కనపడని ఎప్‌స్టీన్‌ల మాటేమిటి?
ABN , Publish Date - Feb 18 , 2026 | 01:21 AM
కనీవినీ ఎరుగని అకృత్యాలకు పాల్పడ్డ జెఫ్రీ ఎడ్వర్డ్ ఎప్‌స్టీన్‌కు సంబంధించి అన్ని ఫైళ్లను విడుదల చేశామని అమెరికా అటార్నీ జనరల్ పామ్ బాండీ వెల్లడించిన రెండు రోజుల్లోనే తాను నిర్దోషి అన్న విషయం రుజువయిందని, ఆ నేరస్థుడితో తనకు...
కనీవినీ ఎరుగని అకృత్యాలకు పాల్పడ్డ జెఫ్రీ ఎడ్వర్డ్ ఎప్‌స్టీన్‌కు సంబంధించి అన్ని ఫైళ్లను విడుదల చేశామని అమెరికా అటార్నీ జనరల్ పామ్ బాండీ వెల్లడించిన రెండు రోజుల్లోనే తాను నిర్దోషి అన్న విషయం రుజువయిందని, ఆ నేరస్థుడితో తనకు ఎలాంటి సంబంధాలు లేవని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ ఫైళ్లలో ట్రంప్ పేరు 38వేల సార్లు ప్రస్తావితమయినప్పటికీ, వాటిలో పేర్లు దొర్లినంత మాత్రాన అందరికీ ఎప్‌స్టీన్ ఘోర కృత్యాలతో సంబంధం ఉన్నట్లు కాదని కూడా అమెరికా న్యాయశాఖ ప్రకటించింది. ఎప్‌స్టీన్ ఈ–మెయిల్స్‌లో ఉన్నవారి పేర్లపై, ఇంటర్నెట్‌లో వస్తున్న రకరకాల ఫోటోలపై మరికొంత కాలం సోషల్ మీడియాలో అనేకానేక వదంతులు రావచ్చు కాని అమెరికానే కాకుండా ఎన్నో దేశాలను కుదిపివేసిన ఎప్‌స్టీన్ ఉదంతానికి తెరదించే ప్రయత్నం చాలా బలంగా జరుగుతోంది. నిజానికి 2019లో ఎప్‌స్టీన్ అమెరికా జైలులో శవమయి తేలినప్పుడే అతడి నేరాలకు మసిపూసి మారేడుకాయ చేసే ఘట్టంలో ఒక ప్రధాన అంకం ముగిసినట్లయింది. అమెరికా ప్రధాన పార్టీల అగ్రనాయకులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా అనేకమంది నేతలు, వ్యాపారవేత్తలు, ప్రముఖులకు ఎప్‌స్టీన్‌తో ఉన్న సంబంధాల విషయమై తామిక ప్రకటించాల్సింది ఏమీ లేదని అమెరికా న్యాయ శాఖ చెప్పడంతో అనేకమంది ఊపిరి పీల్చుకునే ఉంటారు. పైకి మర్యాదగా కనిపించే ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లోని డొల్లతనం, రాజకీయ వ్యవస్థల్లోని మురికి ఉబికి బయటకు వచ్చి తమను ముంచేయడాన్ని వారెలా ఆహ్వానిస్తారు?
ఎప్‌స్టీన్ పైళ్లు బయటపడితే ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వానికీ ముప్పు వాటిల్లవచ్చని ఆయన ప్రత్యర్థులు అనేకమంది భావించారు. అయితే అది టీ కప్పులో తుఫానుగానే తేలిపోయింది. ట్రంప్ పని నిమిత్తమై మోదీ ఇజ్రాయిల్ వెళ్లారనే విషయం మినహా ఆ ఈ–మెయిల్స్‌లో మోదీ గురించి ఇంకెలాంటి ప్రస్తావన ఎక్కడా లేదు. ఇక కేంద్రమంత్రి హర్దీప్‌సింగ్ పూరి గురించి అనేకసార్లు ప్రస్తావనకు వచ్చినప్పటికీ ఎప్‌స్టీన్ నేర కార్యకలాపాల్లో ఆయన పాల్గొన్నారని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. తాను ఒక అంతర్జాతీయ శాంతి సంస్థలో పనిచేస్తున్నప్పుడు, ఒక ప్రతినిధి వర్గంలో సభ్యుడుగా ఉన్న ఎప్‌స్టీన్ తనకు పరిచయమయ్యారని, ఆ తర్వాత భారత్‌కు ప్రయోజనాలు సమకూర్చేందుకు అతడి సహాయం తీసుకున్నానని హర్దీప్‌సింగ్ వాదిస్తున్నారు. భారత విదేశాంగశాఖ నుంచి 2013లో పదవీవిరమణ చేసిన హర్దీప్‌సింగ్ 2019లో కేంద్ర మంత్రి మండలిలో నియమితులయ్యారు. మాజీ దౌత్యవేత్తకు ప్రధాని మోదీ అనేక కీలక బాధ్యతలు అప్పజెప్పారంటే అంతర్జాతీయ స్థాయిలో ఆయనకు, దేశానికి ఉపకరించే పనులు హర్దీప్‌సింగ్ చేసిపెట్టే ఉంటారనడంలో అతిశయోక్తి లేదు.
