Share News

అయోడైజ్డ్ ఉప్పు–ఆంధ్రుడి అన్వేషణ

ABN , Publish Date - May 28 , 2026 | 03:14 AM

మనం ఇప్పుడు సర్వసాధారణంగా వాడే అయోడైజ్డ్ ఉప్పు (Iodised Salt) వెనుక ఉన్న మేధస్సు డాక్టర్ ఉలిమిరి రామలింగస్వామిది. ఒకప్పుడు భారతదేశాన్ని కుదిపేసిన సమస్య గొంతువాపు వ్యాధి (Goitre). అప్పట్లో దేశంలో...

అయోడైజ్డ్ ఉప్పు–ఆంధ్రుడి అన్వేషణ

మనం ఇప్పుడు సర్వసాధారణంగా వాడే అయోడైజ్డ్ ఉప్పు (Iodised Salt) వెనుక ఉన్న మేధస్సు డాక్టర్ ఉలిమిరి రామలింగస్వామిది. ఒకప్పుడు భారతదేశాన్ని కుదిపేసిన సమస్య గొంతువాపు వ్యాధి (Goitre). అప్పట్లో దేశంలో ఈ వ్యాధి వ్యాప్తి 30శాతానికి మించిపోయింది. కానీ ఈ మధ్య ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చి సర్వేల ప్రకారం గాయిటర్ రేటు 5శాతం కంటే తక్కువకు పడిపోయింది. దీనికి కారణమైన మహానుభావుడు ఉలిమిరి రామలింగస్వామి. సరిగ్గా పాతికేళ్ళక్రితం కన్నుమూసిన ఆయన వర్ధంతి నేడు.

రామలింగస్వామి శ్రీకాకుళంలో 1921 ఆగస్టు 8న జన్మించారు. ఆంధ్ర మెడికల్ కాలేజ్ నుండి 1944లో ఎంబీబీఎస్‌, 1946లో ఎండీ పట్టాలను పొందారు. ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం నుండి స్కాలర్‌షిప్ ద్వారా డాక్టర్‌ ఆఫ్‌ ఫిలాసఫీ, డాక్టర్‌ ఆఫ్‌ సైన్స్‌ డిగ్రీలను సాధించారు. భారతదేశానికి తిరిగి వచ్చి, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్‌లో పేథాలజిస్ట్‌గా 1954 దాకా పనిచేస్తూ, డిప్యూటీ డైరెక్టర్‌గా పదోన్నతి పొందారు. 1954లో ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ అఫ్ మెడికల్ సైన్సస్ (ఎయిమ్స్‌)లో ప్రవేశించి, పేథాలజీ ప్రొఫెసర్‌గా, డైరెక్టర్‌గా ఒక దశాబ్దకాలం (1969–1979) వ్యవహరించారు. హార్వార్డ్‌ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌ విజిటింగ్ ప్రొఫసర్‌గా, ఎయిమ్స్‌లో ప్రొఫెసర్ ఎమెరిటస్‌గా కూడా రాణించారు.

రోగుల పాలిట శాపంగా మారిన థైరాయిడ్ సంబంధిత సమస్యల గుట్టురట్టు చేయాలని సంకల్పించి, ఎయిమ్స్‌ సహకారంతో ఎందరో పేషంట్లతో మాట్లాడి, రమారమి లక్షమంది రోగులను పరిశీలించేరు. 1956 నుండి 1972 వరకు హిమాచల్‌ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాలో ఆయన చేసిన అధ్యయనం చాలా ముఖ్యమైనది. ప్రజలు వాడే సాధారణ ఉప్పులో అత్యల్ప మోతాదులో పొటాషియం అయోడేట్ (అయోడిన్) కలిపి పంపిణీ చేశారు. కొద్దిరోజుల్లోనే ఆ ప్రాంతంలో వ్యాధి తీవ్రత బాగా తగ్గిపోయింది. ఈ ప్రయోగమే నేడు భారతదేశంలో వాడుతున్న ‘అయోడైజ్డ్ ఉప్పు’ వెనుక ఉన్న రహస్యం. అక్కడ నుండి ఇంకా లోతైన పరిశోధన కోసం నీలగిరి ప్రాంతానికి వెళ్లి అక్కడ న్యూట్రిషన్ రీసెర్చ్ లేబరేటరీలో పరిశోధనలు చేసారు. థైరాయిడ్ సమస్యకి కారణం అయోడిన్ లోపం అని గుర్తించిన ఆయన ‘గొంతువాపు వ్యాధి సమస్యను మనం నిత్యం వాడే సాధారణ ఉప్పులో అయోడిన్‌ను చేర్చడం ద్వారా సులభంగా పరిష్కరించవచ్చు’నని ప్రకటించారు. మనం రోజూ వాడే సాధారణ ఉప్పులో (సోడియం క్లోరైడ్) పొటాషియం అయోడేట్ కలపడం ద్వారా గొంతువాపు వ్యాధిని నివారించవచ్చని నిరూపించారు. ఈ పరిశోధన ఫలితంగానే భారతదేశంలో నేషనల్ అయోడిన్ డెఫిషియన్సీ కంట్రోల్ ప్రోగ్రామ్ ప్రారంభమైంది. ఫలితంగా ఇప్పుడు మనం వాడుతున్న ‘అయోడైజ్డ్ ఉప్పు’ అందుబాటులోకి వచ్చింది. థైరాయిడ్ వ్యాధులు గణనీయంగా తగ్గాయి. ఇది వైద్య చరిత్రలోనే ఒక మైలురాయి.


