Share News

రాహుల్‌కు ఎందుకీ కంటగింపు?

ABN , Publish Date - Feb 24 , 2026 | 01:09 AM

సమర్థ నాయకత్వం, సరైన మార్గదర్శనంతో భారత్‌ గత పన్నెండేళ్లుగా.. వికసిత భారతదేశ నిర్మాణం కోసం స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకుంది. ప్రజల భాగస్వామ్యంతో వాటిని సాధించే దిశగా అడుగులేస్తోంది. ‘ఆత్మనిర్భర’ నినాదంతో...

రాహుల్‌కు ఎందుకీ కంటగింపు?

సమర్థ నాయకత్వం, సరైన మార్గదర్శనంతో భారత్‌ గత పన్నెండేళ్లుగా.. వికసిత భారతదేశ నిర్మాణం కోసం స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకుంది. ప్రజల భాగస్వామ్యంతో వాటిని సాధించే దిశగా అడుగులేస్తోంది. ‘ఆత్మనిర్భర’ నినాదంతో దేశీయంగా మన కాళ్లమీద మనం నిలబడే విధంగా చర్యలు తీసుకుంటూ.. విదేశాలతో బలమైన సంబంధాలను ఏర్పర్చుకుంటూ.. దేశ ‘బంగారు భవిష్యత్తుకు భరోసా’ను సుస్థిరం చేసుకుంటోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో.. పుష్కరకాలంగా ప్రపంచంలోని ముఖ్య దేశాలు, కీలక కూటములతో భారతదేశం వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసుకుంటోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌, ఆస్ట్రేలియా, 27 దేశాల సమాహారమైన యూరోపియన్ యూనియన్, బ్రిటన్, ఒమన్, మారిషస్, న్యూజిలాండ్ వంటి దేశాలతో కుదుర్చుకున్న మొత్తం 9 స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలతో (FTA) భారత్.. ఉత్పత్తి, సేవల, వ్యవసాయ రంగాలకు మన దేశంలో పెద్దఎత్తున కొత్త మార్కెట్లకు ద్వారాలు తెరుచుకున్నాయి. గ్లోబల్ సప్లయ్ చైన్స్ పునర్వ్యవస్థీకృతమవుతున్న ఈ సమయంలో FTAల ద్వారా భారత్.. అంతర్జాతీయంగా అనేక దేశాలకు అత్యంత విశ్వసనీయమైన భాగస్వామిగా నిలుస్తోంది.

ఇలాంటి వ్యూహాత్మకమైన సమయంలో.. ప్రధాని మోదీ నాయకత్వంలో కుదిరిన భారత్, అమెరికా వాణిజ్య ఒప్పందం ఒక వాణిజ్య ఒప్పందంగా మాత్రమే కాకుండా.. 21వ శతాబ్దపు భారత్‌ అభివృద్ధి ప్రయాణంలో ఓ కీలక మైలురాయిగా నిలిచిపోనుంది. భారత్, అమెరికా ఒప్పందంపై సరైన అవగాహన లేకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు, రాహుల్‌గాంధీ విమర్శలు గుప్పిస్తున్నారు. కానీ, దేశ ప్రయోజనాలను కాపాడే విషయంలో రాజీపడకుండా.. 140 కోట్ల భారతీయుల విశ్వాసాన్ని సంపాదించుకున్న ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సాధిస్తున్న విజయాలను సహించలేక, చేస్తోన్న మంచి పనులను.. అబద్ధాలతో, అసందర్భంగా కాంగ్రెస్ పార్టీ గుడ్డిగా వ్యతిరేకించడమే పనిగా పెట్టుకుంది.


భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని మూడు ప్రధాన కోణాల్లో అర్థం చేసుకోవాలి. మొదటిది.. సాంకేతికతను ఇచ్చిపుచ్చుకోవడం, రెండోది.. పెట్టుబడుల విస్తరణ, మూడోది.. గ్లోబల్ వ్యాల్యూ చెయిన్‌లో భారతదేశ స్థానాన్ని సుస్థిరం చేసుకోవడం, ఇవి ప్రధాన లక్ష్యాలుగా కార్యాచరణ ఏర్పాటు చేసుకున్నాం. ప్రపంచంలో అతిపెద్ద మార్కెట్‌గా, సేవల కేంద్రంగా భారత్ ఎదిగింది. ఇప్పుడు.. ఉత్తమ సాంకేతికత తయారీ, డిజైన్‌లకు కేంద్రంగా మారేందుకు ఈ ఒప్పందం కీలకంగా మారనుంది. సెమీకండక్టర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ టెక్నాలజీ, డిఫెన్స్, స్పేస్, సైబర్ సెక్యూరిటీ లాంటి అనేక రంగాల్లో మనం మరింత పురోగతి సాధించేందుకు వీలుపడనుంది. ఈ సాంకేతికత ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా.. అత్యాధునిక పరిజ్ఞానం భారతదేశానికి అందుబాటులోకి వస్తుంది. మన ఇంజనీర్లు, మన స్టార్టప్‌లకు ప్రపంచస్థాయి ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం లభిస్తుంది. దీని కారణంగా.. టెక్నాలజీ దిగుమతిదారుగా ఉన్న భారతదేశం.. ఇకపై గ్లోబల్ స్టాండర్డ్ టెక్నాలజీని ఎగుమతి చేయనుంది.

