Share News

దిగుమతుల సునామీలో దేశీయ శనగ..!

ABN , Publish Date - Mar 06 , 2026 | 02:47 AM

తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, కర్నూలు, అనంతపురం జిల్లాలలో శనగ ఒక వాణిజ్య పంటగా మారింది. నల్లబర్లీ పొగాకు, పత్తి, మిర్చి, మొక్కజొన్న వంటి పంటలకు ప్రత్యామ్నాయంగా...

దిగుమతుల సునామీలో దేశీయ శనగ..!

తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, కర్నూలు, అనంతపురం జిల్లాలలో శనగ ఒక వాణిజ్య పంటగా మారింది. నల్లబర్లీ పొగాకు, పత్తి, మిర్చి, మొక్కజొన్న వంటి పంటలకు ప్రత్యామ్నాయంగా రైతులు శనగ వైపు మొగ్గు చూపారు. కానీ సాగు చేసిన రైతులకు గిట్టుబాటు ధర కల్పించకపోవడం వలన పీకల లోతు కష్టాల్లో మునిగిపోయారు. ఏ పంట వేయాలో తెలియక, ప్రత్యామ్నాయ పంటలు లేక రైతులు అయోమయంలో ఉన్నారు. నల్లబర్లీ పొగాకు నిషేధం నేపథ్యంలో అత్యధికంగా రైతులు శనగ పంటను సాగు చేశారు.

క్వింటాలు శనగలకు రూ.5,875 కనీస మద్దతు ధరకు మార్క్‌ఫెడ్‌ ద్వారా రైతు సేవా కేంద్రాలలో కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. శనగలను కొంటామన్న నిర్ణయం సంతోషాన్ని కలిగించింది. కానీ ఎన్ని శనగలు కొంటారు? కోల్డ్ స్టోరేజ్‌లో శనగల మాటేమిటి? మొత్తంగా కొంటారా? లేక దళారుల దయాదాక్షిణ్యాలకు వదిలేస్తారా? విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేస్తున్న రైతులకు నగదు ప్రోత్సాహకాల సంగతేమిటి? విదేశీ శనగల దిగుమతులను ఆపేసి వ్యవసాయం, రైతు రక్షణకు తీసుకునే చర్యలు చాలా అవసరం. వ్యవసాయ రక్షణకు తీసుకునే చర్యలపై దీర్ఘకాలిక ప్రణాలిక కావాలి.

ఒకప్పుడు లాభాలను కురిపించిన శనగలు ఇప్పుడు ధర లేక రైతులను దివాళా తీయిస్తున్నాయి. ఆహారంలో పప్పుధాన్యాల అవసరం ఎక్కువగానే ఉన్నది. శరీర నిర్మాణంలో ప్రొటీన్ అవసరం గురించి డాక్టర్లు నొక్కి చెప్తున్నారు. రైతులు కష్టపడి కావల్సినంత పండిస్తున్నారు. కానీ పప్పు ధాన్యాల పంపిణీ సరిగ్గా లేదు. ఒకపక్క గోడౌన్లలో శనగలు కుళ్లిపోతుంటే మరోపక్క పేదవారికి పప్పు ధాన్యాలు అదటం లేదు. రేషన్ షాపుల ద్వారా శనగలను పంపిణీ చేస్తే ఇటు రైతులకు అటు పేద ప్రజలకు మేలు జరుగుతుంది. దేశీయ ఉత్పత్తి సరిపోయినంత ఉంది. కానీ విదేశీ ప్రభుత్వాలను తృప్తిపరచటానికి విదేశీ శనగలను దిగుమతి చేస్తున్నారు. ఇక్కడ పండే పంటలు అమ్ముడుపోవటం లేదు. రేటు రావటం లేదు. రైతులు అప్పులు పాలవుతున్నారు.


ఆంధ్రప్రదేశ్‌తో పాటుగా, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలలో విస్తారంగా శనగ పంటను సాగు చేస్తున్నారు. మిగతా పంటలతో పోలిస్తే శనగ సాగు కాస్త సులభంగానే జరుగుతుంది. మన రాష్ట్రంలో 2.8 లక్షల హెక్టార్లలో శనగ పంట సాగవుతున్నది. దాదాపు 4 లక్షల టన్నుల శనగల ఉత్పత్తి జరుగుతుంది. దేశం మొత్తం మీద 115 నుండి 120 లక్షల టన్నుల వరకు ఉత్పత్తి అవుతున్నదని అంచనా. మన దేశ ప్రజల అవసరాలకు 120 లక్షల టన్నుల శనగలు సరిపోతాయి. అయితే అవసరానికి మించి నిల్వలు ఉన్నాయి. అమ్ముడుపోక కోల్డ్ స్టోరేజీలలో ఎన్ని శనగలు ఉన్నాయో లేక్కే లేదు. ఈ లెక్కను ప్రభుత్వం బయటకు తీయాలి. వాటిని గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకోవాలి.

విత్తనాలు, ఎరువులు, కూలీల ఖర్చు, కౌలుతో సహా వ్యవసాయ ఖర్చులు అన్నీ పెరిగిపోతున్నాయి. ఎకరానికి దిగుబడి 10 క్వింటాళ్ళ నుండి ఆరేడు క్వింటాళ్ళకు పడిపోయింది. గత సంవత్సరం ఎర్రశనగలు క్వింటాలు రేటు రూ.7,200 ఉంటే ఇప్పుడు దళారులు రూ.5,000 కన్నా తక్కువకు అడుగుతున్నారు. తెల్ల శనగలు పోయిన సంవత్సరం రూ.10,200 వుంటే ఇప్పుడు రూ.5,600కు అడుగుతున్నారు. బోల్టు శనగలు గత ఏడాది రూ.15,000 ఉంటే ఇప్పుడు అడిగేవారే లేరు.

