ప్రాంతీయ పార్టీలకు మరణశాసనమేనా ?
ABN , Publish Date - Jun 21 , 2026 | 12:29 AM
ఈ దేశంలోని ప్రాంతీయ పార్టీలకు మరణ శాసనం లిఖించబడుతోందా? ముంచుకొస్తున్న ముప్పు నుంచి ప్రాంతీయ పార్టీలు తమను తాము కాపాడుకునే మార్గాలు మిగిలి ఉన్నాయా?
ఈ దేశంలోని ప్రాంతీయ పార్టీలకు మరణ శాసనం లిఖించబడుతోందా? ముంచుకొస్తున్న ముప్పు నుంచి ప్రాంతీయ పార్టీలు తమను తాము కాపాడుకునే మార్గాలు మిగిలి ఉన్నాయా? భారతీయ జనతా పార్టీ చేపట్టిన ఈ రాజసూయ యాగంలో ప్రాంతీయ పార్టీలు సమిధలుగా మిగిలిపోవలసిందేనా? ‘కోర్ కోర్ శరణ్ కోర్’ అన్న హుంకరింపులను ఔదలదాల్చినా వాటి మనుగడకు మాత్రమే గ్యారంటీ ఉంటుందా? ఎన్డీయే కూటమిలో భాగస్వాములుగా మారిపోయినంత మాత్రాన రక్షణ ఉంటుందా? దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలలో చీలికలు రావడానికి స్వయంకృతాపరాధమే కారణమా? లేక మోదీ–షాల మంత్రాంగం కారణమా? గడచిన కొన్ని రోజులుగా ప్రాంతీయ పార్టీలలో చోటుచేసుకుంటున్న చీలికల నేపథ్యంలో ఈ ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఎన్నికలలో ఓడిపోయే పార్టీలకు మనుగడ లేకుండా పోవడం వాంఛనీయమా? ఆయా పార్టీల తరఫున గెలిచిన చట్టసభల సభ్యులు ఇంత నిస్సిగ్గుగా పార్టీ మారడానికి ఎందుకు తెగబడుతున్నారు? రాజకీయాలు ఇంతలా ఎందుకు దిగజారుతున్నాయి? ఇటువంటి ప్రశ్నలకు కూడా సమాధానం లభించాల్సి ఉంది. రాజకీయ పార్టీలను చీల్చడం, ఫిరాయింపులను ప్రోత్సహించడం ఇప్పుడే ప్రారంభం కాలేదు. ఈ కారణంగా జరుగుతున్న పరిణామాలకు బీజేపీని మాత్రమే దోషిగా పేర్కొనలేము. దేశంలో కాంగ్రెస్ పాలన అప్రతిహతంగా కొనసాగినప్పుడు ఆ పార్టీ కూడా ఫిరాయింపులను ప్రోత్సహించింది. అప్పట్లో ఆయారాం గయారాం సంస్కృతిపై దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. దాదాపుగా అన్ని ప్రతిపక్ష పార్టీలు ఫిరాయింపులు, చీలికలకు బాధితులుగా మారాయి. దీంతో బుద్ధి తెచ్చుకున్న రాజకీయ పార్టీలు... ఫిరాయింపుల నిరోధక చట్టానికి పురుడుపోశాయి. అయితే, ఈ చట్టంలో ఎన్నో లొసుగులు! శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అన్నట్టుగా ఫిరాయింపుల నిరోధక చట్టానికి తూట్లు పొడిచారు. మూడింట రెండొంతుల నిబంధనను అధికారంలో ఉన్న వారికి అనుకూలంగా మలచుకున్నారు. తాజాగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చోటుచేసుకున్న తిరుగుబాటు, ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని పార్టీకి చెందిన తొమ్మిది మంది ఎంపీలలో ఆరుగురు తిరుగుబాటు చేయడం రాజకీయ పరిశీలకులను విస్తుపోయేలా చేస్తోంది. ఈ దేశంలో ప్రాంతీయ పార్టీలను బతకనీయరా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు.
