Share News

వీడని వలసవాద మనో బంధాలు!

ABN , Publish Date - Mar 06 , 2026 | 02:56 AM

కేంద్ర ప్రభుత్వ కార్యకలాపాలలో పేర్ల మార్పు, విగ్రహ ప్రతిష్ఠాపన ప్రాధాన్యం పొందుతున్నాయి. ప్రతి నెలా కాకపోయినా మూడు నాలుగు నెలలకోసారి ఒక నగరం లేదా ఒక రోడ్డు పేరు మార్పును ప్రభుత్వం...

వీడని వలసవాద మనో బంధాలు!

కేంద్ర ప్రభుత్వ కార్యకలాపాలలో పేర్ల మార్పు, విగ్రహ ప్రతిష్ఠాపన ప్రాధాన్యం పొందుతున్నాయి. ప్రతి నెలా కాకపోయినా మూడు నాలుగు నెలలకోసారి ఒక నగరం లేదా ఒక రోడ్డు పేరు మార్పును ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. హిందీ భాషలో ఉన్న పేరుతో ఒక కొత్త చట్టాన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టడమో లేదా ఆమోదించడమో జరుగుతోంది. ఎక్కడో ఒకచోట ఒక కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేస్తోంది. వలస పాలన అవశేషాలను తొలగించడం లేదా మొగల్‌ చరిత్ర గుర్తులను తీసివేయడం పేరిట ఇవన్నీ జరుగుతున్నాయి.

పది రోజుల క్రితం రాష్ట్రపతి భవన్‌ ఆవరణలో ఎడ్విన్‌ లూట్యెన్స్‌ విగ్రహం స్థానంలో సి.రాజగోపాలాచారి ప్రతిమ నేర్పాటు చేశారు. న్యూఢిల్లీ నగర నిర్మాణ శిల్పి లూట్యెన్స్‌. రాజాజీగా సుప్రసిద్ధుడైన చక్రవర్తుల రాజగోపాలాచారి భారతదేశ చిట్టచివరి గవర్నర్‌–జనరల్‌, ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రి, ముఖ్యంగా మహాత్మాగాంధీ ‘మనస్సాక్షి సంరక్షకుడు’ (Con-science keeper)గా సువిఖ్యాతుడు. 1954లో భారత ప్రభుత్వం ఆయనను భారతరత్న పురస్కారంతో గౌరవించింది. రాష్ట్రపతి భవన్‌ ఆవరణలో రాజాజీ విగ్రహ ప్రతిష్ఠాపన ఆయన సమున్నత చరిత్రను జాతి జ్ఞాపకం చేసుకుంటున్న తీరుకు ఒక ఉదాత్త తార్కాణం. ఈ సంస్మరణను, ఎలా భావిస్తున్నారు అనేదే సమస్య. జాతీయవాద సంబంధితమైనదని వివరిస్తున్నప్పటికీ వలసవాద పాలన దుష్ప్రభావాల నుంచి విముక్తి సాధనకు అదొక స్ఫూర్తిదాయక చిహ్నమని ఘంటాపథంగా చెప్పారు ప్రతిష్ఠాపకులు. రాష్ట్రపతి భవన్‌లో ఆ సౌధ వాస్తు శిల్పి లూట్యెన్స్‌ ప్రతిమను తొలగించడంపై సహజంగానే సణుగుడు విన్పించింది. కొంతమంది తీవ్ర విమర్శలూ చేశారు. అయితే ఆ విమర్శలు, ఆక్షేపణలు జాతి వ్యతిరేకమైనవని, వలసవాద బానిసత్వానికి గుర్తులని సామాజిక మాధ్యమాలలో పలువురు ధ్వజమెత్తారు. లూట్యెన్స్‌ న్యూఢిల్లీ నగర నిర్మాణశిల్పి కదా అని అన్నప్పుడు భారతీయుల గురించి ఆయన అభిప్రాయాలను ఏకరువు పెడుతూ న్యూఢిల్లీ వాస్తుశిల్పి ఒక జాత్యహంకారవాది అని వర్తమాన జాతీయవాద ధోరణులను సమర్థించేవారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ లెక్కన, గతించిన కాలంలోని మన నాయకులు ఎంతమంది విశాల, మానవతా భావాల పరీక్షలో నెగ్గుతారు?

