Share News

ఫలించిన బెంగాల్‌ నిరీక్షణ

ABN , Publish Date - May 06 , 2026 | 03:05 AM

‘నేను రాజీనామా చేయను. నాపై గెలిచింది బీజేపీ కాదు, ఎన్నికల కమిషన్’ అని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. బెంగాలీ అస్తిత్వం పేరిట మమత, ఆమె అనుయాయులు ఉధృతంగా...

ఫలించిన బెంగాల్‌ నిరీక్షణ

‘నేను రాజీనామా చేయను. నాపై గెలిచింది బీజేపీ కాదు, ఎన్నికల కమిషన్’ అని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. బెంగాలీ అస్తిత్వం పేరిట మమత, ఆమె అనుయాయులు ఉధృతంగా నిర్వహించిన ప్రచారం, గ్రామాలపై తృణమూల్‌కు ఉన్న పట్టు మూలంగా టీఎంసీ కొద్దిపాటి మెజారిటీతోనైనా గెలుస్తుందని అనేకమంది ఊహించారు. సగానికిపైగా నియోజకవర్గాల్లో ముస్లిం ఆధిపత్యం ఉన్నందువల్ల ఆమె విజయానికి అవరోధాలు లేవని పలువురు విశ్వసించారు. అయితే వీటన్నింటినీ అధిగమించి పశ్చిమ బెంగాల్‌ను భారతీయ జనతా పార్టీ గెలుచుకున్న తీరు స్వతంత్ర భారతదేశ చరిత్రలో అత్యంత కీలకమైన ఘట్టంగా అభివర్ణించడానికి సందేహించనక్కర్లేదు. ‘బెంగాల్‌లో ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రవేశంతో భారతదేశంలో బానిసత్వం ప్రారంభమైంది. ఇప్పుడా బానిసత్వం పోయి, జాతీయవాదం వెల్లువెత్తింద’ని బీజేపీ నాయకుడు ఒకరు అన్నారు.

నిజానికి బెంగాల్ సామాజిక, చారిత్రక నేపథ్యం, ఆ రాష్ట్రంలో ఉన్న సున్నితమైన మత, సాంస్కృతిక వాతావరణం దృష్ట్యా భారతీయ జనతా పార్టీ ఆ రాష్ట్రంలో ప్రవేశించేందుకు ఇంత కష్టపడనక్కర్లేదు. బెంగాల్ మత రాజకీయాలకు ఎప్పుడూ అతీతం కాదు. 1905లో హిందూ జనాభా ఎక్కువగా ఉన్న బెంగాల్‌ పశ్చిమ ప్రాంతాలను, ముస్లింలు అధికంగా ఉన్న బెంగాల్‌ తూర్పు ప్రాంతాలు, అస్సాంను వేరు చేస్తూ బ్రిటిష్ వైస్రాయ్ లార్జ్ కర్జన్ తీసుకున్న నిర్ణయం స్వదేశీ ఉద్యమానికి దారితీసింది. ప్లాసీ యుద్ధంలో బెంగాల్ చివరి నవాబును బ్రిటిష్‌ వారు ఓడించక ముందు నుంచే హిందూ ముస్లింల మధ్య సామాజిక ఘర్షణలు జరిగాయి. స్వాతంత్ర్యోద్యమంలో బెంగాల్ జాతీయవాదం కీలక ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. బెంగాల్ చైతన్యశీలతపై కీలక ప్రభావం చూపిన రామకృష్ణ పరమహంస, వివేకానందుడు, బంకించంద్ర ఛటర్జీ బెంగాల్‌లో పెల్లుబికిన నూతన జాతీయవాదానికి కారకులయ్యారు. బెంగాల్ యువతే ఎప్పుడో ఒకప్పుడు భారత్‌కు ఆధ్యాత్మిక మహోన్నతిని సాధిస్తుందని వివేకానందుడు విశ్వసించారు. బంకించంద్ర ఛటర్జీ బెంగాల్‌లోని శాక్తేయవాదాన్ని, వైష్ణవ ధర్మాన్ని సమ్మిళితం చేసి, దేశభక్తి భావాలను పురిగొల్పేందుకు ఉపయోగించుకున్నారు. ముస్లిం పాలకులకు వ్యతిరేకంగా సాధువులు తిరుగుబాటు చేసిన వైనాన్ని ఆయన తన నవల ‘ఆనంద్ మఠ్’లో అభివర్ణించారు. స్వదేశీ స్ఫూర్తి బెంగాల్‌లోనే ప్రారంభమై దేశమంతటా విస్తరించిందని, అందుకు కర్జన్ చేపట్టిన విభజనే కారణమని గాంధీజీ దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన తర్వాత ఒక వ్యాసంలో రాశారు. గాంధీజీ నాయకత్వానికి, కాంగ్రెస్ పనితీరుకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసింది తొలుత బెంగాలీ జాతీయవాదులే. అరబిందోఘోష్, చిత్తరంజన్‌దాస్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ వీరిలో ప్రముఖులు. స్థూలంగా చెప్పాలంటే జాతీయవాదం, హిందూయిజం, ముస్లిం వ్యతిరేకత బెంగాల్ రాజకీయాల్లో అంతర్లీనంగా సాగాయి. 1946లో దేశ విభజన వాతావరణం నెలకొన్న సమయంలో హుసేన్ షహీద్ సుహ్రావర్దీ హయాంలో జరిగిన హింసాకాండ, నౌఖాలీ అల్లర్లు చరిత్ర పుటల్లో కల్లోల ఘటనలుగా మిగిలిపోయాయి. కలకత్తాలో హిందువుల ఊచకోతను తీవ్రంగా వ్యతిరేకించిన హిందూ మహాసభ నాయకుడు శ్యామా ప్రసాద్ ముఖర్జీ దేశంలో తొలి హిందూవాద పార్టీ జనసంఘ్‌ను స్థాపించారు. ఆయన కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని తీవ్రంగా వ్యతిరేకించారు.