నిజమే, ప్రధాని మోదీకి ప్రాంతీయ పార్టీల పట్ల విముఖత ఉందన్న ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. అయితే, ఉన్నట్టుండి ప్రాంతీయ పార్టీల అస్తిత్వంపై ఇప్పుడే కత్తి ఝుళిపించడం వెనుక కారణం ఏమిటి? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ర్టాలలో లోక్‌సభ సీట్లను 50శాతం పెంచడంతోపాటు చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు అవసరమైన మద్దతును కూడగట్టడంలో మోదీ ప్రభుత్వం విఫలమైంది. రాజకీయంగా మోదీ–షాలకు ఇది తొలి ఎదురు దెబ్బ. బహుశా ఈ కారణంగా సదరు బిల్లులకు అవసరమైన మద్దతును సొంతంగా సమీకరించుకోవాలని వారిరువురూ నిర్ణయించుకొని ఉంటారు. ఈ నేపథ్యంలోనే ‘ఆపరేషన్ ప్రాంతీయ పార్టీలు’ ప్రారంభమైంది. ఒకదాని తర్వాత ఒకటిగా ప్రాంతీయ పార్టీలలో చీలికలు మొదలయ్యాయి.
అందరూ ఆ తాను ముక్కలే...
ఫిరాయింపులను ప్రోత్సహించడం సమర్థనీయమా? అంటే కానే కాదు! అయితే ఈ నేరానికి పాల్పడని ప్రాధాన రాజకీయ పార్టీ ఏది? అంటే చెప్పలేని పరిస్థితి. అందుకే కాబోలు ప్రజలు కూడా ఇలాంటి ఫిరాయింపులను సీరియస్‌గా తీసుకోవడం లేదు. అంతమాత్రాన కేంద్రంలోని పెద్దలు చేపట్టిన చర్యలను తప్పు పట్టకుండా ఉండలేము. అయితే, నేటి బాధిత పక్షాలు ఒకనాడు ఇవే ఫిరాయింపులను ప్రోత్సహించిన విషయం మరువకూడదు. తెలుగు రాష్ర్టాలనే తీసుకుందాం. ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలను మింగేయాలని చూశారు. ఆయన మరణంతో అది ఆగిపోయింది. అంతకుముందు పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు లోక్‌సభలో అవసరమైన మెజారిటీ కొరవడటంతో ఫిరాయింపులను ప్రోత్సహించారు. తెలుగుదేశం ఎంపీలు కూడా ఫిరాయించేలా చేశారు. యూపీఏ ప్రభుత్వం తొలి టర్మ్‌లో కూడా తెలుగుదేశం ఎంపీలు పార్టీ ఫిరాయించేలా రాజశేఖర రెడ్డి మంత్రాంగం నడిపారు. ఈ కారణంగానే కాంగ్రెస్ అధిష్ఠానం వద్ద ఆయనకు పట్టు పెరిగింది. రాష్ట్ర శాసనసభలో కూడా అప్పటి టీఆర్‌ఎస్ సభ్యులను కాంగ్రెస్‌లో చేర్చుకున్నారు. దీనిపై కేసీఆర్ అప్పట్లో తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తానికి నాడు టీడీపీ, టీఆర్‌ఎస్ బాధిత పక్షాలుగా మిగిలాయి. విచిత్రం ఏమిటంటే, ఈ రెండు పార్టీలూ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ ఫిరాయింపులకు దూరంగా ఉండలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక బీజేపీ మినహా మిగతా పార్టీల శాసన సభ్యులను కబళించారు. శాసనసభలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు టీఆర్‌ఎస్‌లో విలీనమైనట్లు ప్రకటించారు. రాజ్యసభలో కూడా 2019 తర్వాత తెలుగుదేశం పార్టీ సభ్యులు బీజేపీలో విలీనం అయినట్టు ప్రకటించారు.
ఇలా ప్రకటించడం పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని పరిహసించడం కాదా? రాజశేఖరరెడ్డి హయాంలో ఫిరాయింపుల విషయంలో బాధితులుగా ఉన్న కేసీఆర్, చంద్రబాబు 2014 తర్వాత ఫిరాయింపులను ప్రోత్సహించలేదా? అదే కేసీఆర్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తమ సభ్యులను చేర్చుకోవడంపై సుప్రీంకోర్టు వరకు వెళ్లి పోరాటం చేస్తున్నారు. 2019కి ముందు తమ పార్టీ ఎమ్మెల్యేల ఫిరాయింపుపై విమర్శలు సంధించిన జగన్మోహన్‌రెడ్డి కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం నుంచి ఫిరాయింపులను ప్రోత్సహించారు. దేశంలోని మిగతా రాష్ర్టాలలో కూడా ఇంచుమించుగా ఇదే పరిస్థితి! తిలా పాపం తలా పిడికెడు అన్నట్టుగా ఫిరాయింపులను ప్రోత్సహించిన పాపంలో అన్ని పార్టీలకూ అంతో ఇంతో వాటా ఉంది. ఈ కారణంగా ఇప్పుడు బీజేపీ చేస్తున్నది మహాపరాధం అని చెప్పలేని పరిస్థితి!
