విపక్ష రహిత భారత్.. ఏ వెల్గులకు?
ABN , Publish Date - May 08 , 2026 | 12:37 AM
పన్నెండు సంవత్సరాల క్రితం భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవీ బాధ్యతలు చేపట్టిన అమిత్ షా తరచు ‘కాంగ్రెస్–ముక్త్ భారత్’ (కాంగ్రెస్ లేని భారత్) గురించి మాట్లాడుతుండేవారు. అమిత్ మహాశయుని...
పన్నెండు సంవత్సరాల క్రితం భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవీ బాధ్యతలు చేపట్టిన అమిత్ షా తరచు ‘కాంగ్రెస్–ముక్త్ భారత్’ (కాంగ్రెస్ లేని భారత్) గురించి మాట్లాడుతుండేవారు. అమిత్ మహాశయుని ఘోష ఒక విశ్వసనీయ మార్గదర్శక ప్రణాళికను కాకుండా కేవలం ఒక రాజకీయ బూకరింపును సూచించేది. ద్వాదశ సంవత్సరాలు గడిచిపోయాయి. కాంగ్రెస్–ముక్త్ భారత్ మహాలక్ష్యం ఇప్పుడు వడివడిగా ‘ప్రతిపక్ష–ముక్త్ భారత్’ (ప్రతిపక్షాలు లేని భారత్) అనే సాహసోపేత లక్ష్య పరిపూర్తికి శీఘ్రగతిన పురోగమిస్తోందని ఆయన వాదించవచ్చు.
2026 అసెంబ్లీ ఎన్నికల తీర్పులో పొరపడేందుకు వీలులేని సందేశం ఏదైనా ఒకటి ఉంటే అది ఇది మాత్రమేనని చెప్పవచ్చు: 2014లో నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తరువాత మరెన్నడు లేని విధంగా భారతీయ జనతా పార్టీ ఇప్పుడు దేశ రాజకీయాలలో అత్యంత ప్రాబల్య, ప్రభావదాయక శక్తిగా వెలుగొందుతోంది. ఇది వాస్తవమే అయినా అందుకు మినహాయింపులూ ఉన్నాయి. తమిళనాడు, కేరళలో బీజేపీయేతర, ఎన్డీయేతర ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయి. తమిళనాడు అప్పటికీ ఇప్పటికీ ఒక విశిష్ట రాష్ట్రంగా ఉన్నది. సినిమా విడుదలైన మొదటి రోజు మార్నింగ్ షోనే చూసితీరాలని అశేష ప్రజలు ఆరాటపడేలా చేసే సినీ హీరో రాజకీయాలలోకి ప్రవేశించి తొలి ఎన్నికలలోనే అద్వితీయ విజేతగా వెలుగొందడం తమిళనాడులో మాత్రమే సాధ్యమయ్యే అద్భుతం. సరే, కేరళ తన ప్రత్యేక శైలిలో పయనిస్తూనే ఉన్నది. ఆ రాష్ట్రంలో బీజేపీ ఇప్పటికీ అధికారానికి ఒక ప్రధాన పోటీదారుగా ప్రభవించనే లేదు.
