ఆనాటి భారత్–చైనా జ్ఞానమైత్రి ఇప్పుడూ కావాలి!
ABN , Publish Date - Aug 23 , 2026 | 12:39 AM
స్వాతంత్య్రం వచ్చి 80 ఏళ్లు పూర్తి అవుతున్న తరుణంలో ‘కాక్రోచ్’ పేరుతో వార్తల్లో క్రియాశీలంగా మారిన ఒత్తిడి గుంపులను మన మేధావులు కొందరు కేంద్ర ప్రభుత్వ వైఫల్య కోణం నుంచి చూస్తున్నారు. మరికొందరు...
స్వాతంత్య్రం వచ్చి 80 ఏళ్లు పూర్తి అవుతున్న తరుణంలో ‘కాక్రోచ్’ పేరుతో వార్తల్లో క్రియాశీలంగా మారిన ఒత్తిడి గుంపులను మన మేధావులు కొందరు కేంద్ర ప్రభుత్వ వైఫల్య కోణం నుంచి చూస్తున్నారు. మరికొందరు అందులో మోదీ సర్కారు తప్పేమీ లేదు, చైనాలోని మన మేలుకోరని మేధావులతో కలిసి ఇక్కడి కొందరు చేస్తున్న కుట్రగా దీన్ని విమర్శిస్తున్నారు. ఇక ఆందోళనలు చేసిన వారిని ‘కాక్రోచ్’లు అంటుంటే, చైనాలోని మేధావులను ‘ఎలుకలు’ అంటున్నారు. సమకాలీన పరిణామాలపై ఈ వ్యాఖ్యలు ఎలా ఉన్నా భారత్–చైనాల మధ్య ఇచ్చిపుచ్చుకోటాలు ఈనాటివి కావు.
క్రీ.శ. ఐదవ శతాబ్దిలో మొదలైన జ్ఞానశోధన భారత–చైనాల మైత్రికి పునాదులు వేసింది. ఆధునిక భారత చరిత్రలో నెహ్రు యుగంగా పరిగణించే కాలంలో ఆ శోధన ఒక స్ఫూర్తి అయింది. ఆనాడు భారత్ నుంచి చైనాకు పెద్ద ఎత్తున పండిత వర్గం వెళ్లి అక్కడ ఏళ్ల తరబడి నివాసం ఉండి వారికి సంస్కృతాన్ని బోధిస్తూ చీనీ భాషలోకి సంస్కృత గ్రంథాలను వారు తర్జుమా చేశారు. వారిలో ప్రముఖుడు కాశ్యప మాతంగ. కీ.శ. 67లో మింగ్ చి చక్రవర్తి ఆహ్వానంపై చైనా వెళ్ళిన కాశ్యప ‘లో’ నదీ తీరంలోని లోయాంగ్ పట్టణంలో నివాసం ఉన్నాడు. భారత్ నుంచి ఇలా చైనా వెళ్ళిన ప్రముఖుల్లో– బుద్ధభద్ర, జీనభద్ర, ధర్మరక్ష, కుమారజీవ, పారమార్ధ, జీనగుప్త, బోధిధర్మ మొదలైన వారు ఉన్నారు.