ఒక్కో పార్టీది ఒక్కో కథ...
ఇప్పుడు దేశ రాజకీయాలలో మోదీ హవా నడుస్తోంది. ఆయనకేమో ప్రాంతీయ పార్టీలంటే గిట్టదు. ఈ నేపథ్యంలో ప్రాంతీయ పార్టీలు తమను తాము కాపాడుకోవడానికి ఏం చేయాలి? ఉన్నపళంగా తమ పార్టీల పరిస్థితి తలకిందులుగా ఎందుకు మారుతోంది? అన్న విషయమై ఆయా పార్టీలు ఆత్మపరిశీలన చేసుకోవాలి. విచిత్రం ఏమిటంటే, బీజేపీతో జట్టు కట్టిన ప్రాంతీయ పార్టీలు కూడా క్రమంగా బలహీనపడటాన్ని చూస్తున్నాం. బిహార్‌లో జేడీయూనే ఇందుకు నిదర్శనం. నితీశ్‌కుమార్ నేతృత్వంలోని జేడీయూతో ప్రారంభంలో బీజేపీ జట్టు కట్టింది. దశాబ్దం తిరిగేసరికి బీజేపీ ప్రధాన పార్టీగా ఎదిగింది. జేడీయూ బలహీనపడింది. నితీశ్ కుమార్ కూడా ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకొని బీజేపీ నేత సామ్రాట్ చౌదరికి పీఠం కట్టబెట్టారు. ఇదిలా ఉండగా, దేశాన్ని కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తున్న సమయంలోనే ఆ పార్టీ పోకడలను నిరసిస్తూ ప్రాంతీయ ప్రయోజనాల కోసం ప్రాంతీయ పార్టీలు పుట్టుకొచ్చాయి. తెలుగునాట ఆత్మగౌరవ నినాదంతో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, బిహార్‌లో ఆర్జేడీ, జేడీయూ.. ఒడిశాలో బిజూ జనతాదళ్, మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ, పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ పేరిట ప్రాంతీయ పార్టీలు పుట్టుకొచ్చాయి. తెలంగాణ రాష్ట్ర సాధనకోసం టీఆర్‌ఎస్ ఏర్పడింది. ప్రారంభంలో ఈ పార్టీలన్నింటినీ ప్రజలు ఆదరించారు. పలు పార్టీలు అధికారంలోకి వచ్చాయి. ఆ తర్వాత కొన్ని పార్టీలు అసలు లక్ష్యాలకు దూరంగా జరిగి ప్రజల ఆదరణ కోల్పోయాయి. బహుజన్ సమాజ్ పార్టీనే తీసుకుందాం.
బహుజనులకు రాజ్యాధికారం కోసం కాన్షీరాం ఏర్పాటు చేసిన ఈ పార్టీ... మాయావతి నేతృత్వంలో లక్ష్యాలకు దూరమైంది. ముఖ్యమంత్రిగా పనిచేసిన మాయావతి తన పోకడల ద్వారా ప్రజలకు దూరమయ్యారు. ఇప్పుడా పార్టీ పరిస్థితి గాల్లో దీపంలా కొట్టుమిట్టాడుతోంది. సమాజ్‌వాదీ పార్టీ కూడా ఉత్తరప్రదేశ్‌లో ఒక వెలుగు వెలిగింది. ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షంగా మిగిలింది. బిహార్‌లో ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ ప్రజలు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేశారు. కుటుంబ పాలనకు పెద్ద పీట వేశారు. మొత్తంగా చూస్తే ఉత్తరప్రదేశ్, బిహార్‌లో ప్రాంతీయ పార్టీల అధిపతులు వాటిని తమ సొంత ఆస్తులుగా మార్చుకున్నారు. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కూడా ప్రభుత్వ నిబంధనలకు లోబడి వ్యవహరించాల్సి ఉంటుంది. కానీ ఈ రెండు రాష్ర్టాల్లోని ప్రాంతీయ పార్టీలు తాము ఎవరికీ జవాబుదారీ కాదన్నట్టుగా వ్యవహరించాయి. ఇక అవినీతి విషయం చెప్పాల్సిన పనిలేదు. ఈ కారణంగానే ఆయా పార్టీల భవిష్యత్తు మసకబారుతూ వచ్చింది. అధికారంలోకి వస్తామన్న ఆశ లేని పార్టీలలో రాజకీయ నాయకులు కొనసాగే పరిస్థితులు ఇప్పుడు లేవు కనుక సమాజ్‌వాదీ పార్టీ పైనా బీజేపీ పంజా విసరబోతోందని ప్రచారం జరుగుతోంది.