దేశ రాజధాని నుంచి గ్రామీణ ప్రాంతాల వరకు ఓ స్పష్టమైన, సానుకూలమైన ప్రభావాన్ని చూపించే భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందంపై విపక్షనేత రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలు.. రైతులు, ఎగుమతిదారుల్లో అనవసర అనుమానాలను కలిగించేందుకు చేసిన కుటిల ప్రయత్నమే. రోజురోజుకూ దేశ రాజకీయాల్లో అస్తిత్వాన్ని కోల్పోతున్న రాహుల్‌గాంధీ, కాంగ్రెస్ పార్టీ.. నెగటివ్ రాజకీయాల ద్వారా ప్రజల్లో అశాంతిని, రేకెత్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. పదేళ్ల యూపీఏ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై ప్రజలు ఆగ్రహించి ఆ ప్రభుత్వాన్ని గద్దెదించితే.. ఈ పన్నెండేళ్లలో తమ కళ్లముందు జరుగుతున్న పురోగతికి అదే ప్రజలు సంపూర్ణ మద్దతు ఇస్తుండటంతో రాహుల్ జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే.. అవకాశం చిక్కినపుడల్లా అబద్ధాలతో ప్రజలను ప్రభుత్వంపై రెచ్చగొట్టేలా దుష్ప్రచారం చేస్తున్నారు.


ప్రస్తుతం భారత్ రూ.4 లక్షల కోట్ల విలువైన వస్త్రాలను వివిధ దేశాలకు ఎగుమతి చేస్తోంది. 38 అభివృద్ధి చెందిన దేశాల పరిధిలోని 9 స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల (FTAs) ద్వారా.. ఈ ఎగుమతులు మరో పదిరెట్లకు పైగా పెరిగి.. రూ.45 లక్షల కోట్ల విలువైన టెక్స్‌టైల్ మార్కెట్‌కు అవకాశాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం అమెరికా దాదాపు రూ.10 లక్షలకోట్ల వస్త్రాలను దిగుమతి చేసుకుంటోంది. ఇందులో భారతదేశం నుంచే దాదాపు 10శాతం వస్త్రాలు అమెరికాకు ఎగుమతి అవుతున్నాయి. ఈ కొత్త FTA తర్వాత మన ఎగుమతులు మరింత పెరగనున్నాయి. ఈ పరిస్థితులకు తగ్గట్లుగా.. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 7 మెగా టెక్స్‌టైల్ పార్కులను అభివృద్ధి చేస్తోంది. ఇందులో ఒకటి తెలంగాణలోని వరంగల్‌లో కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌ పేరుతో డెవలప్ అవుతోంది. ఇలాంటి ప్రాజెక్టులు అమెరికా మార్కెట్‌తో అనుసంధానమైతే వేలాది యువతకు ప్రత్యక్ష ఉపాధి లభిస్తుంది. దీనివల్ల తెలంగాణలోని చేనేత కార్మికులకు కూడా పెద్దమొత్తంలో లబ్ధి చేకూరనుంది. ఇది ఒక్క వస్త్ర పరిశ్రమ గురించిన ప్రస్తావన మాత్రమే. వివిధ పరిశ్రమలతో తెలంగాణకు మరింత ప్రయోజనం చేకూరడం ఖాయం. వస్త్ర పరిశ్రమ పెరిగితే.. పత్తి ఉత్పత్తికి కూడా డిమాండ్ పెరుగుతుంది. దీని ద్వారా రైతుల ఆదాయం కూడా పెరుగుతుంది. ఇది ఒక చైన్ ప్రాసెస్.

కానీ, రాహుల్‌గాంధీ మాత్రం దీనికి భిన్నమైన, అర్థంలేని వాదనతో దేశ వస్త్ర పరిశ్రమ ఎగుమతిదారులను, పత్తి డిమాండ్ తగ్గుతుందని రైతులను భయపెట్టేందుకు కుట్రలు పన్నుతున్నారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా అనేక అంశాల్లో రాజీపడిన సంగతి మనందరికీ తెలుసు. 2013లో బాలి దీవిలో జరిగిన ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) మంత్రివర్గ సమావేశంలో ధాన్యం, పత్తిపై కనీస మద్దతు ధర (MSP) వ్యవస్థను 2017 నాటికి రద్దు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అంగీకరించింది. అనంతరం నరేంద్రమోదీ నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే ‘ఆహార భద్రత’ను దృష్టిలో ఉంచుకుని.. అభివృద్ధి చెందుతున్న దేశాల పబ్లిక్ స్టాక్‌హోల్డింగ్ కార్యక్రమాలను WTO సవాలు చేయకూడదని ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం కారణంగానే.. ఇవాళ కేంద్ర ప్రభుత్వం, కరోనానంతర పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా 81 కోట్ల మందికి ఉచితంగా ఆహారధాన్యాలను అందిస్తున్నది. తెలంగాణలోనూ 1.92 కోట్ల మంది ఈ పథకం ద్వారా లబ్ధిపొందుతున్నారు.