ఇంత సానుకూల వాతావరణం ఉన్నప్పటికీ.. ఆవిర్భవించిన నాలుగున్నర దశాబ్దాలకు గానీ, మోదీ అధికారంలోకి వచ్చిన పన్నెండు సంవత్సరాలకు గానీ పశ్చిమ బెంగాల్‌లో జయపతాకను బీజేపీ ఎగురవేయలేకపోయింది. భారతీయ సాంస్కృతిక పునరుజ్జీవం ప్రారంభమయింది బెంగాల్‌లో. దేశంలో సంఘ సంస్కరణలకు శ్రీకారం చుట్టింది కూడా బెంగాలే. దేశమంతటా విస్తరించిన మావోయిజం బెంగాల్‌లోనే ప్రభవించింది. బెంగాల్‌లోనే వామపక్ష శక్తులు మూడు దశాబ్దాలు రాజ్యమేలి ఇప్పుడు ఉనికికోసం పోరాడుతున్నాయి. బెంగాల్‌లోనే దీదీ పాలన దశాబ్దంన్నర పాటూ సాగింది. గడచిన శతాబ్దంలో బెంగాల్ ఉదారవాద, స్వేచ్ఛావాద లౌకిక శక్తులకు, పలు భావాల సంఘర్షణకు, చైతన్యానికి ప్రతీకగా మారింది. రవీంద్రుడు మొదలు ఎందరో కళాకారులు, రచయితలు, గొప్ప సినీ దర్శకులు, నటులు, గాయకులు వంగభూమిలో ఉద్భవించారు. మరి ఇలాంటి బెంగాల్‌లో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ప్రభంజనం వీయడానికి కారణాలు ఏమిటి? సీపీఐ(ఎం) మాజీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అంగీకరించినట్లు.. వామపక్ష కార్యకర్తలే బీజేపీకి ఓటు వేసే వాతావరణం గత లోక్‌సభ ఎన్నికల సందర్భంగా బెంగాల్‌లో ప్రవేశించింది. బెంగాల్ తన మూలాలను వెతుక్కుందా? తన అస్తిత్వాన్ని జాతీయవాదంలో భాగం చేసిందా?

