Share News

కాంగ్రెస్‌కు పేరొస్తుందనే మెట్రోపై వివక్ష!

ABN , Publish Date - Jul 23 , 2026 | 01:50 AM

హైద‌రాబాద్ మెట్రో రైలుపై బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తొలి నుంచీ వివ‌క్ష చూపుతూనే ఉన్నది. కేంద్ర‌, రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్న‌ప్పుడు 2007లో హైద‌రాబాద్ మెట్రోకు పునాది ప‌డింది..

కాంగ్రెస్‌కు పేరొస్తుందనే మెట్రోపై వివక్ష!

హైద‌రాబాద్ మెట్రో రైలుపై బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తొలి నుంచీ వివ‌క్ష చూపుతూనే ఉన్నది. కేంద్ర‌, రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్న‌ప్పుడు 2007లో హైద‌రాబాద్ మెట్రోకు పునాది ప‌డింది. నాటి కేంద్ర ప‌ట్టణాభివృద్ధిశాఖ మంత్రి జైపాల్‌రెడ్డి చొర‌వ‌తో ప్రారంభ‌మైన హైద‌రాబాద్ మెట్రో మొద‌టి ద‌శ ప్రాజెక్టును స‌కాలంలో పూర్తి చేయ‌డంలో కేసీఆర్ ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంది. ఒక‌ప్పుడు దేశంలో ఢిల్లీ మెట్రో త‌ర్వాత రెండో స్థానంలో ఉన్న హైద‌రాబాద్ మెట్రో.. బీజేపీ, బీఆర్‌ఎస్‌ నిర్లక్ష్యం ఫ‌లితంగా నేడు తొమ్మిదో స్థానానికి ప‌డిపోయే ప‌రిస్థితి ఏర్పడింది.

కేంద్ర ప్ర‌భుత్వం హైద‌రాబాద్ మెట్రోపై వివ‌క్ష చూపుతోంద‌నేది రాజ‌కీయ విమ‌ర్శ ఎంత‌మాత్రం కాదు. దేశంలోని ఆరు ముఖ్య న‌గ‌రాలైన ఢిల్లీ, ముంబ‌యి, కోల్‌క‌తా, చెన్నై, బెంగ‌ళూరు, హైద‌రాబాద్‌ల్లో మెట్రో రైళ్ల ట్రాక్ పొడ‌వు.. విస్త‌ర‌ణ ప‌నులు ప‌రిశీలిస్తే అర్థమ‌వుతుంది. ఢిల్లీ మెట్రో ఇప్ప‌టికే 395.81 కి.మీ దూరం ఉండ‌గా, మ‌రో 157.75కి.మీ మేర విస్త‌ర‌ణ ప‌నులు సాగుతున్నాయి. ముంబ‌యిలో ఇప్ప‌టికే 110కి.మీ మేర మెట్రో ఉండగా (141.4 కి.మీ విస్తరణ పనులు), కోల్‌క‌తాలో 72.98 కి.మీ మేర ఇప్ప‌టికే మెట్రో (60.26 కి.మీ మేర విస్త‌ర‌ణ పనులు) ఉంది. చెన్నైలో 54.24కి.మీ మేర మెట్రో (118.9 కి.మీ మేర విస్త‌ర‌ణ పనులు) ఉంది. బెంగ‌ళూరులో 96.1 కి.మీ మేర మెట్రో ఉండ‌గా, 121.13 కి.మీ మేర విస్త‌ర‌ణ ప‌నులు సాగుతున్నాయి. హైద‌రాబాద్‌లో మాత్రం కేవ‌లం 69 కి.మీ మేర మాత్ర‌మే మెట్రో రైలు ఉంది. ఫేజ్‌–2 విస్త‌ర‌ణలో హైద‌రాబాద్‌కు చోటు ద‌క్క‌లేదు.