ఎప్‌స్టీన్ వ్యవహారం ఏమి చెబుతోంది? భారతదేశంలోనే కాదు, మరే దేశంలో కూడా న్యాయపాలన సమానంగా లేదని స్పష్టం చేస్తోంది. వ్యక్తుల సంపద, పలుకుబడి, సామాజిక హోదాతో సంబంధం లేకుండా అందరికీ సమానంగా న్యాయం లభించే అవకాశం ప్రపంచంలో ఎక్కడా లేదని, దర్యాప్తు ప్రక్రియలో సంస్థాగత బలహీనతలు అంతటా ఉంటాయని వెల్లడించింది. ఆర్థిక శక్తి, రాజకీయ పలుకుబడి దన్నుతో నేర న్యాయ విచారణ వ్యవస్థను లెక్కచేయకుండా ఘోర కృత్యాలకు పాల్పడే తత్వం ప్రబలిపోవడం ఆధునిక న్యాయవ్యవస్థకు ఒక ప్రధాన సవాలుగా ఉన్నది.
మైనర్ బాలికల అక్రమ రవాణాకు ఎప్‌స్టీన్ పాల్పడ్డాడన్న ఆరోపణలు 2005లోనే వచ్చినప్పటికీ అమెరికా న్యాయవ్యవస్థ పట్టించుకోలేదు. 2008లో అరెస్టయినప్పుడు తనపై అభియోగాన్ని ఎప్‌స్టీన్ అంగీకరించాడు. తద్వారా తనపై న్యాయవిచారణ తీవ్రత తగ్గించుకునే అతడి ప్రయత్నాలకు న్యాయవ్యవస్థ తల ఒగ్గింది. కొద్ది నెలలు కస్టడీలో ఉన్నప్పటికీ ఆ సమయంలో తన పలుకుబడితో చట్టవిరుద్ధ కార్యకలాపాలు యథావిధిగా జరిపినా చూసీ చూడనట్లు ఊరుకుంది. బాధితుల ఆక్రందనలు, కొత్త ఆరోపణలు వెల్లువెత్తడంతో 11 ఏళ్ల తర్వాత 2019లో అతడిపై కేసు మళ్లీ తెరిచి చివరకు అరెస్ట్ చేశారు. అరెస్టయిన కొద్ది రోజులకే జైలులలో ఎప్‌స్టీన్ అనుమానాస్పద స్థితిలో మరణించాడు. అది ఆత్యహత్యగా నిర్ధారించారు. మీడియా వార్తలు, ప్రజల డిమాండ్ల వల్ల ఎప్‌స్టీన్ ఫైళ్లను విడుదల చేశారు. ఎందరో హేమాహేమీల పేర్లు బయటకు వచ్చి సంచలనం సృష్టించాయి
విషాదకరమైన విషయం ఏమంటే ప్రపంచమంతా ఇలాంటి ఎప్‌స్టీన్‌లతోనే నిండిపోయింది. రాజకీయ, ఆర్థిక వ్యవస్థల్లో ఉన్న లొసుగులను ఉపయోగించుకుని ఎప్‌స్టీన్ లాంటి వ్యక్తులు పెద్ద మనుషులుగా వెలిగిపోతుంటారు. ఎలాంటి డిగ్రీ అంటూ లేకపోయినా ఒకప్పుడు టీచర్‌గా పనిచేసిన ఎప్‌స్టీన్ చనిపోయే నాటికి 600 మిలియన్ డాలర్ల ఆస్తులకు అధిపతి. న్యూయార్క్ నగరంలో అతి పెద్ద విలాసవంతమైన బంగళా, రెండు ద్వీపాలు, న్యూమెక్సికో, పారిస్‌లలో ఇళ్లు, అనేక కార్లు, ప్రైవేట్ విమానాలు, పలు సంస్థల్లో భారీ పెట్టుబడులు ఆయనకు ఉన్నాయి. ఇవన్నీ ఎలా వచ్చాయి?