ఏమైనా, దేశ చరిత్రలో సంభవించిన అనేక మహోన్నత సంఘటనలకు కేంద్రంగా ఉన్న బెంగాల్‌లో జరిగిన ఈ రాజకీయ పెను మార్పునకు అంతర్లీన కారణాలు ఉండితీరతాయి. చరిత్రలో చోదకశక్తులు లేకపోతే ఏ భావనలూ భౌతిక శక్తిగా మారి పెల్లుబికే అవకాశాలుండవు. ఇప్పుడు బెంగాల్‌లో అదే జరిగిందని, అక్కడ జనం తమకోసం చేస్తున్న నిరీక్షణ ముగిసిందని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. బీజేపీ నేతలు చరిత్ర చేసిన పాత గాయాలను రేపి, ప్రజల్లో హిందూత్వ భావనలను రేకెత్తించడంలో సిద్ధహస్తులు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ విస్తృత కార్యకలాపాలు సరైన సమయంలో ఆజ్యం పోసేందుకు ప్రాతిపదిక కల్పిస్తాయి. ఏమైనా, నిద్రాణమైన బెంగాల్‌ ఆత్మ మళ్లీ మేల్కొంది. ఈ ఆవాహన ఏ పరిణామాలకు దారితీయనున్నదో ఇప్పుడే చెప్పడం కష్టం.

బెంగాల్‌లో చొరబాటుదారుల వల్ల హిందువుల అస్తిత్వానికి నష్టమని, ముస్లింలకు మమతా బెనర్జీ ఇస్తున్న ప్రాధాన్యం జాతీయ భద్రతకు ప్రమాదకరమని ఎంతోకాలంగా ప్రచారం చేస్తున్న బీజేపీ, దాని మద్దతుదారులు ఈసారి విజయవంతమయ్యారు. పెద్ద ఎత్తున బలగాల్ని దించి, భయం వర్సెస్ భద్రత అన్న వాతావరణం ఏర్పరిచారు. ఎన్నికల కమిషన్‌ సహా అన్ని వ్యవస్థలూ వారికి అనుకూలంగా ఉన్నాయన్న ధీమా ఏర్పరిచారు. గత లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 40శాతం ఓట్లు సాధించిన బీజేపీ ఈసారి అదనంగా మరో 5శాతం ఓట్లు సాధించేందుకు తీవ్ర యత్నాలు చేసి సఫలమయింది. ఈ ఎన్నికలను ఒక యుద్ధంలా భావించి పోరాడింది. ముస్లిం ఓటు బ్యాంకు తమ రాజకీయ సమీకరణాలను ప్రభావితం చేసే అవకాశాలు లేవని బీజేపీ మరోసారి రుజువు చేసింది.


