West Bengal Elections: బెంగాల్‌లో బీజేపీ గెలవగలదా
ABN , Publish Date - Jan 14 , 2026 | 12:51 AM
పాత ఏడాది చివరి ఘడియల్లోనూ కొత్త ఏడాది ఆగమిస్తున్న వేళ చాలా మంది రాజకీయనాయకులు తమ కుటుంబసభ్యులతో ఉల్లాసంగా గడపాలని భావిస్తారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా భిన్నమైన...
పాత ఏడాది చివరి ఘడియల్లోనూ కొత్త ఏడాది ఆగమిస్తున్న వేళ చాలా మంది రాజకీయనాయకులు తమ కుటుంబసభ్యులతో ఉల్లాసంగా గడపాలని భావిస్తారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా భిన్నమైన వ్యక్తి. ఆయన తరహాయే వేరు. డిసెంబర్ 31న ఆయన పశ్చిమబెంగాల్‌లో ఉన్నారు. మరో రెండు నెలల్లో రానున్న బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు తమ పార్టీ నేతలను ఆయన సమాయత్తం చేశారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల కౌన్సిలర్లు, పార్టీలో కీలక పదవుల్లో ఉన్నవారితో ఆయన సమాలోచనలు జరిపారు. అసెంబ్లీ నియోజకవర్గాల మ్యాప్ లను ప్రదర్శించి, 294 స్థానాలకు గాను 162 స్థానాల్లో పార్టీ గెలిచే అవకాశాలున్నాయని, 49 స్థానాల్లో హోరాహోరీ పోరాడవలసి ఉంటుందని, 83 స్థానాల్లో బలహీనంగా ఉన్నామని వెల్లడించారు. పోలింగ్ బూత్‌ల వారీ వివరాలు, జిల్లా నివేదికలు, గత ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతం ఆధారంగా సమీక్షలు నిర్వహించారు. రాష్ట్రాన్ని ఐదు జోన్లుగా విభజించి, ఏఏ జోన్లలో ఏ స్థాయిలో ప్రచారం నిర్వహించాలో సూచించారు. కేంద్ర హోం మంత్రి పర్యటనతో ఈ జనవరి 17, 18 తేదీల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పశ్చిమబెంగాల్ పర్యటనకు రంగం సిద్ధమయింది. రెండు రోజులు సుడిగాలి పర్యటన జరిపే మోదీ జనవరి 18న హౌరాలో భారీ ర్యాలీనుద్దేశించి ప్రసంగించనున్నారు.
బిహార్ ఎన్నికల తర్వాత మోదీ, అమిత్ షా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్న ఎన్నికలు పశ్చిమబెంగాల్‌వే, సందేహం లేదు. ప్రతి ఎన్నికనూ జీవన్మరణ సమస్యగా తీసుకునే ఈ నేతలు బెంగాల్‌లో ఈసారి సర్వశక్తులు ఒడ్డేందుకు సిద్ధపడుతున్నారు. బెంగాల్ ఎన్నికలు సాధారణమైనవి కావని వారికి తెలుసు. తమిళనాడు, కేరళలో బలం పుంజుకోవడం, అస్సాం, పుదుచ్చేరిలో ఉన్న ప్రభుత్వాలను కాపాడుకోవడం కంటే పశ్చిమబెంగాల్‌లో అధికారాన్ని తృణమూల్ కాంగ్రెస్ నుంచి హస్తగతం చేసుకోవడమే చాలా చాలా ముఖ్యం. గత 14 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న మమతా బెనర్జీని గద్దెదించడమే ధ్యేయంగా బీజేపీ పావులు కదుపుతోంది. అక్కడ వామపక్షాలకు కానీ, కాంగ్రెస్‌కు కానీ కాషాయ పార్టీ ధాటిని సమర్థంగా ఎదుర్కొనే శక్తి లేదు. ఒక్క మమతా బెనర్జీని దెబ్బతీస్తే బెంగాల్‌లో తమకు తిరుగులేదని బీజేపీ నేతలు భావిస్తున్నారు. గత 14 ఏళ్లలో బెంగాల్‌లో స్త్రీలపై జరిగిన అత్యాచారాలు, అవినీతి, ఇతర అక్రమాల చిట్టా విప్పడం, ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకతను ఉపయోగించుకోవడం, పెద్ద ఎత్తున బంగ్లాదేశ్ చొరబాటుదారులను అనుమతించి ఓటర్ల జాబితాలో చేర్పించారని ఆరోపించడం... ఇత్యాది ఆయుధాలు బీజేపీ వద్ద ఎన్నో ఉన్నాయి. సరిపోతాయా? బెంగాల్‌లో మమతా బెనర్జీ అనే బెబ్బులిని బంధించేందుకు ఇవేవీ సరిపోవని మోదీ, షాకు తెలియనిది కాదు.
