Share News

బీజేపీ రాజకీయాలకు బ్రిక్స్‌ పాఠం!

ABN , Publish Date - Sep 16 , 2026 | 02:32 AM

‘లోకంలో బలవంతుడైనవాడు చెబితే అధర్మం కూడా ధర్మం అవుతుంది. అదే బలహీనుడు చెప్పే ధర్మం ఎంత గొప్పదైనా దాన్ని ఎవడూ అంగీకరించడు’ అని మహాభారతంలో భీష్ముడు కురుసభలో ద్రౌపది వస్త్రాపహరణ...

బీజేపీ రాజకీయాలకు బ్రిక్స్‌ పాఠం!

‘లోకంలో బలవంతుడైనవాడు చెబితే అధర్మం కూడా ధర్మం అవుతుంది. అదే బలహీనుడు చెప్పే ధర్మం ఎంత గొప్పదైనా దాన్ని ఎవడూ అంగీకరించడు’ అని మహాభారతంలో భీష్ముడు కురుసభలో ద్రౌపది వస్త్రాపహరణ ఘట్టంలో చెబుతాడు. ‘పాండవులకు జరిగిన అవమానమే భవిష్యత్తులో కౌరవులకు వ్యతిరేకంగా ప్రత్యర్థులందర్నీ ఏకం చేస్తుంది’ అని అదే సభలో విదురుడు హెచ్చరిస్తాడు. ‘బలవంతుడి శక్తి కంటే భయంతో ఏకమైన బలహీనుల కూటమి శక్తిమంతమైనది’ అని విదురుడు చెప్పినట్లుగానే పాంచాల, మత్స్య, యాదవ, మగధ, ఛేది, కాశీ, పాండ్య, చోళ, కేకయ తదితర రాజ్యాలన్నీ పాండవుల తరఫున ఏకం అవుతాయి. చాణక్యుడైనా, ఇటాలియన్ రాజనీతిజ్ఞుడు మాకియవెల్లీ అయినా ఇంతకంటే భిన్నంగా ఏమీ ఆలోచించలేదు. న్యూఢిల్లీలో గతవారం ముగిసిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో మహాభారతంలోని దౌత్యనీతి ప్రస్ఫుటించింది.

తాను అత్యంత బలవంతుడిననుకున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను వ్యక్తిగతంగా బ్రిక్స్ దేశాలు పైకి పల్లెత్తు మాట అనకుండానే ఆయనకు ఒక స్పష్టమైన సందేశాన్ని పంపించాయి. ఏక పక్ష దౌర్జన్య చర్యలు, వర్తకాన్ని దెబ్బతీసే టారిఫ్ లను న్యూఢిల్లీ డిక్లరేషన్ తీవ్రంగా ఖండించింది. బ్రిక్స్ వేదికపై విభిన్న ప్రయోజనాలను ఆశిస్తున్న అనేక దేశాలు ఏకమయ్యేందుకు అవసరమైన వాతావరణాన్ని ట్రంప్ అనాలోచితంగానే అందించారు. సంక్షుభిత ప్రజాస్వామ్య భారత్, నియంతృత్వ చైనా, రష్యా దేశాలు, అమెరికాతో సన్నిహిత భద్రతా సంబంధాలు ఉన్న గల్ఫ్ దేశాలు, అమెరికా దాడిని ఎదుర్కొంటున్న ఇరాన్.. ఇవన్నీ ఒక వ్యూహాత్మక ప్రాపంచిక దృక్పథాన్ని పంచుకునేందుకు అవకాశాన్ని ట్రంప్‌ కల్పించారు. అమెరికా అధ్యక్షుడి దూకుడు విధానాల వల్ల ఈ దేశాలన్నీ ఒత్తిడి ఎదుర్కోవడమే ఇందుకు కారణం. డాలర్ ఆధిపత్యాన్ని సవాల్ చేసే దేశాలపై అత్యధిక సుంకాలు విధిస్తామని ట్రంప్ హెచ్చరించినప్పటికీ బ్రిక్స్ దేశాలు ప్రత్యామ్నాయ చెల్లింపు విధానాలను వెతుక్కునేందుకు ఆయనే దోహదం చేశారు. వాణిజ్యం కోసం, స్థానిక జాతీయ కరెన్సీల వాడకాన్ని న్యూఢిల్లీ డిక్లరేషన్ సమర్థించింది. పాశ్చాత్య ఆర్థిక వ్యవస్థలపై ఆధారపడటాన్ని తగ్గించుకునేందుకు ఇది సభ్య దేశాలకు ఊతమిచ్చింది.