వీరిలో ప్రతి ఒక్కరూ తమ శిష్యులతో, బౌద్ధ బిక్షువుల బృందాలతో కలిసి చైనాకు తరలివెళ్లారు. ఒక దశలో (కీ.శ. 6వ శతాబ్దికి) ఒక్క లియాంగ్ పరగణాలోనే మూడు వేల మంది భారతీయ బౌద్ధ భిక్షువులు, పది వేల భారతీయ కుటుంబాలు ఉండేవి. వీరు తమతో ఎన్నో సంస్కృత గ్రంథాలను అక్కడికి తీసుకుని వెళ్లి, వాటిని చీనీ భాషలోకి తర్జుమా చేశారు. వీరిలో కొందరు నేరుగా చీనీలో గ్రంథాలనూ రాశారు. కుమారజీవ చీనీ భాషలో 47 గ్రంథాలను రాసిన సుప్రసిద్ధ రచయిత. ఇక జీవగుప్త 37 సంస్కృత గ్రంథాలను చీనీ భాషలోకి అనువదించారు. వీరి రాకపోకలకు ఈ సారస్వత ఆదాన ప్రదానాలకు కీ.శ. 427లో ప్రారంభమైన మన నలంద విశ్వవిద్యాలయమే సమన్వయ కేంద్రంగా ఉండేది. ఇలా భారత్ నుంచి చైనా వెళ్ళిన పండితుల వద్ద అక్కడ శిష్యులుగా చేరిన చైనా ప్రముఖులు ఎందరో ఉన్నారు. ప్రముఖ యాత్రా చరిత్రకారుడుగా మన చరిత్ర గ్రంథాల్లో ప్రస్తావించే ఫాహియాన్ (కీ.శ. 337–422) కుమారజీవకు శిష్యుడు. భారత్‌లో పర్యటనకు బయలుదేరే ముందు గురువు కుమారజీవను ఫాహియాన్ సంప్రదిస్తాడు. అప్పుడు కుమారజీవ ఇలా సలహా ఇస్తాడు: ‘‘భారత్‌లో నీ సమయమంతా మత సంబంధమైన జ్ఞానాన్ని ఆకళింపు చేసుకోవడానికే వెచ్చించవద్దు. అక్కడి ప్రజలు, వారి జీవన విధానం కూడా క్షుణ్ణంగా అధ్యయనం చెయ్యి; అప్పుడు చైనాకు ఆ దేశ ప్రజలను అర్థం చేసుకోవడం సాధ్యమవుతుంది’’.
చాలా ఆసక్తికరమైన అంశం ఇది. ఆసియాలోని ఇరుగు పొరుగు దేశాల మధ్య భవిష్యత్తులో ఏర్పడాల్సిన సత్సంబంధాల అవసరాన్ని నాటి పండితులు గుర్తించడం ఇందులో మనకు కనిపిస్తుంది. కుమారజీవ దూరదృష్టి ఫలితాలు హుయన్ త్సాంగ్ (602–664) కాలంలో కనిపిస్తాయి. రెండు దేశాల పాలకుల దృష్టిలో హుయన్ త్సాంగ్ ఒక గౌరవనీయుడైన ఇరుదేశాల ప్రతినిధిగా గుర్తింపు పొందాడు. భారత్ నుంచి ఆయన తనతో చైనా తీసుకువెళ్ళిన 645 సంస్కృత గ్రంథాలను, అక్కడి చక్రవర్తుల సహకారంతో ఒక పండిత బృందాన్ని ఏర్పాటు చేసి వాటిని చీనీలోకి తర్జుమా చేయించాడు.
హుయన్ త్సాంగ్ భారత్ నుంచి చైనా తిరిగి వెళ్ళిన తర్వాత, రెండు దేశాల మధ్య అప్పటి వరకు ఒకరి పట్ల మరొకరికి ఉన్న అభిప్రాయాలకు ‘కొత్త చూపు’ వచ్చి చేరింది. భారత్‌లో కనూజ్ రాజధానిగా పరిపాలిస్తున్న హర్షవర్ధనుడు – చైనా టి యాంగ్ చక్రవర్తి ఇరువురూ స్నేహపూర్వకంగా రాయబారులను పంపుకున్నారు. ఆసియాలోని ఈ రెండు పెద్ద దేశాల మధ్య సారూప్యత గల అంశాలు స్పష్టమైన రూపుతీసుకున్నాక, వాటి ప్రభావం సమాంతరంగా తూర్పు ఆసియాలో ఉన్న చిన్న దేశాల్లో కనపడింది.
ఈ దేశాలు తొలుత బ్రాహ్మణిజం ఆధిపత్యంలో ఉండి, తర్వాత క్రమంగా బౌద్ధంలోకి మారాయి. తొలుత ఈ రెండు మతాలూ ఒక దశ వరకు సామరస్యపూర్వకంగా ఉండేవి. తర్వాత వీటి మధ్య స్పర్ధ మొదలయింది. అయితే ఆ స్పర్ధ క్రమంగా పోరుగా మారడానికి మాత్రం కారణం ఆధ్యాత్మిక వైరం కాదు. అందుకు రాజకీయ, ఆర్థిక, వాణిజ్య కారణాలు ఉన్నాయి అంటారు నెహ్రు. కాలక్రమంలో సముద్ర వాణిజ్య మార్గాల పైన గుత్తాధిపత్యం ఈ దేశాల మనుగడకు కీలకం అయింది. ఐదవ శతాబ్ది నాటికి ఈ దేశాల్లో మహా నగరాలు ఏర్పడ్డాయి.
