Share News

‍సంక్షోభం కాదు, ఇది ‘సువర్ణా’వకాశం!

ABN , Publish Date - May 28 , 2026 | 03:19 AM

ఇరాన్ యుద్ధం మహా అయితే కొన్ని వారాలపాటు జరుగుతుందని అనుకున్నాం. కానీ శాశ్వత పరిష్కారం కనుచూపులో కన్పించటం లేదు. ఈ విపత్కర పరిస్థితుల్లో మధ్యకాలిక, దీర్ఘకాల నియంత్రణ...

‍సంక్షోభం కాదు, ఇది ‘సువర్ణా’వకాశం!

ఇరాన్ యుద్ధం మహా అయితే కొన్ని వారాలపాటు జరుగుతుందని అనుకున్నాం. కానీ శాశ్వత పరిష్కారం కనుచూపులో కన్పించటం లేదు. ఈ విపత్కర పరిస్థితుల్లో మధ్యకాలిక, దీర్ఘకాల నియంత్రణ చర్యలపై దృష్టి సారించాలి. ఈ సంక్షోభం, రవాణాకు అంతరాయం ఇంకొన్ని వారాలు, నెలలు కొనసాగవచ్చు. భవిష్యత్తులో ఇలాంటి అంతరాయాలు మరిన్ని తలెత్తే అవకాశముంది. వాటికీ సిద్ధం కావాలి.

మన తక్షణ సమస్య– 2027 ఆర్థిక సంవత్సరానికి భారీ విదేశీ వాణిజ్య లోటును ఎదుర్కోవటం. ఇప్పటికే విదేశీ ద్రవ్య నిల్వలు హరించుకుపోతున్నాయి. చమురు, గ్యాస్ దిగుమతుల ఖర్చే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 230 బిలియన్ డాలర్ల దాకా అయ్యే అవకాశముంది. దీంతోపాటు, బంగారం పట్ల మోజు.. ఫారెక్స్ నిల్వల్ని ఖాళీ చేస్తోంది. గత మూడేళ్లలో 2,273 మెట్రిక్ టన్నుల పసిడిని దిగుమతి చేసుకున్నాం. ఇది ప్రపంచం మొత్తం బంగారం ఉత్పత్తిలో 25శాతం. ప్రస్తుత పసిడి ధరల ప్రకారం, గత మూడేళ్ల దిగుమతుల విలువ 336 బిలియన్ డాలర్లు.

‘సంక్షోభం– వృధా చేసుకోకూడని గొప్ప అవకాశం’ అంటారు ఆర్థిక శాస్త్ర నోబెల్ గ్రహీత పాల్ రోమర్. ప్రస్తుత సంక్షోభాన్ని మనం అవకాశంగా మలచుకోవాలి. ఈ నేపథ్యంలో.. బంగారం విషయంలో అందరికీ లాభదాయకమైన పరిష్కారాన్ని ప్రతిపాదిస్తున్నాను. భారత్‌లో బంగారం ఉత్పత్తి నామమాత్రంగానీ.. దిగుమతులు, నిల్వలు మాత్రం ప్రపంచంలోనే అత్యధికం. ఇందులో చాలావరకు ప్రయివేటు వ్యక్తుల వద్ద ఉన్నాయి.

రోమన్ సామ్రాజ్యం కాలం నుంచి ఈ సంస్కృతి మన సమాజంలో భాగమైంది. మన దేశం విలాస సరుకుల్ని రోమ్‌కి భారీగా ఎగుమతి చేసేది. సుగంధ ద్రవ్యాలు, ముత్యాలు, ఏనుగు దంతాలు, నాజూకు వస్త్రాలు వంటివి. రుతుపవన ఆధారిత వాణిజ్య మార్గాలను ఇందుకు వినియోగించుకునేది. ఈ ఎగుమతుల నుంచి మనకు భారీ వాణిజ్య మిగులు లభించేది. ప్రతిగా బంగారం, వెండి, వజ్రవైఢూర్యాలు వంటివి పెద్దమొత్తంలో భారత్ దిగుమతి చేసుకునేది. ఈ వాణిజ్యంపై రోమ్‌లో ఆనాటి సుప్రసిద్ధ రచయిత, సేనానాయకుడు ప్లైనీ ది ఎల్డర్ (క్రీ.పూ 23–79) పెద్ద ఫిర్యాదే చేశారు. రోమన్లకు విలాస వస్తువుల పట్ల మోజును ఆసరాగా చేసుకుని రోమ్ సామ్రాజ్యం నుంచి ఇండియా ప్రతి సంవత్సరం 100 మిలియన్ రోమన్ సిక్కాల (సెస్టర్లు అనే నాణేలు)ను కొల్లగొడుతోందని ఆక్షేపించారు. అలా దిగుమతులు మొదలైన కాలం నుంచి.. బంగారాన్ని దాచుకోవటం భారతీయ కుటుంబాలు, మత సంస్థలకు ఆనవాయితీగా మారింది. భారతీయుల వద్ద ఇప్పటికి 35–40వేల మెట్రిక్ టన్నుల పసిడి ఉందని అంచనా. మానవ జాతి చరిత్రలో వెలికితీసిన మొత్తం బంగారంలో ఇది సుమారు 20శాతం. భారత్‌లో ఉన్న ఈ మొత్తం బంగారం విలువ ప్రస్తుత ధరల ప్రకారం 5 ట్రిలియన్ డాలర్లు.