చీలికలు పీలికలై...
రాజకీయ పార్టీలను సొంత జాగీర్లుగా మార్చుకున్న సందర్భాలలో నాయకులు సహజంగానే ప్రజలకు దూరమవుతారు. మహారాష్ట్రలో కూడా మరాఠీల రక్షణ కోసం శివసేనను ఏర్పాటు చేశారు. కానీ, ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే రెండు శిబిరాలుగా విడిపోయారు. ఉద్ధవ్ నేతృత్వంలో శివసేన ఇతర పార్టీల మద్దతు కూడగట్టుకొని అధికారంలోకి వచ్చింది. అయితే ఉద్ధవ్ పోకడల వల్ల ఆ పార్టీ నుంచి ఏక్‌నాథ్ షిండే విడిపోయి శివసేనను సొంతం చేసుకున్నారు. షిండే నేతృత్వంలోని పార్టీనే అసలైన శివసేనగా సర్వోన్నత న్యాయస్థానం ప్రకటించింది. నిజానికి ఎన్నికల సందర్భంగా షిండే సమర్పించిన బీ–ఫాంపై ఉన్నది ఉద్ధవ్ ఠాక్రే సంతకమే! ఎన్నికల్లో బీ–ఫాంలు ఇచ్చిన వారిది కాకుండా మరొకరిది అసలైన పార్టీ ఎలా అవుతోందో తెలియదు! మొత్తంగా చూస్తే ఏ లక్ష్యం కోసం శివసేన ఏర్పడిందో ఆ లక్ష్యానికి దూరంగా జరిగింది. ఈ క్రమంలోనే పార్టీలో చీలికలు, పీలికలు.
నేరమూ... శిక్ష!
తప్పు చేసిన, చేస్తున్న పార్టీలను ప్రజలు శిక్షించాలి! అధికారం ఉందని ఇంకో పార్టీని కబళించడం ఏమిటి? అన్న ప్రశ్న ఉత్పన్నం అవడం సహజం. ఈ ప్రశ్నకు కూడా ఏదో ఒక రోజు ప్రజలే సమాధానం చెబుతారు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీని నిలువరించడం ఎలా? అని ప్రధాన రాజకీయ పార్టీలు తలలు పట్టుకునేవి. కాంగ్రెస్ నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగానే ప్రాంతీయ పార్టీలు ఆవిర్భవించాయని మరచిపోకూడదు. ఇప్పుడు బీజేపీ పోకడలు సమ్మతం కాని పక్షంలో ప్రజలే సరిదిద్దే బాధ్యత తీసుకుంటారు. అది ఎప్పుడు? అంటే సమయం వచ్చినప్పుడు అని చెప్పుకోవాలి. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన మూడు దశాబ్దాల తర్వాత కదా కాంగ్రెస్ పార్టీకి తొలి ఎదురుదెబ్బ తగిలింది! మోదీ–షాలు తప్పు చేస్తున్నారన్న నిర్ణయానికి ప్రజలు వస్తే తమదైన శైలిలో శిక్ష వేస్తారు. ప్రత్యర్థికి కాలు అందివ్వకూడదు అన్నది యుద్ధ తంత్రం. ఈ స్పృహ రాజకీయ పార్టీలకు ఉండాలి. ప్రధాని మోదీ నియంతృత్వ పోకడలు పోతున్నారని, ప్రతిపక్షాలను బతకనివ్వకపోవడం ఏమిటని నిందించవచ్చుగానీ, ఆయనకు అటువంటి అవకాశం ఇస్తున్నది ఎవరు? నిజంగానే ప్రధాని మోదీ తప్పు చేస్తుంటే ప్రజల్లో వ్యతిరేకత ఎందుకు ఏర్పడటం లేదు? అన్న ప్రశ్నకు సమాధానం కావాలి. ప్రధానమంత్రిలో నియంతృత్వ పోకడలు నిజమే అనుకుంటే అందుకు ప్రతిపక్షాల అనైక్యత కూడా కారణం కావచ్చు కదా! తమకు తిరుగులేదని భావించడం వల్లనే కదా కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు నియంతృత్వ పోకడలు పోయింది. పోటీతత్వం లేనప్పుడు అలసత్వమైనా వస్తుంది లేదా మితిమీరిన ఆత్మవిశ్వాసమైనా ఆవహిస్తుంది.
