విపక్ష వైరుధ్యాలే బీజేపీ విజయ సోపానాలు
ABN , Publish Date - Jan 21 , 2026 | 12:43 AM
‘భారత రాజకీయాల్లో కులం పోషించే సంక్లిష్ట పాత్రను గుర్తించడంలో కమ్యూనిస్టులు విఫలమయ్యారని అంగీకరించాలి. అదే విధంగా ప్రజలపై మతం ప్రభావాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడంలో కూడా మేము...
‘భారత రాజకీయాల్లో కులం పోషించే సంక్లిష్ట పాత్రను గుర్తించడంలో కమ్యూనిస్టులు విఫలమయ్యారని అంగీకరించాలి. అదే విధంగా ప్రజలపై మతం ప్రభావాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడంలో కూడా మేము విఫలమయ్యాం. కమ్యూనిస్టులు అనుసరించే గతితార్కిక భౌతికవాదం ప్రజల చేతనలో భాగం కాలేదు’ అని మరియం అలెగ్జాండర్ బేబీ గత ఏడాది పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన తర్వాత ఒక ఇంటర్వ్యూలో అన్నారు. కేరళకు చెందిన బేబీ హయాంలోనే ఇవాళ కమ్యూనిస్టుల ఏకైక కోట అయిన ఆ రాష్ట్రంలో సీపీఐ(ఎం) నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్ అధికారం కోల్పోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది. ఆ స్థానంలో కాంగ్రెస్ సారథ్యంలోని ఎల్‌డీఎఫ్ పది సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నప్పటికీ కేరళలో పెరుగుతోన్న బీజేపీ ప్రభావాన్ని అడ్డుకోలేకపోతోంది. మతపరమైన సంప్రదాయాలు, విశ్వాసాల గురించి జనంలో ప్రస్తావించేటప్పుడు ఆచితూచి మాట్లాడాలని ప్రస్తుత కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా పార్టీ నేతలకు హితవు చెప్పారంటే కేరళలో బీజేపీ ప్రభావాన్ని ఆయన కూడా తక్కువ అంచనా వేయడంలేదనే చెప్పాలి. ఇవాళ దేశ వ్యాప్తంగా బీజేపీ విస్తరించడానికి వామపక్షాల వైఫల్యమే కారణమని సీపీఎం నేతల మాటల ద్వారానే అర్థం చేసుకోవచ్చు.
భారతీయ జనతా పార్టీ చరిత్రలో ప్రప్రథమంగా బిహార్‌కు చెందిన యువ నేత నితిన్ నబీ జాతీయ అధ్యక్షుడుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ వెలువరించిన ప్రసంగంలో ఒక కొత్త ఉత్సాహం కొట్టొచ్చినట్లు కనపడుతోంది. 2014లో ఢిల్లీలో అడుగుపెట్టినప్పటి నుంచీ మోదీ క్రమక్రమంగా పార్టీపై పట్టు బిగుస్తూ పార్టీ యావత్తూ తన కనుసన్నలలో నడుస్తూ, తాను ఎవరిని సూచిస్తే వారిని కిమ్మనకుండా పార్టీ జాతీయ అధ్యక్షుడుగా ఎన్నుకునేలా చేస్తున్నారు. ఇదేమీ చిన్నవిషయం కాదు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం, మహారాష్ట్రలో స్థానిక ఎన్నికల్లో అసాధారణ విజయం సాధించిన తర్వాత సంభవించిన పరిణామమిది. ముంబైతో సహా 25 ప్రధాన నగరాల్లో బీజేపీ జయకేతనం ఎగురవేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ రాబోయే ఎన్నికల్లో కేరళలో కూడా బీజేపీని ప్రజలు ఆదరిస్తారన్న ఆశాభావాన్ని ప్రధానమంత్రి వ్యక్తం చేశారు.