మోదీ వర్సెస్ దీదీగా సాగుతున్న ఈ ఎన్నికలు ప్రధానంగా బీజేపీ, దాని వ్యతిరేక శక్తుల మధ్య జరుగుతున్నాయి. మోదీ–షా ఆకర్షణ పూర్తిగా పనిచేయని రాష్ట్రాల్లో బెంగాల్ ప్రధానమైనది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మూడు దశాబ్దాలు కాంగ్రెస్‌ను, ఆ తర్వాత దాదాపు మూడున్నర దశాబ్దాలు వామపక్షాలను ఆదరించిన బెంగాల్ ప్రజలు, తృణమూల్ కాంగ్రెస్‌ను ఆదరించారే కాని బీజేపీని దరి చేర్చుకునేందుకు అంత ఉత్సుకత ప్రదర్శించలేదు. నిజానికి పశ్చిమబెంగాల్‌లో వామపక్షాల ధాటిని ఎదుర్కొని ఎర్రసేనతో ఉగ్రంగా తలపడి, అనేక హింసాత్మక దాడులను ఎదుర్కొన్న మమతా బెనర్జీని కాంగ్రెస్ దరిచేర్చుకోలేకపోయింది. ఆమె పార్టీని మిత్రపక్షంగా బీజేపీ కాపాడుకోలేకపోయింది. పీవీ నరసింహారావు ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న మమతా బెనర్జీ 1997లోనే స్వంత పార్టీని ఏర్పాటు చేశారు. వాజపేయి ప్రభుత్వంలో రైల్వే మంత్రిగా రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆ తర్వాత మన్మోహన్ ప్రభుత్వంలోనూ రైల్వే మంత్రిగా ఉన్నారు. తొలుత లోక్ సభ ఎన్నికల్లో, తర్వాత స్థానిక ఎన్నికల్లో వామపక్షాలను ఊడ్చివేసిన మమత 2011 అసెంబ్లీ ఎన్నికల్లో 34 ఏళ్లుగా ఉన్న లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని గద్దెదించి చరిత్ర సృష్టించారు. సాదాసీదా ముతక చీర, స్లిప్పర్లు ధరించి ప్రజల మధ్య సామాన్యురాలిగా సంచరించే మమతా బెనర్జీని గద్దెదించేందుకు బీజేపీ ఇవాళ సామ, దాన, భేద దండోపాయాలను ప్రయోగిస్తోంది.
