Share News

ఆలస్యంగా నష్ట నివారణ!

ABN , Publish Date - Mar 05 , 2026 | 04:50 AM

బంగ్లాదేశ్‌ ప్రధాని తారీఖ్‌ రెహమాన్‌ తమ మంత్రివర్గంలోకి మైనారిటీల నుంచి ఇద్దరిని తీసుకున్నారు: దీపేన్ దివాన్ బౌద్ధుడు. నితాయి రాయ్ చౌదరి హిందువు. నితాయి రాయ్‌ చౌదరిని ‘సాంస్కృతికశాఖ’ మంత్రిగా...

ఆలస్యంగా నష్ట నివారణ!

బంగ్లాదేశ్‌ ప్రధాని తారీఖ్‌ రెహమాన్‌ తమ మంత్రివర్గంలోకి మైనారిటీల నుంచి ఇద్దరిని తీసుకున్నారు: దీపేన్ దివాన్ బౌద్ధుడు. నితాయి రాయ్ చౌదరి హిందువు. నితాయి రాయ్‌ చౌదరిని ‘సాంస్కృతికశాఖ’ మంత్రిగా నియమించారు! ‘మైనారిటీలపై మారణకాండ, హత్యాకాండ’ అంటూ మన దేశంలో సాగిన ప్రచారానికి బంగ్లాదేశ్ ఇచ్చిన సమాధానం ఇది. 17 కోట్ల జనాభా, అందులో 8శాతం– అంటే ఒకటిన్నర కోట్ల మంది హిందువులు గల దేశం వారిది. మన దేశ జనాభాలో 15శాతం ముస్లింలు (23 కోట్ల మంది). అయినా ప్రస్తుత మోదీ మంత్రివర్గంలో ఒక్క ముస్లిమూ లేరు. కాగా పాకిస్థాన్‌లోనూ ఇద్దరు హిందువులు మంత్రులుగా ఉన్నారు. దర్శన్ లాల్ అంతర్ రాష్ట్ర వ్యవహారాల మంత్రిగాను, ఖ్యాల్ దాస్ కొహిస్థానీ మతవ్యవహారాల మంత్రిగాను ఉన్నారు. మన దేశంలో గత మూడు లోక్‌సభ ఎన్నికల్లోనూ బీజేపీ ఒక్క ముస్లిం అభ్యర్థినీ నిలబెట్టలేదు. కేరళలో ప్రవేశం కోసం 2024లో మాత్రం ఒక అభ్యర్థిని నిలబెట్టినా ఓడిపోయారు.

ఇటీవల కొన్ని ఘటనల్ని గుర్తు చేసుకుంటే భారత్‌–బంగ్లాదేశ్‌ సంబంధాల మధ్య జరిగిన డామేజ్‌ బాగా అర్థమవుతుంది. జనవరి 22న ఎన్నికల ప్రచారం మొదలుకాగానే– మరుసటి రోజు షేక్ హసీనా ఢిల్లీలో (వర్చువల్‌గా) హద్దులు దాటి మాట్లాడారు. బంగ్లాదేశ్‌లో నిరంకుశత్వం, హిందువుల ఊచకోత, అరాచకం చెలరేగుతున్నదని, దానికి నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మహమ్మద్‌ యూనస్‌ ఆజ్యం పోస్తున్నట్టుగా చెప్తూ, ఇవి బూటకపు ఎన్నికలు అని ఆమె నిందించారు. జనవరి 24న భారత ప్రభుత్వం ఒక ఆదేశాన్ని జారీ చేసింది. బంగ్లాదేశ్‌లో పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయనీ, భద్రత లేదనీ, అందువల్ల అక్కడి రాయబార కార్యాలయాల సిబ్బందీ, మరో నాలుగైదు కాన్సులేట్ ఆఫీసుల సిబ్బంది కుటుంబాల్లోని మహిళలందరినీ భారత్‌కు రప్పించేయాలనీ ఈ ఆదేశం సారాంశం! ఈ చర్యను బంగ్లాదేశ్ అధికారికంగా ఖండించి నిరసన తెలిపింది. ఇద్దరు మహిళలు ముప్పై ఏళ్ల పాటు ప్రధానులుగా ఉన్న బంగ్లాదేశ్‌లో మహిళలకు రక్షణ లేదంటూ మన ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చేనాటికి అక్కడి పరిస్థితి ఏమిటి? అక్కడ పోటీలో ఉన్న 50 పార్టీల్లో సగం పార్టీలు 80 మంది మహిళల్ని అభ్యర్థులుగా ప్రకటించి ప్రచారం చేస్తున్నాయి! వారిలో 40 మంది అక్కడి డెమొక్రటిక్ యునైటెడ్ ఫ్రంట్ (డీయూఎఫ్) పేరిట ఉన్న వామపక్ష కూటమి పక్షాన రంగంలో ఉన్నారు. మూడు కమ్యూనిస్టు పార్టీలు 17 మందిని, మిగతా పార్టీలు 23 మందిని మహిళల్ని నిలబెట్టి, స్వేచ్ఛగా ప్రచారం చేశాయి. ఎన్నికల్లో గెలిచిన బీఎన్‌పీ కూటమి 8 మంది మహిళల్ని నిలబెట్టగా, వారిలో ఏడుగురు జమాతే ఇస్లామీను ఓడించి గెలిచారు! వారిలో ముగ్గురు మంత్రులు! జమాతే కూటమి ఇద్దరు ఉన్నత విద్యావంతులైన మహిళల్ని నిలబెట్టి, వారి తరఫునా, హిందువు కృష్ణనంది తరఫునా ఆ కూటమి నేత డాక్టర్ షఫికుర్ రెహమాన్ స్వయంగా ప్రచారం సాగించారు.


