Share News

ఆ జ్ఞాననిధులను విస్మరిస్తే వినాశనమే!

ABN , Publish Date - May 21 , 2026 | 12:28 AM

‘ఉత్తమ భావాలు అన్ని వైపుల నుంచి రావాలి’ అని విశ్వసించిన మన పూర్వీకులు అభివృద్ధిపరిచిన జ్ఞాన వ్యవస్థలను గుడ్డిగా ఆరాధించడమో లేదా పూర్తిగా తిరస్కరించడమో జరుగుతోంది. ఇవి ఆలోచనారహిత...

ఆ జ్ఞాననిధులను విస్మరిస్తే వినాశనమే!

‘ఉత్తమ భావాలు అన్ని వైపుల నుంచి రావాలి’ అని విశ్వసించిన మన పూర్వీకులు అభివృద్ధిపరిచిన జ్ఞాన వ్యవస్థలను గుడ్డిగా ఆరాధించడమో లేదా పూర్తిగా తిరస్కరించడమో జరుగుతోంది. ఇవి ఆలోచనారహిత వైఖరులు. భారతీయ జ్ఞాన వ్యవస్థల పట్ల అటువంటి ప్రతిస్పందనలు వివేకవంతమైనవి కావని ఇటీవలి రెండు నూతన పుస్తకాలు సూచించాయి. పురాతన భారతీయుల శాస్త్రీయ విజ్ఞానాన్ని, తాత్విక భావస్రవంతిని అల్లా టప్పా గా భావించకుండా గంభీరమైన మేధో నిబద్ధతతో మనం వాటిని శోధించి తీరాలని కూడా ఆ పుస్తకాలు నొక్కి చెప్పాయి. ఈ మేధా కర్తవ్యాన్ని ఎలా చేయాలో, ఎలా చేయకూడదో కూడా అవి నిర్దేశించాయి.

భారతీయ ఉన్నత విద్యా జగత్తులో ఇప్పుడు విస్తృతంగా చర్చిస్తున్న విషయం భారతీయ జ్ఞాన వ్యవస్థలు (ఇండియన్‌ నాలెడ్జ్‌ సిస్టమ్స్‌– ఐకేఎస్‌). ప్రతి విశ్వవిద్యాలయమూ ఐకేఎస్‌ సంబంధిత సదస్సును నిర్వహించి దాని వివరాలను సచిత్రంగా, సవివరంగా తమ వెబ్‌సైట్‌పై ఉంచుతున్నది. విద్యావేత్తలూ పురాతన భారతీయ జ్ఞాన సంచయంలో ఒక వినూత్న సత్యాన్ని ఆవిష్కరించేందుకు ఆరాటపడుతున్నారు. తమ పరిశోధనా కృషి, ఐకేఎస్‌ మధ్య ఉన్న సంబంధాన్ని సగర్వంగా చెప్పుకుంటున్నారు. భారతీయ జ్ఞాన వ్యవస్థలపై ఉన్నత విద్యా ప్రపంచంలో వెల్లివిరుస్తున్న ఈ అభిమానం సహజమైనదేనా? మేధో అంతః ప్రేరణల జనితమేనా? కాదు, కానే కాదు. ప్రభుత్వం పురికొల్పిన విద్యాసక్తి అది. పురాతన భారతీయుల జ్ఞానాన్ని ఆధునిక పాఠ్యాంశాలలో భాగంగా చేసేందుకై భారతీయ జ్ఞాన వ్యవస్థల పరిశోధన, బోధనను భారత ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.

