మహిళా ఆరోగ్యంపై మహత్తర ముందడుగు
ABN , Publish Date - Mar 10 , 2026 | 01:10 AM
ఒక క్యాన్సర్ వైద్యుడిగా దశాబ్దాలుగా పని చేస్తున్న నేను– ఈ కాన్సర్ ఎంతటి నష్టం కలిగిస్తుందో చూశాను, అలాగే ఆధునిక వైద్యం సాధించిన గొప్ప విజయాలను కూడా చూశాను. 14 ఏళ్ల బాలికల కోసం దేశవ్యాప్తంగా..
ఒక క్యాన్సర్ వైద్యుడిగా దశాబ్దాలుగా పని చేస్తున్న నేను– ఈ కాన్సర్ ఎంతటి నష్టం కలిగిస్తుందో చూశాను, అలాగే ఆధునిక వైద్యం సాధించిన గొప్ప విజయాలను కూడా చూశాను. 14 ఏళ్ల బాలికల కోసం దేశవ్యాప్తంగా ‘హ్యూమన్ పాపిలోమా వైరస్’ (HPV) ఉచిత టీకా కార్యక్రమాన్ని ఇటీవల భారత ప్రభుత్వం ప్రారంభించింది. ఈ నిర్ణయం దేశ ప్రజారోగ్య చరిత్రలో ఒక గొప్ప మైలురాయిగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. భారత ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం నాకు ఎంతో సంతోషాన్ని, గర్వాన్ని కలిగిస్తోంది. ప్రభుత్వం ఎంతో దూరదృష్టితో నిర్వహిస్తోన్న ఈ కార్యక్రమం కేవలం ఒక వ్యాక్సినేషన్ ప్రక్రియ మాత్రమే కాదు. ఇది ఎంతోమంది భారతీయ యువతుల ఆరోగ్యాన్ని, భవిష్యత్తును రక్షించే దిశగా తీసుకున్న గొప్ప ముందడుగు.
చాలా కాలంగా సర్వైకల్ క్యాన్సర్ (గర్భాశయ ముఖద్వార క్యాన్సర్) నిశ్శబ్దంగా విస్తరిస్తూ, దేశంలో పెద్ద ఆరోగ్య సమస్యగా మారింది. ఇది మన భారతీయ మహిళల్లో కనిపించే రెండో అత్యంత సాధారణ క్యాన్సర్. ఈ వ్యాధికి సంబంధించి ప్రతి ఏడాది– దాదాపు 80 వేల కొత్త కేసులు నమోదవడమేగాక, 42వేల మందికి పైగా మహిళలు ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ఈ సర్వైకల్ క్యాన్సర్ కేసులలో చాలా వరకూ పూర్తిగా నిరోధించగలిగినవే. సుమారు 80 శాతం కంటే ఎక్కువ సర్వైకల్ క్యాన్సర్ కేసులు అధిక ప్రమాదం కలిగిన HPV వైరస్‌ల వల్లనే వస్తాయి. ముఖ్యంగా హెచ్‌పీవీ–16తో పాటు హెచ్‌పీవీ–18 అనే వైరస్ రకాలే ఈ దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్‌కు కారణం.
వ్యాధి వచ్చాక చికిత్స చేయడం కంటే, వ్యాధి రాకుండా ముందే నివారించడం ఉత్తమం. కాబట్టి భారత్ ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టింది. ప్రతి ఏడాది 1.2 కోట్ల మంది బాలికలకు టీకాలు అందించాలనే ప్రభుత్వ నిర్ణయం ఎంతో ప్రశంసనీయమైనది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం అందజేస్తోన్న గార్డాసిల్ వ్యాక్సిన్– హెచ్‌పీవీ 6, 11, 16, 18 రకాల వైరస్‌ల నుంచి మహిళలకు రక్షణ ఇస్తుంది. ఎంతో ఖర్చుతో కూడిన ఈ టీకాను మూడు నెలల పాటు నిర్ణీత ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో పూర్తి ఉచితంగా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమాన్ని మరింత పారదర్శకంగా, వేగవంతంగా నిర్వహించడానికి U–WIN అనే డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోంది.