అమెరికా అధ్యక్షులు ట్రంప్, బైడెన్, క్లింటన్; కుబేరులు ఎలాన్ మస్క్, మెలీనా ట్రంప్, బిల్‌గేట్స్‌తో పాటు అనేక మంది దేశాధినేతలు, వ్యాపార ప్రముఖులు, ఉన్నతాధికారులతో సంబంధాలు నెలకొల్పుకుని పబ్బం గడుపుకున్న వ్యక్తి ఎప్‌స్టీన్. కనీసం వంద దేశాల రాజకీయ నాయకులు, సీనియర్ దౌత్యవేత్తలు, 200 మందికి పైగా బిలియనీర్లు, కార్పొరేట్ అధిపతులు అతడి ఉచ్చులో చిక్కుకున్నారు. అనేకమంది ప్రజా ప్రతినిధులకు, న్యాయవాదులకు, చివరకు మీడియా సంస్థలకు నిధులు అందించాడు. యూనివర్సిటీలు, పరిశోధనా సంస్థలకు ఆర్థిక సహాయమందించాడు. చివరకు నోమ్ ఛామ్‌స్కీ వంటి ప్రగతిశీల మేధావి కూడా అతడి ఆదరాన్ని పొందిన వారిలో ఉన్నారు. ఎప్‌స్టీన్ అనేక మందిని తన ప్రత్యేక విమానాల్లో తిప్పాడు. పలువురికి తన పామ్ బీచ్‌లోని బంగళాలో విలాసాలు చవి చూపించాడు. మోడలింగ్‌ను వృత్తిగా పెట్టుకున్న అనేకమంది యువతులను, మైనర్ బాలికలను లైంగిక అత్యాచారాలకు గురిచేయడమే కాక ప్రముఖులకు ఎర వేశాడు. యూరప్‌లో అనేక దేశాల్లో నాయకులకు నిధులు అందించి అక్కడి రాజకీయాలను తారుమారు చేశాడు. అతడితో సంబంధాల గురించి వెల్లడి కాగానే పది దేశాల్లో పెద్ద తలకాయలు రాజీనామాలు చేశాయి. అనేక దేశాల్లో దౌత్యవేత్తలు, మంత్రులు తప్పుకున్నారు. కొందరు పశ్చాత్తాపం ప్రకటించారు. అయితే అత్యధికులు స్తబ్దుగా ఉండిపోయారు. ‘ఏమైతేనేం డాక్యుమెంట్లు పుకార్లకు దారితీస్తాయి కాని వాటి ద్వారా కేసులను నిర్మించలేము’ అని అమెరికా న్యాయనిపుణుడొకరు అన్నారు. ఈ మొత్తం ప్రహసనం రాజకీయ నాయకులు, నేరచరితులు, బడా వ్యాపారవేత్తల మధ్య అంతర్గత సంబంధాలను వెలికితీసింది. రాజకీయ ఆర్థిక వ్యవస్థల చలన సూత్రాలను దళారులు, బ్రోకర్లు నిర్ణయిస్తారని తేల్చింది.
మన దగ్గర దళారులు లేరా? ఢిల్లీ వీధుల్లో తిరిగే దళారుల గురించి, ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఇతర కేంద్రమంత్రిత్వ శాఖల్లోనూ, పార్టీ కార్యాలయాల్లోనూ వారు నిర్వహించే పాత్ర గురించి, వాటిలో కనిపించే స్త్రీ పాత్ర గురించి దివంగత ప్రధానమంత్రి పాములపర్తి వెంకటనరసింహారావు తన ‘లోపలి మనిషి’ నవలలో లీలామాత్రంగా ప్రస్తావించారు. రక్షణ కొనుగోళ్లలో మధ్యదళారుల పలుకుబడి గురించి వాజపేయి హయాంలో సీవీసీ రూపొందించిన నివేదికను బయటకు పొక్కనివ్వలేదు. మధ్య దళారులను చట్టబద్దం చేయాలని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ సూచించినప్పటికీ పారదర్శకంగా ఆర్థిక లావాదేవీలు వెల్లడించడానికి ఎవరు సిద్ధపడతారు?
