పేదల పెన్నిధిగా ‘పాడి’ పథం
ABN , Publish Date - Feb 20 , 2026 | 12:27 AM
జీవన దృశ్యాలు కొన్ని ఎప్పటికీ మనతో ఉంటాయి. దశాబ్దాల నాటి ఒక పల్లె జీవన దృశ్యం ఒక స్ఫూర్తిదాయక భావచిత్రంలా నా మనసులో నిలిచిపోయింది. రాజస్థాన్‌లోని ఒక గ్రామంలో ఉన్నప్పటి మాట ఇది. ఆ రోజు కోళ్లు కూయక ముందే...
జీవన దృశ్యాలు కొన్ని ఎప్పటికీ మనతో ఉంటాయి. దశాబ్దాల నాటి ఒక పల్లె జీవన దృశ్యం ఒక స్ఫూర్తిదాయక భావచిత్రంలా నా మనసులో నిలిచిపోయింది. రాజస్థాన్‌లోని ఒక గ్రామంలో ఉన్నప్పటి మాట ఇది. ఆ రోజు కోళ్లు కూయక ముందే నిద్ర నుంచి మేల్కొన్నాను. పొగమంచు ఆ పల్లెను దట్టంగా కమ్మేసి ఉంది. ఆ ఊరులో ఉన్న పాల సేకరణ కేంద్రంకు వెళ్లేందుకు సమాయత్తమయ్యాను. ఒక మామూలు ఇంటిలో ఆ కేంద్రం ఉన్నది. లోపల పలువురు మహిళలు బారులు తీరి ఉన్నారు. ఒక్కొక్కరు తమ చేతుల్లో ఉన్న ఇత్తడి పాత్రను ఒక చిన్న వెయింగ్ మెషీన్ మీద ఉంచుతున్నారు. క్షణాల్లో ఒక ప్రింటెడ్ స్లిప్‌ను తీసుకుని తమ పాత్రల్లోని పాలను ఒక పెద్ద డబ్బాలో పోస్తున్నారు. ఆ మహిళల్లో అక్షరాస్యులు ఒక్కరూ లేరు. తాము సరఫరా చేసిన పాల పరిమాణాన్ని, ఆ పాలలో కొవ్వు ఎంత ఉన్నదో నమోదు చేసి ఉన్న ఆ ప్రింటెడ్ స్లిప్‌ను ఆత్మవిశ్వాసంతో చూపారు. పాల పరిమాణం, అందులోని కొవ్వును బట్టి వారికి చెల్లింపులు జరుగుతాయి. ఆ మహిళలు సరఫరా చేసిన పాలతో నిండిపోయిన పెద్ద డబ్బాలను చిన్న వాహనం మీదకి చేర్చి జిల్లా, రాష్ట్ర స్థాయి పాల ఉత్పత్తి కేంద్రాలకు పంపుతారు. ఇది చదివాక మీకిప్పుడు అమూల్ గుర్తొస్తోందా? అవును, మన దేశంలో పాల ఉత్పత్తిని ఇతోధికంగా పెంచిన శ్వేత విప్లవాన్ని సాధించిన అమూల్ పాడి పరిశ్రమ నమూనా అది. అనేకానేక ఆవులు, గేదెలతో కూడిన పాల ఉత్పత్తి కేంద్రం లేదా ఒకటి లేదా రెండు గేదెలు ఉన్న ఒక కుటుంబం అమూల్ నమూనా సహకార పాడి పరిశ్రమలో భాగమే.
నాటి ఆ పల్లె జీవన దృశ్యానికి వర్తమాన ప్రాసంగికత ఉన్నది. ఒక కొత్త ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఉనికిలోకి వస్తోన్న కాలమిది. ప్రతి దేశమూ సొంత సహజ వనరులు, ఆర్థిక బలాల ప్రాతిపదికన భద్ర భవిష్యత్తును నిర్మించుకోవడానికి ఆరాటపడుతున్న రోజులివి. మనం కూడా అభివృద్ధి చెందడానికి ఉత్తమ మార్గం ఏమిటో తెలుసుకోవలసిన సమయమిది. మనం అనుసరించాల్సిన అభివృద్ధి సాధన మార్గం పాత సంపన్న దేశాల అభివృద్ధి పథానికి భిన్నంగా ఉండి తీరాలి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తన పెత్తనాన్ని నిలుపుకోవడానికి ఆ పాత సంపన్న దేశాలు నానా విధాలుగా ప్రయత్నిస్తున్నాయన్న వాస్తవాన్ని మనం విస్మరించకూడదు.