కేంద్రంలో మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ వ్యాప్తంగా రాజకీయాలు మారిపోతున్నాయి. మహారాష్ట్రలో అయితే మరీ వేగంగా మారుతున్నాయి. థాకరే, శరద్ పవార్ పార్టీలను చీల్చడంలో బీజేపీ విజయవంతమయింది. క్రమంగా కాంగ్రెస్ కానీ, ప్రాంతీయ పార్టీలు కానీ బీజేపీని ఎదుర్కోవడంలో విఫలమయ్యే పరిస్థితి ఏర్పడింది. ఈ విషయం ఇటీవల మహారాష్ట్ర మునిసిపల్ ఎన్నికల్లో మరింత స్పష్టమైంది. ఈ పార్టీలు విఫలమయినప్పుడు దేశంలో ముస్లిం ఓటర్లు తమకొక ప్రత్యామ్నాయం కోసం అన్వేషిస్తారని, ఏఐఎంఐఎం వంటి పార్టీని ఆశ్రయిస్తారని ఈ ఎన్నికలు తేల్చాయి. మహారాష్ట్రంలో థాకరే, పవార్ కుటుంబాలు మొదటి నుంచీ బలంగా ఉన్న ప్రాంతాల్లో సైతం తమ పట్టును కోల్పోయాయి. మోదీ జాతీయ స్థాయిలో అడుగుపెట్టకముందు మహారాష్ట్రలో బలహీనంగా ఉన్న బీజేపీ ఇప్పుడు ఆ రాష్ట్ర రాజకీయాల్లో కేంద్ర శక్తిగా మారింది. బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ ఏకమై తాత్కాలిక విజయం సాధించినప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ కూటమి తుడిచిపెట్టుకుపోయింది. గ్రామ పంచాయతీ, మునిసిపల్ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి ప్రబల శక్తిగా ఆవిర్భవించింది. 2014కు ముందు 15 సంవత్సరాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయాల్లో తన స్థానమేమిటో తేల్చుకోలేని అగమ్యగోచర స్థితిలో ఉన్నది. గుజరాత్, బిహార్, ఒడిషాలో మాదిరి మహారాష్ట్రలో కూడా బీజేపీ అధికారం సుస్థిరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశంలో అతి పెద్ద పార్టీగా ఇప్పటికే విస్తరించిన బీజేపీ స్వాతంత్ర్యానంతరం కొన్ని దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీకి లభించిన ప్రాబల్యాన్నే సాధించిందనడంలో అతిశయోక్తి లేదు. కాంగ్రెస్, వామపక్షాలు, ఇతర బీజేపీయేతర పార్టీల సైద్ధాంతిక వైఫల్యానికి ఇది నిదర్శనం.
కొత్త జాతీయ అధ్యక్షుడు ఎన్నికైన సమయంలో మహారాష్ట్ర స్థానిక ఎన్నికల తర్వాత కేరళ గురించి మోదీ ప్రస్తావించడం గమనార్హం. జనవరి 23న కేరళలో పర్యటించనున్న మోదీ ఆ రాష్ట్రంలో బీజేపీ ఎంతో కొంత కాలుమోపడంపై ఉత్సాహంతో ఉన్నారనడంలో సందేహం లేదు. 1980లో బీజేపీ ఆవిర్భవించిన తర్వాత దాదాపు రెండున్నర దశాబ్దాల వరకూ కేరళలో ఆ పార్టీకి ఉనికి కూడా లేదు. 2016లో బీజేపీ తొలి అసెంబ్లీ సీటు గెలుచుకుని అనేక నియోజకవర్గాల్లో ఓట్ల శాతాన్ని పెంచుకుంది. అయిదారు కార్పొరేషన్లలో ప్రతిపక్ష స్థానం సాధించింది. 2024లో తొలి లోక్‌సభ సీటును సాధించడమే కాక 19 శాతం ఓట్లను దక్కించుకుంది. అయిదు లోక్‌సభ సీట్లలో బీజేపీకి రెండు లక్షలకు పైగా ఓట్లు లభించాయి. 11 అసెంబ్లీ సెగ్మెంట్లలో అధిక ఓట్లు సాధించగా, 9 సీట్లలో రెండవ స్థానం సాధించింది.