ప్రభుత్వం పనిగట్టుకుని ప్రోత్సహిస్తున్న భారతీయ జ్ఞాన వ్యవస్థల పరిశోధనా కార్యకలాపాల ప్రహసనంపై తీవ్ర విమర్శనాత్మక ప్రతిస్పందనలు అనివార్యంగా వ్యక్తమవుతున్నాయి. దేశ ప్రజల్లో ‘వైజ్ఞానిక దృక్పథం’ను పెంపొందించాలని అభిలషిస్తున్నవారు పురాతన భారతీయ జ్ఞానం అశాస్త్రీయమైనదని, అర్థరహితమైనదని కొట్టివేస్తున్నారు. జ్ఞాన సంప్రదాయాలకు ప్రభుత్వం అంత ప్రాధాన్యమివ్వడాన్ని వారు ప్రశ్నిస్తున్నారు. కుల వ్యవస్థను వ్యతిరేకించేవారు బ్రాహ్మణీయ ప్రపంచ దృక్పథాన్ని సమస్త భారతీయులపై రుద్దే ప్రయత్నమే ఐకేఎస్‌ను ప్రోత్సహించడమని నిరసిస్తున్నారు. ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నవారు నిరంకుశ పాలనా ధోరణులపై నిరసన ప్రబలకుండా అదుపు చేసేందుకే ఐకేఎస్‌ పేరిట మిథ్యా జాతీయ స్వాభిమానాన్ని పెంపొందిస్తున్నారని దుయ్యబడుతున్నారు. ఐకేఎస్‌కు అనుకూలంగా ప్రభుత్వం ఎంత ఎక్కువగా వాదిస్తే ప్రగతిశీల, ఉదారవాద విద్యావంతులు అంత ఎక్కువగా భారతీయ జ్ఞాన వ్యవస్థ అనే భావనను పరిహసిస్తున్నారు. ప్రభుత్వ వాదన ఎలా ఉన్నప్పటికీ ఐకేఎస్‌ను ఈ విధంగా అపహసించడం, తిరస్కరించడం తీవ్ర మేధాపరమైన, రాజకీయ తప్పిదమే అవుతుంది, సందేహం లేదు.


సరే, ఆధునిక మానవ జ్ఞానచరిత్ర తన స్వీయ చరిత్రే అని పాశ్చాత్య ప్రపంచం భావిస్తోంది. మానజ్ఞానానికి ఏకైక భండారం తమ మేధ అని పాశ్చాత్య దేశాలు మిడిసిపడుతున్నాయి. అహంకరిస్తున్నాయి. ఇది పూర్తిగా చారిత్రక అసంబద్ధం. ప్రాచ్య ప్రపంచం ముఖ్యంగా భారతదేశం ఆ అసంగతాన్ని ఎలా విశ్వసిస్తుంది? సహిస్తుంది? తాము పుట్టి పెరిగిన మాతృభూమి జ్ఞాన వనరులు, మేధో సంప్రదాయాలపై రేపటి తరాలకు అవగాహన లేకుండా చేయడం సాంస్కృతిక వినాశనానికి దారితీస్తుంది. వేల సంవత్సరాల భారతీయ సాంస్కృతిక, నాగరికతా వారసత్వాన్ని మరచిపోవడం లేదా వాటికి దూరమవడం నిస్సందేహంగా రాజకీయ తప్పిదం అవుతుంది. వలసపాలన నుంచి స్వాతంత్ర్యాన్ని సాధించుకున్న నాటి నుంచి మన మేధా సంప్రదాయాలను ఉపేక్షించామన్న గర్హనీయ వాస్తవాన్ని అంగీకరించడం ద్వారా భారతీయ జ్ఞాన వ్యవస్థలతో మన బాంధవ్యాన్ని అధునాతనం చేసుకోవడం ప్రారంభమవ్వాలి. భావాలలో స్వరాజ్య సాధనకు సంబంధించిన అజెండాలో భారతీయ జ్ఞానవనరుల పునరుద్ధరణ, పునర్నిర్మాణం అంతర్భాగమవ్వాలి. మేధోపరమైన, సాంస్కృతిక స్వీయ నిర్ణయాధికారమే నిజమైన స్వాతంత్ర్యం అనేది మనం విస్మరించకూడదు.

