Share News

విశ్వ‌న‌గ‌రంగా హైద‌రాబాద్‌

ABN , Publish Date - Apr 03 , 2026 | 01:43 AM

విదేశీ పెట్టుబ‌డులు, బ‌హుళ‌జాతి సంస్థ‌లు, అంత‌ర్జాతీయ జీవ‌న‌శైలి క‌లిగిన మ‌హాన‌గ‌రం హైద‌రాబాద్‌. ప్ర‌పంచంలో న్యూయార్క్ సిటీ, లండ‌న్‌, దుబాయ్ వంటివి పూర్తిస్థాయి విశ్వ‌న‌గ‌రాలుగా గుర్తింపు పొందాయి. హైద‌రాబాద్ సైతం...

విశ్వ‌న‌గ‌రంగా హైద‌రాబాద్‌

విదేశీ పెట్టుబ‌డులు, బ‌హుళ‌జాతి సంస్థ‌లు, అంత‌ర్జాతీయ జీవ‌న‌శైలి క‌లిగిన మ‌హాన‌గ‌రం హైద‌రాబాద్‌. ప్ర‌పంచంలో న్యూయార్క్ సిటీ, లండ‌న్‌, దుబాయ్ వంటివి పూర్తిస్థాయి విశ్వ‌న‌గ‌రాలుగా గుర్తింపు పొందాయి. హైద‌రాబాద్ సైతం వేగంగా ఆ స్థాయికి చేరుకుంటున్న ఎమ‌ర్జింగ్ గ్లోబ‌ల్ సిటీగా నిలుస్తోంది. రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టాక హైద‌రాబాద్‌ను విశ్వ‌న‌గ‌రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారు. ఒక‌వైపు విదేశీ పెట్టుబ‌డుల‌ను రాబ‌డుతూ, మ‌రోవైపు ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్‌ను అభివృద్ధి చేస్తూ, ఐటీని మ‌రింత‌గా విస్త‌రిస్తూ మ‌హాన‌గ‌రాన్ని సుంద‌రంగా తీర్చిదిద్దుతున్నారు. హైద‌రాబాద్‌, సికింద్రాబాద్‌, సైబ‌రాబాద్‌కు తోడుగా నాలుగో న‌గ‌రంగా ఫ్యూచ‌ర్ సిటీని నిర్మిస్తున్నారు.

దేశంలోని అతి పెద్ద అర్బన్ ఎకానమీలో హైదరాబాద్‌ 5వ స్థానంలో నిలిచింది. హైద‌రాబాద్‌ నుంచి భారత జీడీపీ వాటా సుమారు 83 బిలియన్ డాలర్లు ఉన్నట్టు అంచనా. ఇది 2035 నాటికి 200 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ప‌లు అధ్య‌య‌నాలు స్ప‌ష్టం చేస్తున్నాయి. దీనికి ప్ర‌ధాన కార‌ణం హైదరాబాద్ ఐటీ రంగ విస్తరణకే ప‌రిమితం కాలేదు. బయోటెక్నాలజీ, ఫార్మా, తయారీ రంగాల్లోనూ త‌న ప్ర‌త్యేక‌త‌ను చూపిస్తోంది. అన్ని ర‌కాల ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటుకు అనువైన, స‌మ‌శీతోష్ణం క‌లిగిన‌ ద‌క్క‌న్ పీఠ‌భూమి కావ‌డంతో పాటు బిజినెస్ ఫ్రెండ్లీ వాతావరణం హైద‌రాబాద్‌కు ఉన్న మ‌రో ప్ర‌త్యేక‌త‌. దీంతో మల్టీనేషనల్ కంపెనీలు ఇక్కడికి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. స్టార్టప్స్‌ కూడా పెరుగుతున్నాయి. హైద‌రాబాద్‌తో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావించింది. అందులో భాగంగా క్యూర్‌, ప్యూర్‌, రేర్‌ పేరిట వికేంద్రీకృత వ్యూహాన్ని అనుసరిస్తోంది.

హైద‌రాబాద్ మ‌హాన‌గ‌ర అభివృద్ధికి బృహ‌త్త‌ర ప్ర‌ణాళిక‌ను సిద్ధం చేస్తున్నారు. మ‌హాన‌గ‌రంలో ట్రాఫిక్ స‌మ‌స్య‌కు చెక్ పెట్ట‌డంతో పాటు మెరుగైన ప్ర‌జా ర‌వాణా కోసం ప్రతిష్ఠాత్మ‌కంగా మెట్రో రైలు ప్రాజెక్టును తెచ్చారు. మెట్రో రైలు మొద‌టి ద‌శ‌లో 69 కి.మీ న‌డుస్తోంది. రెండో ద‌శ‌లో భాగంగా 76.4 కిలోమీటర్ల మేర కొత్త మెట్రో మార్గాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. మెట్రో నిర్వహణను సైతం ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకోనుంది. మ‌హాన‌గ‌రంలో 2050 నాటికి మెట్రో నెట్‌వర్క్‌ను విస్తరించనున్నారు. భ‌విష్య‌త్తు అవ‌స‌రాల‌కు అనుగుణంగా హెచ్ఎండీఏ ప‌రిధిలో కొత్తగా 120 ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, స్కైవాక్‌లను, 75 జంక్ష‌న్లను అభివృద్ధి చేయ‌నున్నారు.


హైదరాబాద్ నగరం మధ్య నుంచి వెళుతున్న మూసీ నదిపై 29 బ్రిడ్జ్‌లను నిర్మించనున్నారు. మూసీని దశలవారీగా ప్ర‌భుత్వం అభివృద్ధి చేయ‌నుంది. మల్లన్నసాగర్‌ నుంచి న‌గరానికి తెచ్చే 20 టీఎంసీల‌ గోదావరి జ‌లాల‌లో 17.5 టీఎంసీలను తాగునీటికి వినియోగించనున్నారు. మిగ‌తా 2.5 టీఎంసీల నీటిని ఉస్మాన్‌సాగర్‌ (గండిపేట), హిమాయత్‌సాగర్‌లకు తరలించి అక్కడి నుంచి నీళ్లు విడుదల చేసి మూసీలో ప్రవహించేలా చేస్తారు. దీంతో స్వచ్ఛమైన గోదావరి జలాలు మూసీలో ప‌రుగులు తీసేలా చేయ‌నున్నారు. మూసీ నదిలో చుక్క మురుగు నీరు కూడా చేరకుండా ముందుగానే 27 ట్రంక్‌లైన్లను నిర్మించి ఎస్టీపీలకు మళ్లించ‌నున్నారు. మూసీనదీ అభివృద్ధి పూర్తయితే లండన్, టోక్యో, దుబాయి, సియోల్ రివర్‌ఫ్రంట్ల మాదిరే హైదరాబాద్ నైట్ ఎకానమీ కొత్త దశలోకి ప్రవేశించి స‌రికొత్త హైద‌రాబాద్‌గా నిలిచిపోనుంది.

డా. ఎన్‌.యాద‌గిరిరావు

అడిషనల్ క‌మిష‌న‌ర్‌‌, సైబ‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్

ఈ వార్తలు కూడా చదవండి..

పోలవరం డయాఫ్రం వాల్ నిర్మాణం పూర్తి.. ఇంజనీర్లను సన్మానించిన మంత్రి

పార్లమెంట్‌లో అమరావతి బిల్లు ఆమోదం.. చంద్రబాబు ఫస్ట్ రియాక్షన్

For More AP News And Telugu News

Updated Date - Apr 03 , 2026 | 01:43 AM