ఇద్దరు విలన్ల మధ్య అంతిమ యుద్ధం
ABN , Publish Date - Mar 05 , 2026 | 04:52 AM
మిడిల్ ఈస్ట్‌లో జరుగుతున్న యుద్ధం ఇద్దరు విలన్ల మధ్య జరుగుతున్న క్లైమాక్స్ ఫైట్ లాంటిది. ఒక విలన్ మరణించినా, మరో విలన్ గెలిస్తే అందరూ మరో విపత్తుకు సిద్ధం కావాల్సిందే!...
మిడిల్ ఈస్ట్‌లో జరుగుతున్న యుద్ధం ఇద్దరు విలన్ల మధ్య జరుగుతున్న క్లైమాక్స్ ఫైట్ లాంటిది. ఒక విలన్ మరణించినా, మరో విలన్ గెలిస్తే అందరూ మరో విపత్తుకు సిద్ధం కావాల్సిందే!
చరిత్ర చూస్తే ఇరాన్‌లో ఖమేనీ అస్తిత్వానికి ఏర్పాట్లు చేసిందే అమెరికా. అమెరికాతో దోబూచులాడబట్టే ఖమేనీ ఎదిగాడు! డీక్లాసిఫైడ్ డాక్యుమెంట్స్ మీద గార్డియన్, బీబీసీ చేసిన రీసెర్చ్ మేరకు– మిలిటరీ తిరుగుబాటు మళ్లీ జరగకుండా అమెరికాతో ఖమేనీ నిగూఢ ఒప్పందం చేసుకున్నాడు, ఆ మేరకు 1979లో ఇరాన్‌కు తిరిగి వచ్చి నాయకుడు కాగలిగాడు. ఇవి గ్లోబల్ పాలిటిక్స్. ఇవి మన దేశ రాజకీయాల కంటే అసహ్యంగాను ఆశ్చర్యకరంగానూ ఉంటాయి.
ఇజ్రాయెల్ శత్రువైన హమాస్‌కు స్థావరాన్ని ఇచ్చి, రక్షణ కల్పించిన దేశం ఖతార్. ఇప్పుడు ఇదే ఖతార్‌పై ఇజ్రాయెల్ ఆజన్మశత్రువు ఇరాన్ దాడి చేసింది. ఇజ్రాయెల్‌కు యుద్ధ భాగస్వామి అయిన అమెరికా అదే ఇజ్రాయెల్ శత్రుదేశమైన ఖతార్‌లో తన ఎయిర్ బేస్ పెట్టుకుంది. ఇప్పుడు దాని మీద ఇరాన్ దాడి చేసింది. ఇవన్నీ గ్లోబల్ పెత్తనం కోసం రకరకాలుగా ఏర్పడే సమీకరణాలు.
దీన్ని గ్లోబల్ పాలిటిక్స్‌లో భాగంగా కాక ముస్లింల మీద దాడిగా చూసేవాళ్ళు గమనించాల్సింది ఏమిటంటే, అమెరికా–ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఇరాన్ జరిపిన దాడులన్నీ ముస్లిం దేశాలైన ఖతార్, బహ్రెయిన్, దుబాయ్‌లపైనే! 1965లో ఖమేనీ ఇరాక్‌లో తల దాచుకుంటే అక్కడి నుంచి వెళ్ళగొట్టింది ఇంకో అమెరికా వ్యతిరేక ముస్లిం నాయకుడు సద్దాం హుస్సేన్. సద్దాం హుస్సేన్ తరిమేస్తే ఖమేనీ తలదాచుకున్న దేశం ఫ్రాన్స్. అలా ఒక సెక్యులర్ దేశం మాత్రమే ఖమేనీకి గూడు కల్పించింది. ఖమేనీకి బతకడానికి సెక్యులర్ దేశం కావాలి, పాలించడానికి మాత్రం మత ఛాందసదేశం కావాలి.
అలానే గమనిస్తే– ప్రపంచంలో ముస్లింలు అధికంగా వలస వెళ్ళిన దేశాలైన సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రెండూ అమెరికా మిత్ర దేశాలే. ఎంత ద్వేషించినా ముస్లిం దేశాల నుంచి వలసపోయే వాళ్ళు సౌదీ, యూఏఈ తర్వాత ప్రాధాన్యం ఇచ్చే దేశం అమెరికానే. ప్రపంచంలో, ఒకపక్క ద్వేషిస్తూనే మరోపక్క అక్కడే సెటిల్ అవ్వాలని కలలు కనే దేశం ఏదన్నా ఉంటే అది అమెరికానే!
