Share News

‘సర్‌’ జ్ఞానేశ్‌ సంకటంలో సర్కార్‌!

ABN , Publish Date - Sep 27 , 2026 | 02:40 AM

భారత ఎన్నికల సంఘం ప్రధానాధికారి (సీఈసీ) జ్ఞానేశ్‌ కుమార్‌ తన విధ్యుక్త ధర్మాన్ని నిర్వర్తిస్తున్న తీరును ఇటీవలికాలంలో నేనూ పలుమార్లు ఆక్షేపించాను. ‘సర్‌’ (ఓటర్‌ జాబితాల ప్రత్యేక...

‘సర్‌’ జ్ఞానేశ్‌ సంకటంలో సర్కార్‌!

భారత ఎన్నికల సంఘం ప్రధానాధికారి (సీఈసీ) జ్ఞానేశ్‌ కుమార్‌ తన విధ్యుక్త ధర్మాన్ని నిర్వర్తిస్తున్న తీరును ఇటీవలికాలంలో నేనూ పలుమార్లు ఆక్షేపించాను. ‘సర్‌’ (ఓటర్‌ జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ) ప్రక్రియ అమలుపై సీఈసీ, ఆయన సహచర ఎన్నికల కమిషనర్ల (ఈసీ) మధ్య అభిప్రాయ భేదాలను పాత్రికేయురాలు రితికా చోప్రా ఇటీవల బహిర్గతం చేశారు. ఆమె పరిశోధనాత్మక కథనాన్ని ‘ది ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’ ప్రచురించకపూర్వమే ఆ రాజ్యాంగ సంస్థలో పరిస్థితులు సజావుగా లేవన్న వాస్తవం మనలో చాలా మందికి తెలుసు. త్రిసభ్య రాజ్యాంగ సంస్థ అయిన ఎన్నికల సంఘం సమైక్యంగా బాధ్యతలు నిర్వర్తించడం లేదని ఇప్పుడు ప్రజాబాహుళ్యానికీ తెలిసిపోయింది. ఎన్నికల ప్రక్రియ పవిత్రత గురించి భారతీయ ఓటర్లు కలవరపడుతున్నారు.

ఆరోపణలు వెల్లువెత్తుతున్నా జ్ఞానేశ్‌ కుమార్‌ నిష్క్రమించడం లేదు. తనపై వచ్చిన నిందారోపణలతో ఎన్నికల సంఘం ప్రతిష్ఠ మసకబారిందనే వాస్తవాన్ని గుర్తించి, నైతిక బాధ్యతతో జ్ఞానేశ్‌ గౌరవప్రదంగా రాజీనామా చేస్తారని ఆశించవద్దు. ఒక గౌరవనీయుడైన వ్యక్తి ఇటువంటి సందర్భాల్లో ‘వివాదాన్ని పొడిగించి భారత ప్రజాస్వామ్యానికి హాని చేసే ఉద్దేశం నాకు లేదు. కనుక నేను పదవి నుంచి వైదొలుగుతాను’ అని ప్రకటిస్తాడు. ‘నేను ఏ తప్పూ చేయలేదు. అయినప్పటికీ పదవిలో కొనసాగడం ఎన్నికల వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని ప్రభావితం చేయవచ్చు’ అని కూడా అనవచ్చు. జ్ఞానేశ్‌ రాజీనామాను ప్రభుత్వం ఆమోదిస్తుంది. చాలా కాలంగా తాము చెప్పినట్లు చేసిన ఈ సివిల్‌ సర్వీస్‌ అధికారిని కొంత విరామం అనంతరం ఏదో ఒక దేశానికి భారత రాయబారిగా పంపించవచ్చు. జమ్మూ–కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తినిచ్చిన రాజ్యాంగ అధికరణ 370 రద్దు, రామ జన్మభూమి ట్రస్ట్‌ ఏర్పాటు, సహకార సంఘాలను ఏకీకృత అధికార పరిధిలోకి తీసుకురావడం మొదలైన చాలా వ్యవహారాలలో ఆయన కీలక పాత్ర నిర్వహించారు కనుక ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్‌గా పంపవచ్చు. జ్ఞానేశ్‌ స్థానంలో సీఈసీగా మరో వీర విధేయుడిని ప్రభుత్వం నియమించుకుంటుంది.