మళ్లీ పాడి పరిశ్రమ విషయానికి వద్దాం. పాశ్చాత్యదేశాలు ఆర్థిక వ్యవస్థలోని ఇతర రంగాలలో అనుసరించే పద్ధతులనే ఈ రంగంలోనూ అనుసరిస్తున్నాయి. పారిశ్రామిక సంస్థల తరహాలో భారీ స్థాయిలో పాలను ఉత్పత్తి చేస్తాయి. ఉత్పత్తి కేంద్రాల్లో భారీ యంత్రీకరణ విధిగా ఉంటుంది. పాల ఉత్పత్తి కార్యకలాపాలు భారీ స్థాయిలో ఉన్నప్పుడే పాల ఉత్పత్తి భారీ పరిమాణంలో ఉంటుందని, తద్వారా మరింత అధికంగా విక్రయించి అధిక లాభాలు ఆర్జించడం సాధ్యమవుతుందనే భావన పాశ్చాత్య పాడి పరిశ్రమ నమూనాకు ప్రాతిపదిక. అయితే అటువంటి భారీ లాభార్జనకు పెద్ద మూల్యమే చెల్లించవలసివస్తోంది. క్రిమి సంహారక మందులు, యాంటీ బయోటిక్స్ మొదలైన బాహ్య ఉత్పాదకాలపై అధికంగా ఆధారపడడం వాతావరణ కాలుష్యానికి, ఆహార భద్రతా సమస్యలకు దారితీస్తోంది. పాల సరఫరా సగటు ఆదాయపరులకూ అందుబాటులో ఉండేందుకు ప్రభుత్వాలు సబ్సిడీలనిస్తున్నాయి. అయితే గిరాకీ కంటే పాల సరఫరా అధికంగా ఉండడంతో పాడి పరిశ్రమ సమస్యలు సంక్లిష్టమయ్యాయి. దీంతో ఉత్పత్తిదారులకు కొత్త మార్కెట్లు అవసరమవుతున్నాయి.
విదేశీ పాడి ఉత్పత్తులను తమ మార్కెట్‌లోకి అనుమతించే విషయమై ప్రపంచ దేశాలు తర్జన భర్జనపడుతున్నాయి. విదేశీ పాడి ఉత్పత్తులను అనుమతిస్తే తమ పాల ఉత్పతిపైన ప్రతికూల ప్రభావం పడుతుందని, రైతుల శ్రేయస్సు దెబ్బతింటుందని అభివృద్ధి చెందుతున్న దేశాలు సంశయిస్తున్నాయి. ఈ అంశం సంపన్న, పేద దేశాల మధ్య వివాదాస్పదంగా ఉండడంలో ఆశ్చర్యం లేదు. మెర్కోసూర్ (బ్రెజిల్, అర్జెంటీనా, పరాగ్వే, ఉరుగ్వే, బొలీవియాల స్వేచ్ఛా వాణిజ్య కూటమి) దేశాలతో వాణిజ్య ఒప్పందం తమకు నష్టదాయకంగా పరిణమించవచ్చని యూరోపియన్ యూనియన్ దేశాలు సంకోచిస్తున్నాయి. పాడి ఉత్పత్తులలో లాటిన్ అమెరికా దేశాలు తమకు పోటీ కావడాన్ని యూరోపియన్ దేశాలు భరించలేకపోతున్నాయి మరి. ఇటీవల యూరోపియన్ యూనియన్, అమెరికాతో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాలలో కూడా వ్యవసాయం, పాడి ఉత్పత్తులే అత్యంత వివాదాస్పద అంశాలు కావడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఈ వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకుని మన పాడి పరిశ్రమ అభివృద్ధి నమూనా ఎలా భిన్నమైనదో, మన ఆర్థిక భద్రతకు అది ఎలా భరోసా కల్పిస్తుందో అర్థం చేసుకోవల్సిన అవసరమున్నది.