భిన్న రాజకీయ వ్యవస్థలు, భద్రతా ప్రయోజనాలు కలిగిన కూటమి అయినప్పటికీ ఎలాంటి రణగొణ ధ్వనులు లేకుండా బ్రిక్స్ సమావేశంలో అత్యంత సమగ్రమైన, ప్రభావదాయక ఏకగ్రీవ డిక్లరేషన్‌ను విడుదల చేయగలగడమే ఆ దేశాల మధ్య ఏర్పడిన ఉమ్మడి అవగాహనకు నిదర్శనం. ప్రస్తుత అంతర్జాతీయ వ్యవస్థ ఏకపక్ష ఆర్థిక ఒత్తిళ్లకు గురవుతోందనే సాధారణ భావనే వీటన్నింటినీ ఒక తాటిపైకి తెచ్చింది. ఈ సదస్సుకు భారత్ నాయకత్వం వహించినందువల్ల సహజంగానే రెండు రోజుల పాటు జరిగిన సదస్సుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ కేంద్ర బిందువుగా నిలిచారు.


భారత్ ప్రస్తుత పరిస్థితి కత్తి మీద సాము లాంటిది. పలు వైరుధ్యాలతో కూడిన సంబంధాలను ఏకకాలంలో సమన్వయం చేసేందుకు భారత్ ప్రయత్నించాల్సి వచ్చింది. చైనాతో సరిహద్దు ఘర్షణలు, ఆర్థిక ఆధిపత్యం నేపథ్యంలో ఆ దేశాధినేతతో సుహృద్భావ వాతావరణంలో చర్చించడం, రష్యాతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగించడం, సంక్షుభిత పశ్చిమాసియాలో ఇరాన్‌తో చర్చలు జరపడం, అభివృద్ధి చెందిన దేశాల గళంగా, గ్లోబల్ సౌత్ నేతగా అవతరించేందుకు ప్రయత్నించడం ఇందులో ముఖ్యమైనవి. అంతేకాదు, రష్యాతో రక్షణ, ఇంధన రంగ సహకారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోబోమని భారత్‌ స్పష్టం చేసింది. పాశ్చాత్య కూటములతో చేతులు కలుపుతూనే, సంప్రదాయ మిత్రులను విస్మరించబోమనే వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని ప్రకటించింది. అదే సమయంలో, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీ సదస్సులో ఒక సున్నితమైన దౌత్య వ్యూహాన్ని అవలంబించారు. పశ్చిమ దేశాలను తిరస్కరించడం పూర్తిగా తమ వ్యూహం కాదని, ఆ దేశాలతో సంబంధాలు కొనసాగిస్తూనే అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రయోజనాలను ఏకకాలంలో కాపాడుకోవాలన్నదే భారత్‌ వైఖరి అని ఆయన స్పష్టం చేశారు. అమెరికా ఒత్తిడి, చైనా ఆధిపత్యం మధ్య భారత్ తనను తాను ఒక ఆచరణాత్మక ప్రత్యామ్నాయంగా ప్రదర్శించుకోవడానికి ప్రయత్నించింది. అదే సమయంలో వాషింగ్టన్ ఎంత గట్టిగా ఒత్తిడి తెచ్చినా, దానిపై ఆధారపడకుండా యంత్రాంగాలను అభివృద్ధి చేయగలమని చెప్పగలగడమే ఈ బ్రిక్స్ సమావేశాల ప్రత్యేకత.

చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ ఈ సదస్సులో చేసిన ప్రసంగం అత్యంత శక్తిమంతమైనది. ‘నియమాలు లేని ప్రపంచం అంటే ట్రాఫిక్ సిగ్నల్స్ లేని కూడలి వంటిది. అంతర్జాతీయ నియమాలను అన్ని దేశాల భాగస్వామ్యంతోనే, అందరికీ ఒకే విధంగా ఉండేలా రూపొందించాలి. బలవంతుడిదే న్యాయం అనే సిద్ధాంతానికి అంతర్జాతీయ వ్యవహారాల్లో ఎలాంటి స్థానం ఉండకూడదు. ప్రపంచ దక్షిణ దేశాలు అంతర్జాతీయ వ్యవహారాల్లో చట్టబద్ధ పాలనను (రూల్ ఆఫ్ లా) సమష్టిగా పరిరక్షించాలి’ అని జిన్‌ పింగ్‌ అన్నారు. బహుళ ధ్రువ ప్రపంచం అనే దాన్ని ఎవరూ మార్చలేరని, ప్రపంచాన్ని తమకోసం సుందరవనంగా, ఇతరులకు కీకారణ్యాలుగా మార్చేందుకు చేసే ప్రయత్నాలు చెల్లవని రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. జారిపోతున్న తమ నాయకత్వాన్ని కాపాడుకోవడానికి పాత నేతలు కొందరు ఆంక్షలు, అడ్డంకులు సృష్టిస్తున్నారని, కానీ ఇవి ప్రత్యామ్నాయ, స్వతంత్ర వాణిజ్య మార్గాలను వేగవంతం చేస్తున్నాయని ఆయన అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రసంగంలోనూ బలమైన వ్యాఖ్యలు లేకపోలేదు. ‘మనం నిబంధనలను పాటించేవారిగా (రూల్–టేకర్స్) కాకుండా, నిబంధనలను నిర్దేశించేవారిగా (రూల్–షేపర్స్) ఎదగాల్సిన అవసరం ఉంది’ అని మోదీ చెప్పారు. టెక్నాలజీని, కీలక ఖనిజాలను ఆయుధాలుగా వాడుకోవద్దని ఆయన హెచ్చరించారు.


బ్రిక్స్ సదస్సులో అన్నిటికన్నా ముఖ్యమైనది ప్రధానమంత్రి నరేంద్రమోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ మధ్య దాదాపు 45 నిమిషాల పాటు ద్వైపాక్షిక సమావేశం. వ్యూహాత్మక భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ పరస్పర ఆర్థిక ప్రయోజనాలకోసం పనిచేసేందుకు వారు సిద్ధంగా ఉన్నారన్న సంకేతాలు వెలువడ్డాయి. గల్వాన్ ఘర్షణల చేదు జ్ఞాపకాలను మరిచి, వాస్తవాధీన రేఖ వద్ద శాంతిని నెలకొల్పేందుకు, ఆర్థిక, దౌత్య మార్గాలను పునరుద్ధరించేందుకు భారత్ సుముఖత చూపింది.