తొలుత జ్ఞాన తృష్ణను తీర్చుకోవడానికి మొదలైన ప్రస్థానం మనిషిని కొత్త తీరాలకు తీసుకువెళితే, కొత్త జాతులతో మొదలై విస్తరించిన స్నేహపూర్వక సంబంధాలు క్రమక్రమంగా వాణిజ్య కేంద్రంగా మారాయి. 2008 నాటి ప్రపంచ ఆర్థిక మాంద్యం, పలు మొదటి ప్రపంచ దేశాలను తాకిన స్థాయిలో మనల్ని తాకలేకపోయింది. ఆర్థిక సంస్కరణల అమలులో మన కంటే ముందు ఉన్న ఆసియా దిగ్గజం చైనా అప్పటికే ప్రపంచ మాంద్యం ప్రకంపనాలు తనని తాకకుండా నిలువరించగలిగింది. అది మొదలు క్రమక్రమంగా ప్రపంచ దేశాల దృష్టి యూరప్ నుంచి ఆసియా మీదికి మళ్ళింది.
18వ శతాబ్ది వరకు ప్రపంచ జీడీపీలో సగభాగం ఆసియాది అంటే అందుకు ఆశ్చర్యం అక్కరలేదు. అయితే, ఈ ఇరుదేశాల ప్రాధాన్యాల్లో ఇప్పుడు ‘జ్ఞానం’ మసకబారి ‘విపణి’ పెద్దపీట ఎక్కి కూచుంది. చైనా మళ్ళీ ‘సిల్క్ రూట్’ పునరుద్ధరణ అంటూ తన వాణిజ్య ఆబకు గత చరిత్ర సొబగులు అద్ది, ‘వన్ బెల్ట్–వన్ రోడ్’ ప్రాజెక్టుతో ‘ఆఫ్రో–ఆసియా’ మ్యాప్ పైకి దూసుకువచ్చింది.
స్టాక్ హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ వార్షిక నివేదిక ప్రకారం అత్యధిక సైనిక వ్యయంతో ముందున్న మొదటి మూడు దేశాల్లో చైనా, ఇండియా ఉన్నాయి. చైనా, పాకిస్థాన్‌లతో ఇండియా ఎదుర్కొంటున్న ఒత్తిడి, శత్రుత్వం, మన రక్షణ వ్యయం ఇంతగా పెరగడానికి ప్రధాన కారణమని అభిప్రాయపడ్డారు సిప్రిలో సీనియర్ పరిశోధకుడు సైమన్ టి. వైజ్‌మెన్. పశ్చిమాసియా శాంతి ఒప్పందాల చర్చలకు పాకిస్థాన్ వంటి దేశాలను మధ్యవర్తులుగా అమెరికా ఎంచుకొంటుంటే, చైనాతో మైత్రి నుంచి దూరమై చాలా దూరం వచ్చేశాక, మనం ఇక్కడ సరిచేసుకోవలసిన వాటిని పట్టించుకోకుండా సమస్యనంతా చైనా ఎలుకల పైకి నెట్టడం విజ్ఞతేనా? మనం చేయవల్సిన వాటిని చేయకుండా ఎవరినో వేలేత్తి చూపటంతో సమస్యలు పరిష్కారం అవుతాయా?
జాన్‌సన్ చోరగుడి
అభివృద్ధి సామాజిక అంశాల వ్యాఖ్యాత
ఈ వార్తలు కూడా చదవండి...
హరీశ్‌రావు కాదు.. అబద్దాల రావు.. మంత్రి పొంగులేటి సెటైర్లు
ఆ భూములను లాక్కుంటే.. చూస్తూ ఊరుకోం.. రేవంత్ సర్కార్‌కు కవిత వార్నింగ్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News