రాజకీయాలు ఇందుకు మినహాయింపు కాదు. ఎన్నికల ఫలితాలు వెలువడగానే... తమ పార్టీ తరఫున గెలిచి ప్రమాణ స్వీకారం కూడా చేయని ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడమేమిటి? ఆ వెంటనే ఎంపీలూ తిరుగుబాటు చేయడం ఏమిటి? అని తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఈ తిరుగుబాట్లు లేదా ఫిరాయింపులను బీజేపీ ప్రోత్సహిస్తూ ఉండవచ్చుగానీ అంత మంది తన నాయకత్వాన్ని ధిక్కరించడానికి గల కారణాలను తెలుసుకొనే ప్రయత్నం మమతా బెనర్జీ చేయాలి కదా! అధికారంలో ఉన్నా లేకపోయినా బీజేపీలో చోటుచేసుకోని తిరుగుబాట్లు ఇతర పార్టీలలో మాత్రమే ఎందుకు తలెత్తుతున్నాయనేది నాణేనికి మరో కోణంగా చూడాలి. భవిష్యత్తులో బీజేపీలో కూడా తిరుగుబాట్లు చోటుచేసుకోవచ్చు– అది వేరే విషయం! తెలంగాణలో ఇతర పార్టీలను చీల్చగలిగిన కేసీఆర్, బీజేపీని మాత్రం కదిలించలేకపోవడం గమనార్హం. ఇటీవల బీజేపీ నుంచి సస్పెండైన ఎమ్మెల్యే రాజాసింగ్ అదే పార్టీని పట్టుకొని వేలాడారేగానీ అధికారంలో ఉన్న కాంగ్రెస్‌లో చేరలేదే? సిద్ధాంతాల పట్ల నిబద్ధత ఉన్నవాళ్లు ఇలాగే వ్యవహరిస్తారు. ఎన్నికల్లో పోటీకి దింపుతున్న అభ్యర్థుల్లో సిద్ధాంత నిబద్ధత లేకపోవడం, ఆయా పార్టీల పట్ల విధేయత కొరవడటం వల్ల ఫిరాయింపులను ప్రోత్సహించడం సులువవుతోంది.
ఎందుకిలా... ఏమిటి తేడా?
