Share News

అశాంత ప్రపంచంలో మనమే ప్రశాంతం!

ABN , Publish Date - Nov 19 , 2026 | 01:53 AM

‘ఫ్రాన్స్ ప్రజల్లాగా నిరసన చేయలేమనా...?’ శీర్షికతో ఏపీ శాసనమండలి సభ్యులు సి.రామచంద్రయ్య రాసిన వ్యాసం (ఆంధ్రజ్యోతి 11.11.2026) చదివిన తరువాత వారి దృష్టిలో ప్రజాచైతన్యం అంటే నిరసనల...

అశాంత ప్రపంచంలో మనమే ప్రశాంతం!

‘ఫ్రాన్స్ ప్రజల్లాగా నిరసన చేయలేమనా...?’ శీర్షికతో ఏపీ శాసనమండలి సభ్యులు సి.రామచంద్రయ్య రాసిన వ్యాసం (ఆంధ్రజ్యోతి 11.11.2026) చదివిన తరువాత– వారి దృష్టిలో ప్రజాచైతన్యం అంటే నిరసనల పేరుతో రోడ్లపైకి వచ్చి విధ్వంసం సృష్టించడం, ప్రభుత్వ ఆస్తుల్ని తగులబెట్టడం, పోలీసులపైకి రాళ్లు రువ్వడం... ఇదేనేమో అనిపించింది! ఎందుకంటే ఐరోపాలోని ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, అల్బేనియా, బెల్జియం, జర్మనీ, స్విట్జర్లాండ్ తదితర దేశాలలో ఈ మధ్య జరుగుతున్నది ఇదే! అక్కడ జరుగుతున్న ఆందోళనలకు కారణం పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత, ప్రభుత్వ అస్తవ్యస్త ఆర్థిక విధానాలు, ధరాభారాలు, ఆరోగ్యమూ విద్య, సామాజిక రంగాల్లో సబ్సిడీలను కుదించాలన్న ఆయా ప్రభుత్వాల నిర్ణయాలూ కావచ్చు, లేదా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెబుతున్నట్టు ఆ దేశాల్లో చొరబడి అక్రమంగా నివసిస్తున్న అక్రమ వలసదారులు కావచ్చు. కారణం ఏదైనా అక్కడి ప్రజలు ఎంచుకున్న పోరాట విధానం మాత్రం సరైనది కాదు. ఆ పోరాటాలను చూసి మన దేశ ప్రజలు నేర్చుకోవాల్సిందీ ఏమీ లేదు.

ఈ మధ్య కాలంలో మన దేశంలో కూడా దేశ రాజధాని ఢిల్లీ వేదికగా అనేక ఉద్యమాలు, రాజకీయ ఉనికి కోసం కొన్ని పార్టీల పోరాటాలు జరిగాయి. వాటి వలన ప్రభుత్వ వాహనాలు దహనం అవ్వడం, పోలీసులూ నిరసనకారులూ తీవ్ర గాయాలపాలవడం తెలిసిందే. అయితే ఆ ఆందోళనల వలన సాధించిన ఫలితం ఏమిటని ప్రశ్నించుకుంటే సమాధానం శూన్యం. ఈ ప్రమాదాలను ముందుగానే గ్రహించిన మన రాజ్యాంగ నిర్మాతలు ‘మన సామాజిక, ఆర్థిక లక్ష్యాలు సాధించడానికి రాజ్యాంగబద్ధ పద్ధతులకు తప్పనిసరిగా కట్టుబడి ఉండాలి’ అని సూచించారు. హింసాయుత పద్ధతులతో పాటు పౌర ఉల్లంఘన, సహాయ నిరాకరణ, సత్యాగ్రహం వంటి ప్రక్రియలను పూర్తిగా విడిచిపెట్టాలని హెచ్చరించారు. అయినప్పటికీ ఈనాటికీ కొందరు ఇదే మార్గంలో వెళ్లడం బాధాకరం. కాకపోతే ఈ తరహా ఆందోళనలు దేశవ్యాప్తం కాకుండా ఉండటంలో అటు కేంద్ర ప్రభుత్వమూ, ఇటు దేశ ప్రజలూ చూపిన చొరవనూ, సంయమనాన్ని అభినందించాల్సిందే.