ఇప్పుడు జాతీయ రాజకీయ దృశ్యాన్ని చూద్దాం. భారతీయ జనతా పార్టీ, దాని మిత్రపక్షాలు దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాలలో అధికారంలో ఉన్నాయి. అరేబియా సముద్రం నుంచి బంగాళాఖాతం దాకా దేశ రాజకీయ పటం కాషాయ వర్ణంలో కనిపిస్తోంది. ఇందుకు జార్ఖండ్ ఒక్కటి మాత్రమే మినహాయింపు. 2026 అసెంబ్లీ ఎన్నికల తీర్పు బీజేపీకి మరింత ప్రాధాన్యాన్ని సమకూర్చింది. కేవలం రెండు సంవత్సరాల క్రితం లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఏక పార్టీ ఆధిపత్యం దిశగా భారత్ ప్రస్థానాన్ని నిలువరించడం సాధ్యమేనన్న ఆశాభావాన్ని కలిగించాయి. కాంగ్రెస్ పునరుత్థానమయింది. ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమిలోని పలు ప్రాంతీయ పార్టీలు చెప్పుకోదగ్గ విజయాలు సాధించాయి. కాంగ్రెస్, దాని మిత్ర పక్షాలు పోటీదాయక, బహు–పార్టీ రాజకీయాలకు ఊపిరి పోయగలవని ప్రజాస్వామ్య భారత హితైషులు అందరూ విశ్వసించారు. కాల వైపరీత్యం! రెండు సంవత్సరాలకే ఆ ఆశ అడుగంటిపోయింది.. ఆ ఆశాభావం నిజమయేందుకు ఆస్కారం లేదనే భావనకు ఇటీవలి పరిణామాలు తావిచ్చాయి.
గత 24 నెలల్లో ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమిలోని కీలక భాగస్వామ్యపక్షాలు వరుసగా తీవ్ర పరాజయాలపాలయ్యాయి. మహారాష్ట్రలో శివసేన (యూబీటీ) చిత్తుగా ఓడిపోయింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో అధికారాన్ని కోల్పోయింది. బిహార్‌లో రాష్ట్రీయ జనతాదళ్ ప్రాధాన్యం తగ్గిపోయింది. ఒడిషాలో బిజూ జనతాదళ్ సుదీర్ఘ పాలన హఠాత్తుగా అంతమయింది. తమిళనాడులో డీఎంకే, పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ అధికార కంచుకోటలు కూలిపోయాయి. ఒకప్పుడు ప్రతిపక్షాల సమైక్యతా నిర్మాతగా భాసిల్లిన నితీశ్‌కుమార్ ఇప్పుడు బీజేపీ రాజకీయ దయాదాక్షిణ్యాలపై ఆధారపడుతున్నారు. ఈ పరాజయాలు యాదృచ్ఛికమైనవీ కావు, తాత్కాలికమైనవీ కావు. దేశ రాజకీయ వ్యవస్థ ప్రాథమిక వైఫల్యాన్ని అవి సూచిస్తున్నాయి, సందేహం లేదు. వ్యవస్థాగత మార్పులు రాని పక్షంలో పరిస్థితి మరింతగా దిగజారిపోతుందని అవి స్పష్టంగా హెచ్చరిస్తున్నాయి.
స్వాతంత్ర్యానంతర భారతదేశంలో మహా శక్తిమంతమైన ఎన్నికల యంత్రంగా పరిణమించిన పార్టీ బీజేపీ. సైద్ధాంతిక స్పష్టత లేదా నిర్ణయాత్మక నాయకత్వం కాకుండా ఆ పరిణామమే బీజేపీని ప్రస్తుతం ఒక విభిన్న, విలక్షణ పార్టీగా నిలుపుతోంది. లక్ష్య సాధనలో నిరంతర నిమగ్నత, పరిస్థితులకు అనుగుణంగా మారడం, భావోద్వేగాలకు అతీతంగా వ్యవహరించడం ఆ పార్టీని అజేయంగా ఉంచుతున్నాయి. అది జయించలేని ప్రాంతం ఏదీ లేదు, దాని ఆకాంక్ష ఏదీ నెరవేర్చుకోలేనిదీ కాదు. పశ్చిమ బెంగాల్ ఇందుకొక దృష్టాంతం. 2011లో ఆ రాష్ట్ర శాసనసభలో ఒక్క సీటునూ గెలుచుకోలేకపోయిన బీజేపీ 2026లో 200కు పైగా స్థానాలను కైవసం చేసుకున్నది. నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు పదిహేను సంవత్సరాల పాటు చేసిన నిర్విరామ కృషి ఫలితమే బెంగాల్‌లో లభించిన మహావిజయం. ఈ చరిత్రాత్మక విజయంతో బెంగాల్ రాజకీయ జగత్తులో ఒక సుస్థిర, శాశ్వత ఉనికిని బీజేపీ సముపార్జించుకున్నది. ఒక పద్ధతి ప్రకారం క్షేత్ర స్థాయిలో ప్రజల సమీకరణ, బహుళ అంచెల వ్యూహం, బలమైన కేంద్ర నాయకత్వం బీజేపీ ఎదుగుదలకు దోహదం చేశాయి. బెంగాల్‌లో అధికార కైవసం బీజేపీకి కేవలం మరో విజయం మాత్రమే కాదు, మతపరమైన గుర్తింపు, సంక్షేమ పథకాలు, క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకలాపాలను ఎడతెగకుండా పటిష్ఠంగా నిర్వహించే సామర్థ్యాన్ని మిళితం చేసిన బీజేపీ విజయ సూత్రానికి తిరుగులేని ధ్రువీకరణే ఆ చరిత్రాత్మక గెలుపు అని చెప్పితీరాలి.
