Share News

ఓ నిశ్శబ్ద సంక్షోభం!

ABN , Publish Date - Sep 27 , 2026 | 02:21 AM

భారత్‌ భవిష్యత్‌లో ఎదుర్కొనే అతిపెద్ద సవాలు ఏమిటి? నిరుద్యోగం, కృత్రిమ మేధ, వాతావరణ మార్పు, నీటికొరత–ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం. కానీ మరో సంక్షోభం గురించి చర్చ...

ఓ నిశ్శబ్ద సంక్షోభం!

భారత్‌ భవిష్యత్‌లో ఎదుర్కొనే అతిపెద్ద సవాలు ఏమిటి? నిరుద్యోగం, కృత్రిమ మేధ, వాతావరణ మార్పు, నీటికొరత–ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం. కానీ మరో సంక్షోభం గురించి చర్చ జరగడం లేదు– అదే సంరక్షణ కొరత--–కేర్‌ డెఫిసిట్‌. పిల్లలను చూసుకునేవారు, వృద్ధులకు తోడుగా ఉండేవారు తగ్గిపోతున్నారు. ఇప్పటివరకు ఈ బాధ్యతను మహిళలే మోశారు. కానీ ఉమ్మడి కుటుంబాలు కరిగిపోతున్నాయి, మహిళల ఉపాధి పెరుగుతోంది. సంరక్షణ అవసరం పెరుగుతుంటే, తీర్చాల్సిన కుటుంబాలు చిన్నవవుతున్నాయి. ఒక మహిళ తన పిల్లల కోసం ఉద్యోగం వదిలేస్తే, ఆమె నైపుణ్యం, ఆదాయం, స్వంత జీవితం– అంతా ఆగిపోతుంది. ఈ నష్టం ఆమె కుటుంబానికి, పనిచేసే సంస్థకు, చివరికి దేశానికి కూడా చెందుతుంది.

భారత టైమ్‌ యూజ్‌ సర్వే ప్రకారం, మహిళలు రోజుకు అయిదు గంటలు వేతనం లేని పని చేస్తారు. ఇది ఇంటి పని. పిల్లల, వృద్ధుల సంరక్షణ సమయం వేరే. ఈ పనిని ఎవరూ లెక్కవేయలేదు, ఎందుకంటే అది ‘బాధ్యత’ అనుకుంటారు. ఈ ‘బాధ్యత’ ఆర్థిక విలువ ఎంత? మహిళల ఉచిత గృహ, సంరక్షణ శ్రమ విలువ భారత జీడీపీలో 15 నుంచి 17శాతం– అంటే రూ.34 లక్షల కోట్లకు పైగా ఉంటుందని కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ అంచనా. మహిళా శ్రామికశక్తి భాగస్వామ్యంలో ఉన్న అంతరాన్ని పూడిస్తే 2025 నాటికి భారత జీడీపీకి సుమారు రూ.64 లక్షల కోట్లు జతకావొచ్చని మెకిన్సే గ్లోబల్‌ ఇన్‌స్టిట్యూట్‌ అంచనా. సంరక్షణ భారం తగ్గితే, దేశ ఆర్థిక వ్యవస్థ ఎంత పెరుగుతుందో ఈ రెండు గణాంకాలు చెబుతున్నాయి. ఇప్పుడు ప్రపంచ సంస్థలు కూడా ఇదే చెబుతున్నాయి. కేర్‌ సేవల్లో పెట్టుబడి పెడితే మహిళల ఉపాధి పెరుగుతుంది, ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. భారత ఆర్థిక సర్వే దీన్ని భారీ ఉపాధి రంగంగా పేర్కొంది; సుప్రీంకోర్టు కూడా సంరక్షణను దేశ నిర్మాణంలో కీలక భాగంగా చెప్పింది. ఈ సంక్షోభం భారత్‌కు మాత్రమే పరిమితం కాదు. అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఇదే సవాలును ఎదుర్కొంటున్నాయి. జర్మనీలో వృద్ధుల సంరక్షణ ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది. ఆ వృద్ధుల పిల్లల వార్షిక ఆదాయం లక్ష యూరోలు దాటితేనే, వారి నుంచి కొంత ఆర్థిక సహకారాన్ని ప్రభుత్వం తీసుకుంటుంది.


భారత్‌ కూడా తన మార్గాన్ని కనుగొనాల్సిన సమయం ఆసన్నమైంది. 2050 నాటికి భారత జనాభాలో దాదాపు 20శాతం మంది వృద్ధులు ఉంటారు. వారి సంరక్షణకు మూడు కోట్ల శిక్షణ పొందిన సిబ్బంది అవసరమని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి అంచనా. రాబోయే దశాబ్దాల్లో భారత్‌ ఎంత పెద్ద సంరక్షణ మౌలిక వసతిని నిర్మించాల్సి ఉంటుందో ఈ సంఖ్యే చెబుతోంది. ప్రపంచంలోని అనేక దేశాలు కేర్‌ ఎకానమీని సంక్షేమ కార్యక్రమంగా కాకుండా ఉపాధి, మహిళల ఆర్థిక భాగస్వామ్యం, వృద్ధుల సంక్షేమం, ఆరోగ్య వ్యవస్థలను కలిపే అభివృద్ధి వ్యూహంగా చూస్తున్నాయి. భారత్‌ కూడా అదే దిశగా అడుగులు వేయాలి. రేపటి సంక్షోభం ఉద్యోగాలు లేకపోవడం వల్ల మాత్రమే కాదు, ఉద్యోగం చేయాలనుకున్న వారిని కాపాడుకునే వ్యవస్థ లేకపోవడం వల్ల కూడా రావొచ్చు. దీన్ని నివారించాలంటే, సంరక్షణను కుటుంబ వ్యక్తిగత బాధ్యతగా కాకుండా, విద్య, ఆరోగ్యం లాగే మౌలిక సదుపాయంగా మార్చాలి.

వంగవోలు రవి

ఈ వార్తలు కూడా చదవండి..

అమరావతి గ్రామకంఠం మినహాయింపులపై సీఆర్డీఏ స్పష్టత

సీఈసీపై పోరుకు ఇండియా కూటమి సిద్ధం.. సెప్టెంబర్ 30న కీలక సమావేశం

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 27 , 2026 | 02:21 AM