ఒకపక్క గిడ్డంగుల్లో చాలినన్ని శనగ నిల్వలు ఉన్నాయి. మరోపక్క దిగుమతి సుంకాన్ని తగ్గించి, విదేశీ దిగుమతులను ప్రోత్సహిస్తున్నారు. విదేశాల నుండి అధికంగా దిగుమతులు చేయటంతో శనగ రైతుల కష్టాలు పెరుగుతున్నాయి. 2017–18 సంవత్సరాలలో శనగ దిగుమతులపై 40శాతం ఉన్న దిగుమతి సుంకాన్ని 10శాతానికి తగ్గించారు. దేశీయ శనగల ఉత్పత్తి తగ్గిపోవడం వలన, 2024 మే నుంచి 2025 మార్చి వరకు పూర్తిగా దిగుమతి సుంకాలను రద్దు చేశారు. ఉత్పత్తి పుంజుకున్న తర్వాత మళ్లీ 2025 ఏప్రిల్ నుండి 10శాతం సుంకాలను అమలులోకి తెచ్చారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో, రికార్డు స్థాయిలో 15 లక్షల టన్నుల శనగలను దిగుమతి చేసుకున్నారు. విదేశాలలో రైతులకు సబ్సిడీలు, ప్రోత్సాహకాలు కూడా ఎక్కువగా వుండటం వలన ఉత్పత్తి ధర తక్కువ. మన రైతులకు సబ్సిడీలు, ప్రోత్సాహకాలు లేవు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు. అప్పులు పెరిగిపోతున్నాయి. వ్యవసాయ ఖర్చులు పెరిగి రైతులకు అప్పులు, వడ్డీలు పెరిగిపోతున్నాయి. ఏళ్ల తరబడి కోల్డ్ స్టోరేజ్‌లలో నిల్వ ఉంచటం వలన క్వింటాలుకు రూ.150 కడుతూ ఉండాలి. బయట గోడౌన్లలో పెడదామంటే శనగలు పుచ్చిపోతున్నాయి. శీతల గిడ్డంగులలో ఖాళీ లేదు. ఒకపక్క పేరుకుపోతున్న శనగలు. మరో పక్క అప్పులు.


రాష్ట్రవ్యాప్తంగా రైతులు దివాలా తీస్తున్న తరుణంలో ఏ పంట వేయాలో తెలియనటువంటి పరిస్థితులలో, కొంచెం డబ్బులు వస్తాయనే ఆశతో నల్లబర్లీ పొగాకును సాగు చేశారు. నల్లబర్లీ పొగాకు రూ.15–18 వేల వరకు ధర వచ్చింది. పొగాకు కంపెనీలు, ప్రభుత్వం కలిసి క్వింటాల్ నల్లబర్లీ పొగాకు రేట్లను రూ.12,000 నుంచి రూ.9,000 నుంచి రూ.6,000కు తగ్గించి నిర్ణయించి రైతులకు అన్యాయం చేశారు. ఈ సంవత్సరం అసలు నల్లబర్లీ పొగాకు సాగు చేయడాన్ని నిషేధించారు. ఒకప్పుడు లాభాలను కురిపించిన శనగ సాగు ఇప్పుడు రైతుకు కంటనీరు తెప్పిస్తున్నది. బయట తెచ్చిన అప్పుల వడ్డీ పెరిగిపోతుంది. వ్యవసాయ ఖర్చులకి, ఇంటి ఖర్చులకి చేతిలో డబ్బులు లేవు. బ్యాంకర్స్, అప్పులవాళ్ళు అప్పులు ఇవ్వడం మానేశారు. ప్రభుత్వం సహాయం చేస్తే బయటపడవచ్చు.

1) రైతుల దగ్గర ఉన్నటువంటి సరుకు మొత్తం కొనుగోలు చేయాలి. ఆంక్షలు పెట్టకుండా కొనాలి. నిబంధనలను సడలించాలి. 2) కనీస మద్దతు ధర అంటే స్వామినాథన్ కమిషన్ సిఫారసు చేసినట్లుగా ఖర్చులకు 50శాతం కలిపి చెల్లించాలి. 3) ఇదివరకు లాగా విదేశీ దిగుమతుల పైన 40శాతం దిగుమతి సుంకాన్ని విధించాలి. అలా చేస్తేనే దేశంలో ఉత్పత్తి అయిన శనగకు డిమాండ్ ఉంటుంది. 3) విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేస్తున్న రైతులకు అమెరికాలో లాగా నగదు ప్రోత్సాహకాలను ఇవ్వాలి. 4) విదేశీ శనగల దిగుమతులను ఆపేయాలి. 5) వ్యవసాయ సంక్షోభాన్ని నివారించడానికి, రైతు రక్షణకు తీసుకునే చర్యలను ప్రకటించి అమలుపరచాలి.

డాక్టర్ కొల్లా రాజమోహన్

నల్లమడ రైతు సంఘం

ఇవి కూడా చదవండి...

లేట్‌ నైట్ రివ్యూలు తగ్గించండి.. మంత్రికి ఎమ్మెల్యే సూచన

అసెంబ్లీలో అందరూ ఉంటేనే మసాలా: స్పీకర్ అయ్యన్న పాత్రుడు

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 06 , 2026 | 02:47 AM