ఈ జైత్రయాత్ర క్రమంలో రాజకీయ కవచంగా సాంస్కృతిక ఉప–జాతీయవాద పరిమితులు బహిర్గతయ్యాయి. ఢిల్లీ నుంచి వచ్చిన ‘బయటి మనుషుల’కు వ్యతిరేకంగా బెంగాల్ ఆత్మగౌరవ పరిరక్షణకు పోరాడుతున్న ‘బెంగాల్ పుత్రిక’గా తనను తాను నిలుపుకోవడం ద్వారా మమతా బెనర్జీ 2021లో విజయం సాధించారు. అయితే ఈ అస్తిత్వ–ఆధారిత కథనాల ప్రభావశీలత శాశ్వతమైనది కాదు. ఈ సత్యాన్ని గుర్తించిన బీజేపీ ఇటీవలి ఎన్నికల పోరులో తన వ్యూహాన్ని మార్చుకుని అక్రమ వలసలు, స్థానిక అవినీతి, పాలనలో అలసట, అసమర్థత మొదలైన అంశాలకు అగ్ర ప్రాధాన్యమిచ్చింది.
తమిళనాడులో సైతం ఉప జాతీయవాద భావోద్వేగాలను ఎన్నికల ప్రయోజనాలకు ఉపయోగించుకునే ప్రయత్నాలు జరిగాయి. కేంద్ర ప్రభుత్వ ఆధిపత్యాలకు ప్రతిఘటనగా ద్రవిడియన్ రాజకీయాలను డీఎంకే అధినేత స్టాలిన్ సరికొత్తగా ప్రతిపాదించారు. అయినా సైద్ధాంతిక సంఘీభావం ఉన్న ద్రావిడ పార్టీలను నవ యువతరం నిర్ద్వంద్వంగా నిరాకరించింది. రాజకీయాలలో కుటుంబ వారసత్వాలను ఇస్‌స్టాగ్రామ్ తరం తిరస్కరించింది. పాలనలో కొత్త భావాలు, పద్ధతులను, తక్షణ ఫలితాలను, అవ్యవహితంగా సకల రంగాలలో కొట్టొచ్చినట్టు కనిపించే మార్పులను ఈ నవ యువతరం ప్రగాఢంగా కోరుకున్నది.
మరి సంప్రదాయ ప్రాంతీయ సత్రాప్ పాలనా నమూనాకు కాలం చెల్లిపోయిందా? ఇప్పటికిప్పుడు నిశ్చితంగా సమాధానమివ్వలేని ప్రశ్న ఇది. అయితే భారత రాజకీయాలలో ఒక నిర్మాణాత్మకమైన మార్పు చోటుచేసుకుంటుందనడంలో సందేహం లేదు. కేంద్రీకృత, దేశవ్యాప్తంగా సమస్త ప్రజలను ప్రభావితం చేయగల శక్తిమంతమైన నాయకత్వంవైపు అధికార సమతౌల్యత నిర్ణయాత్మకంగా మొగ్గుచూపుతోంది. ఈ మార్పు 1991–2014 సంవత్సరాల మధ్య రాజ్యమేలిన సంకీర్ణ రాజకీయాలకు విరుద్ధమైన పరిణామం.