అయితే జ్ఞానేశ్‌ కుమార్‌ తనంతట తానుగా వెళ్లిపోరు. మరి, ప్రభుత్వానికి ఇది ఆమోదయోగ్యమేనా? జ్ఞానేశ్‌ను ‘నిర్వాచన్‌ సదన్‌’ నుంచి గెంటివేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని నేను భావించడంలేదు. జ్ఞానేశ్‌ను సాగనంపేందుకు ప్రభుత్వం విముఖత చూపవచ్చు. ఆయన పట్ల ప్రేమాభిమానాలు ఉండడం అందుకు కారణం కాదు. మరేమిటి? జ్ఞానేశ్‌ నిష్క్రమణ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రతిష్ఠను దెబ్బతీస్తుంది కనుక. యూపీఏ ప్రభుత్వ చివరి రోజులలో చోటుచేసుకున్న ఘటనలు భారతీయ జనతాపార్టీలో ఎవరూ ఇంకా మరచిపోలేదు. ప్రభుత్వ వ్యవస్థల్లో అవినీతిపై వివాదాలు తీవ్రమవుతున్న కొద్దీ, పత్రికలు ప్రభుత్వ పదవులలో ఉన్నవారిని లక్ష్యంగా చేసుకుని ఆ వివాదాలను మరింత పెంచేవి. పత్రికలు ఎవరిని లక్ష్యంగా చేసుకున్నా యూపీఏ పెద్దలు సదరు మంత్రులకు ఉద్వాసన చెప్పారు. ఈ క్రమంలో ప్రధానమంత్రి డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌ ఒత్తిడికి లొంగిపోయే నాయకుడుగా ప్రజలకు కనిపించారు. ఇది యూపీఏకు నష్టదాయకమయింది. ఆరోపణలకు గురైన ఒక మంత్రిని తొలగించినప్పుడు పత్రికలు, ప్రతిపక్షాలు ప్రభుత్వంపై మరిన్ని విమర్శనాస్త్రాలను సంధించేవి. మరింత మంది మంత్రులు రాజీనామా చేయాలనే డిమాండ్ వచ్చేది. ఈ పరిణామాలు అంతిమంగా 2014 సార్వత్రక ఎన్నికలలో యూపీఏ ఓటమికి దారితీశాయి.

యూపీఏ సర్కార్‌ ఎదుర్కొన్న దయనీయ పరిస్థితులు తన ప్రభుత్వానికి వాటిల్లాలని నరేంద్ర మోదీ ఎందుకు కోరుకుంటారు? అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ మీడియా విమర్శలను ఆయన లెక్క చేయలేదు. నిర్ణయాలను వెనక్కి తీసుకోవడానికి ఆయన ససేమిరా అంటారు. ఈ కారణంగానే విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను తొలగించడంలో తాత్సారం చేశారు. జంతర్‌ మంతర్‌ వద్ద అశేష యువజనులు వారాల తరబడి చేసిన నిరసనలు ఆసేతు హిమాచలం దావానలంలా వ్యాపించే ప్రమాదమున్నదని గ్రహించిన తరువాతనే నరేంద్రమోదీ ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామాకు ఆదేశించారు. లేనిపక్షంలో తాను యువజనుల మద్దతు కోల్పోవలసివస్తుందని మోదీ భయపడ్డారు. కాబట్టి, ఒకవేళ ఈ ప్రభుత్వం జ్ఞానేశ్‌ కుమార్‌ను తొలగిస్తే, అది మోదీకి వేరేదారి లేకపోయినందువల్ల మాత్రమే జరుగుతుంది.