అదలా ఉంచితే స్వాతంత్ర్యానంతర, ముఖ్యంగా మన వర్తమాన నాయకుల వలసవాద వ్యతిరేకతను నిశితంగా చూడవలసిన అవసరమున్నది. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వ చారిత్రక దృక్పథం, విధాన నిర్ణయాలు, సాంస్కృతిక ఆసక్తులు, ప్రతిపాదిత చట్టాలు, ఆర్థిక అజెండా... అన్నీ వలస పాలకుల విధానాలు, వ్యూహాలు, పద్ధతులకు అనుగుణంగా ఉన్నవే.


వలసవాదం విషయంలో బయటి మనిషి వర్సెస్‌ లోపలి మనిషి అంటే విదేశీయులు వర్సెస్‌ దేశీయులు అన్న వాదన సహేతుకమైనది కాదు. ఎందుకంటే వలసవాదులు ఎవరు (దేశీయులా, విదేశీయులా) అన్న ప్రశ్న వలసవాదం నిజమైన స్వభావాన్ని అర్థం చేసుకునేందుకు తోడ్పడదు. మరింత స్పష్టంగా చెప్పాలంటే ఆ ప్రశ్న వలసవాదం నిజస్వభావాన్ని కప్పిపుచ్చుతుంది. వలసవాదం ఒక సాంస్కృతిక–ఆర్థిక వ్యవస్థ. ప్రజలను సంపూర్ణంగా నియంత్రించే వ్యవస్థ. అవసరమైతే వారిని పూర్తిగా కకావికలు చేయగల శక్తిమంతమైన అధికార వ్యవస్థ. వలసవాదం ప్రజలకు ప్రాథమిక హక్కులను నిరాకరిస్తుంది. శిక్షా స్మృతి, నేర విచారణా స్మృతి మొదలైన వలస పాలకుల కాలం నాటి చట్టాల స్థానంలో 2023లో భారతీయ న్యాయసంహిత, భారతీయ నాగరిక్‌ సురక్షా సంహితలను తీసుకువచ్చారు. అయితే ఆ చట్టాలలో మార్పులు సారహీనమైనవని న్యాయశాస్త్ర కోవిదులు కొట్టివేశారు. ఈ సంహితలలోని కొన్ని కొత్త నిబంధనలు వలస పాలనా కాలం నాటి చట్టాలలోని నిబంధనల కంటే కూడా ప్రగతి నిరోధకమైనవని వారు స్పష్టంగా ఎత్తి చూపారు. చట్టాల పేర్లు మార్చారు కానీ ఆ పేర్ల మార్పుతో పాటు రాజ్య వ్యవస్థలో, పౌరుల మధ్య సంబంధాలలో మార్పేమీ రాలేదు.

ఇటీవల న్యూఢిల్లీలో ఇండియా ఏఐ ఇంపాక్ట్‌ సమ్మిట్‌–2026 వద్ద ప్రధానమంత్రికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తల అర్ధనగ్న నిరసన ప్రదర్శననే చూడండి. కాంగ్రెస్‌ కార్యకర్తల తీరు ఎలా ఉన్నప్పటికీ వారి నిరసన జాతి ప్రయోజనాలకు ఏ విధంగానూ వ్యతిరేకమైనది కాదు, దేశ ప్రతిష్ఠకు భంగకరమైనది కానే కాదు. ప్రజలు ఆగ్రహావేశాలతో నిర్వహించే నిరసన ప్రదర్శనలకు వలస పాలకులు, నిరంకుశ ప్రభుత్వాలు మాత్రమే భయపడతాయి. ఏఐ సదస్సు వద్ద నిరసన ప్రదర్శన కారణంగా అరెస్టయిన కాంగ్రెస్‌ కార్యకర్తలలో కొంత మంది ఇప్పటికీ జైలులోనే ఉన్నారు. వారికి బెయిల్‌ మంజూరు చేసేందుకు కోర్టు ఆమోదించడం లేదు.