అప్పట్లో పలు ప్రాంతీయ పార్టీల నాయకులు తమ తమ రాష్ట్రాల్లో అధికారాన్ని చెలాయిస్తూ కేంద్రంలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని తమ రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా ప్రభావితం చేస్తుండేవారు. ఆ పరిస్థితి ఇంకెంత మాత్రం లేదు. విస్తరణవాద బీజేపీ ప్రభవించడమే అందుకు కారణం. సామ దాన భేద దండోపాయాలతో రాజకీయ ఆటంకాల నన్నిటినీ అధిగమిస్తోంది. మిత్రపక్షాలకు అధికారంలో భాగస్వామ్యం కల్పిస్తోంది ప్రత్యర్థులపై పలు విధాల ఒత్తిళ్లు తెస్తోంది. ఫలితంగా ఎన్నికల రంగంలో సమాన అవకాశాలు అంతకంతకూ మృగ్యమైపోతున్నాయి.
ఇటువంటి పరిస్థితుల్లో ప్రతిపక్షం ఎదుర్కొంటున్న సవాలు కేవలం ఎన్నికల సంబంధితమైనది కాదు, అది అస్తిత్వపరమైనది. ఒక సమైక్య, సదా కొత్త శిఖరాలను అధిరోహిస్తున్న రాజకీయ పార్టీని, సదా చీలికలతో కొట్టుమిట్టాడే, ప్రతిస్పందనాత్మక ప్రతిపక్షం సమర్థంగా ఎదుర్కోగలుగుతుందా? పటిష్ఠమైన, ప్రభావశీల ఉమ్మడి ఎజెండాతో ప్రజల ముందుకు రాని పక్షంలో దేశ రాజకీయ రంగంలో ప్రతిపక్షం స్థానం కుంచించుకుపోతూనే ఉంటుంది.
సరే, మళ్లీ అమిత్ షా మౌలిక దార్శనికతకు వెళదాం. ‘కాంగ్రెస్ రహిత భారత్’ అనే లక్ష్యాన్ని ఇప్పటికే పాక్షికంగా సాధించడం జరిగింది. మరి ఇప్పుడు మన దేశ రాజకీయ ప్రస్థానం, అంతకంటే ముఖ్యమైన పర్యవసానాలకు కారణమయ్యే ప్రతిపక్ష రహిత భారత్ లక్ష్యసాధన దిశగా సాగుతున్నదా? ఇది చాలా తక్షణ ప్రాధాన్యమున్న ప్రశ్న. ప్రతిపక్షాలు లేని భారత్ దిశగా దేశ రాజకీయాల గమనాన్ని నిలువరించేందుకు వెన్వెంటనే పూనుకోవల్సిన అవసరమున్నది. ఎందుకు? ప్రతిపక్ష రహిత భారత్‌తో ఎన్నికల సమతుల్యత మాత్రమే కాకుండా భారత గణతంత్ర రాజ్యానికి పునాది అయిన వైవిధ్య, బహు–రాజకీయ పక్ష ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడకే ప్రమాదం వాటిల్లుతుంది.
రాజ్‌దీప్ సర్దేశాయి
(వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్)
ఈ వార్తలు కూడా చదవండి..
డ్రగ్స్ కట్టడి చేయడమే తొలి ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
హైదరాబాద్‌లో బెంగాల్ నటికి వేధింపులు.. నిందితుడికి 7 రోజుల జైలు శిక్ష
Read Latest AP News And Telugu News