బెంగాల్‌లో బీజేపీ గెలుపు తర్వాత జాతీయ స్థాయిలో ప్రతిపక్షాలు తమ భవిష్యత్ గురించి పునరాలోచన చేయడం సహజం. ఈ ఓటములను ఎదుర్కొని లోక్‌సభ ఎన్నికలకు సమాయత్తం అయ్యేందుకు మరోసారి అన్ని శక్తులను ఏకం చేసే అవకాశం కాంగ్రెస్‌కు లేకపోలేదు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ను పూచిక పుల్లలా తీసిపారేసిన మమతా బెనర్జీ, స్టాలిన్ ఇప్పుడు కాంగ్రెస్‌తో కలిసి పనిచేయక తప్పని పరిస్థితి నెలకొన్నది. బెంగాల్‌లో మమతా బెనర్జీ, తమిళనాడులో స్టాలిన్ ఓడిపోయినంత మాత్రాన వారి స్థానంలో బీజేపీని ఢీకొనగలిగిన శక్తి కాంగ్రెస్‌కు లేదు. మూడు దశాబ్దాల క్రితం సినీనటుడు రజనీకాంత్‌ను పీవీ నరసింహారావు ఢిల్లీకి పిలిపించి, మాట్లాడి కూడా ఆయనను రాజకీయాల్లోకి ప్రవేశించేలా చేయలేకపోయారు. అదే జరిగి ఉంటే ఇప్పుడు పరిణామాలు భిన్నంగా ఉండేవి. ఇప్పుడు కూడా సినీనటుడు విజయ్‌కు స్నేహహస్తం చాచేందుకు కాంగ్రెస్ తటపటాయించి వెనుకడుగు వేసింది. అందుకు కర్ణాటక నేత డీకే శివకుమార్ కారణమంటున్నారు. తమిళనాడులో టీవీకే విజయం నేటి తరం జెన్ జీ యువత వల్ల వచ్చిందని, ఇదే యువత 2029లో మోదీకి వ్యతిరేకంగా ఓటు వేసి కాంగ్రెస్‌ను అధికారంలోకి తెస్తుందని రాహుల్‌గాంధీ సన్నిహితుడొకరు వ్యాఖ్యానించారు. ఈ ఆలోచన ‘ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్లు’ అన్న సామెతను గుర్తు చేస్తోంది. రాజకీయ శూన్యం ఉన్న చోటల్లా బీజేపీలా విస్తరించగల సామర్థ్యం లేకపోవడం మాత్రమే కాదు, బీజేపీని ముఖాముఖి ఓడించగల సామర్థ్యాన్ని కూడా కాంగ్రెస్ సంపాదించుకోలేకపోతోంది. అస్సాంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి రావడమే ఇందుకు నిదర్శనం. కేరళలో పదేళ్ల ఎల్డీఎఫ్ ప్రభుత్వాన్ని ఓడించి యూడీఎఫ్ అధికారంలోకి రావడం సహజంగానే జరిగి ఉండవచ్చు కానీ, ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటే తాము విస్తరించడం సహజమని బీజేపీ నేతలు భావిస్తున్న విషయాన్ని విస్మరించరాదు.

బీజేపీలో ఉండే యుద్ధ స్ఫూర్తి, ఎంతో ముందుగా వ్యూహాలు రూపొందించే శక్తి, పోలింగ్‌ బూత్‌ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయగలిగిన సామర్థ్యం కాంగ్రెస్‌లో కొరవడిన విషయం స్పష్టమవుతోంది. అయిదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతుండగానే మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ పేరిట దేశం దృష్టి మళ్లించి పెద్ద ఎత్తున మహిళలను తమవైపు తిప్పుకునేందుకు యత్నాలు చేసింది. ఇదే సమయంలో పంజాబ్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆప్ ఎంపీలను లోబరుచుకుంది. తెలంగాణలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటన తేదీని ఖరారు చేశారు. రాష్ట్రంలో చాప కింద నీరులాగా గ్రామ స్థాయి నుంచి బూత్‌ స్థాయి కమిటీల నియామకం, సదస్సుల నిర్వహణ ఎప్పుడో ప్రారంభమైంది. పలు చోట్ల హిందూ ధార్మిక సమ్మేళనాలు జరుగుతుంటే అవెందుకో తెలియని స్థానిక కాంగ్రెస్ నేతలు అందులో పాల్గొనడం విస్మయాన్ని కలిగిస్తోంది. రాజకీయాలు పార్ట్ టైమ్ వ్యాపకాలు కావు. బీజేపీ పైన, మోదీ పైన ఎన్ని విమర్శలైనా గుప్పించవచ్చు కానీ అవి జనాన్ని ప్రభావితం చేయగలుగుతున్నాయా అన్నదే అసలు ప్రశ్న. బీజేపీని ఎదుర్కోగల బలమైన పార్టీ యంత్రాంగాన్ని, అహర్నిశలూ పనిచేయగలిగిన కేడర్‌ను, ప్రజల్లోకి ప్రవేశించగల సైద్ధాంతిక భావనలను సృష్టించుకోకపోతే పార్లమెంట్‌లోనో, సభల్లోనో చేసే విన్యాసాలు ప్రహసనాలుగానే మిగిలిపోతాయి.

ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

ఈ వార్తలు కూడా చదవండి..

పాస్టర్లకు ఎస్సీ కుల ధృవీకరణ పత్రాలపై విచారణ.. వాయిదా వేసిన హైకోర్టు

హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు భారీ ఆపరేషన్.. 56 మంది అరెస్ట్

For More AP News And Telugu News

Updated Date - May 06 , 2026 | 03:05 AM