పోషకాహార లోపం వల్ల పిల్లల్లో వచ్చే వ్యాధులపై ఆయన విస్తృత పరిశోధనలు చేశారు. గర్భిణీ స్త్రీలలో రక్తహీనతను తగ్గించడానికి ఐరన్ సప్లిమెంట్స్ అందించే జాతీయ కార్యక్రమాలకు ఆయన పరిశోధనలే పునాది. మధ్య ఆఫ్రికా దేశాల కంటే దక్షిణాసియా (భారతదేశం వంటి) దేశాలలో పిల్లల్లో పోషకాహార లోపం ఎందుకు ఎక్కువగా ఉందో వివరిస్తూ, 1996లో యునిసెఫ్ కోసం ఆయన రాసిన ప్రసిద్ధ నివేదిక ‘ది ఏషియన్ ఎనిగ్మా’లో ఇలా పేర్కొన్నారు: ‘‘దక్షిణాసియాలో కనిపించే విపరీతమైన పోషకాహార లోపానికి ప్రధాన కారణాలు... పురుషులు, స్త్రీల మధ్య సమాజంలో ఉన్న తీవ్రమైన లింగ అసమానతలలోనే లోతుగా నాటుకుపోయి ఉన్నాయి.’’ విటమిన్‌–ఎ లోపంపై రామలింగస్వామి గర్భవతులుగా ఉన్న కోతులపై పరిశోధన చేశారు. తల్లి కోతికి విటమిన్–ఎ లోపం ఏర్పడినప్పుడు, పుట్టబోయే పిల్ల కోతి కంటిలోని ‘రాడ్స్ అండ్ కోన్స్’ (వెలుతురును గుర్తించే కంటి భాగాలు) ఏ విధంగా దెబ్బతింటాయో ప్రయోగపూర్వకంగా నిరూపించారు. ప్రపంచ వైద్య చరిత్రలో ఈ విధమైన నష్టాన్ని కంటిచూపుతో సహా నిరూపించిన మొదటి శాస్త్రవేత్త ఆయనే. 1967లో బీహార్‌లో వచ్చిన ఘోరమైన కరవు సమయంలో, ఆహార కొరత లేకుండా ఏం చేయాలో సర్కారుకి ఈయనే సలహాలు ఇచ్చారు. 1984లో జరిగిన భోపాల్ గ్యాస్ దుర్ఘటన తర్వాత, అక్కడి బాధితులకు వైద్య సహాయం, పునరావాసం అందించే చర్యలను స్వయంగా ముందుండి నడిపించారు. 1994లో మహారాష్ట్ర, గుజరాత్‌లలో ప్లేగు వ్యాధి విజృంభించినప్పుడు ప్రభుత్వానికి దిశానిర్దేశం చేసిన టెక్నికల్ అడ్వైజరీ కమిటీకి రామలింగస్వామి చైర్మన్‌. సమాజం నుండి, కొన్ని ప్రభుత్వ వర్గాల నుండి తీవ్ర వ్యతిరేకత వచ్చినప్పటికీ, ఎయిడ్స్ వ్యాధి భారతదేశంలోకి కూడా చొచ్చుకొని వచ్చి మహమ్మారిగా మారే అవకాశముందని ముందే అంచనా వేసిన వ్యక్తి రామలింగస్వామి. ఆయన చొరవతోనే దేశవ్యాప్తంగా హెచ్.ఐ.వి టెస్టింగ్ కిట్లు, ల్యాబ్‌లు అందుబాటులోకి వచ్చాయి. భారతదేశంలో ఎయిడ్స్ నివారణ పరిశోధనలకు ఆయనే పునాది వేశారు. ఇన్ని పరిశోధనలతో వైద్యరంగంలోనే ఒక విప్లవాన్ని తీసుకొచ్చిన రామలింగస్వామి మే 28, 2001న క్యాన్సర్ బారినపడి మరణించారు.


భారత వైద్యరంగానికి రామలింగస్వామి అందించిన సేవలు గుర్తిస్తూ భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్‌లతో సత్కరించింది. ఆయన గౌరవార్థం న్యూఢిల్లీలోని ICMR ప్రధాన కార్యాలయానికి ‘రామలింగస్వామి భవన్’ అని పేరు పెట్టారు. ఒక అంతర్జాతీయ సదస్సులో ఒక విలేకరి రామలింగస్వామిని, ‘‘మీరు దశాబ్దాలుగా ఉప్పు మీదే ఎందుకు ఇంతగా రీసెర్చి చేస్తున్నారు?’’ అని అడిగితే, ఆయన నవ్వుతూ, ‘‘నేను భారతదేశంలో పుట్టాను, ఇక్కడి ఉప్పు తిని పెరిగాను. అందుకే ‘ఉప్పు తిన్న విశ్వాసం’ చూపిస్తూ, ఆ ఉప్పు రుణం తీర్చుకుంటున్నాను!’’ అని చమత్కరించారు.

కొమ్మాజోస్యుల కృష్ణమూర్తి

ఈ వార్తలు కూడా చదవండి..

న్యాయవాది మొయినుద్దీన్‌ హత్యకేసులో కీలక పరిణామం

లోకేష్ నాయకత్వంలో టీడీపీ మరింత బలంగా ముందుకెళ్తుంది: ఎంపీ శ్రీభరత్

For More AP News And Telugu News

Updated Date - May 28 , 2026 | 03:14 AM