Share News

ధిక్కారానికి ఆసరా ఇచ్చిన అక్షరకారుడు

ABN , Publish Date - Nov 11 , 2026 | 12:40 AM

అక్షరాల్ని అసహాయుల వైపు నిలిపిన విశిష్ట అమెరికన్ రచయిత హోవర్డ్ ఫాస్ట్. రచనా వ్యాసంగాన్ని పీడితుల పక్షంగా నిర్మించిన అరుదైన మేధావి. బానిసల తిరుగుబాటుకు శక్తిమంతమైన రూపాన్ని ఇచ్చిన...

ధిక్కారానికి ఆసరా ఇచ్చిన అక్షరకారుడు

అక్షరాల్ని అసహాయుల వైపు నిలిపిన విశిష్ట అమెరికన్ రచయిత హోవర్డ్ ఫాస్ట్. రచనా వ్యాసంగాన్ని పీడితుల పక్షంగా నిర్మించిన అరుదైన మేధావి. బానిసల తిరుగుబాటుకు శక్తిమంతమైన రూపాన్ని ఇచ్చిన సృజనశీలి. ఎక్కడో పురాతన చరిత్ర పుటల్లో మరుగున పడిన ‘స్పార్టకస్’ వ్యక్తిత్వాన్ని సజీవంగా వెలికితీసి, ఒక ధిక్కార స్వరంగా మళ్లీ పునఃసృష్టి చేసిన మహావ్యక్తి. సాహిత్య ప్రయోజనం సామాజిక హితమేనని ఆచరణలో నిరూపించిన ఆలోచనాపరుడు హోవర్డ్ ఫాస్ట్.

న్యూయార్క్‌లో 1914, నవంబర్ 11న హోవర్డ్ మెల్విన్ ఫాస్ట్ అత్యంత బీద కుటుంబంలో జన్మించారు. తొమ్మిదేళ్లకే తల్లి మరణించింది. తండ్రి ఉపాధిని వెతుక్కుంటూ వెళ్లిపోయాడు. ఆ పరిస్థితుల్లో వీధుల్లో వార్తా పత్రికలు అమ్మడం మొదలుకొని న్యూయార్క్ పబ్లిక్ లైబ్రరీలో చిరుద్యోగిగా పనిచేసేంత వరకూ హోవర్డ్‌ ఫాస్ట్‌ ఎన్నో అవతారాలు ఎత్తారు. ఫ్యాక్టరీల్లో కార్మికుడిగా, ఓడల్లో గుమస్తాగా పనిచేశారు. కొన్నాళ్లు దేశ దిమ్మరిగా తిరిగారు. విపరీతంగా సాహిత్యం చదివారు. 18 ఏళ్లకే రచయితగా మారారు.

రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ‘అమెరికన్ వాయిస్’ పత్రికకు విలేకరిగా పనిచేసిన ఫాస్ట్, వార్ కరస్పాండెంట్‌గా చైనా, బర్మా దేశాలతో పాటు ఇండియాకు కూడా వచ్చారు. ఆ అనుభవంతోనే భయంకరమైన బెంగాల్ కరువును ‘ద ప్లెడ్జ్’ అనే ఆత్మకథాత్మక నవలలో కళ్లకు కట్టినట్లు చిత్రించారు. భారతదేశంలో బ్రిటిష్ వలసవాద దోపిడీ వల్ల ఏర్పడిన కరువు గురించి ప్రత్యక్ష అనుభవంతో రాసిన ఏకైక అమెరికన్ రచయిత హోవర్డ్ ఫాస్ట్ మాత్రమే.

జాక్ లండన్ ప్రఖ్యాత నవల ‘ఐరన్ హీల్’ (ఉక్కుపాదం)ను చదివి ఎంతగానో ప్రభావితమైన హోవర్డ్ ఫాస్ట్, కమ్యూనిస్టు పార్టీలో చేరారు. కన్నింగ్ హమ్, బెహన్ బోరక్, వాల్టర్ ఎరిక్సన్ వంటి కలం పేర్లతో కూడా పలు రచనలు చేశారు. ‘డైలీ వర్కర్’ కమ్యూనిస్ట్ పత్రికలో జర్నలిస్ట్‌గా పనిచేశారు. స్పానిష్ అంతర్యుద్ధంలో రిపబ్లికన్ పక్షాన పోరాడిన వీరుల కోసం సంక్షేమ నిధి ఏర్పాటయ్యింది. అందుకు విరాళాలిచ్చిన వ్యక్తుల పేర్లను ప్రభుత్వానికి వెల్లడించడానికి నిరాకరించడంతో హోవర్డ్ ఫాస్ట్‌కు మూడు నెలల జైలుశిక్ష విధించారు.


