Share News

జ్ఞానేశ్‌ కుమార్‌.. రోజురోజుకీ భారం!

ABN , Publish Date - Oct 14 , 2026 | 02:30 AM

హనుమంతుడు తొలుత అశోక వనాన్ని ధ్వంసం చేశాడు. తర్వాత కింకరుల్ని హతమార్చాడు. జంబుమాలీ, మంత్రి కుమారులు, సేనాధిపతులూ కుప్పకూలిపోయారు. రావణుడి కుమారుడు అక్షకుమారుడినీ...

జ్ఞానేశ్‌ కుమార్‌.. రోజురోజుకీ భారం!

హనుమంతుడు తొలుత అశోక వనాన్ని ధ్వంసం చేశాడు. తర్వాత కింకరుల్ని హతమార్చాడు. జంబుమాలీ, మంత్రి కుమారులు, సేనాధిపతులూ కుప్పకూలిపోయారు. రావణుడి కుమారుడు అక్షకుమారుడినీ బండకేసి కొట్టి చంపాడు. చివరకు ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రం ప్రయోగించిన తరువాతే హనుమంతుడి ప్రతాపం తగ్గింది. గత రెండు, మూడు నెలలుగా దేశ రాజధానిలో చోటుచేసుకుంటున్న దృశ్యాలు చూస్తుంటే వాల్మీకి రామాయణంలోని సుందరకాండ ఘట్టాలు గుర్తుకు వస్తున్నాయి.

జూలై–ఆగస్టు నెలల్లో ప్రధాని మోదీ ప్రభుత్వాన్ని కాక్రోచ్‌ జనతా పార్టీ ఉక్కిరిబిక్కిరి చేసింది. అనేక ఎన్నికల యుద్ధాల్లో ఆరితేరిన ధర్మేంద్ర ప్రధాన్‌ను కేంద్ర మంత్రిమండలి నుంచి తొలగించడం మోదీకి అనివార్యమయింది. భారత ఎన్నికల సంఘం ప్రధానాధికారి జ్ఞానేశ్ కుమార్ రాజీనామాను డిమాండ్‌ చేస్తూ అక్టోబర్ 10న జంతర్ మంతర్ వద్ద మళ్లీ నిరసనకు పూనుకుంటామని సీజేపీ ప్రకటించేసరికి మోదీ సర్కార్ అప్రమత్తమైంది. రెండు రోజుల ముందే సరిహద్దు భద్రతా దళాలు, సాయుధ పోలీసు బలగాలు, కేంద్ర రిజర్వు పోలీసు బలగాలు, పారామిలటరీ దళాలు, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ రంగంలోకి దిగాయి. దాదాపు 50వేల మంది భద్రతా సిబ్బందికి తోడుగా ప్రైవేట్ దళాలు కూడా చేరాయని అంచనా. అడుగడుగునా బారికేడ్లు. పోలీసులు లాఠీలు ఝళిపించారు. రెండు, మూడు రోజుల పాటు న్యూఢిల్లీలో గాలి కూడా పూర్తిగా స్తంభించినట్లు కనపడింది. సీజేపీ నేతలు అభిజీత్‌ దీప్కే, సౌరవ్‌దాస్, అశుతోష్ రంకాలను విమానంలోనే అరెస్టు చేసి వేర్వేరు ప్రదేశాలకు తరలించారు. ఢిల్లీలోనే దాదాపు 10వేల మందిని అరెస్టు చేశారు. అనేకమంది ఆన్‌లైన్ వ్యాఖ్యాతలు, కార్యకర్తల్ని కస్టడీలోకి తీసుకున్నారు. అన్ని మెట్రో స్టేషన్లనూ మూసివేశారు. ఢిల్లీకి వచ్చే రైళ్లను రద్దు చేశారు. ఇంటర్నెట్‌ను నిలిపివేశారు. అయినప్పటికీ కన్నాట్ పస్‌లోనూ, జంతర్‌ మంతర్ వద్దకు చొచ్చుకువచ్చిన యువతీ యువకులనూ నిర్బంధించారు. మీడియానూ వదలలేదు. బస్సుల నుంచి తప్పించుకుపోకుండా, వాటిలోనే ఇనుప చువ్వలతో లాకప్‌లను నిర్మించారు. దేశ రాజధానిలో యువతరంగం ఉవ్వెత్తున ఎగిస్తే ఏమి జరుగుతుందో అని ప్రభుత్వం భయపడినట్టు ఈ చర్యలతో స్పష్టమయింది.


ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే సర్వోన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో కూడా సెక్షన్ 163 బీఎన్ఎస్ఎస్ కింద బ్యానర్లు కట్టారు. సుప్రీంకోర్టు ముందున్న లాయర్ల చాంబర్లలోకి ప్రవేశించి న్యాయవాదులను కూడా అరెస్టు చేశారు. సుప్రీంకోర్టు నుంచి మండీహౌస్‌కు ఊరేగింపుగా వెళుతున్న న్యాయవాదులను అరెస్టు చేసి, యమునా కాంప్లెక్స్‌కు తరలించారు. సీనియర్‌ న్యాయవాది దినేశ్ ద్వివేది వారిలో ఒకరు. ఎన్నికల కమిషన్ తరఫున వాదిస్తున్న రాకేశ్ ద్వివేదీకి ఆయన స్వయానా సోదరుడు. ‘అసలు సుప్రీంకోర్టులోనూ, సుప్రీంకోర్టు ముందు నిషేధాజ్ఞలు విధించేందుకు మీ అనుమతి తీసుకున్నారా?’ అని సీనియర్ న్యాయవాది గోపాల్‌శంకర్ నారాయణ్ అడిగిన ప్రశ్నకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఎలాంటి సమాధానమూ ఇవ్వలేదు. తనకూ ఈ నిషేధాజ్ఞల గురించి తెలియదని ప్రభుత్వ ప్రధాన న్యాయవాది సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అన్నారు. న్యాయవాదుల అరెస్ట్‌ను సుప్రీంకోర్టు, హైకోర్టు బార్ అసోసియేషన్లూ, అడ్వకేట్ ఆన్ రికార్డ్ అసోసియేషన్ ఖండించాయి. చివరకు భారత ప్రధాన న్యాయమూర్తి జోక్యంతో న్యాయవాదులను విడుదల చేశారు. జమ్మూ–కశ్మీర్‌లో ఇంటర్నెట్, టెలీకమ్యూనికేషన్ సదుపాయాలను నిలిపివేయడం రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులను కాలరాయడమేనని అనురాధా బాసిన్ కేసులో జస్టిస్ రమణ బెంచ్ 2020లో ఇచ్చిన తీర్పును పలువురు న్యాయవాదులు ఉటంకించడంతో ఢిల్లీలో నిషేధాజ్ఞలు ఎత్తివేయాలని కేంద్రానికి సీజేఐ సూర్యకాంత్‌ చెప్పాల్సి వచ్చింది. జ్ఞానేశ్ కుమార్ రాజీనామాపై ప్రారంభించిన ఉద్యమం వేడి సుప్రీంకోర్టుకు తగిలినట్లే కనపడుతోంది. ఎందుకంటే ఈ విషయంలో సరైన సమయంలో జోక్యం చేసుకోలేని నిస్సహాయతే సుప్రీంకోర్టును ఆత్మరక్షణలో పడేలా చేసింది.