గత ఏడాది కేరళ స్థానిక ఎన్నికల్లో తొలి మునిసిపల్ కార్పొరేషన్‌ను దక్కించుకుంది. రాష్ట్ర రాజధాని అయిన తిరువనంతపురం మునిసిపల్ కార్పొరేషన్‌లో 50 సీట్లు సాధించి 45 సంవత్సరాలుగా వామపక్ష ఫ్రంట్ గుప్పిట్లో ఉన్న అనేక స్థానాలను కైవసం చేసుకుంది. 174 గ్రామపంచాయతీలు, 4 జిల్లా పంచాయతీలు, నాలుగు సిటీ కార్పొరేషన్లు దక్కించుకున్న బీజేపీ కేరళలో దాదాపు 15 శాతం ఓట్లు సాధించగలిగింది. అన్నిటికన్నా ఎక్కువగా తిరువనంతపురంలో 23 శాతం దక్కించుకోగా, అనేక చోట్ల 19 శాతం ఓట్లను సాధించింది. క్రమంగా కేరళలో యూడీఎఫ్, ఎల్‌డీఎఫ్‌ల తర్వాత బీజేపీ మూడో స్థానం కోసం ఉరకలు వేస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 33 స్థానాల్లో 30 నుంచి 65వేల ఓట్ల వరకు సాధించిన బీజేపీ ఈ సారి ఓట్ల శాతం పెంచుకుంటుందనడంలో సందేహం లేదు. ఎన్ని సీట్లు గెలుచుకుంటుందో చెప్పలేము కాని దాదాపు 40- నుంచి 60 సీట్లలో బీజేపీ దాదాపు 20 శాతం ఓట్లను సాధించే అవకాశాలు లేకపోలేదు.
ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ వయనాడ్ సీటులో విజయం సాధించినప్పటికీ 2021 అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాల చేతుల్లో తాము రెండవసారి ఎందుకు ఓడిపోయిందీ ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ నేతలకు అర్థం కావడం లేదు. అయితే పదేళ్ల వామపక్ష ఫ్రంట్ సర్కార్ పట్ల వ్యతిరేకత మాత్రం కొట్టొచ్చినట్లు కనపడుతోంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 20 లోక్‌సభ సీట్లు సాధించడం, గత ఏడాది స్థానిక ఎన్నికల్లో అత్యధిక స్థానాలు దక్కించుకోవడం కేరళలో కాంగ్రెస్ పునరుత్థానాన్ని సూచిస్తోంది. సాధారణంగా అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా స్థానిక ఎన్నికల్లో తన సత్తా చూపిస్తుంది. కాని కేరళలో అలా జరగలేదంటే ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉన్నదన్నమాటే. అత్యధిక నిరుద్యోగం, పేదరికంతో పాటు భారీ ఎత్తున నిరుత్పాదక వ్యయం, మౌలిక సదుపాయాలు లేకపోవడం వంటి సమస్యలతో పాటు పినరయి విజయన్ ప్రభుత్వంపై గోల్డ్ స్మగ్లింగ్, శబరిమల బంగారం చోరీ వంటి అనేక ఆరోపణల మూలంగా వామపక్ష ప్రభుత్వం అధికారం కోల్పోయే ప్రమాదంలో ఉన్నది. ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే, స్థానిక ఎన్నికల్లో ప్రజలకు సీపీఐ(ఎం)ని ఎంత అసహ్యించుకుంటున్నారో తేలిందని, ఆ పార్టీ అహంకారమే దాన్ని ప్రజల నుంచి దూరం చేసే పరిస్థితికి దారి తీసిందని, యూడీఎఫ్‌లో భాగస్వామి అయిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి బినయ్ విశ్వం తీవ్రంగా విమర్శించారు. పినరయి విజయన్ ప్రభుత్వం తీసుకున్న కొన్ని హిందూత్వ అనుకూల చర్యల మూలంగా ముస్లిం ఓటర్లకు సీపీఐ(ఎం) కంటే కాంగ్రెస్ ఎక్కువ లౌకికవాద పార్టీగా కనపడడంలో ఆశ్చర్యం లేదు.
