Share News

అది ‘మగస్వామ్యం’ కాదు, ధనస్వామ్యం!

ABN , Publish Date - Feb 03 , 2026 | 03:10 AM

‘ఈ గొడవ స్త్రీల దుస్తుల గురించి కాదు!’ అన్న పేరుతో, ఎ.సునీత (జనవరి 22న) రాసిన వ్యాసానికి స్పందన ఇది. మొత్తం గొడవ అంతటికీ కారణం ‘మగస్వామ్యం’ అని వ్యాసకర్త తేల్చేశారు....

అది ‘మగస్వామ్యం’ కాదు, ధనస్వామ్యం!

‘ఈ గొడవ స్త్రీల దుస్తుల గురించి కాదు!’ అన్న పేరుతో, ఎ.సునీత (జనవరి 22న) రాసిన వ్యాసానికి స్పందన ఇది. మొత్తం గొడవ అంతటికీ కారణం ‘మగస్వామ్యం’ అని వ్యాసకర్త తేల్చేశారు. ‘మగస్వామ్యం’ అనే పదాన్ని ఒకసారి, రెండుసార్లు కాదు, ఏకంగా పదకొండుసార్లు ఉపయోగించారు. ‘మగస్వామ్యం’ అనేది, ధన స్వామ్యానికి నీడలాంటిదనీ, నీడతో యుద్ధం చేసి ప్రయోజనం లేదనీ, ధన స్వామ్యంతో చేసే యుద్ధం గురించి ఆలోచించాలనీ వివరించడానికే ఈ ప్రయత్నం.

(1) పురుషులైనా, స్త్రీలైనా వేసుకునే బట్టల్ని తయారు చేయించేది ఎవరు? బట్టల పెట్టుబడిదారులే! కొంత ధనం పెట్టి, అనేక రెట్ల ధనాన్ని లాభాలుగా సంపాదించడమే పెట్టుబడిదారీ విధానం. దాన్నే ‘ధన స్వామ్యం’ అంటారు. పెట్టుబడిదారులు, ధనాన్ని ఒకరికంటే మించి ఒకరు పోటీలు పడి సంపాదించడానికే, అనేక రకాల వికృత వ్యాపార మార్గాలు! ఫాషన్ టెక్నాలజీ పేరుతో కోర్సులు! ఫాషన్ షోలు! అందాల పోటీలు! ఆ ప్రదర్శనల్లో, పోటీల్లో వేసుకునే బట్టలు వందల రకాలు. వాటన్నిటినీ తయారు చేయించి మార్కెట్లోకి వదిలేది బట్టల పెట్టుబడిదారులే! పైగా, ఎప్పుడూ ఒకే రకం కాదు. ఫాషన్లు నిరంతరం మారుతూ ఉండాలి. వీటన్నిటినీ, సినిమాల్లో నటీనటులతో ధరింపజేసి ఊరుకోరు. బయట, వ్యాపార ప్రకటనల్లో, దుస్తుల దుకాణాల ప్రారంభోత్సవాలలో, సినిమాల ప్రొమోషన్ల సభల్లో, సినిమా తారలతోనో, మోడల్స్ తోనో తొడిగించి, వాటిని ఆకర్షణీయమైన సరుకులుగా చూపి, జనాల చేత కొనిపించి, ధనం సంపాదించాలనే ‘ధనస్వామ్య సిద్ధాంతం’ ఇది. ఈ సిద్ధాంతాన్ని, దుకాణాలూ, పత్రికలూ, టీవీలూ, సినిమాలూ, ఇంకా అనేక రకాలైన ప్రచార సాధనాలు ఒక అంటువ్యాధిలాగా జనాలలో వ్యాపింపజేస్తున్నాయి. దీని ప్రభావంలో, ఆడా–మగా, చిన్నా–పెద్దా అందరూ వయసు, ప్రాంతం, దేశం, కుల మతాలతో సంబంధం లేకుండా లొంగిపోతున్నారు. పెట్టుబడిదారీ విధానం, తను మొదలైన చోటే ఉండిపోదు. దేశ సరిహద్దులు దాటి, ఖండాంతరాలు చేరుతుంది. (ఉదాహరణకి ‘అల్ జజీరా’ అనే ఒక టీవీ చానల్, వెనకబడ్డ ఆఫ్రికాఖండ దేశాలలోని, మారుమూల ప్రాంతాల పేద ప్రజల జీవితాల మీద కూడా డాక్యుమెంటరీలు చూపిస్తూ ఉంటుంది. అందులో కనిపించే పేదవాళ్ళు వేసుకునే బట్టల్లో, నాణ్యత ఏ మాత్రమూ లేకపోయినా, ఆ బట్టలూ, ఆ అలంకార వస్తువులూ అన్నీ సంపన్న దేశాలలో వుండే వికృత ఫాషన్ల రూపాల్లోనే ఉంటాయి.) అలాగే, పెట్టుబడిదారీ కంపెనీలు తయారు చేయించే రకరకాల ఫాషన్ల బట్టల్ని చూపడానికి, 24 గంటలూ పనిచేసే ప్రత్యేక ‘ఫాషన్ టీవీ’లూ, యూట్యూబులూ ఎన్నో! పెట్టుబడిదారీ సరుకుల సంస్కృతి ఎలా ప్రచారం అవుతుందో, అన్ని వర్గాల ప్రజలూ, ఆ భావజాలానికి ఎలా లోనవుతారో– అనే కోణంలో సమస్యని అర్థం చేసుకోకుండా, ‘మగస్వామ్యం! మగస్వామ్యం’ అని, 11 సార్లు ధర్మాగ్రహాన్ని ప్రకటించినా, అది నీడతో యుద్ధంగానే మిగిలిపోతుంది.


