనీ సుద్దులు చెప్పడం సిగ్గుచేటు. ఏది ఏమైనా అమరావతి అంతమే జగన్ పంతమని అర్థమవుతున్నది. అందుకే జగన్‌ కుట్రల నుంచి అమరావతిని రక్షించుకోవాలి.

యనమల రామకృష్ణుడు

టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు

ఈ వార్తలు కూడా చదవండి..

రైలు పట్టాలపైనే మహిళ ప్రసవం.. ఏమైందంటే?

బెట్టింగ్ యాప్‌ బారిన పడి యువకుడి బలి

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 14 , 2026 | 12:43 AM