2014లో కేంద్రంలో నరేంద్రమోదీ హిందూ హృదయ సమ్రాట్‌గా అడుగు పెట్టిన తర్వాతే పశ్చిమబెంగాల్‌లో ప్రవేశించేందుకు బీజేపీ సాహసంతో అడుగులు ముందుకు వేసింది. వామపక్షాల, కాంగ్రెస్ ఓటు బ్యాంకు క్రమంగా పడిపోవడం, తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరుగుతుండడం ఇందుకు తోడ్పడుతోంది. బెంగాల్‌లో ముస్లింలు 30 శాతం పైగా ఉండడం, బీజేపీ కేంద్రీకృత ఎన్నికల యంత్రాంగం వ్యూహాత్మకంగా మమతా బెనర్జీని హిందూ వ్యతిరేకశక్తిగా చిత్రించడం, స్థానిక నాయకులను ప్రోత్సహించడం వల్ల ఆ పార్టీ కొంత బలం పుంజుకుంది. గత పదేళ్లలో ఇతర రాష్ట్రాల్లో పొందిన వ్యాప్తితో పోలిస్తే బెంగాల్‌లో బీజేపీ వ్యాప్తి తక్కువే. తనకు ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ పుంజుకుంటోందని తెలిసిన తృణమూల్ భారీ ఎత్తున సంక్షేమ పథకాలను, నగదు బదిలీని చేపట్టింది. బెంగాలీ ఉప జాతీయ వాదాన్ని రెచ్చగొట్టి బీజేపీని స్థానిక సంస్కృతిని వ్యతిరేకించే పార్టీగా చిత్రించింది. రవీంద్రుడు వంటి సాంస్కృతిక చిహ్నాలను ఉపయోగించుకుని హిందూ జాతీయవాదం స్థానిక అస్తిత్వానికి వ్యతిరేకమనే భావన కల్పించేందుకు ప్రయత్నించింది. అదే సమయంలో బీజేపీ మతతత్వానికి తాను వ్యతిరేకమంటూ దాదాపు 30 శాతం ఉన్న ముస్లిం ఓట్లను సంఘటితం చేసుకోగలిగింది. గ్రామీణ ప్రాంతాల్లో బలమైన కేడర్‌ను నిర్మించుకుని బీజేపీ చొచ్చుకు రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తోంది.
అయినప్పటికీ బెంగాల్‌లో బీజేపీ క్రమంగా విస్తరిస్తోంది. బెంగాల్‌లో ఆరెస్సెస్ శాఖలూ విస్తరిస్తున్నాయి. అక్కడి హిందూ సాంస్కృతిక వారసత్వాలను ఉపయోగించుకుని, రామకృష్ణ మిషన్ వంటి స్థానిక సంస్థలతో సంబంధాలు పెట్టుకుని బీజేపీ బలోపేతం అవుతోంది. నిజానికి బీజేపీ పూర్వరూపమైన భారతీయ జనసంఘ్ సంస్థాపకుడు, అంతకు ముందు హిందూ మహాసభ ప్రధాన నేతల్లో ఒకరైన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బెంగాలీ నాయకుడు అయినప్పటికీ పశ్చిమబెంగాల్‌లో బీజేపీ నిలదొక్కుకోవడం అంత సులభం కావడం లేదు. వామపక్షాలు బలంగా ఉండడం వల్ల, రామజన్మభూమి ఉద్యమం తర్వాత కూడా బెంగాల్‌లో హిందూత్వ భావోద్వేగాలను రేకెత్తించలేకపోయిన బీజేపీకి వామపక్షాలు, కాంగ్రెస్ బలహీనమైన తర్వాతే మరింత బలపడేందుకు అవకాశాలు ఏర్పడ్డాయి. వివేకానందుడు, సుభాష్ చంద్రబోస్, బంకించంద్ర ఛటర్జీ వంటి సాంస్కృతిక మూర్తుల పేర్లను ప్రస్తావించడం, వందేమాతరంను స్వంతం చేసుకునే ప్రయత్నం చేయడం, మమతను ముస్లింల అనుకూల, హిందూత్వ వ్యతిరేకశక్తిగా చిత్రించడం వంటి ప్రచారాన్ని బీజేపీ ఉధృతం చేస్తూ వస్తోంది. దీనివల్ల 2019, 2014 లోక్‌సభ ఎన్నికల్లోనూ, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో సగటున 40 శాతం ఓట్లను బీజేపీ సాధించుకోగలిగింది.
