Share News

సత్వర న్యాయంలో న్యాయమెంత?!

ABN , Publish Date - Mar 05 , 2026 | 04:45 AM

‘దేశవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న అయిదు కోట్ల కేసులు పరిష్కరించటానికి మా చేతుల్లో మంత్రదండమేమీ లేదు’ అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఒకరు గతంలో వ్యాఖ్యానించారు. అనంతర కాలంలో ఆయన సుప్రీంకు...

సత్వర న్యాయంలో న్యాయమెంత?!

‘దేశవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న అయిదు కోట్ల కేసులు పరిష్కరించటానికి మా చేతుల్లో మంత్రదండమేమీ లేదు’ అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఒకరు గతంలో వ్యాఖ్యానించారు. అనంతర కాలంలో ఆయన సుప్రీంకు ప్రధాన న్యాయమూర్తి అయ్యాక, మధ్యవర్తిత్వం ద్వారా కేసులు పరిష్కరించడమనే ప్రత్యామ్నాయ మార్గాన్ని ప్రతిపాదించారు. ఆ తర్వాత వచ్చిన సీజేలతో పాటు, దేశవ్యాప్తంగా వివిధ హెూదాల్లో ఉన్న న్యాయమూర్తులందరూ ఇదే పద్ధతిని ప్రతిపాదిస్తున్నారు.

గతంలో కంటే ప్రస్తుతం దేశవ్యాప్తంగా లోక్‌ అదాలత్‌లు ఎక్కువగా జరుగుతున్నాయి. ‘జాతీయ లోక్ అదాలత్’ పేరిట దేశమంతటా ఒకే రోజున, ఈ విధంగా సంవత్సరంలో నాలుగైదుసార్లు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆయా రోజుల్లో లక్షల సంఖ్యలో కేసులను పరిష్కరిస్తున్నారు. ఉదాహరణకు, గత డిసెంబర్ 13న నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో ఏపీలో 2 లక్షలకు పైగా కేసులు పరిష్కారమయ్యాయి! తెలంగాణ సహా ఇతర రాష్ట్రాల్లోనూ ఇంచుమించు ఇదే స్థాయిలో కేసులు పరిష్కారమయ్యాయి.

పైకి ఇది చాలా బాగున్నట్లుగా అనిపిస్తున్నా, అంతర్గతంగా ఇది ఓ వికృత న్యాయ ప్రక్రియ. ఎలాగంటే, పోలీసు అధికారులు తమ క్రిందిస్థాయి సిబ్బందికి నేరాల సంఖ్యను నిర్దేశించినట్లుగానే, ఉన్నత న్యాయపాలికలు తమ దిగువ కోర్టుల్లోని న్యాయమూర్తులకు– లోక్‌ అదాలత్‌లో పరిష్కరించాల్సిన కేసుల సంఖ్యను నిర్దేశించడం వల్ల అటు పోలీసులపైనా, ఇటు ఇన్సూరెన్స్‌ కంపెనీలపైనా ఒత్తిడి పెరుగుతోంది. దీంతో బాధితులపై పోలీసులు ఒత్తిడి చేయడం, బెదిరించి రాజీలకు ఒప్పించడం వంటివి చేయాల్సి వస్తోంది. ఈ విషయాల్లో ఎలాంటి ఉన్నతస్థాయి పర్యవేక్షణా లేకపోవడం గమనార్హం. ముఖ్యంగా, బాధితులకిచ్చే నష్టపరిహారం మొత్తం న్యాయబద్ధంగా ఉందో లేదో పట్టించుకునే దిక్కు ఉండడం లేదు.


న్యాయవాదులు– ఇన్సూరెన్స్ కంపెనీ అధికారులు బయట కుదుర్చుకునే రాజీలను మెకానికల్‌గా రికార్డు చేయటానికే న్యాయమూర్తులు పరిమితం అవుతున్నారు. ఆ ఇచ్చే మొత్తాలు న్యాయంగా, చట్ట సమ్మతంగా ఉంటున్నాయో లేదో పరిశీలించే న్యాయమూర్తులు అతి స్వల్పం. ఉదాహరణకు, తిరుపతి పరకామణి కేసులో చోరీ ఆరోపణలు ఎదుర్కొన్న రవికుమార్ అనే ఉద్యోగితో, సతీశ్‌కుమార్ అనే మరో ఉద్యోగి రాజీ చేసుకున్నాడు. దేవుడి ఆస్తికి అధికారులు కేవలం ధర్మకర్తలు మాత్రమే. రాజీ చేసుకునే అధికారం ఉందా? లేదా? అనే చిన్న విషయాన్ని కూడా లోక్ అదాలత్ న్యాయమూర్తులు పట్టించుకోలేదు! మరో ఘటనలో– తనపై దాడి చేసిన నిందితుడితో తన ప్రమేయం లేకుండానే రాజీ చేసుకున్నట్లు 2024 డిసెంబర్ 14న లోక్ అదాలత్ రికార్డు చేసిందని అనంతపురంలో ఒక వ్యక్తి ఫిర్యాదు చేశాడు. బాధితులతో నిమిత్తం లేకుండా హైకోర్టుల్లో చాలా చిన్న మొత్తాలకు రాజీ పడినట్లు హైకోర్టు లోక్ అదాలత్ అవార్డులు ఇస్తున్నారు. Justice delayed is Justice denied అనేది ఎంత నిజమో Justice hurried is Justice buried అనేది కూడా అంతే వాస్తవం. కాబట్టి ఈ అశాస్త్రీయ పరిష్కార పద్ధతి కంటే, కేసుల పరిష్కారాలకు ఉన్నత న్యాయ పాలికలు తమ చేతుల్లో ఉన్న మరికొన్ని ప్రత్యామ్నాయాలపైన దృష్టి సారించాలి. కుదరనిపక్షంలో కనీసం లోక్ అదాలత్‌లలో పరిష్కారమయ్యే కేసులను లోతుగా పరిశీలించి రికార్డు చేయాలి.