ఇతర పార్టీలతో పోల్చితే తమ పార్టీ భిన్నమైనదని ప్రజలను ముందుగా నమ్మించాలి కదా? చిరకాలంగా పార్టీ జెండాను మోసిన వాళ్లను కాదని తక్షణ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎవరికి పడితే వారికి టికెట్లు కేటాయిస్తే పరిస్థితి ఇలాగే ఉంటుందని ప్రతిపక్షాలు, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు గుర్తించాలి. దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలలో నిబద్ధత కొరవడుతోంది. ఎన్నికలప్పుడు ప్రజలకు ఏవో తాయిలాలు ప్రకటించి అధికారంలోకి రావాలని మాత్రమే ప్రయత్నిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీతో విభేదించి లేదా ధిక్కరించి ఏర్పాటు చేసిన పార్టీలను కాంగ్రెస్ వాసనలకు దూరంగా ఉంచాల్సిన బాధ్యత ఆయా పార్టీల అధినేతలపై ఉండదా? తెలుగు రాష్ర్టాలనే తీసుకుందాం! కాంగ్రెస్ పోకడలను నిరసిస్తూ 1982లో ఎన్టీఆర్ ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ ఇతర పార్టీలతో పోల్చితే ఎలా భిన్నమైనదో ప్రజలకు ఎప్పటికప్పుడు వివరించాలి కదా! ఏ రాయి అయితేనేమి పళ్లు రాలగొట్టుకోవడానికి అంటూ ప్రజలు నిస్పృహకు గురి కాకుండా... తమను తాము సంస్కరించుకుంటూ ముందుకు సాగాలి కదా? పార్టీ పట్ల నిబద్ధతతో పనిచేస్తున్న వారిని గుర్తించి పెద్ద పీట వేసినప్పుడే ఏ పార్టీకైనా మంచి భవిష్యత్తు ఉంటుంది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు గోడ దూకడాలు ఉండవు. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్‌గా పనిచేసిన ఎంఏ షరీఫ్, ప్రస్తుత చైర్మన్ మోషేన్ రాజునే తీసుకుందాం. ఈ ఇరువురికీ తమ పార్టీల పట్ల నిబద్ధత ఉండటం వల్లనే తమ అధినాయకులు అధికారం కోల్పోయినా, ఎవరెంతగా ప్రలోభపెట్టినా పార్టీ పట్ల విధేయతను వదులుకోవడానికి అంగీకరించలేదు. అవసరానికి ఇతర పార్టీల నుంచి అరువు తెచ్చుకొనే సంస్కృతిని పెంచి పోషిస్తే అలా వచ్చినవాళ్లు అవసరం తీరాక ఎందుకుంటారు? ప్రాంతీయ పార్టీలలో ప్రజాస్వామ్య పోకడలు అంతరించిపోతున్నాయి. పార్టీలను సొంత జాగీర్లుగా భావిస్తే తిరుగుబాట్లు, ఫిరాయింపులే మిగులుతాయి. బీజేపీ మాత్రం ప్రజాస్వామ్య బద్ధంగా వ్యవహరిస్తోందా? అని ప్రశ్నించవచ్చు.
అలా ఉండకపోతే ఆ పార్టీకి కూడా ఏదో ఒక రోజు ఇదే దుస్థితి ఎదురవుతుంది. తెలంగాణ కోసం ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చి ప్రాంతీయ ప్రయోజనాలను విస్మరించడం వల్లనే కదా ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్‌ను తిరస్కరించారు? ఇది మా పార్టీ అన్న భావన ప్రాంతీయ పార్టీల కార్యకర్తలు, నాయకులలో ఏర్పరచాలి. అలా కాకుండా ఫలానా పార్టీ కేసీఆర్ పార్టీ, చంద్రబాబు పార్టీ, మమతా బెనర్జీ పార్టీ, ఉద్ధవ్ ఠాక్రే పార్టీ, అఖిలేశ్ యాదవ్ పార్టీ అని కార్యకర్తలు, నాయకులు భావించేలా వ్యవహరిస్తే పరిణామాలు ఇలాగే ఉంటాయి. అవినీతి విషయంలోనూ కొన్ని ప్రాంతీయ పార్టీలు నాటి కాంగ్రెస్ పార్టీతో పోటీపడటం కూడా వాటి పతనానికి కారణం అవుతోంది. రాజకీయాల పట్ల ప్రజల్లో, ముఖ్యంగా యువతలో చులకన భావం ఏర్పడిన ప్రస్తుత పరిస్థితుల్లో ప్రాంతీయ పార్టీలతో పాటు ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఆత్మపరిశీలన చేసుకోవాలి. రాజ్యం వీరభోజ్యం అన్నట్టుగా విర్రవీగడం వల్లనే ప్రాంతీయ పార్టీల అధిపతులు ఓటమి తర్వాత గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. అధికారాన్ని, డబ్బును కాకుండా ప్రజలను – కార్యకర్తలను నమ్ముకున్న పార్టీలకు ఒడుదుడుకులు ఎదురైనా భవష్యత్తు ఉంటుంది. సుదీర్ఘ కాలం అధికారంలో లేకపోయినా బతికి బట్టకట్టి, ఇప్పుడు అధికారంలో పాతుకుపోయిన బీజేపీని చూసి నేర్చుకోవలసింది ఏమైనా ఉంటే నేర్చుకోండి అని ప్రతిపక్షాలకు చెప్పడం తప్పు కాదనుకుంటా!