(2) ‘ఇళ’ అనే 13 ఏళ్ళ బాలికకు, శోభనం రాత్రి, ‘మగస్వామ్య’ శృంగారాన్ని బోధించిన ముద్దుపళనినీ, ఆమెని గురువుగా భావించిన బెంగుళూరు నాగరత్నమ్మనూ ఈ వ్యాసకర్త ఏమీ అనకుండా; ముద్దుపళనిని సహేతుకంగానే విమర్శించిన వీరేశలింగం గారిని మాత్రం ‘మగస్వామ్యానికి మద్దతు’ ఇచ్చిన ‘మగ సంస్కర్త’ అని అధర్మాగ్రహం ప్రకటించారు. అంతేనా, భార్యలున్న సంపన్న పురుషుల విలాసాలనూ, కామవాంఛలనూ తీర్చే వృత్తులలోకి, కొన్ని కుటుంబాల స్త్రీలని పాత సమాజం బలవంతాన నెడితే, వాళ్ళని ‘కళల్లో ఆరితేరిన’ వారిగా, జమీందారులనూ, వ్యాపారస్తులనూ ‘అలరించి’(?) ‘ప్రతిఫలంగా ఆస్తిని పొంది, స్వతంత్రంగా బతికిన’ వారిగా వ్యాసకర్త కీర్తించారు! ఈ కీర్తనని మించిన ‘మగస్వామ్యం’ ఉండదు! భార్యలున్న పురుషుల్ని, ‘ప్రత్యేక సమూహాలకు చెందిన స్త్రీలు,’ ‘అలరించడం’ అంటే అర్థం ఏమిటి? ఆ పురుషుల భార్యల మనోవేదన, ఈ ‘మగస్వామ్య’ విరోధి అయిన వ్యాసకర్తకి పట్టదా? ‘మగస్వామ్య’ శృంగారాన్ని అందించినందుకు, ‘ప్రతిఫలంగా ఆస్తి’ని పొందడంలో ఉన్న అల్పత్వం అర్థం కాలేదా? లక్షలాది కౌలురైతుల శ్రమను ‘కౌలు’ రూపంలో దోచుకోబట్టే గదా ఆ జమీందారులకి ఆ ‘ఆస్తి’ సమకూరింది? ఆ రక్తపు కూడులో కొంత భాగాన్ని, విలాస పురుషులు ఇస్తే, అది తినేవాళ్ళని ‘స్వతంత్రంగా బతికేవాళ్ళు’ అని అనవచ్చునా? కొత్త చట్టాల వల్ల, దేవదాసీలు, ‘అందరికీ శరీరాలు అమ్ముకునే స్త్రీలుగా’ దిగజారాల్సి వచ్చిందని వాపోయారు వ్యాసకర్త. దేవదాసీలు గానీ, ‘వివిధ పేర్లున్న సమూహాల స్త్రీలు’ గానీ, ఆ చట్టాలు రాకముందు, అందరికీ కాకపోయినా, ధనిక పురుషులకు ‘శరీరాలను అమ్ముకునే’ స్థితిలో లేరా? ‘అలరించడం’ అంటే వేరే అర్థం ఉందా?