‘కొత్తగా వచ్చే కేసుల కంటే పరిష్కరించే కేసుల సంఖ్య అధికంగా ఉండాలి’ అని 2018లో ఉమ్మడి ఏపీ హైకోర్టు తన క్రింది కోర్టులను ఆదేశిస్తూ ఒక సర్క్యులర్ జారీ చేసింది. అయితే దీనికి క్రిందిస్థాయి న్యాయమూర్తులు ఒక చిట్కా కనుగొన్నారు. కొత్త కేసులకు నెంబర్ ఇవ్వకుండా పరిష్కరించిన పాత కేసులు ఎక్కువగా ఉన్నట్లు చూపించారు. ఇది న్యాయవాదులకు న్యాయమూర్తులకు మధ్య వివాదాంశమైంది. ఇది 2018 ఆగస్టు 17, 18 తేదీల్లో ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ న్యాయవాదులు తమ విధులను బహిష్కరించటానికి దారితీసింది! కాబట్టి చిట్కాలతోనూ, అడ్డదారుల్లో కేసుల పరిష్కారం కోసం కాకుండా తమ చేతుల్లో ఉన్న అధికారాల ద్వారా పెండెన్సీని తగ్గించుకోవటంపై న్యాయ పాలికలు దృష్టి పెట్టాలి. దానికోసం రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ప్రకారం తమకున్న ప్రత్యేక అధికారాలను ఉపయోగించి కోర్టులకు మౌలిక వసతుల కల్పన, న్యాయమూర్తుల ఖాళీల భర్తీ వంటి విషయాల్లో ప్రభుత్వాల్ని నిలదీసి పనులు చేయించవచ్చు. సత్వర న్యాయం అనేది వేదికలపై అలంకారప్రాయమైన ఉద్ఘాటనల కోసం తప్ప ఆచరణ సూత్రంగా లేదనే విషయం న్యాయ పాలికలు గుర్తించాలి. ఈ విషయంలో న్యాయమూర్తులు తమకు తామే బాధ్యత వహిస్తే తప్ప లా కమిషన్లు, పై స్థాయి న్యాయమూర్తులు ఎవరెన్ని సూచనలు చేసినా వృథా.


కేసుల సత్వర పరిష్కారానికి అనేక సులభ మార్గాలున్నాయి. న్యాయస్థానాలు తమ సెలవులు తగ్గించుకోవాలి. సంక్రాంతి, దసరా, వేసవి సెలవులు కుదించుకోవడంతోపాటు అతి చిన్న పండుగలకు (వరలక్ష్మీవ్రతం, నాగుల చవితి, మిలాద్–ఉన్–నబీ లాంటివి) సెలవులు లేకుండా చూడాలి. న్యాయమూర్తులు భోజన విరామం తర్వాత కూడా కచ్చితంగా పనిచేసేట్లు చూడాలి. న్యాయవాదులు పదేపదే కోర్టులను బహిష్కరించడాన్ని నివారించాలి. సుప్రీంకోర్టు, హైకోర్టులు, జిల్లా కోర్టులు ఏసీ హాళ్లుగా మారినందున వేసవి సెలవులు కుదించాలి. లోక్ అదాలత్‌లలో పరిష్కారమయ్యే ప్రతి కేసూ న్యాయమూర్తుల పరిశీలన, పర్యవేక్షణలో జరిగేటట్లు, కక్షిదారులకు సరైన న్యాయం జరిగేట్లు చూడాలి. బాధితులు మరింత బాధకు గురికాకుండా చూసే బాధ్యత న్యాయమూర్తులదే.

చెరుకూరి సత్యనారాయణ

ఇవీ చదవండి:

ఈ నిర్ణయంతో అనేక మార్పులు వచ్చాయి: సీఎం చంద్రబాబు

వైసీపీ ప్రభుత్వ తీరుతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది: లోకేశ

చిన్నారి ప్రాణం తీసిన బెలూన్

Updated Date - Mar 05 , 2026 | 04:45 AM