బెంగాల్‌లో బీజేపీ విజయం సాధించగలదా? ఆ రాష్ట్ర జనాభాలో 70 శాతంగా ఉన్న హిందువుల్లో 60 శాతం మందికి పైగా తమ వైపు మొగ్గు చూపితేనే బీజేపీ అక్కడ జయపతాక ఎగురవేయగలదు. బీజేపీ హిందూత్వ సిద్ధాంతానికీ, హిందూ మతంలోని వైవిధ్యానికీ మధ్య సాగుతున్న సమరం ఇది. ప్రతి ఒక్కరూ కాళీమాతను పూజించే ఈ ప్రాంతంలో హిందూత్వ ఆధారంగానే పోరాడడం, మమతా బెనర్జీకి వ్యతిరేకంగా హిందువులను సమీకరించడం సాధ్యం కాకపోవచ్చు. స్వయంగా కాళీ భక్తురాలైన మమతా బెనర్జీ గత ఎన్నికల్లో కాళీ మంత్రాలను ఉచ్చరిస్తూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించింది. ఒవైసీ నేతృత్వంలోని ఎఐఎంఐఎంతో పాటు ఒకటి రెండు చిన్నా చితకా ముస్లిం పార్టీలు ఉన్నప్పటికీ, ముస్లిం ఓట్లు చెప్పుకోదగిన విధంగా చీలిపోయే అవకాశాలు తక్కువే.
ఈ నేపథ్యంలో అమిత్ షా బెంగాల్ వెళ్లి వచ్చిన వారం రోజుల్లోనే కోల్‌కతాలోని ఐ–పాక్ కార్యాలయంపై ఈడీ దాడులు జరపడానికి ప్రాధాన్యం ఉన్నది. గెలిచే స్థానాల్లో సర్వశక్తులు ఒడ్డి పోరాడడం, ఉధృతంగా ప్రచారం చేయడం, పోలింగ్ బూత్ స్థాయి వ్యూహరచన చేయడం ఒక ఎత్తు అయితే, ప్రత్యర్థి బలహీనతలపై దెబ్బకొట్టడం మరో ఎత్తు. ఇటువంటి వ్యవహారాల్లో అమిత్ షాది అందెవేసిన చేయి. ఐదేళ్ల క్రితం జరిగిన ఒక బొగ్గు కుంభకోణంలో వచ్చిన డబ్బులు మనీలాండరింగ్ ద్వారా ఐపాక్ సంస్థ డైరెక్టర్ ప్రతీక్ జైన్‌కు చేరాయన్న అనుమానంతో ఈడీ అధికారులు ఆయన కార్యాలయాలపై దాడులు చేశారు. ఈ దాడుల పేరుతో తమ ఎన్నికల వ్యూహానికి సంబంధించిన డాక్యుమెంట్లు బీజేపీ స్వాధీనపరుచుకుంటుందన్న అనుమానంతో మమతా బెనర్జీ మందీ మార్బలంతో, పోలీసు బలగాలతో ఐ–పాక్ కార్యాలయానికి వెళ్లారు. ఈడీ అధికారుల నుంచి ఫైళ్లను, ఎలక్ర్టానిక్ ఆధారాలను లాక్కున్నారు. అమిత్ షాను తీవ్రంగా దూషించారు. ‘ఆరోగ్యంగా ఉన్న పులి కంటే గాయపడ్డ పులి ప్రమాదకరం. నాపై దాడి చేస్తున్న కొద్దీ కొత్త ప్రాణం నాలో మేలుకుంటుంది’ అని ఆమె ప్రకటించారు. ప్రత్యర్థులను బలహీనం చేసేందుకు ఈడీ, సీబీఐ వంటి శక్తులను ప్రయోగించడం బీజేపీకి కొత్త కాదు కానీ, మమత లాంటి నేతలు వీధి పోరాటాలకు దిగడం ఆ పార్టీ ఊహించిందో లేదో చెప్పలేం. ఎన్నికలకు రెండునెలల ముందే భీకర రణం ప్రారంభమైన బెంగాల్‌లో ఇలాంటి బీభత్స రస ప్రధాన దృశ్యాలు ఎన్ని ఎదురవుతాయో, అవి ఎవరికి ఉపయోగకరమో చెప్పలేం. రాజకీయాలు వీధి పోరాటాలైనప్పుడు ఏ న్యాయస్థానాలైనా ఏమి చేయగలవు?
ఎ. కృష్ణారావు
(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)
ఈ వార్తలు కూడా చదవండి..
రైలు పట్టాలపైనే మహిళ ప్రసవం.. ఏమైందంటే?
బెట్టింగ్ యాప్ బారిన పడి యువకుడి బలి
Read Latest AP News And Telugu News