(3) ‘మగస్వామ్యం’ అనే నీడతో యుద్ధం చేసే క్రమంలో, వ్యాసకర్త, కొన్ని పొరపాటు సూత్రీకరణలు చేశారు. గతిలేక, బలవంతంగా జరిగే ‘రాక్షస రతి’ని, ‘సెక్స్ వర్క్’ అనీ, ‘లైంగిక శ్రమ’ అనీ వర్ణించారు. అది, ‘పని’ అనీ, ‘శ్రమ’ అనీ అంటే, ఆ పనికి, కుదిరిన బేరం ప్రకారమే ‘డబ్బు’ ఇచ్చాంగా అనరా, మగస్వాములు? (4) ‘సినిమాల్లో నటించే స్త్రీలకి, స్వతంత్ర జీవితమూ, డబ్బూ, స్వేచ్ఛా, వృత్తి రీత్యా లభిస్తుంది’ అని ఒక భ్రమని కల్పిస్తున్నారు వ్యాసకర్త. మరి ‘కాస్టింగ్ కౌచ్’ సమస్యా, ‘మీ టూ ఉద్యమం’ సంగతులేమిటి? (5) స్త్రీ వాదం మగస్వామ్య దృక్కోణాన్ని ఎండగట్టిందని ఇంకో అవాస్తవ ప్రకటన చేశారు వ్యాసకర్త. ఈ ప్రస్తావించిన ‘స్త్రీ వాదం’ చేసిన ఘనకార్యం ఏమిటంటే, స్త్రీలని ఫ్యూడల్ అసమానత్వం నించీ, సమానత్వంలోకి కాకుండా, పెట్టుబడిదారీ అసమానత్వం లోకే తీసికెళ్ళింది. అందుకే అది, యూనివర్శిటీలలో ఐక్యం అయి, ఫెలోషిప్పులూ, చైర్లూ, ఇతర పదవులూ సంపాదించడం ద్వారా అధికార వ్యవస్థ ఒడిలో ఇమిడిపోయింది. ఆ పేరుతో కొందరు, అవార్డులూ, రివార్డులూ సంపాదించుకున్నారు. దోపిడీ ఆస్తి విధానాన్నీ, స్త్రీ–పురుషుల మధ్య ఇంటా బయటా ఉన్న అసమాన శ్రమ విభజననీ ప్రశ్నించని స్త్రీవాదం, స్వచ్ఛంద సంస్థలకు వచ్చే నిధుల కోసం ఎదురుచూసే స్థితిలోనే వుండిపోయింది.


(6) చివరిగా, స్త్రీలకైనా, పురుషులకైనా చెప్పవలిసింది ఏమిటంటే, బట్టల పెట్టుబడిదారులు ఎక్కువ లాభాల కోసం పోటీలు పడి, వెరైటీ పేరుతో తయారు చేయించే అడ్డమైన, అంగాంగ ప్రదర్శనలకు అనువైన బట్టలు మనం వేసుకోవద్దు. అవి మనల్ని భోగ్య వస్తువులుగా, కామ క్రీడా వస్తువులుగా (ఆబ్జెక్ట్ ఆఫ్ సెక్స్ అండ్ ఎంజాయ్‌మెంట్) తయారు చేస్తాయి. వాటిని, ఎటువంటి ఆలోచనా లేకుండా అనుసరిస్తే, మనల్ని మనమే వస్తువులుగా తయారు చేసుకున్నవాళ్ళం అవుతాం (సెల్ఫ్–ఆబ్జెక్టిఫికేషన్). ధనస్వామ్య వ్యతిరేక చైతన్యం మనకు లేనప్పుడు, పెట్టుబడిదారులు తమ సరుకుల ద్వారా, మనకు లేని అవసరాలనూ, హేతుబద్ధత లేని అభిరుచుల్నీ, మన మాటల తీరునీ, అన్నిటినీ మనకు తెలియకుండానే మన మీద రుద్దుతారు– అని హెర్బర్ట్ మార్క్యూజ్ అనే విమర్శకుడు చేసిన హెచ్చరికను మనం మరిచిపోకూడదు, ‘ఏది సహజమైనదీ, ఏది తర్కానికి నిలబడుతుందీ’ అని ప్రతీ దాన్నీ ఆలోచించి, ఆ ప్రకారం చేసుకోవాలి. మన శరీరానికీ, ఆకారానికీ, మనం ఉండే వాతావరణానికీ, మనం చేసే వృత్తులకూ, పనులకూ, సౌఖ్యంగా ఉండే బట్టలే వేసుకుందాం– అనే ధోరణిలో ఆలోచించుకోవాలి.

బి.ఆర్.బాపూజీ

ఈ వార్తలు కూడా చదవండి..

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి జర్నలిస్టులపై దాడి.. ఖండించిన ప్రెస్ క్లబ్

బుల్లెట్ ట్రైన్‌కు హబ్‌గా హైదరాబాద్: అశ్వినీ వైష్ణవ్

For More TG News And Telugu News

Updated Date - Feb 03 , 2026 | 03:10 AM