రేవంత్‌రెడ్డి ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన మరుక్ష‌ణం నుంచే హైద‌రాబాద్ మెట్రో ఫేజ్‌–2పై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ పెట్టారు. ప్ర‌ధాన‌ మంత్రి, కేంద్ర ప‌ట్ట‌ణ వ్య‌వ‌హారాలశాఖ మంత్రులను ప‌లుమార్లు క‌లిసి హైద‌రాబాద్ మెట్రో ఫేజ్‌–2కు స‌హ‌క‌రించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. విస్త‌ర‌ణ ప‌నుల‌కు సంబంధించి నియ‌మించిన కార్య‌ద‌ర్శుల క‌మిటీలో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ మెట్రో ఎండీ సుశీల్ కుమార్‌ను కేంద్రం నియ‌మించినా, తర్వాత ర‌క‌ర‌కాల కొర్రీలు వేయ‌డం ప్రారంభించింది. మొద‌ట మెట్రో ఫేజ్‌–1 నిర్వ‌హ‌ణ చూస్తున్న ఎల్&టీని సంప్ర‌దించాల‌ని సూచించింది. కేసీఆర్ ప్ర‌భుత్వంలో ఎదుర్కొన్న చేదు అనుభ‌వాల‌తో ఫేజ్‌–2 విస్త‌ర‌ణ అటుంచి ఫేజ్‌–1 నుంచే త‌ప్పుకుం టామ‌ని ఎల్&టీ సంస్థ స్ప‌ష్టం చేసింది. దాంతో ఫేజ్‌–2 విస్త‌ర‌ణ‌కు అనుగుణంగా ఫేజ్‌–1ను స్వాధీనం చేసుకోవాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఎల్&టీకి చేయాల్సిన చెల్లింపుల‌కు సంబంధించిన మొత్తానికి అవ‌స‌రమైన వ‌న‌రుల సేకర‌ణ‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం చూపిన చొర‌వ‌తో హైద‌రాబాద్ మెట్రో రైలుకు త‌క్కువ వ‌డ్డీతో రుణం ఇచ్చేందుకు ఇండియ‌న్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేష‌న్‌ సిద్ధ‌మైంది. కానీ అక్కడి నుంచి స‌కాలంలో నిధులు విడుదల కాలేదు.


ఎట్టి ప‌రిస్థితుల్లోనూ మెట్రో విస్త‌ర‌ణ చేప‌ట్టాల‌ని భావించిన ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి ప‌ట్టువీడ‌కుండా గ‌త జూన్‌ 22, 23 తేదీల్లో కేంద్ర ప‌ట్ట‌ణాభివృద్ధిశాఖ మంత్రి మ‌నోహ‌ర్‌లాల్ ఖ‌ట్ట‌ర్‌, రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్‌, కేంద్రమంత్రి కిష‌న్‌రెడ్డితో రెండు రోజుల పాటు ఢిల్లీలో వ‌రుసగా భేటీ అయ్యారు. నాటి చ‌ర్చ‌లు పూర్తి సానుకూలంగా సాగాయి. హైద‌రాబాద్ మెట్రో ఫేజ్‌–1 వాల్యూయేష‌న్‌, ఫేజ్‌–1 స్వాధీనానికి అవ‌స‌ర‌మైన రుణ సేక‌ర‌ణ‌, రుణ సంస్థ ఎంపిక‌, మెట్రో ఫేజ్‌–2 విస్త‌ర‌ణ‌, నిర్మాణ‌ వ్యయం, అందుకు అవ‌స‌ర‌మైన రుణ సేక‌ర‌ణ అంశాల అధ్య‌య‌నానికి క‌న్స‌ల్టెంట్‌ను నియ‌మించాల‌న్న అంశంపై కేంద్ర మంత్రులు, ముఖ్య‌మంత్రి ఏకాభిప్రాయానికి వ‌చ్చారు. క‌న్స‌ల్టెంట్‌గా SBICAPSను ఎంపిక చేశారు. క‌న్స‌ల్టెంట్ అధ్య‌య‌న స‌మ‌యంలో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల మ‌ధ్య స‌మ‌న్వ‌యానికి కేంద్రం, రాష్ట్రం నుంచి చెరో అధికారిని నియ‌మించాల‌ని నాడు నిర్ణ‌యించారు. ఆ నిర్ణ‌యానికి అనుగుణంగా రాష్ట్ర ప్ర‌భుత్వం వెంట‌నే సీనియ‌ర్ అధికారి జ‌యేశ్‌ రంజ‌న్‌ను నియ‌మించింది. కానీ కేంద్ర ప్ర‌భుత్వం ఇప్ప‌టి వ‌ర‌కు తమ త‌ర‌ఫు అధికారిని నియమించ‌లేదు. కన్స‌ల్టెంట్‌గా SBICAPSను నియ‌మిస్తూ ఎటువంటి ఆదేశాలూ జారీ చేయ‌లేదు.