అన్నదాతల విషయంలో అన్యాయంగా వ్యవహరించినందుకు.. కాంగ్రెస్ పార్టీ సిగ్గుపడాలి. డాక్టర్ ఎమ్మెస్ స్వామినాథన్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన జాతీయ రైతు కమిషన్ సిఫారసులను అమలు చేసే ప్రసక్తే లేదని.. 2013లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉత్పత్తి వ్యయం కంటే కనీసం 50శాతం ఎక్కువగా కనీస మద్దతు ధర ఉండాలని స్వామినాథన్ కమిటీ సూచించింది. దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అంగీకరించలేదు. అనంతరం, నరేంద్రమోదీ ప్రభుత్వం ఉత్పత్తి వ్యయాన్ని పరిగణనలోకి తీసుకుని కనీస మద్దతు ధరను నిర్ణయించే విధానాన్ని అమలు చేసింది. 2014తో పోలిస్తే.. దాదాపు అన్ని పంటలకు 50శాతం కనీస మద్దతు ధర పెంచడం ద్వారా రైతుల ఆదాయం పెరిగింది.

మన దేశంలో హిమాచల్‌ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో యాపిల్ పంట బాగానే ఉన్నప్పటికీ.. దేశీయ అవసరాలకు తగ్గట్లుగా ఉత్పత్తి లేదు. భారతదేశం.. ప్రస్తుతం 5.5లక్షల మెట్రిక్ టన్నుల యాపిల్స్‌ను దిగుమతి చేసుకుంటోంది. అమెరికాతో ఒప్పందం కారణంగా అక్కడి నుంచి యాపిల్స్‌ను మనం దిగుమతి చేసుకోవచ్చు. అయితే.. అమెరికా నుంచి వచ్చే యాపిల్స్ ధర.. హిమాచల్‌ప్రదేశ్‌లో ఉత్పత్తి అవుతున్న ధరకంటే దాదాపు 40శాతం ఎక్కువ. అందువల్ల మన యాపిల్ రైతులకు ఎలాంటి నష్టం ఉండదు. మన దేశంలో ఏటా 6 కోట్ల టన్నుల దాణా అవసరం అవుతున్నది. రానున్న రోజుల్లో ఇది మరింత పెరుగుతుంది. కానీ ప్రస్తుతం అమెరికాతో కుదిరిన ఒప్పందం కారణంగా మనం అక్కడి నుంచి దిగుమతి చేసుకునేది 5 లక్షల టన్నులే. అంటే మన అవసరంలో 1శాతం మాత్రమే. పౌల్ట్రీ ఇండస్ట్రీ ఇంకా ఎక్కువ దాణా దిగుమతి చేయాలని అడిగినా సరే.. రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. అందుకే.. ఈ విషయంలో మన రైతులు ఏ మాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

ఇలాంటి చర్యలతో పాటుగా వివిధ దేశాలతో కుదుర్చుకుంటున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలతో.. దేశం, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే.. రాహుల్‌గాంధీకి మాత్రం కంటగింపుగా మారింది. దేశం, తెలంగాణ పురోగతి చెందడం, యువతకు ఉద్యోగాలు రావడం రాహుల్‌కు ఇష్టంలేదని అర్థమవుతోంది. ఇప్పటివరకు వరుసగా 100 ఎన్నికల్లో వరుస పరాజయాల తర్వాత రాహుల్‌గాంధీ నిరాశ, నిస్పృహలతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. అందుకే ప్రధానిపై ఉన్న వ్యతిరేకతను దేశంపై వ్యతిరేకతగా మలచుకున్నారు. మోదీ నాయకత్వంలో దేశం సాధిస్తున్న ప్రగతిని చూసి జీర్ణించుకోలేక, అధికారం దక్కదన్న అసహనంతో.. దేశంలో అన్నదాతలను, ఎగుమతిదారులను రెచ్చగొట్టేందుకు విఫలయత్నం చేస్తున్నారు. సందర్భోచితంగా మోదీ సర్కారు చేసుకుంటున్న ఒప్పందాలపై అసందర్భోచిత విమర్శలతో దేశ ప్రజలముందు మళ్లీ మళ్లీ తన పరువు తానే తీసుకుంటున్నారు. వీటిని కూడా దేశ ప్రజలు, తెలంగాణ ప్రజలు హర్షించరు. కచ్చితంగా ఈ కుట్రలను తిప్పికొడతారు.

జి.కిషన్‌రెడ్డి

కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి

ఈ వార్తలు కూడా చదవండి..

సీఎం రేవంత్‌రెడ్డికి అరుదైన అంతర్జాతీయ ఆహ్వానం..

చంద్రబాబుకు మేమెందుకు సహకరిస్తాం: సీఎం రేవంత్‌‌రెడ్డి

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 24 , 2026 | 01:09 AM