ఐకేఎస్‌తో సమస్య దాని మౌలిక భావన కాదు, దాని రూపకల్పనే అని చెప్పక తప్పదు భారతీయ జ్ఞాన వ్యవస్థల పరిశోధనకు ప్రభుత్వం నిర్దేశించిన విధానం భావనాత్మకంగా లోపభూయిష్టమైనది. దానికి సమగ్ర దృక్పథం కొరవడింది. పైగా పలు కుదింపులతో దాని పరిధి సంకుచితమయింది. భారతీయ జ్ఞాన వ్యవస్థలను ప్రాచీనకాలపు అవశేషాలుగా పరిగణించడం మొట్టమొదటి పెద్ద కుదింపు. సజీవ, చైతన్యశీల భారతీయ జ్ఞాన సంప్రదాయాలు పురాతన యుగాలలో మాత్రమే వర్ధిల్లాయా? సుదూర గతంపైన మాత్రమే దృష్టి సారించడం రెండో కుదింపు. ముస్లిం, బ్రిటిష్‌ పాలనా యుగాలలో సమున్నతంగా జరిగిన మేధో కృషిని ఐకేఎస్‌ ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తోంది. జ్ఞాన వ్యవస్థలను కేవలం రాతపూర్వక గ్రంథాలకే పరిమితం చేయడం మూడో కుదింపు. వ్యవసాయం, నేత కార్మికులు, చేతి వృత్తుల వారి దైనందిన కార్యకలాపాలలో నిక్షిప్తమై ఉన్న ఆచరణాత్మక, నిగూఢ జ్ఞానాన్ని విస్మరించడం సమంజసం కాదు. గ్రామీణ సమాజాలలో నేటికీ ఆ జ్ఞాన సంప్రదాయాలు ప్రయోజనకరంగా వర్థిల్లుతూనే ఉన్నాయి. వాటిని ఉపేక్షిస్తే నష్టం వాటిల్లేది ఎవరికి? ఐకేఎస్‌ పరిగణనలోకి తీసుకుంటున్న పురాతన గ్రంథాలు పూర్తిగా బ్రాహ్మణీయ మేధో సంప్రదాయానికి చెందినవే కావడం నాలుగో కుదింపు. ప్రాంతీయ, దేశీ సంప్రదాయాలను శోధించక పోవడం సరికాదు. భారతీయ జ్ఞాన వ్యవస్థలను ఆధునిక పాశ్చాత్య ప్రమాణాలు, దృక్కోణాల పరంగా మూల్యాంకనం చేయడం ఒక పెద్ద పొరపాటు. ఇది సత్యావిష్కరణకు ఎలా దోహదం చేస్తుంది?


సరే, ఇప్పుడు నేను తొలుత ప్రస్తావించిన రెండు కొత్త పుస్తకాల గురించి వివరంగా నివేదిస్తాను. వాటిలో మొదటిది 2025లో ప్రచురితమైన ‘భారత్‌ కి సారస్వత్‌ సాధన’. భారతీయ మేధో సంప్రదాయాలతో మనం మమేకమయ్యే మార్గాన్ని ఇది నిర్దేశించింది. రచయిత రాధా వల్లభ్‌ త్రిపాఠి మన కాలపు ప్రముఖ సంస్కృత విద్వజ్ఞుడు. సంస్కృత భాషలోని వందకు పైగా సాహిత్య, తాత్విక ఉద్గ్రంథాలకు అనువాదాలు చేశారు, విపుల వ్యాఖ్యానాలు వెలయించారు. క్రీస్తుపూర్వం 1000 సంవత్సరం నుంచి క్రీ.శ. 20వ శతాబ్ది దాకా 19 మంది మహాకవులు, మహాదార్శనికుల మేధో కృషి గురించి విపులంగా వివరించిన పుస్తకమే ‘భారత్‌ కి సారస్వత్‌ సాధన’. భారతదేశంలో జ్ఞానం, సాహిత్య సృష్టి ఎలా సాగిందో త్రిపాఠి నేటి పాఠకులకు సుబోధకం చేశారు. సమాజానికి మేధస్సును, నైతికతను అందించిన మహాకవులు, దార్శనికుల రచనల పాధాన్యాన్ని, వర్తమాన ప్రాసంగికతను వివరించారు. ఈ క్రమంలో కొన్ని ఇబ్బందికరమైన సత్యాలను కప్పిపుచ్చేందుకు ఆయన ప్రయత్నించలేదు. ఇది గమనార్హం, ప్రశంసనీయం. పాశ్చాత్య సంస్కృత విద్వాంసులను గౌరవిస్తూనే వారి మేధా కృషిని నిశితంగా పరిశీలించారు. తన అభిప్రాయాలను నిష్కర్షగా తెలిపారు. భారతీయ జ్ఞానసంప్రదాయాల పట్ల తన ప్రగాఢ అభిమానాన్ని వ్యక్తం చేస్తూనే ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న ఐకేఎస్‌ ప్రాజెక్టులో భాగమయ్యేందుకు ఆయన నిర్ద్వంద్వంగా తిరస్కరించారు.