ఈ ప్రపంచ పెత్తందారీ రాజకీయాలలో ఖమేనీని బలిపశువు అనుకోవటం సరికాదు. ఈ రాజకీయాలలో అతనూ ఒక ప్రధాన పాత్ర పోషించినవాడే. కుర్ద్‌లో సున్నీ ముస్లింల స్వయంప్రతిపత్తి కోసం జరిగిన తిరుగుబాటును నిర్దాక్షిణ్యంగా అణచివేసినవాడు ఖమేనీ. సెప్టెంబర్ 16, 2022న ఇరవై రెండేళ్ళ ఒక అమ్మాయిని కేవలం హిజాబ్ సరిగా వేసుకోలేదన్న కారణంగా చంపించినవాడు. పూర్తి షరియా ‘లా’ రూపొందించి మహిళల స్వేచ్ఛపై ఉక్కుపాదం మోపిన ఘనుడు. ‘జాన్, జిందగీ, ఆజాదీ’ నినాదాలతో వెల్లువెత్తిన ప్రజా ఉద్యమాన్ని నిర్దాక్షిణ్యంగా అణచివేయాలని చూసి విఫలమైనవాడు. ఒక్క సంవత్సరంలోనే ఈ తిరుగుబాటుకు సంబంధించి ఎన్నో కిడ్నాప్‌లు, అరెస్ట్‌లు, చిత్రహింసలు, హత్యలు చేయించాడు. గాజా యుద్ధంలో 75 వేల మందిని చంపడానికి ఇజ్రాయెల్‌కు రెండేళ్ళు పట్టింది. కానీ ఇరాన్ ఒక్క ఏడాదిలోనే స్వంత ప్రజలను 50 వేల మందిని చంపింది. అలాగని అక్కడ ఖమేనీని దేవుడిలా కొలిచేవాళ్ళు లేరని కాదు. ఎంత నియంతృత్వ పాలనలో అయినా ఆ నియంతను ఆరాధించే ప్రజలు ఉండనే ఉంటారు. హిట్లర్‌ను ఆరాధించిన ప్రజలూ అప్పట్లో లక్షల్లో ఉన్నారు. ఇదీ అంతే!
ఇక అమెరికా విషయానికి వస్తే– ఇరాన్ ప్రజలు ఖమేనీ నిరంకుశ పాలనలో ఎన్నో అగచాట్లు పడుతున్నారన్నది ఒక కారణంగాను; ఇరాన్ వద్ద అణ్వస్త్రాలు ఉన్నాయన్నది రెండో కారణంగాను చూపించి ఇజ్రాయెల్‌తో కలిసి ఇరాన్‌పై ఈ దాడి చేసింది. ఇరాన్ ప్రజల మీద అమెరికాకు ఎందుకంత గొప్ప ప్రేమ? ఒకప్పుడు ‘మోస్ట్ వాంటెడ్’గా అమెరికా డిక్లేర్ చేసిన ISIS టెర్రరిస్ట్ అహ్మద్ ఆల్ షరా అధ్యక్షుడిగా కొనసాగుతున్న సిరియా కూడా నిరంకుశ పాలనలోనే ఉంది. అయితే ఈ నియంతను ట్రంప్ నిస్సిగ్గుగా ‘బ్యూటిఫుల్ మేన్’ అని అభివర్ణించి సిరియాపై ప్రేమ కురిపిస్తున్నాడు. ఛాందసవాద ముస్లిం నియంత పాలనలో ఉన్న సౌదీ అరేబియాతోనూ అమెరికా అచ్చిక బుచ్చికలాడుతుంది. కాబట్టి అమెరికా ఈ సందర్భంగా ఇరాన్ దేశ ప్రజల ఆకాంక్షలను గమనించి వారిని ఉద్ధరించడానికి ఇదంతా చేస్తున్నదని అనుకోవడానికి ఏమీ లేదు. ఇదో సాకు మాత్రమే. ఇక ఇరాన్ చేతిలో న్యూక్లియర్ బాంబు ఉందన్నది మరో కారణం. ప్రపంచంలో న్యూక్లియర్ బాంబులు అమెరికా, ఇజ్రాయెల్ వద్ద మాత్రమే ఉండాలి, ఇంక వేరే ఏ దేశం దగ్గర ఉండొద్దూ అనేది ఏ రకమైన న్యాయ సూత్రమో తెలీదు. ఇలాంటి ప్రశ్నలను ఐక్యరాజ్యసమితి లాంటి అంతర్జాతీయ సంస్థలు ఏవీ అడగవు. అణ్వాయుధాలే ఆందోళన అయితే– రష్యా, నార్త్ కొరియా, ఇండియాలపై కూడా దాడి చేయాలిగా!