ఏ రాష్ట్రం నుంచైనా ప్రాతినిధ్యం వ‌హించే కేంద్ర మంత్రులు ఆయా రాష్ట్రాల ప్ర‌యోజ‌నాల కోసం ప్ర‌య‌త్నిస్తారు. కానీ తెలంగాణ‌లో ఆ ప‌రిస్థితి లేకుండా పోయింది. గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో ప్ర‌ధాన‌మంత్రి మోదీ రాష్ట్రానికి వ‌స్తే ముఖ్య‌మంత్రి కేసీఆర్ క‌నీసం స్వాగ‌తం ప‌లికేవారు కాదు. కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు సంయుక్తంగా చేప‌ట్టే ప‌థ‌కాలకు సంబంధించి రాష్ట్ర వాటాను విడుద‌ల చేసేవారు కాదు. ఫలితంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు ద‌క్కేవి కావు. కానీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇందుకు భిన్నంగా, సైద్ధాంతికంగా పొసగకపోయినప్పటికీ, ప్రొటోకాల్ ప్ర‌కారం ప్ర‌ధాన‌మంత్రికి స్వాగతం ప‌లుకుతున్నారు. రాష్ట్ర వాటాలు ఎప్ప‌టిక‌ప్పుడు విడుద‌ల చేస్తూ కేంద్రం నుంచి నిధులు రాబ‌డు తున్నారు. స‌మాఖ్య స్ఫూర్తిని పాటిస్తున్నారు. అయినప్పటికీ చ‌ట్ట‌బ‌ద్ధంగా ఇవ్వాల్సిన అనుమ‌తుల విష‌యంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివ‌క్ష చూపుతూనే ఉన్నది.


తెలంగాణ నుంచి కేంద్ర మంత్రిగా ఉండ‌డ‌మే కాకుండా సికింద్రాబాద్ ఎంపీగానూ కిష‌న్‌రెడ్డి ఉన్నారు. మెట్రో సేవ‌లు అందే, మెట్రో విస్త‌ర‌ణ‌తో లాభం పొందే హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రం ప‌రిధిలోనే సికింద్రాబాద్‌, చేవెళ్ల‌, మ‌ల్కాజిగిరి, మెద‌క్‌ లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాలున్నాయి. ఈ నియోజ‌క‌వ‌ర్గాల నుంచి కిష‌న్‌రెడ్డి, కొండా విశ్వేశ్వ‌ర్‌ రెడ్డి, ఈట‌ల రాజేంద‌ర్‌, ర‌ఘునంద‌న్‌రావు ఎంపీలుగా ఉన్నారు. వీరంతా బీజేపీ ఎంపీలే. తెలంగాణ నుంచి బీజేపీకున్న ఎనిమిదిమంది ఎంపీల్లో న‌లుగురు హైదరాబాద్‌ మహాన‌గ‌ర పరిధి నుంచే ఉన్నారు. వీరంతా మెట్రో విస్త‌ర‌ణ‌పై ఎందుకు నోరు విప్ప‌రు? ఎందుకు కేంద్ర ప్ర‌భుత్వంపై ఒత్తిడి తీసుకురారు? ఎందుకంటే మెట్రో విస్త‌ర‌ణ చేప‌డితే ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డికి పేరు వ‌స్తుంది, కాంగ్రెస్ ప్ర‌జా ప్ర‌భుత్వానికి ఖ్యాతి ద‌క్కుతుంది కాబట్టి! అలా జ‌ర‌గ‌డం వారికి ఇష్టం లేదు. ఇంత‌కుమించి మ‌రే కార‌ణం కనిపించ‌డం లేదు.

హైద‌రాబాద్‌ మహానగరంలో ప్ర‌జా ర‌వాణాపై భారం త‌గ్గించ‌డానికి మెట్రో విస్త‌ర‌ణ అత్యంత అవ‌స‌రం. ఇప్ప‌టికైనా కేంద్రమంత్రి కిష‌న్‌రెడ్డి, బీజేపీ ఎంపీలు మెట్రో ఫేజ్‌–2 విస్త‌ర‌ణ‌కు వెంట‌నే అనుమతులు ఇప్పించాలి. లేదంటే తెలంగాణ ప్ర‌జ‌లు వారిని క్ష‌మించ‌రు.

వ‌ల్లాల న‌వీన్ యాద‌వ్

ఎమ్మెల్యే, జూబ్లీహిల్స్

ఈ వార్తలు కూడా చదవండి..

ఘనంగా గాడిదలకు పెళ్లి ?.. వీడియో వైరల్

లాఠీఛార్జ్‌లో తీవ్రంగా గాయపడిన యువకుడు.. అంతలో తల్లి నుంచి ఫోన్.. వీడియో వైరల్

For More TG News And Telugu News

Updated Date - Jul 23 , 2026 | 01:50 AM