మన సాంస్కృతిక పరంపరలో బంగారు నగలు భాగమైనా, ఆ పసిడి మన దేశంలో నగల తయారీకి ఉపయోగపడటం లేదు. దీంతో విదేశాల నుంచి ఏటా భారీ మొత్తాల్లో దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. పోనీ, డబ్బు రూపంలోకి మార్చి సమాజానికో, కుటుంబానికో అభివృద్ధి అవసరాలకు ఉపయోగపడే పెట్టుబడిగా మార్చుకోగలుగుతున్నామా అంటే– అదీ లేదు. 98శాతం బంగారం ప్రజల వద్ద ఇళ్లలోనో, లాకర్లలోనో నిరుపయోగంగా ఉంది. రిజర్వు బ్యాంక్ వద్ద 880 మెట్రిక్ టన్నుల వరకు నిల్వలు ఉంటాయేమో.

2015లో ప్రవేశపెట్టిన గోల్డ్ మానిటైజేషన్ పథకం (జీఎంఎస్) కేవలం 37.81 మెట్రిక్ టన్నుల పసిడిని ఉత్పాదక అవసరాలకు మళ్లించింది. అదే ఏడాది తీసుకొచ్చిన సావరిన్ గోల్డ్ బాండ్ (ఎస్‌జీబీ) రూ.72,000 కోట్లను మాత్రమే బాండ్లుగా మార్చగలిగింది. సభ్యుల పెట్టుబడి బాండ్ల ద్వారా పోగైన మొత్తం బంగారం సుమారు 147 మెట్రిక్ టన్నులు. ఇప్పుడు బంగారం ధర చుక్కలు తాకటంతో.. ప్రభుత్వ ఖజానాపై ఆ మేరకు భారం పడుతుంది. ఎస్‌జీబీ హామీల్ని నెరవేర్చటానికి అంచనాలకు మించి ఎక్కువ మొత్తాల్ని నష్టపోవాల్సి ఉంటుంది. ఇంత సంక్షోభంలోనూ ఖరీదైన దిగుమతుల అవసరం లేకుండా, దేశీయ అవసరాలకు మన వద్దే నిరుపయోగంగా నిల్వవుంచిన బంగారాన్ని వినియోగించలేమా? దేశంలో మౌలిక వసతులను, మన ఉత్పాదక శక్తిని పెంచే ప్రయివేటు ప్రాజెక్టులకు అవసరమైన నిధులను సమకూర్చుకోవటం కోసం భారీ బంగారం నిల్వల రూపంలో నిరుపయోగంగా ఉన్న ఈ పెట్టుబడిని ఉపయోగించలేమా?

ఎస్‌జీబీలో రిస్క్ ఉన్నమాట వాస్తవం. బాండ్ కొనుగోలుదారులు నగదు చెల్లించి, వర్చువల్ (ఆన్‌లైన్) బంగారాన్ని కొనుగోలు చేస్తారు. బాండ్ విలువ మేరకు వడ్డీ అందుకుంటారు. గడువుతీరే సమయానికి బంగారానికి మార్కెట్‌లో ఎంత విలువ ఉంటే అంత మొత్తాన్నీ పొందే గ్యారంటీ ఉంటుంది. బాండ్‌ల ద్వారా కొనుగోలు చేసిన 147 మెట్రిక్ టన్నుల బంగారానికి ఇప్పటి మార్కెట్ రేటును చెల్లించాలంటే.. ప్రభుత్వం రూ.1,00,000 కోట్లు నష్టపోతుంది.

కానీ, జీఎంఎస్ భిన్నమైనది. సరైనరీతిలో మెరుగుపరిస్తే జీఎంఎస్‌లో ప్రజలకు, ప్రభుత్వ ఖజానాకూ మంచి లాభావకాశాలున్నాయి. జీఎంఎస్‌లో తమ బంగారాన్ని యథాతథంగా (భౌతిక వస్తురూపంలో) ప్రజలు బ్యాంకులో డిపాజిట్ చేస్తారు. సురక్షితమైన వడ్డీ ఖాతాను ప్రారంభిస్తారు. ఏటా కొద్దిమొత్తం వడ్డీని ఆర్జిస్తారు. గడువు తీరాక, డిపాజిటర్‌కి బంగారాన్ని డబ్బు రూపంలోనో బంగారు కడ్డీలు, నాణేల రూపంలోనో వడ్డీతో సహా చెల్లిస్తారు. ఇందులో బ్యాంకులకు రిస్క్ చాలా తక్కువ. డిపాజిట్ చేసిన బంగారాన్ని కొంతమేర డిమాండ్‌ను బట్టి దేశీయ మార్కెట్‌కి మళ్లించవచ్చు. దీనివల్ల పసుపు లోహాన్ని దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉండదు. విలువైన విదేశీ మారక ద్రవ్యాన్ని కోల్పోనక్కర్లేదు. ఈ పథకాన్ని గనక సులభతరం చేసి, డిపాజిట్‌దార్లకు తేలిగ్గా ఉండేలా ప్రక్రియను మారిస్తే.. బంగారాన్ని గణనీయ మొత్తంలో బ్యాంకులు ఆకర్షిస్తాయి.