రెండో పుస్తకం ‘అల్లమ ప్రభు అండ్‌ శైవ ఇమాజినేషన్‌’. ఇది కూడా 2025లోనే ప్రచురితమైనది. భారతీయ మేధా చరిత్రలో మరొక ముఖ్యభాగమైన బ్రాహ్మణేతర, సంస్కృత భాషాయేతర సంప్రదాయాలపై ఈ పుస్తకం దృష్టి నిలిపింది. రచయిత డీఆర్‌ నాగరాజ్‌ కన్నడ మేధావి. స్వతంత్ర భారతదేశంలో సమగ్ర సాంస్కృతిక విమర్శకులలో ఆయన అగ్రగణ్యుడు. నాగరాజ్‌ కన్నడంలో రాసిన ఆ పుస్తకం ఆయన మరణానంతరం 1999లో ప్రచురితమయింది. రెండున్నర దశాబ్దాల అనంతరం ఆ కన్నడ పుస్తకానికి ఎన్‌ఎస్‌ గండూర్‌ ఆంగ్లానువాదం వెలువడింది. 12వ శతాబ్ది వీరశైవ ఉద్యమంలో ప్రముఖ వచనకారుడు అయిన అల్లమ ప్రభు గురించిన పుస్తకమిది. కవిగా, తాత్వికుడుగా అల్లమ ప్రభు విశిష్టతను వివరించడంలో భారతీయ సాహిత్య తత్వశాస్త్ర చరిత్ర రచనా రీతులు అట్టడుగు వర్గాల వారి ఆలోచనా శైలులను విస్మరించడాన్ని నాగరాజ్‌ విమర్శించారు. భావ చిత్రాలు, రూపకాలంకారాలతో అల్లమ ప్రభు మొదలైన అణగారిన వర్గాల విద్వజ్ఞుల విశిష్ట దేశీయ కల్పనా ప్రతిభను సంప్రదాయ పండితులు గుర్తించలేదని నాగరాజ్‌ నిక్కచ్చిగా చెప్పారు. పాశ్చాత్య సాహిత్య సిద్ధాంతాన్ని కాకుండా కశ్మీర్‌ తాత్వికుడు అభినవగుప్త శైవ మీమాంస సంప్రదాయాల ఆధారంగా అల్లమ ప్రభు వచనాలను నాగరాజ్ పరిశీలించి వాటికి వినూత్న భాష్యాలు చెప్పారు.


త్రిపాఠి, నాగరాజ్‌ల పుస్తకాలలో సువ్యక్తమైన దృక్పథంతో భారతీయ జ్ఞాన వ్యవస్థలను మనం శోధించవలసిన అవసరమున్నది. సమ్మిళిత, దూర దృష్టితో కూడిన విధానం మన అధ్యయనాలకు ప్రాతిపదిక కావాలి. అవి భవిష్యత్‌ ఆధారంగా జరగాలి. పురాతన యుగాల గ్రంథాలలో ఆధునిక విజ్ఞానశాస్త్ర ఆవిష్కరణల ఆనవాళ్ల అన్వేషణకు స్వస్తి చెప్పాలి. ఆ చారిత్రక జ్ఞానసంచయాన్ని వర్తమాన సమాజాల సమస్యలను పరిష్కరించేందుకు వివేకశీలంగా ఉపయోగించుకోవాలి. ఈ శోధనలు చరిత్రలో ఏదో ఒక దశకు మాత్రమే పరిమితం కాకూడదు అలాగే గ్రంథగత బ్రాహ్మణీయ జ్ఞానానికి మాత్రమే ప్రాధాన్యమివ్వకూడదు. స్థానిక చేతివృత్తులు, మౌఖిక సంప్రదాయాలు, పురాతన రోగ నిదాన పద్ధతులను నిశితంగా పరిశీలించి ఈ నాటి జ్ఞానవాహినులతో సమన్వయపరచాలి. ఇటువంటి విశాల దృక్పథాన్ని అనుసరించినప్పుడే అన్నీ వేదాల్లో ఉన్నాయన్న అహేతుక వైఖరిని విడనాడగలుగుతాము. అవిద్యావంతులు, వెనుకబడిన సామాజికులుగా మనం భావిస్తున్న రైతులు, చేతివృత్తుల నిపుణులను జ్ఞాన నిర్మాతలుగా, భారతీయ జ్ఞాన వ్యవస్థల వాహకులుగా గుర్తించి గౌరవించే ప్రజాస్వామ్య సంప్రదాయాన్ని నెలకొల్పగలుగుతాము.

యోగేంద్ర యాదవ్

(వ్యాసకర్త ‘స్వరాజ్‌ ఇండియా’ అధ్యక్షుడు)

ఈ వార్తలు కూడా చదవండి...

కేసీఆర్ హయాంలో ఆ ప్రాజెక్టుకు భూసేకరణ లేకుండానే టెండర్లు పిలిచారు.. మంత్రి ధ్వజం

టీజీ పీజీఈసెట్ పరీక్ష షెడ్యూల్ మార్పు.. కొత్త తేదీ ఇదే

అక్రమాస్తుల కేసులో జలమండలి జనరల్ మేనేజర్ అరెస్ట్

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - May 21 , 2026 | 12:28 AM