జమాతే నేత ఒక ఎన్నికల సభలో ‘‘మా దేశం అఫ్ఘానిస్థాన్, పాకిస్థాన్, ఇరాన్ వంటిది కాదు’’ అని స్పష్టం చేశారు. జమాతేకు అయిదు లక్షలమంది మహిళలతో కూడిన మహిళా విభాగం ఉంది. వారిలో 50వేల మంది సుశిక్షిత వాలంటీర్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తాము గెలిస్తే మహిళలను మంత్రివర్గంలోకి చేర్చుకుంటామనీ, ప్రపంచంలోనే పెద్దదైన మహిళా విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పుతామనీ జమాతే నేత భారీ పత్రికాగోష్ఠిలో ప్రకటించారు. ఎన్నికల ప్రణాళికలోనూ కొన్నింటిని చేర్చారు. గర్భిణులకు అయిదు గంటల పనిదినం ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు.

‘‘బంగ్లాదేశ్‌కు, ప్రజలకు వ్యతిరేకంగానూ, హసీనాకు అనుకూలంగానూ సాగించిన ప్రచారాలు గత 50 ఏళ్లలో ఎవ్వరికీ చేతకానిరీతిలో మొత్తం బంగ్లాదేశ్ జాతిని ఐక్యం చేశాయి. భౌగోళికంగా, చారిత్రకంగా కలిసి ఉండిన ఒక పొరుగుదేశ పౌరులను ‘అక్రమ చొరబాటుదారులు, చెదలు’ అంటూ, తమ దేశ భద్రతకు ప్రమాదంగా ఇండియా చిత్రించటాన్ని బంగ్లాదేశ్ జీర్ణం చేసుకోలేదు’’– అని ప్రఖ్యాత అంతర్జాతీయ వ్యవహారాల నిపుణుడు ఎనాం షహాబ్‌ఖాన్ ఆవేదనతో ఒక పత్రికా వ్యాసంలో రాశారు. ‘‘అయినా సంబంధాల మెరుగుదలకై బీఎన్‌పీ తన కట్టుబాటును ప్రదర్శిస్తుంది. అయితే అది ఎదుటివారిని బట్టే ఉంటుంది. ‘జూలై తిరుగుబాటు’ తర్వాత నేటి బంగ్లాదేశ్ ఎవ్వరి ప్రాపకమూ కోరటం లేదు. ఎవ్వరి జూనియర్ భాగస్వామిగా ఉండటానికీ వారికి ఆసక్తి లేదు. తమ సొంతగొంతుతో, నిటారుగా నిలబడ్డ దేశం బంగ్లాదేశ్’’– అని ఆయన రాశారు. ఈ స్థితిలో ఇండియా కర్తవ్యం ఏమిటో మాజీ విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లా మరో పత్రికా వ్యాసంలో ఎత్తి చూపారు: ‘‘ఈ ఫలితాలు దక్షిణాసియా చరిత్రలో ఒక అధ్యాయాన్ని ప్రారంభించాయి. ఇరుదేశాల సంబంధాల్ని సరిదిద్దటానికి అవకాశం కల్పించాయి. సుదీర్ఘ అనిశ్చితి తర్వాత నిర్ణయాత్మకమైన జనాదేశంతో, మూడింట రెండు వంతుల మెజారిటీతో అక్కడ కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి’’ అని రాశారు.

బంగ్లాదేశ్ ఎన్నికల ఫలితాలు ఫిబ్రవరి 13 రాత్రికి వస్తాయనగా, ప్రధాని మోదీ సోషల్‌ మీడియా ద్వారా బంగ్లా నేషనల్ పార్టీకి (బీఎన్‌పీ), తారీఖ్‌ రెహమాన్‌కు ఎంతో ముందుగానే శుభాకాంక్షలు చెప్పారు. ఆ తరువాత, సాయంత్రం నాలుగింటికి బంగ్లాదేశ్‌ కాబోయే ప్రధానికి మోదీ ఫోన్ చేసి అభినందించి, ‘కలిసి పనిచేద్దాం’ అన్నారు. ఫిబ్రవరి 17న తారీఖ్‌ రెహమాన్‌ ప్రమాణ స్వీకారానికి భారత లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాతో పాటు విదేశాంగశాఖ కార్యదర్శి హాజరయ్యారు. ఎన్నికల ముందు దాకా ఇక్కడి మీడియా ద్వారానే గాక ప్రభుత్వం చేతనూ జరిగిన డ్యామేజ్‌ను చక్కదిద్దేందుకు భారత్‌ ఈ రూపంలో చర్యలు మొదలుపెట్టింది. బంగ్లాదేశ్‌తో మోదీ ప్రభుత్వం ప్రారంభించిన ‘డ్యామేజ్‌ కంట్రోల్‌’ చర్యలను మరింత చురుకుగా ముందుకు తీసుకువెళ్లాలి. ఇరుదేశాలూ శాంతి–అభివృద్ధి మార్గంలో ముందుకు సాగేలా దోహదం చేయాలి.

యం.జయలక్ష్మి

ఆప్కాబ్ విశ్రాంత ఏజీఎమ్‌

ఇవీ చదవండి:

ఈ నిర్ణయంతో అనేక మార్పులు వచ్చాయి: సీఎం చంద్రబాబు

వైసీపీ ప్రభుత్వ తీరుతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది: లోకేశ

చిన్నారి ప్రాణం తీసిన బెలూన్

Updated Date - Mar 05 , 2026 | 04:50 AM