అమెరికా, ఇజ్రాయెల్‌లు ఈ యుద్ధాన్ని ప్రపంచ ఉద్ధరణ కోసం చేస్తున్నట్టు చెప్పుకోవడంలో ఆత్మవంచన ఏమీ లేదు, కేవలం పరవంచన మాత్రమే ఉంది. ఇంతవరకు నియంతలు అన్న ఆరోపణతో అమెరికా ఆయా దేశ నాయకులను చంపేసిన తర్వాత అక్కడ ఎక్కడా స్థిరత్వం ఉన్న ప్రభుత్వం రాలేదు. కుక్కను చంపే ముందు దానిపై పిచ్చిది అన్న ముద్ర వేయాలనే సూత్రాన్ని అమెరికా నిర్మొహమాటంగా పాటిస్తుంది.
ఈ ప్రపంచ రాజకీయాలలో ఒకరికి ఒకరు మిత్రులే! ఒకరికి ఒకరు శత్రువులే! ప్రజలు ఈ సామ్రాజ్యవాద, మత విస్తరణవాద రాజకీయాలను తమకు అనుకూలంగా మలచుకొని అడుగు ముందుకేస్తూ వెళ్ళాలి. అంబేడ్కర్ ఈ దేశంలో దళిత రాజకీయాలు పరిచయం చేసినప్పుడు, ఇవి ఒక రాజకీయ చర్చ అని కూడా గమనించని ఈ దేశ నాయకుల మీదా, పార్టీల మీదా నమ్మకం పెట్టుకోకుండా బ్రిటిష్ వాళ్ళ దగ్గర తన ఎజెండాను చర్చకు పెట్టాకనే– దళితులకు గాంధీ ఆలయ ప్రవేశం లాంటి రాజకీయ కార్యక్రమాలకు తావునిచ్చాడు. అంబేడ్కర్‌కు బ్రిటీషర్ల మీద ఏ మాత్రం ప్రేమ లేదు. అంబేడ్కర్ రాజకీయాలు ఒక దెయ్యానికీ ఇంకో దెయ్యానికీ మధ్యలో గొడవ పెట్టి లాభపడ్డాయి. ఇది రాజీపడటం కాదు. వ్యూహాత్మకంగా వ్యవహరించడం. ఎందుకంటే– యుద్ధం ఎలాగూ దేనినీ పరిష్కరించలేదు. అలాగని ఎన్ని తరాలు పోరాటాలు చేసి, ఎన్ని యుగాల వరకు సమస్యలతో సంసారం చేయగలదు ఈ పౌర జీవితం!
శత్రువును అనుకూలంగా ఉపయోగించుకోవడం, తర్వాత తగలబెట్టడం అమెరికా రాజకీయం. అలా అని ఆ శత్రువులూ అమాయకులు కాదు, వాళ్ళకు అమెరికా ఎత్తులు తెలియకా కాదు. యాసర్ అరాఫత్‌కు వ్యతిరేకంగా అమెరికా తనను పెంచి పోషించిందని హమాస్‌కూ తెలుసు. అలాగే, హమాస్ అమాయక బలి పశువు అసలే కాదు. ఇలాంటి రాజకీయాల్ని అమెరికా ఒక ఎత్తుగడగా కాక ఒక రాజీలానో, ఆత్మగౌరవ సమస్యలానో చూసి ఉంటే– ఈ రోజు ఆ దేశం అగ్రరాజ్యం కాగలిగేది కాదు.
ఇప్పుడు అమెరికా ఎత్తులు ఊహకందని స్థాయిలో ఉన్నాయి. ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ అనే నినాదం వెనుక అమెరికాను ఆర్థికంగా, మిలిటరీపరంగా అత్యంత సెక్యూర్డ్ పొజిషన్‌లో ఉంచే ప్రయత్నం ఉంది. రానురాను ఇది తీవ్రస్థాయికి చేరుతోంది. ఆ హోదా ఏ మాత్రం కదిలినా అమెరికా స్వీకరించే పరిస్థితిలో లేదు. నైజీరియాలో క్రిస్టియన్‌లపై బోకో హరాం అనే రాడికల్ ఇస్లాం సంస్థ ఊచకోత జరుపుతుంటే ఇదే అమెరికా అక్కడి ప్రభుత్వ తటస్థ వైఖరిని గర్హించి, తానే ముందుపడి ఆ సంస్థ స్థావరాలపై బాంబులు వేసింది. ఇలాంటివి చూసినప్పుడు– అమెరికా ప్రపంచానికి ఆపద్బాంధవుడు లాగా అనిపిస్తుంది. కానీ ఆపద్బాంధవుడికీ ఒక రాక్షస రూపం ఉంది. అది మిగతా రాక్షసులను చంపడానికి సన్నద్ధమవుతోంది. ఒక రాక్షసుడు చంపబడ్డాడు అని ఆనందించలేం, చింతించనూలేం!
పి.విక్టర్ విజయ్‌కుమార్
ఇవీ చదవండి:
ఈ నిర్ణయంతో అనేక మార్పులు వచ్చాయి: సీఎం చంద్రబాబు
వైసీపీ ప్రభుత్వ తీరుతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది: లోకేశ్