ప్రయివేటు పౌరులను, కుటుంబాలను దొంగ–పోలీస్ తరహా ప్రశ్నలు అడగకుండా; ఇళ్లలోని బంగారాన్ని వెల్లడించినందుకు పన్నులు విధించకుండా ఉంటేనే అది సాధ్యమవుతుంది. సంఘటిత నేర ముఠాలు అవినీతి సొమ్మును చెలామణిలోకి తెచ్చుకోకుండా జీఎంఎస్‌లో తగిన జాగ్రత్తలని తీసుకోవాలి.

సరైన రీతిలో రూపకల్పన, అమలు చేస్తే.. ఇది మంచి ఫలితాలనిచ్చే అవకాశముంది. లావాదేవీలు సాధారణ బ్యాంకింగ్ కలాపాల్లా జరుగుతాయి. వ్యక్తులు, కుటుంబాలు తాము పొదుపు చేసుకున్న డబ్బుని బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తుంటాయి. అవసరం ఉన్నవారికి బ్యాంకులు ఆ డబ్బును రుణంగా వడ్డీకి ఇస్తాయి. డిపాజిట్ చేసిన వారు వడ్డీ పొందుతారు. అవసరమైనప్పుడు డిపాజిట్‌ను ఉపసంహరించుకుంటారు. బంగారాన్ని కూడా మనం అదే రీతిలో చెలామణి చేయవచ్చు. దీనివల్ల పసిడి దిగుమతి భారీగా తగ్గుతుంది. అంతకంటే ముఖ్యం, ఇతర దేశాలనో, ద్రవ్య సంస్థలనో దేబిరించాల్సిన అవసరం లేకుండా.. బంగారం రూపంలో నిరుపయోగంగా ఉన్న అపార పెట్టుబడిని వినియోగంలోకి తేవచ్చు. అభివృద్ధి, ఆర్థిక ప్రగతికి అవసరమైన పెట్టుబడికి వినియోగించవచ్చు. డిపాజిట్ రూపంలోని బంగారాన్ని క్రమంగా దేశ వినియోగ అవసరాలకు మళ్లిస్తారు. ఒక దశాబ్దకాలం గడిచేసరికి, మన ఆర్థిక వ్యవస్థ ఇంకా పరిణతి చెందుతుంది. హరిత సాంకేతికతలు విస్తరిస్తాయి. ఇంధన దిగుమతుల మీద మనం ఆధారపడటమూ తగ్గుతుంది. ఎగుమతులు పెరిగి వాణిజ్య మిగులు ఏర్పడుతుంది. అవసరమనుకుంటే, అప్పుడు అడపాదడపా కొంత బంగారం దిగుమతి మొదలుపెట్టవచ్చు. ఇప్పుడు ఓ పదేళ్ల పాటు పసిడి దిగుమతులకు విరామం అవసరం.

‘భారతదేశం ఓడిపోతే గెలిచేదెవరు? భారత్ గెలిస్తే ఓడిపోయేదెవరు? అని ప్రధాని నెహ్రూ అన్నారు. ఇప్పుడు దేశం కోసం ఈ లక్ష్యాల్ని నెరవేర్చే సంకల్పాన్ని... ఆర్థిక, బ్యాంకింగ్, పన్నుల, బంగారం, వాణిజ్య రంగాలలో నిపుణులు, ఆభరణాల తయారీదారులు ప్రదర్శించాలి. కలసి కూర్చుని చర్చించాలి. చాలా జాగ్రత్తగా ఆలోచించి ఆకర్షణీయ పథకానికి రూపకల్పన చేయాలి. ఒక అభివృద్ధి చెందిన దేశమవటానికి గొప్ప అవకాశం అందుబాటులోకి వచ్చిన తరుణంలో...భారీ పెట్టుబడిని నిరుపయోగకరంగా దాచిపెట్టటం, బంగారం పట్ల అంతులేని మోజును ప్రదర్శించటం, పెట్టుబడి అవసరం విపరీతంగా ఉన్న సమయంలో 5 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడిని బంగారం రూపంలో నిరుపయోగకరంగా వదిలేయడం తెలివైన పంథా కాదు.

డాక్టర్ జయప్రకాష్ నారాయణ్

లోక్‌సత్తా వ్యవస్థాపకులు

ఈ వార్తలు కూడా చదవండి..

న్యాయవాది మొయినుద్దీన్‌ హత్యకేసులో కీలక పరిణామం

లోకేష్ నాయకత్వంలో టీడీపీ మరింత బలంగా ముందుకెళ్తుంది: ఎంపీ శ్రీభరత్

For More AP News And Telugu News

Updated Date - May 28 , 2026 | 03:19 AM