అక్కడే తన మనసులోని భావాలకు స్పష్టమైన రూపాన్నిచ్చారు ఫాస్ట్. ఖైదీగా ఉంటూనే స్వేచ్ఛను నినదించిన గొంతుకల్ని అక్షరీకరించి అద్భుతమైన చారిత్రక రచనగా మలిచారు. అదే ‘స్పార్టకస్’. ఆనాటి నిర్బంధ పరిస్థితుల్లో దానిని ప్రచురించడానికి ఎవరూ ముందుకు రాకపోతే ఆయనే సొంతంగా ప్రచురించారు. ఈ రచన లక్షలాది ప్రతులు అమ్ముడుపోయింది. అసంఖ్యాక భాషల్లోకి అనువాదమై ఎందరో అభిమానుల్ని సంపాదించుకుంది.

1951లో సరిగ్గా 75 ఏళ్ల క్రితం ప్రచురించిన ఈ పుస్తకం... రచయితగా హోవర్డ్ ఫాస్ట్‌నే కాక, బానిస తిరుగుబాటుదారుడిగా స్పార్టకస్‌ను కూడా విశ్వసాహిత్యంలో అజరామరం చేసింది. విప్లవం అంటే వ్యక్తిగత విద్వేషం కాదనీ, పీడితుల స్వప్నాల్ని సమష్టిగా వ్యక్తీకరించే సామూహిక కార్యాచరణ అని చాటింది. 1955లోనే ఆకెళ్ల కృష్ణమూర్తి తెలుగు అనువాదం రావిశాస్త్రి ముందు మాటతో వెలువడి, ఇప్పటికీ ప్రకాశిస్తూనే ఉంది. పుస్తక రూపంలో మాత్రమే కాదు, సినిమాగా, వెబ్ సిరీస్‌గా కూడా లక్షలాది మందిని ఈనాటికీ ఆకర్షిస్తోంది స్పార్టకస్ వీరోచిత గాథ.

సిటిజన్ టామ్ పెయిన్, ఫ్రీడమ్ రోడ్, ది ఇమ్మిగ్రాంట్స్, ఏప్రిల్ మార్నింగ్, మై గ్లోరియస్ బ్రదర్స్ వంటి సుమారు 80కి పైగా రచనలు చేశారు ఫాస్ట్. ఇంకా, కవితలు, వ్యాసాలు, చిన్న కథలు ఎన్నో రాశారు. ‘బీయింగ్ రెడ్’ పేరుతో ఆత్మకథ రాసుకున్న ఆయన, తర్వాత కమ్యూనిస్టు పార్టీ నిరంకుశత్వంతో విభేదిస్తూ దాన్నుంచి వైదొలిగాడు. అంతేకాదు ‘ది నేకెడ్ గాడ్: రైటర్ & కమ్యూనిస్టు పార్టీ’ అనే సంచలన రచనతో పార్టీ వైఖరిని తీవ్రంగా దుయ్యబట్టారు.

లేబర్ పార్టీ తరఫున హోవర్డ్ ఫాస్ట్ ఎన్నికల్లో పోటీ చేశారు. 2003 మార్చి 12న మరణించారు. ఫ్యాక్టరీ కార్మికుడిగా మొదలుకొని కవిగా, రచయితగా, జర్నలిస్టుగా, పరిశోధకుడిగా, చరిత్రకారుడిగా, చివరి వరకూ వివిధ స్రవంతుల్లో ప్రవహించారు. అన్యాయానికి, ఆధిపత్యానికి వ్యతిరేకంగా స్పార్టకస్ నవలలో ఫాస్ట్ రాసిన ముగింపు మాటలే మానవాళి భవిష్యత్తు పట్ల గొప్ప ఆశను ఆవిష్కరిస్తాయి. అవి– ‘‘సంఘంలో చాలా మంది ఎల్లప్పుడూ తమ శ్రమశక్తిని ధారపోసి సృష్టించిన సంపదనంతా ఏ కొద్దిమందో భుక్తం చేసుకుని మానవ జాతిని దోపిడీ చేసినంత కాలమూ, ఈ స్పార్టకస్ పేరు జ్ఞాపకముంటూనే ఉంటుంది... ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. భయం వల్లనో, శక్తిహీనత వల్లనో ఒక్కొక్కప్పుడు ఆ పేరు గుసగుసల్లోనే ఉండిపోవచ్చు. కానీ, అదే పేరు మరొకప్పుడు రణన్నినాదమై దిక్కులు పిక్కటిల్లేటట్లు, విశ్వమంతా కంపించేటట్లు ప్రతిధ్వనించవచ్చు.’’

గౌరవ్

సామాజిక కార్యకర్త

(నేడు హోవర్డ్ ఫాస్ట్ జయంతి..

‘స్పార్టకస్’ నవలకు 75 సంవత్సరాలు)

ఈ వార్తలు కూడా చదవండి..

416 గ్రామాల్లో భూ రీసర్వే పూర్తి.. భూదార్ నంబర్ల కేటాయింపుపై పొంగులేటి కీలక ఆదేశాలు

గూడూరులో దారుణం.. రూ.500 అప్పు తిరిగివ్వలేదని వ్యక్తిపై వేడి నూనె పోసిన మహిళ

Read Latest TG Govt And Telugu News

Updated Date - Nov 11 , 2026 | 12:40 AM