స్థానిక ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆధిక్యత కనపరచిన కాంగ్రెస్‌కు ఈ పరిస్థితుల్లో అవలీలగా అధికారం దక్కాలి. కాని కాంగ్రెస్‌కు ప్రధాన సమస్య ముఠా రాజకీయాలు. ఏకే ఆంటోనీ, వాయలార్ రవి, ఊమెన్ చాందీ వంటి నేతలు ఇప్పుడు లేరు. సీనియర్ నేత రమేశ్ చెన్నితల, ప్రతిపక్ష నేత వీడీ సతీశన్, కె.సుధాకరన్, సన్నీజోసెఫ్‌తో పాటు పలువురు ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నారు. లోక్‌సభకు ఎన్నికైన కాంగ్రెస్ ఎంపీల్లో సగం మందికి పైగా అసెంబ్లీకి పోటీ చేసి ముఖ్యమంత్రి పదవినో, మంత్రిపదవినో దక్కించుకోవాలని చూస్తున్నారు. ముస్లింలీగ్, కేరళ కాంగ్రెస్, ఆర్ఎస్‌పీలతో కూడా సీట్లు సర్దుబాటు చేసుకోవడం సులభం కాదు. బిహార్‌లో కాంగ్రెస్ వైఫల్యం తర్వాత కేరళలో ఆ పార్టీ తన అంతర్వైరుధ్యాలను పరిష్కరించుకుని సంఘటితంగా ఎంతమేరకు విజయం సాధించగలదో ఇప్పుడే చెప్పలేం. కేరళలో కాంగ్రెస్ గెలిస్తే ఆ పార్టీ చేతిలో తెలంగాణ, కర్ణాటక తర్వాత మరో రాష్ట్రం చేరుతుంది. దీనివల్ల పార్టీకి నైతిక స్థైర్యం పెరుగుతుందనడంలో సందేహం లేదు.
ఇప్పటికే పశ్చిమబెంగాల్, త్రిపురలో పూర్తిగా పట్టు కోల్పోయిన సీపీఐ(ఎం) తన చివరి కోట కేరళను సైతం కోల్పోయే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. 1970 తర్వాత మొదటిసారి దేశంలో ఎక్కడా ఉనికిలోలేని దుస్థితిని ఈ వామపక్షం ఎదుర్కొంటోంది. ఆ పార్టీ సంస్థాగత సామర్థ్యాన్ని, జాతీయ ఆవశ్యకతను ఇది ప్రశ్నార్థకం చేయనున్నది. బీజేపీ వ్యూహాత్మకంగా దక్షిణ, కేంద్ర ప్రాంతాల్లోని హిందూ మెజారిటీ ప్రాంతాల్లో వ్యాప్తి చెందడం మరో కీలక పరిణామం. తిరువనంతపురం, పలక్కాడ్, త్రిసూర్‌లలో పట్టణ హిందూ ఓటర్లు బీజేపీ వైపు మళ్లడమే ఇందుకు నిదర్శనం. దేశంలో బీజేపీయేతర ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేయడంలో అన్నిరకాల వామపక్షాల పాత్ర క్షీణిస్తోంది. ‘పోనీ దేశంలో ఉన్న రకరకాల వామపక్షాలన్నీ ఏకమై ఒక బలమైన శక్తిగా ఏర్పడొచ్చు కదా’ అని సీపీఐ నేత నారాయణను అడిగితే ‘సీపీఐ(ఎం) మూర్ఖత్వమే అందుకు అడ్డు’ అని ఆయన జవాబిచ్చారు! ప్రాంతీయ పార్టీలు ముక్కలు ముక్కలు కావడం, ప్రత్యామ్నాయ శక్తులన్నీ సంఘటితం కాకపోవడమే బీజేపీకి శ్రీరామరక్ష!
ఎ. కృష్ణారావు
(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)
ఈ వార్తలు కూడా చదవండి.
అబూ సలేంకు పెరోల్ ఇవ్వొద్దు.. ముంబై కోర్టుకు తెలిపిన మహారాష్ట్ర ప్రభుత్వం
నితిన్ నబీన్‌కు జడ్ కేటగిరీ సెక్యూరిటీ
Read Latest National News