ప్రపంచ అగ్రగామి పాల ఉత్పత్తిదారుల్లో భారత్ ఒకటి. నేడు ప్రపంచ పాల ఉత్పత్తిలో నాల్గవ వంతును మన దేశమే ఉత్పత్తి చేస్తోంది. గత దశాబ్దంలో మన పాడి పశువుల రంగం ఏడు శాతం అభివృద్ధిని సాధించింది. ఇదెలా సాధ్యమయింది? పాడి ఉత్పత్తుల రంగంలోని కార్పొరేట్ కంపెనీల వల్ల కాదు, పాల ఉత్పత్తిలో పాలుపంచుకుంటున్న లక్షలాది కుటుంబాల వల్లే ఆ పెరుగుదల సాధ్యమయింది. నేను తొలుత ప్రస్తావించిన రాజస్థానీ మహిళల లాంటి సామాన్య పౌరులే పాడి పశువుల పెరుగుదలకు ప్రధాన కారకులు. ఇది అద్వితీయమైన పెరుగుదల. ఈ అభివృద్ధి లక్షలాది కుటుంబాలకు మంచి ఆదాయాన్ని సమకూరుస్తోంది. వారు ఆ ఆదాయాన్ని తమకు మరింత శ్రేయోదాయక జీవితాన్ని సమకూర్చుకునేందుకు వినియోగిస్తున్నారు.
ఈ ఆర్థికాభివృద్ధి నమూనాలో మరో రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి, వ్యయాలను సాధ్యమైనంత తక్కువగా ఉంచడం. దీనివల్ల వినియోగదారులకు ఆహారం మరింత చౌకగా అందుబాటులో ఉంటుంది. రైతులకూ మంచి ఆదాయం సమకూరుతుంది. ఉత్పాదకాలను పరిమితంగా ఉపయోగించడమనేది మరో అంశం. పారిశ్రామిక తరహా పాల ఉత్పత్తి వ్యవస్థల్లో పశువులకు సోకే వ్యాధులను నిరోధించేందుకు చేసే వ్యయం భారీ స్థాయిలో ఉంటుంది. పశుగణాలను ఆరోగ్యకరంగా ఉంచేందుకు యాంటీ బయోటిక్స్‌ను నిత్యం ఉపయోగిస్తారు. భారతీయ రైతులు పశుపోషణలో పాటించే పద్ధతులు ఆరోగ్యకరమైనవి. జాతీయ పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ మన సంప్రదాయ పశుపోషణ పద్ధతులను తప్పక ప్రోత్సహించాలి. యాంటీ బయోటిక్స్ వాడకాన్ని తగ్గించేందుకు పటిష్ఠ చర్యలు చేపట్టాలి.
దేశీయ ఉత్పత్తులను వినియోగించుకోవడాన్ని ప్రోత్సహించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎగుమతులే లక్ష్యంగా ఉండే ఉత్పాదక కార్యకలాపాల వల్ల సంక్షేమం సమకూరదు. గ్రామీణ కుటుంబాలు సొంత గృహాలలో పండించుకున్న కూరగాయలను ఎక్కువగా వినియోగించుకోవాలి. అలాగే పట్టణ కుటుంబాలు పరిసర ప్రాంతాలలో పండించే కూరగాయలు, పండ్లను ఎక్కువగా వినియోగించుకోవాలి. స్థానిక ఉత్పత్తుల వినియోగం పెరుగుదలతో స్థానిక మార్కెట్లు బలపడతాయి. పాల వినియోగం పెరుగుతున్నందున స్థానికంగా ఉత్పత్తి అయ్యే పాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రాధాన్యమివ్వాలి. మన పాడిపరిశ్రమకు లక్షలాది కుటుంబాలు ఆలంబనగా ఉన్నాయి. వారి సామూహిక కృషిని ఇతోధికంగా ప్రోత్సహించాలి. తద్వారా సామాన్య ప్రజలు మరింత ఆదాయ లబ్ధిని పొందుతారు.
సునీతా నారాయణ్
(‘సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్’ డైరెక్టర్ జనరల్,
‘డౌన్ టు ఎర్త్’ సంపాదకురాలు)
ఈ వార్తలు కూడా చదవండి..
వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఏసీబీ కోర్టు నోటీసులు..
నకిలీ మద్యం కేసు.. నిందితులకు రిమాండ్ పొడిగింపు
Read Latest Telangana News And AP News And Telugu News