ఈ నేపథ్యంలో అక్టోబర్ 12న ఇండియా కూటమి సుప్రీంకోర్టు వరకు నిరసన ఊరేగింపును నిర్వహించింది. ప్రభుత్వం దాదాపు ప్రేక్షక పాత్ర వహించింది. కాంగ్రెస్‌ చెబుతున్న ప్రకారం... నిషేధాజ్ఞలు ఉన్నప్పటికీ దాదాపు రెండున్నర లక్షల మంది నాలుగు గంటల పాటు న్యూఢిల్లీలో జరిగిన ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. కాంగ్రెస్‌, ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాల కార్యకర్తలే కాకుండా, కాక్రోచ్ పార్టీ పిలుపునకు ప్రతిస్పందించిన విద్యార్థులు, యువజనులు, పౌర సమాజ సభ్యులూ పాల్గొనడంతో కన్నాట్ ప్లేస్ పరిసర ప్రాంతాలు జన సమ్మర్దంతో కిక్కిరిసిపోయాయి. మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీ తన బలం యావత్తునూ పూర్తిగా కేంద్రీకరించడంతో వివిధ రాష్ట్రాల నుంచి ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు వేల సంఖ్యలో ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీకి రాకపోతే అధిష్ఠానం ఆగ్రహానికి గురికావల్సి వస్తుందన్న భయం మొదటిసారి కాంగ్రెస్‌ నేతల్లో కనపడింది. సుప్రీంకోర్టుకు ఊరేగింపు ఒక నెపం మాత్రమేనని, మొత్తం పార్టీలో ఉద్యమ స్ఫూర్తిని, వీధి పోరాట తత్వాన్ని రగల్చడమే రాహుల్‌గాంధీ వ్యూహం అన్న విషయం విదితమయింది. పదవులు ఆశిస్తూ, పైరవీలే ధ్యేయంగా జీవిస్తున్న కాంగ్రెస్ నేతలు మొట్టమొదటిసారి చెమటోడ్చారు. పోలీసులతో రాహుల్, ప్రియాంక వాదిస్తూ, వారిని ప్రతిఘటిస్తూ, బారికేడ్లను దాటుతూ ముందుకు సాగుతుంటే కాంగ్రెస్ కార్యకర్తల్లో కదలిక రాకుండా ఎలా ఉంటుంది? ఒక రకంగా ఇది కాంగ్రెస్ నరనరాల్లో చైతన్యాన్ని రగిల్చిన క్షణం. ఈ నిప్పురవ్వను మరింతగా మండించేందుకే రాహుల్, ప్రియాంక సిద్ధపడుతున్నట్లు కనపడింది. మొదట ఎన్నికల కమిషన్ కార్యాలయం వరకు, ఆ తరువాత సుప్రీంకోర్టు దాకా నిర్వహించారు. ఇక రాష్ట్రాల్లో ప్రకటించిన కార్యాచరణను కాంగ్రెస్ ఎంత ఉద్యమస్ఫూర్తితో నిర్వహిస్తుందో వేచి చూడాలి. ఓట్ చోరీపై ప్రారంభించిన ఈ ఉద్యమం ఓటర్లలో తమ ఓటు హక్కు గురించి చైతన్యాన్ని కల్పించే దిశలో ఊపందుకుంటే కానీ ఆశించిన ఫలితాలు రావు.


అదే సమయంలో సర్‌పై, వ్యవస్థల విశ్వసనీయతపై తలెత్తిన వివాదం మోదీ, బీజేపీ ప్రతిష్ఠకు ఎంతవరకు నష్టం వాటిల్లిందో చెప్పేందుకు ఇప్పుడే ఎలాంటి కొలమానాలూ లేవు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ చుట్టూ ఏర్పడిన ప్రతిష్టంభన ఎంతకాలం కొనసాగుతుందో చెప్పలేం. జ్ఞానేశ్ కుమార్‌ను రాజీనామా చేయిస్తే ఓట్ చోరీపై ప్రతిపక్షాల విమర్శలను ప్రభుత్వం ఒప్పుకున్నట్లవుతుంది. ప్రతిపక్షాలు ఎంత రాద్ధాంతం చేసినా, తమ పోరును ఎంత ఉధృతం చేసినా ఎన్నికల్లో మాత్రం తమ యంత్రాంగం, వ్యూహరచన, ఎన్నికల ప్రచారంలో భావోద్వేగ అంశాలు, సామాజిక సమీకరణల ద్వారా విజయాలు సాధించగలమనే విశ్వాసాన్ని మాత్రం బీజేపీ అగ్రనేతలు కోల్పోయినట్లు కనపడడంలేదు. ఎన్నికల్లో తాము గెలిస్తే చాలు, ప్రతిపక్షాలు నీరుగారిపోతాయన్న వ్యూహాన్నే వారు అవలంబిస్తున్నారు.