గ్లోబల్ పెట్టుబడిదారీ విధానం పూర్తిగా సంపద, సామాజిక, రాజకీయ నెట్‌వర్క్‌ల ద్వారానే నడుస్తోంది. అధికారం తరుచూ అధికారిక హోదాల ద్వారా కాకుండా నెట్‌వర్క్‌ల ద్వారా సాగుతుంది. మన దేశంలో నెట్ వర్క్‌లు, లాబీయింగ్ పేరిట, కేసులను పరిష్కరించుకునేందుకు, అక్రమంగా సంపాదించిన నిధులు విదేశాలకు బదిలీ చేసేందుకు, బడా వ్యాపారవేత్తలకు ప్రయోజనాలు కల్పించేందుకు నాయకులే తహతహలాడుతున్నారు. ఈ క్రమంలో స్పాన్సరింగ్‌లు, లైంగిక కార్యకలాపాలు, ఖరీదైన బహుమతులు, విలాసవంతమైన హోటళ్లలో విందులు మొదలైనవి మామూలే. ఇవన్నీ అభివృద్ధి ముసుగులో జరుగుతుంటాయి. ఎవరిని ఎక్కడ ఉంచాలో అన్న విషయంలో నేతలు విచక్షణ పాటించడం లేదు. బాధాకరమైన విషయం ఏమంటే ఈ బ్రోకర్లు, దళారులు కొన్ని సందర్భాల్లో బాహటంగా దర్శనమిస్తున్నారు. అంతేనా? వారు చట్టసభల్లో సభ్యులు అయ్యేందుకు మన నేతలే దోహదం చేస్తున్నారు!
‘ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్’ నివేదిక ప్రకారం మన దేశం అవినీతిలో 182 దేశాల్లో 91వ స్థానంలో ఉన్నది. నేషనల్ క్రైమ్స్ రికార్డ్ బ్యూరో నివేదిక ప్రకారం ప్రతి 8 నిమిషాలకూ ఒక బాలిక మాయమవుతోంది. భారతదేశంలో సెక్స్ వ్యాపారం, చిన్నపిల్లల అక్రమ రవాణా గురించి సుప్రీంకోర్టు కూడా తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేసింది. మన వ్యవస్థలు ఏ విధంగా పనిచేస్తున్నాయో దీన్నిబట్టి అర్థమవడం లేదా? సనాతన ధర్మం, సాంప్రదాయం, రామరాజ్యం, దేశభక్తి, ధర్మం మొదలైన వాటి గురించి గంభీరంగా మాట్లాడే మన రాజకీయ నాయకులు నిజాయితీ, పారదర్శకత, జవాబుదారీ విధానంతో వ్యవహరిస్తున్నారా? దర్యాప్తు సంస్థలు, న్యాయవిచారణలు సక్రమంగా నడుస్తున్నాయా? చట్టాలకు నిబద్ధమైన వారిని వ్యవస్థలు కాపాడుతున్నాయా? అన్నిటికీ మించి నైతిక ప్రమాణాలను కాపాడగలుగుతున్నారా? అమెరికాలో కనీసం ప్రజల డిమాండ్ మేరకు ఒక దుర్మార్గుడికి సంబంధించిన డాక్యుమెంట్లను బహిర్గతం చేశారు. మన దేశంలో ఇలాంటి ఘోరమైన రహస్యాల గురించి ఎవరు చర్చిస్తారు?
ఎ. కృష్ణారావు
(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)
ఈ వార్తలు కూడా చదవండి...
జగన్ కుటుంబమే తిరుమల పవిత్రతని దెబ్బతీసింది.. అచ్చెన్నాయుడు ధ్వజం..
వేంకటేశ్వరస్వామితో ఆటలాడే వారెవరూ బతికి బట్టకట్టలేదు.. స్వామి శ్రీనివాసనంద సరస్వతి ఫైర్
Read Latest Telangana News And AP News And Telugu News