ఇరుగుపొరుగువారి భూములలోకి ప్రవేశించడం, వాటిని స్వాధీనం చేసుకోవడం, అక్కడి చెట్టూ చేమా, కొండా కోనా, వాగు, వంక, నదిని, మరీ ముఖ్యంగా తోటి పౌరుల జీవనరీతులను ధ్వంసం చేయడం... ఇదంతా ఊరి ప్రజల శ్రేయస్సుకు, దేశ ప్రయోజనాలకు అని గంభీరంగా చెప్పడమనేది వలసవాద–పెట్టుబడిదారీ వ్యవస్థల మరో కుతంత్రం. గ్రేట్‌ నికోబార్‌ దీవిలో ఇప్పుడు జరుగుతున్నది కూడా ఇదే సుమా! ఆ దీవిలో, 130 చదరపు కిలోమీటర్ల అటవీ భూమితో సహా 166 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలోని భూములలో పర్యావరణాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు. ప్రభుత్వం ఈ నిర్వాకాన్ని చేసిన తీరు పూర్తిగా– అవును, ఎటువంటి మినహాయింపు లేకుండా, వలసపాలనా సంబంధితమైనదే. నిజమే, గ్రేట్‌ నికోబార్‌ మన భారత్‌లో భాగమే. అయితే ఆ దీవి, అక్కడి ప్రజలు ప్రభుత్వాల సంరక్షణలో ఉంటూ వచ్చారు. వారికి రక్షణ కల్పించడమంటే వారి జీవనరీతులు, పర్యావరణాన్ని అర్థం చేసుకోవలసిన అవసరమున్నది. ఈ వాస్తవాన్ని విస్మరించి పర్యావరణాన్ని సామాజిక జీవనరీతులను నిర్మూలించడం వలసవాద క్రూరత్వం కాక మరేమిటి? గ్రేట్‌ నికోబార్‌ ప్రజలకు మనం బయటి మనుషులమే. వారి భూభాగాలను స్వాధీనం చేసుకున్న వలసకారులమే.


భారత ప్రజలను కుల మతాలు, ఇతర సంకుచిత అంతరాల ప్రాతిపదికన విడదీయడమే వలస పాలకుల అజెండాగా సదా ఉండేది. మతం పేరిట హిందువులు, ముస్లింల మధ్య విభేదాలు సృష్టించారు. ఉభయ మతస్థులూ సామరస్యపూర్వకంగా తమ విభేదాలను పరిష్కరించుకోవడానికి వీలు లేకుండా చేశారు. ఇందుకుగాను ఒకరిపై ఒకరికి విద్వేషాలు పుట్టే విధంగా చరిత్రలు రాశారు. హిందువులు, ముస్లింలు ఒకరితో ఒకరు పోరాడుకున్నప్పుడు వలస పాలకులు పరమానందభరితులయ్యారు. ప్రస్తుత పాలకుల ప్రోత్సాహంతో చరిత్రను తిరగరాస్తున్న తీరుతెన్నులు మత సామరస్యానికి దోహదం చేసేవిగా లేవు. వలస పాలకుల హయాంలో కంటే ఘోరమైన పక్షపాతాలు చరిత్ర రచనలో ప్రస్తుతం వ్యక్తమవుతున్నాయి. పాఠ్యపుస్తకాలలోను ప్రజా చర్చలలోను ఈ ధోరణులు ప్రబలమవుతున్నాయి. వలస పాలకుల పక్షపాత వైఖరులే మరో విధంగా ఇప్పటికీ కొనసాగుతున్నాయి. కాకపోతే ఆ కాలంలో పాలకులుగా శ్వేత జాతీయులు ఉంటే ఇప్పుడు హిందూత్వవాదులు ఉన్నారు. ఈ పాలకులు స్థానికులే కనుక వారి మద్దతుదారులు దుర్బల ముస్లింలపై దాడులు జరుపుతున్నారు. ముస్లిం ఆరాధనా మందిరాలు వాస్తవంగా హిందూ ఆలయాలే అన్న వాదనతో న్యాయస్థానాలలో ముస్లింల హక్కులపై పోరాటాలు చేస్తున్నారు. సాంస్కృతిక రంగంలో కూడా ఈ ఆధిపత్యవాద దాడులు ముమ్మరంగా జరుగుతున్నాయి. భారతీయ సంస్కృతిని అర్థం చేసుకోవడంలో వలస పాలకులు ప్రోత్సహించిన పద్ధతులనే ఈనాటి సంకుచిత వాదులు అనుసరిస్తున్నారు. మేధో నిష్పాక్షికతకు తిలోదకాలు ఇచ్చివేస్తున్నారు. స్వతంత్ర ఆలోచనలను అణచివేస్తున్నారు. ప్రజల మధ్య కృత్రిమ విభజనలు సృష్టించడంలో నాటి బ్రిటిష్‌ వారితో నేటి పాలక వర్గాలూ పోటీపడుతున్నాయి. వలస పాలకులు అధికారాన్ని పూర్తిగా తమ చేతుల్లోనే కేంద్రీకరించుకున్నారు. ఆ పాలనా పద్ధతులనే భారత ప్రభుత్వమూ అక్షరాలా అనుకరిస్తున్నట్టుగా కనిపిస్తోంది. బ్రిటిష్‌ వలస పాలకులు సమాఖ్య పాలనా పద్ధతిని ప్రోత్సహించలేదు. కేంద్రీకృత పాలనే చేశారు. ప్రజాస్వామిక ఆరాటాలను కఠినంగా అణచివేశారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా అలానే వ్యవహరిస్తోంది.