ప్రపంచ వ్యాప్తంగా యుద్ధాలు, అంతర్యుద్ధాలు, హక్కుల పోరాటాలు, మత ఘర్షణలు జరుగుతున్న ఈ రోజుల్లో... 140 కోట్ల జనాభా, 22 అధికార భాషలు, 8 మతాలు, వేల కులాలు ఉండి కూడా భారతదేశం ఒక్క దేశంగా నిలబడటం నిజంగా అద్భుతమే. నిజానికి మన దేశానికి కొన్ని శతాబ్దాలుగా శాంతి మార్గంలో పోరాటాలు చేసి, గొప్ప విజయాలు సాధించిన అనుభవం ఉంది. భారతదేశం ప్రశాంతంగా ఉండటానికి ఇంకొక ముఖ్య కారణం– భారతదేశ వ్యవస్థ అందరినీ కలుపుకుని వెళ్తుంది కాబట్టి. అలాగని సమస్యలు లేవని కాదు. కులం/మతం పేరుతో ప్రజల్లో విభజనలు, నిరుద్యోగ యువతలో అసంతృప్తి... అయితే ఇవేవీ కొత్తగా పుట్టుకొచ్చిన ప్రమాదాలు కావు. ఏనాటినుంచో ఉన్నవే. వీటన్నిటినీ ఎప్పటికప్పుడు ఎదుర్కొంటూ మన సమాజం ఐక్యతగా ముందుకుపోతూనే ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకర పరిస్థితులు ఉన్నా కూడా ఈ పదేళ్లలో మన దేశం అన్ని రంగాల్లోనూ సాధించిన ప్రగతి మామూలు విషయం కాదు. ఈ దశాబ్దకాలంలో ‘పేద దేశం’ అనే ముద్ర నుంచి ‘ప్రపంచాన్ని నడిపించే దేశం’ అనే స్థాయికి మన దేశం ఎదగడం నిజంగా మనందరికీ గర్వకారణం.

ఏది ఏమైనా ప్రజాస్వామ్యంలో పోరాటాలు హింస లేకుండా, చట్టబద్ధంగా ఉండాలని, కేవలం వ్యక్తుల మార్పు కంటే వ్యవస్థాపరమైన సంస్కరణలే ముఖ్యమని అందరూ గ్రహించాలి. ఆ దిశగా పోరాటాలు చేసే విధంగా యువతకు దిశానిర్దేశం చేయాలి. రాజ్యాంగం ఎంత ఉదాత్తమయినా, ప్రజల్లో రాజ్యాంగబద్ధ ప్రవర్తన, స్వభావం అలవోకగా సమకూరవని, మన దేశ పరిస్థితుల్లోనైతే వాటిని పనిగట్టుకుని నేర్పించాల్సి ఉంటుందని రాజ్యాంగ నిర్మాతలు ఆనాడే స్పష్టం చేశారు. భిన్న స్వరాలూ, భిన్న ఆకాంక్షలు మన ప్రజాస్వామ్య వ్యవస్థ సుసంపన్నతకు అద్దం పడుతున్నప్పటికీ, వాటిని సాధించుకోవడానికి తగిన పద్ధతుల్ని మనమే గౌరవించుకోకపోతే ఎప్పటికీ ఫలితాలు రావని హెచ్చరించారు. ఇటీవలి కాలంలో సోషల్‌ మీడియా వలన వేగంగా, తేలిగ్గా ప్రజల్ని సమీకరించే, ఆందోళన చేయగలిగే పద్ధతులు అందుబాటులోకి రావడంతో యువత రాజకీయాల పట్ల కొంత ఆసక్తిని కనబరుస్తున్నారు. ఇది సానుకూల పరిణామం. కానీ తాత్కాలిక ప్రయోజనం కోసం సమీప భవిష్యత్తులో తీవ్ర పరిణామాలకు దారితీసే చర్యలకు యువత పాల్పడకూడదు. ఈ అవగాహనను యువత సాధించగలిగితే కచ్చితంగా మనం యువత భాగస్వామ్యాన్ని రాజకీయాలలోను, పాలనలోను పెద్దఎత్తున పెంచే అవకాశాలుంటాయి. ఆ దిశగా యువతను సన్నద్ధం చేయాల్సిన బాధ్యత పౌరసమాజంపై ఉంది.

కూసంపూడి శ్రీనివాస్

జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి

ఈ వార్తలు కూడా చదవండి..

మొన్నే బుల్లెట్ దిగాల్సింది.. కానీ కొంచెంలో మిస్ అయ్యింది: ఎమ్మెల్యే కోమటిరెడ్డి

ఇందిరమ్మ కుటుంబ బీమా అమలుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: సీఎస్ ఆదేశం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 19 , 2026 | 01:53 AM