క్యాన్సర్ వైద్య నిపుణులుగా పరిశోధనల్లో మేం తెలుసుకున్నది ఏమిటంటే, లైంగిక జీవితం ప్రారంభం కావడానికి ముందే బాలికలకు ఈ టీకాను ఇవ్వడం చాలా అవసరం. ఎందుకంటే హెచ్‌పీవీ ఇన్ఫెక్షన్ తెలియకుండానే వస్తుంది. ఒక్కసారి ఈ వ్యాధికి గురైతే తర్వాత దాన్ని పూర్తిగా తొలగించలేం. ఈ టీకా చాలా సురక్షితమైనది, ఎంతో ప్రభావవంతమైనది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 50 కోట్లకు పైగా డోసులు ఇచ్చి, పూర్తిగా పరీక్షించబడింది.
ఈ చరిత్రాత్మక టీకా కార్యక్రమ నిర్వహణను ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. గర్భాశయ క్యాన్సర్ నివారణపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఇటీవల నిర్వహించిన ‘క్వాడ్ క్యాన్సర్ మూన్‌షాట్’ వంటి అంతర్జాతీయ వేదికల్లో ఈ కాన్సర్ (ముందస్తుగా సర్వికల్ క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు, తక్కువ ఖర్చుతో చికిత్స, టీకాల అందుబాటు వంటి అంశాలు)పై ప్రస్తావించారు. ఎంతో దృఢ సంకల్పం, కార్యదీక్ష ఉంటే తప్ప ఇలాంటి కార్యక్రమం అమలు సాధ్యం కాదు. ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం కోసం Gavi (ప్రపంచవ్యాప్తంగా టీకాల అందుబాటును పెంచేందుకు పనిచేసే అంతర్జాతీయ సంస్థ) నుంచి 2.6 కోట్ల టీకా డోసులు పొందడం చూస్తే, ఈ కార్యక్రమ నిర్వహణకు భారత ప్రభుత్వం ఎంతగా కృషి చేస్తోందో అర్థమవుతోంది.
ఒక వైద్య నిపుణుడిగా, మహిళల క్యాన్సర్ సంరక్షణకు జీవితాంతం కట్టుబడిన వ్యక్తిగా నేను విన్నవించేది ఒక్కటే. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సామాజిక కార్యకర్తలందరూ ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమంపై సమాజంలో అవగాహన కలిగించాలి. మనమంతా కలిసి ఈ టీకాలపై సమాజంలో నెలకొన్న అపోహలను తొలగించాలి. పద్నాలుగేళ్ల ప్రతి బాలిక ఈ సింగిల్ డోస్ టీకాతో రక్షణ పొందేలా కృషి చేయాలి. అప్పుడే భవిష్యత్తులో వేలాదిమంది మహిళలను సర్వికల్ క్యాన్సర్ నుంచి రక్షించగలుగుతాము. శాస్ర్తీయంగా విశ్వసనీయత కలిగిన ఈ టీకాను అందించడం ద్వారా దేశంలోని ఆడబిడ్డల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్న సందేశాన్ని ప్రపంచానికి భారతదేశం అందిస్తోంది.
ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమాన్ని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఇప్పుడు మనం ఒక కొత్త యుగం ప్రారంభ దశలో నిలబడి ఉన్నాం. ఒకప్పుడు భయంకరంగా భావించిన ఈ సర్వైకల్ క్యాన్సర్, త్వరలోనే చరిత్ర పుస్తకాలలో మాత్రమే ఉండే వ్యాధిగా మారే రోజు దగ్గరలోనే ఉంది. అప్పుడు భారత మహిళలు ఇంకా ఎక్కువ కాలం, ఆరోగ్యంగా, మరింత శక్తిమంతంగా జీవించే అవకాశం పొందుతారు.
డాక్టర్ నోరి దత్తాత్రేయుడు
ప్రపంచ ప్రఖ్యాత క్యాన్సర్ నిపుణులు
ఈ వార్తలు కూడా చదవండి..
రైతుల రుణాలపై కేంద్రం కీలక ప్రకటన
Read Latest AP News And Telugu News