ఈ ఘట్టం ఏ పరిణామాల్ని సూచిస్తోంది? చైనాతో కొన్ని దశాబ్దాలుగా నెలకొన్న శత్రుత్వ వాతావరణం మారనుందా? భారత్–చైనా సంబంధాల పునరుద్ధరణ అనేది దౌత్యపరమైన విజయానికంటే వ్యూహాత్మక రాజీని సూచిస్తోందా? అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. రాజీ అనడం కన్నా ప్రస్తుత అల్లకల్లోల అంతర్జాతీయ వాతావరణంలో అదొక చారిత్రక అవసరం కూడా కావచ్చని మరికొందరు భావిస్తున్నారు. ఈ సమావేశంలో భారత్‌, చైనాల మధ్య అత్యంత ముఖ్యమైన ఏకాభిప్రాయం ఏర్పడిందని, వ్యూహాత్మక, దీర్ఘకాలిక, దిశానిర్దేశం చేసే అంశాలపై ఇరువురు నేతలు స్పష్టమైన, లోతైన చర్చలు జరిపారని చైనా విదేశాంగ మంత్రి, కమ్యూనిస్టు పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వాంగ్ యీ అనడం విస్మరించదగిన విషయం కాదు. బ్రిక్స్ సమావేశాలు మారుతున్న ప్రపంచ వ్యవస్థను, అంతర్జాతీయ సంబంధాల మార్పును సూచిస్తున్నాయని అమెరికన్‌ మీడియా వ్యాఖ్యానించింది. అమెరికాతో ఉద్రిక్తతలు ఉన్న ఇరాన్‌కు బ్రిక్స్‌లో ప్రముఖ స్థానం లభించడం గ్లోబల్ ఆర్డర్‌లో మారుతున్న సమీకరణాలకు అద్దం పడుతోందని అమెరికా పత్రికలు ప్రత్యేకంగా విశ్లేషించాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరించిన సుంకాల విధానాలే అంతర్గతంగా గణనీయమైన భేదాభిప్రాయాలు ఉన్న దేశాలను ఒకచోటకు చేర్చే అనుసంధానంగా (బైండింగ్ ఏజెంట్) పనిచేశాయని అమెరికన్‌ మీడియా భావించింది.

నిశితంగా విశ్లేషించాలంటే అమెరికాయే బ్రిక్స్‌కు సానుకూల పవనాలను (టెయిల్ విండ్) సృష్టించింది. వాషింగ్టన్‌ విధానాలు, అంతర్జాతీయ సంబంధాలు శాశ్వతంగా ఇలాగే ఉంటాయని చెప్పలేం. బహుళ ధ్రువ ప్రపంచంగా మారేందుకు, భద్రతా మండలి, ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు తీరుతెన్నుల్లో మార్పులు ఏర్పడేందుకు సమయం ఆసన్నమైందని, లేకపోతే బ్రిక్స్ మరింత బలమైన ప్రత్యామ్నాయ వ్యవస్థగా మారుతుందని చెప్పేందుకు ఆస్కారం ఏర్పడింది.


దేశ రాజకీయాల్లో కూడా తమ వ్యవహారశైలే ప్రత్యర్థుల బలాబలాలను నిర్ణయిస్తుందని బ్రిక్స్‌ సదస్సు నేపథ్యంలో పాలక పక్షం నేతలు గ్రహించాల్సిన అవసరం ఉన్నది. ట్రంప్ ధాటితో పలు దేశాలు ఏకమైనట్లు గడచిన కొన్ని సంవత్సరాలుగా ప్రధానమంత్రి మోదీ, ఆయన కుడిభుజం అమిత్ షా ధాటికి తట్టుకోలేక ప్రత్యర్థి శక్తులన్నీ ఏకమయ్యేందుకు ప్రయత్నిస్తున్నాయి. తాజాగా ఉమ్మడి పౌరస్మృతిపై ఎన్డీఏ మిత్రపక్షాలు కూడా అసమ్మతి ప్రకటిస్తున్నాయి. తన 25 సంవత్సరాల పాలన పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని తన పుట్టిన రోజు సెప్టెంబర్‌ 17 నుంచి సేవా సంకల్ప్ అభియాన్ జరుపుకోవాలని ఎన్డీఏ పార్టీలను నిర్దేశిస్తున్న మోదీ వైఖరిలో బ్రిక్స్ అనుభవం తర్వాతనైనా మార్పు వస్తుందా? చెప్పలేం.

ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

ఈ వార్తలు కూడా చదవండి..

ఆళ్ల నాని మృతిని తొలుత గుర్తించింది ‘మ్యాక్సీ’నే: వాచ్‌మన్

మాట తప్పడం, మడమ తిప్పడమే సీఎం రేవంత్ రెడ్డి ట్రేడ్ మార్క్: కవిత

For More TG News And Telugu News

Updated Date - Sep 16 , 2026 | 02:32 AM