Share News

అది అందెశ్రీ రచన కాదని ప్రభుత్వానికి తెలుసా?

ABN , Publish Date - Jul 23 , 2026 | 01:30 AM

అందెశ్రీ స్మృతివనం శంకుస్థాపన సమావేశంలో (జూలై 18) ప్రభుత్వం నోట ‘నిప్పులవాగు’ సంకలనం ప్రస్తావన మరోసారి వచ్చినందున ఈ పుస్తకంపై కొంత స్పష్టత అవసరమనిపిస్తోంది. అందెశ్రీ సంపాదకత్వంలో...

అది అందెశ్రీ రచన కాదని ప్రభుత్వానికి తెలుసా?

అందెశ్రీ స్మృతివనం శంకుస్థాపన సమావేశంలో (జూలై 18) ప్రభుత్వం నోట ‘నిప్పులవాగు’ సంకలనం ప్రస్తావన మరోసారి వచ్చినందున ఈ పుస్తకంపై కొంత స్పష్టత అవసరమనిపిస్తోంది. అందెశ్రీ సంపాదకత్వంలో వచ్చిన తెలంగాణ ఉద్యమ పాటల బృహత్గ్రంథం ‘నిప్పులవాగు’. ఈ 1,300 పేజీల సంకలనంలో 1946 నుంచి 2021 వరకు వచ్చిన, వందలాది మంది కవులు రాసిన తెలంగాణ ఉద్యమ గీతాలు ఉన్నాయి. అందెశ్రీ వీటన్నిటినీ సేకరించి వాక్కులమ్మ తొలి ప్రచురణగా ‘నిప్పులవాగు’ సంకలనాన్ని తెచ్చారు. ఈ సంకలనంలో కేవలం అందెశ్రీ ఇష్టానికి, భావుకతకు, చింతనాసరళికి చెందిన రచనలే చోటుచేసుకున్నాయని విమర్శ కూడా ఉంది. దీని ఆవిష్కరణ 2 నవంబర్ 2022 నాడు జరిగింది. ధర ఎక్కువ, భారీ పుస్తకం కావడంతో పాటు సాహిత్య కోణంలో దీనికి ప్రాచుర్యం రానందువల్ల ఈ సంకలనం అంతగా పాఠకాదరణ పొందలేదు.

2025 నవంబర్ 10న అందెశ్రీ అకాల మరణం తెలంగాణ ప్రజానీకాన్ని దిగ్భ్రమపరిచింది. తెలంగాణ గీతాన్ని అందించిన కవిగా ప్రభుత్వం అందెశ్రీ అంతిమ సంస్కారాలకు అన్ని గౌరవ లాంఛనాలను అందించింది. ఈ సందర్భంగా ఆనాడు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ... ‘‘అందెశ్రీ జీవితకాలం రచించిన రచనలను ‘నిప్పుల వాగు’ అనే పుస్తక రూపంలో తెచ్చారు. ప్రభుత్వం తరఫున ఈ ‘నిప్పుల వాగు’ను ఇరవై వేల కాపీలుగా ముద్రించి తెలంగాణ ప్రాంతంలో ఉండే ప్రతి లైబ్రరీకి అందజేస్తాం’’ అన్నారు. ఇప్పుడు స్మృతివనం శంకుస్థాపన సందర్భంగా ఈ పుస్తకం ప్రస్తావన ప్రభుత్వం తరఫు నుంచి మరోమారు వచ్చింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా ‘‘అందెశ్రీ రచించిన నిప్పులవాగు కవితా సంకలనం 20 వేల కాపీలు ముద్రిస్తున్నాం’’ అని నిర్ధారించారు. ఈ మాటలను బట్టి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇద్దరూ ఈ సంకలనం పూర్తిగా అందెశ్రీ రచనలతో కూడుకున్నది అని భావిస్తున్నారని అనుకోవాలి. కానీ ఇది అందెశ్రీ ఒక్కరి రచనల సంకలనం కాదు. దానిపై ‘సంపాదకుడు అందెశ్రీ’ అని స్పష్టంగా ఉంది. కాబట్టి దాని పునర్ముద్రణను అందెశ్రీకి నివాళిగా భావించలేం. పోనీ అందెశ్రీ చేపట్టిన కార్యం కాబట్టి ప్రచురిస్తారు అనుకున్నా, ఇంత భారీ పుస్తకం ఇరవై వేల కాపీలంటే పెద్ద ఖర్చే అవుతుంది. కాబట్టి వీలయినంతగా పేజీల సంఖ్యను తగ్గించి, సమగ్రరూపానికి తేవడం మంచిది.

బద్రి నర్సన్

ఈ వార్తలు కూడా చదవండి..

ఘనంగా గాడిదలకు పెళ్లి ?.. వీడియో వైరల్

లాఠీఛార్జ్‌లో తీవ్రంగా గాయపడిన యువకుడు.. అంతలో తల్లి నుంచి ఫోన్.. వీడియో వైరల్

For More TG News And Telugu News

Updated Date - Jul 23 , 2026 | 01:31 AM