ఈ సందిగ్ధ సంక్షోభ సమయంలో ప్రజా జీవనం అస్తవ్యస్తంగా మారనుందనడంలో సందేహం లేదు. మోదీని గద్దెదించడమనేది కాంగ్రెస్, ఇతర శక్తులకు జీవన్మరణ సమస్యగా మారింది. ఈ శక్తులు తమ పోరును ఉధృతం చేసినకొద్దీ ప్రభుత్వం మరింత కఠోర చర్యలకు పాల్పడే అవకాశాలున్నాయి. రైళ్ల రద్దు, మెట్రో స్టేషన్ల మూసివేత, ప్రజలు తిరిగే చోట నిషేధాజ్ఞలు, ట్రాఫిక్ రద్దీలు, ఇంటర్నెట్‌పై ఆంక్షల మూలంగా వేల సంఖ్యలో సాధారణ ప్రజలకు తీవ్ర అసౌకర్యాలు కలుగక తప్పదు. రాజకీయ, ప్రజా ఉద్యమాలు కేవలం ఢిల్లీలోనే కాకుండా ప్రధానంగా బీజేపీ అధికారంలో ఉన్న 22 ఎన్డీఏ రాష్ట్రాలకు కూడా విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. డీలిమిటేషన్ కోసం ప్రభుత్వం ప్రత్యేక సమావేశాలు నిర్వహించే పరిస్థితి లేకపోగా నవంబర్, డిసెంబర్ నెలల్లో జరిగే శీతాకాల సమావేశాలు కూడా భగ్నమయ్యే అవకాశాలు ఉన్నాయి. రాబోయే ఏప్రిల్‌లో జరిగే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వరకూ సంక్షోభం తీవ్రతరం కావడమే కానీ చల్లారే సూచనలు కనపడడం లేదు.


ప్రభుత్వం నిరసనలను నిరోధించడానికి ప్రయత్నించి విఫలమైంది. నిషేధాజ్ఞలు విధించి కూడా ఉద్యమకారులను కట్టడి చేయలేకపోయింది. జంతర్ మంతర్‌ను నిరసనలకు కేంద్రం కాకుండా చేయడం తేలికేకానీ ప్రజాగ్రహ అగ్నిపర్వతం నుంచి ఉబికివచ్చిన లావా ప్రవాహాన్ని ఆపలేదు కదా. ఆ ప్రవాహం మరో దారిని వెతుక్కుంది మరి. నిరసన ప్రదర్శనలను దేశభక్తికీ, జాతీయవాదానికీ, విదేశీ కుట్రలకు ముడిపెట్టి ప్రజాభిప్రాయం మళ్లించడం కూడా అంత సులభం కాదు. ఇప్పటి తరానికి ఎమర్జెన్సీ రోజులు తెలియకపోవచ్చు కానీ ప్రస్తుతం అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోందన్న అభిప్రాయం వారిలో ఏర్పడుతోంది. అణచివేత, హింసాకాండను ప్రభుత్వమే అమలు చేస్తుంటే, ఈ సోషల్ మీడియా యుగంలో నవతరానికి ఎలాంటి అభిప్రాయం కలుగుతుందో పాలకులు ఆలోచించాలి. ఒక ప్రధాన విజయం సాధించాలంటే అధికారంలో ఉన్నవారు చిన్న చిన్న అపజయాలకు సిద్ధపడక తప్పదు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో నీట్ పేపర్ లీకేజీ అంకానికి తెరపడింది. ఇప్పుడు ప్రభుత్వానికి రోజురోజుకూ భారంగా, దుర్భరంగా మారుతున్న జ్ఞానేశ్ కుమార్‌పై ఏ చర్య తీసుకున్నా ఆచితూచి తీసుకోవాలి. లేకపోతే అది ముందు నుయ్యి, వెనుక గొయ్యిలా మారే ప్రమాదం లేకపోలేదు.

ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

ఇవి కూడా చదవండి..

ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా స్వాతి రెడ్డి నియామకం.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 14 , 2026 | 02:30 AM