మనం వలసవాద మనస్తత్వాన్ని వదిలించుకోవాలి. అందుకు గతాన్ని మంచి చెడుల సరళ సమ్మేళనంగా కాకుండా ఒక సంక్లిష్ట వాస్తవంగా గుర్తించాలి. ప్రజల అనేకానేక విభిన్న అనుభవాలు కొన్నిసార్లు ఏకమవుతూ మరికొన్నిసార్లు పరస్పర విరుద్ధమవుతుంటాయనే బహుముఖ వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. మన వర్తమానంలో అనేక వైరుధ్యాలు ఉన్నాయని, అది చాలా క్షుద్రమైనదనే వాస్తవాన్ని కూడా అంగీకరించి తీరాలి. ఈ సత్యాలను కప్పిపుచ్చేందుకు ప్రయత్నించడం మంచిదికాదు. సమకాలీన సమస్యలకు గతాన్ని నిందించడం అంతకంటే ఉపయోగకరంకాదు. ఒక ప్రజాస్వామిక సమాజంగా మనం విఫలమయ్యాం. ఇది స్వయంకృతం. దీన్ని అంగీకరించడమే గొప్ప ప్రయోజనకరమైన వలసవాద వ్యతిరేక చర్య అవుతుంది. ప్రజలకు జీవిత హుందాను, హక్కులను, న్యాయాన్ని వలసవాదులు నిరాకరించారు. ప్రతి వ్యక్తికీ సమకూరేలా మనం ఇప్పుడు బాధ్యత వహించాలి. సమాజంలో అట్టడుగున ఉన్నవారి జీవితాలు కూడా ఆ సమున్నత విలువలతో వెలుగొందేందుకు మనం పూచీ వహించాలి. హక్కుల నిరాకరణను నిర్భయంగా ఎదుర్కొనే తెగువను ప్రతి ఒక్కరికీ ఉండేలా చేయాలి.


మన గణతంత్ర రాజ్య నిర్మాతలు మనకొక సమున్నత రాజ్యాంగాన్ని, మనకు ప్రాతినిధ్యం వహించే వివిధ చిహ్నాలను ఇచ్చారు. వారు గతాన్ని చెరిపివేయలేదు, బ్రిటిష్‌ పాలకుల కథనాలను గుడ్డిగా అంగీకరించలేదు. గత యుగాల నుంచి యోగ్యమైన వాటిని స్వీకరించారు, వర్తమానాన్ని సరికొత్త రీతుల్లో ఊహించారు. వలసవాద ప్రభావాల నుంచి మన మేధస్సు, హృదయం స్వేచ్ఛగా ఉండే భవిష్యత్తును వారు స్వప్నించారు.

టి.ఎమ్‌.కృష్ణ

భారతీయ సంగీతవేత్త, ప్రజామేధావి

(ది టెలిగ్రాఫ్‌)

ఇవి కూడా చదవండి...

లేట్‌ నైట్ రివ్యూలు తగ్గించండి.. మంత్రికి ఎమ్మెల్యే సూచన

అసెంబ్లీలో అందరూ ఉంటేనే మసాలా: స్పీకర్ అయ్యన్న పాత్రుడు

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 06 , 2026 | 02:56 AM