మరి, సీఈసీగా జ్ఞానేశ్‌ కుమార్‌ కొనసాగిన పక్షంలో జరిగేదేమిటి? ఓటర్‌ జాబితాల ప్రత్యేక సవరణ ప్రక్రియను, ఎన్నికల వ్యవస్థను ఆయన దుర్వినియోగం చేశారన్న వాస్తవం ప్రజల మనసుల్లో అలాగే ఉంటుంది. పత్రికలను ప్రభుత్వం మచ్చిక చేసుకోగలదుగానీ సామాజిక మాధ్యమాలపై నియంత్రణ సాధ్యమయ్యే విషయం కాదు. అవి సర్వస్వతంత్రాలు. న్యూస్‌ చానెల్స్‌ విచక్షణారహితంగా ఇస్తున్న మద్దతు, ‘విశ్వసనీయ వర్గాలు’ ‘మూలాల’ పేరుతో ప్రచారం చేస్తున్న విషకథనాలు ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయడంలో విఫలమవుతున్నాయన్న సత్యాన్ని ప్రభుత్వం గ్రహిస్తోంది. జంతర్‌ మంతర్‌ వద్ద విద్యార్థుల, యువజనుల నిరసనలను అణచివేయడంలో అవేమీ ఉపకరించలేదు. ఎన్నికల సంఘంలో ఏకీభావం లోపించడం గురించి బహిర్గతమైన వాస్తవాలపై ప్రజాగ్రహం చెలరేగకుండా నియంత్రించడమూ వాటిద్వారా అసాధ్యం. అందువల్ల, ప్రజల ఓపికను పరీక్షించడం ఒక్కటే ప్రభుత్వం దగ్గర మిగిలింది. సీఈసీకి ఉద్వాసన చెప్పి తీరాలని డిమాండ్‌ చేసీ చేసీ జనం విసుగుచెంది మిన్నకుండిపోతారని ఆశిస్తోంది. ఒక వారం తరువాత మీడియా దగ్గర కొత్త విషయాలు ఏవీ ఉండబోవనీ, జ్ఞానేశ్‌పై విమర్శలు పచ్చినిజాలే అయినప్పటికీ అవి పదే పదే పునరావృతమయితే ప్రజలకు తప్పక విసుగుపుట్టిస్తాయని, వారు వాటిని పట్టించుకోవడం మానివేస్తారని ప్రభుత్వం భావిస్తోంది. ప్రజలదృష్టిని మళ్లించేందుకు కొన్ని ‘ఇతర’ అంశాలను తెరపైకి తీసుకువచ్చే అవకాశమూ లేకపోలేదు. జ్ఞానేశ్‌పై మరోసారి ప్రతిపక్షాలు అభిశంసన తీర్మానాన్ని తీసుకువచ్చి తీరుతాయి కూడా. అయితే లోక్‌సభ స్పీకర్‌ గానీ, రాజ్యసభ చైర్మన్ గానీ ఆ తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు, పెట్టినా దానిపై చర్చించేందుకు అంగీకరిస్తారా? అంగీకరించరు. కొద్ది నెలలక్రితం విపక్షాలు ఇదే సీఈసీకి వ్యతిరేకంగా తీసుకువచ్చిన అభిశంసన తీర్మానానికి పట్టిన గతే తాజా తీర్మానానికీ పడుతుంది. ఎన్నికల సంఘం వ్యవహారాలలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడం లేదు కనుక, అత్యున్నత న్యాయస్థానం ఉదాసీనతను ప్రభుత్వం తనకు అనుకూలంగా ఉపయోగించుకోవచ్చు.

ఈ వివాదం రేగడానికి మరో అదనపు కారణం ఢిల్లీలో ‘సర్‌’ ప్రక్రియలో అవకతవకలే. ఢిల్లీలోని 1.45 కోట్ల ఓటర్లలో 47 లక్షల మంది ఓటర్ల పేరును ‘సర్‌’ ఎన్యూమరేషన్‌ దశలోనే తొలగించారు. ముసాయిదా జాబితాలలోని 97 లక్షల మంది ఓటర్లలో 33లక్షల మందికి ‘తార్కిక వ్యత్యాసాలు’ అనే కారణంతో నోటీసులు జారీ చేశారు. దశాబ్దాలుగా ఓటు వేస్తున్నవారిని తమకు ఓటుహక్కు ఉందని నిరూపించుకోవాలని నోటీసు ఇచ్చారు. ఓటర్‌ జాబితాల నుంచి లక్షలాది ఓటర్ల పేర్లను తొలగిస్తే ప్రజలు ఆగ్రహోదగ్రులు అవ్వరని కేవలం ఒక మోసగాడు లేదా ఒక మూర్ఖుడు లేదా జ్ఞానేశ్‌ మాత్రమే విశ్వసించగలరు. ఓటర్‌ జాబితాలపై నెలకొన్న ఈ గందరగోళాన్ని త్వరితంగా పరిష్కరించాలని ప్రభుత్వంలో ఉన్న ఓ పెద్ద మనిషి ఆదేశిస్తే, సీఈసీపై ప్రజాగ్రహం సమసిపోవచ్చు, నిరసనలకు ప్రాధాన్యం పోవచ్చు. మరి, ఇది వాస్తవిక అంచనాయేనా? సమస్యేమిటంటే జ్ఞానేశ్‌ స్వయంగా ఈ సమస్యలో భాగం. ఒక ప్రభుత్వాధికారిగా విధులు నిర్వహించడంలో ఆయన ఒక అహంకారి. సర్‌ ప్రక్రియలో ఆయన జోక్యం చేసుకుంటున్నారని విన్నప్పుడు దానిని విశ్వసించనివారెవరూ ఉండరు.


జ్ఞానేశ్‌కు ప్రభుత్వం ఇంతగా మద్దతు ఇవ్వడానికి ఒక అవ్యక్త కారణం ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీకి మరో ఐదారునెలల్లో జరగవలసిన ఎన్నికలే. ఆ ఎన్నికలు షెడ్యూల్‌ ప్రకారమే జరుగుతాయని జ్ఞానేశ్‌ ఘంటాపథంగా చెబుతున్నారు. యూపీ ఎన్నికలలో బీజేపీ పెద్ద మెజారిటీతో గెలిస్తే అధికారపక్షానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా, మోదీ ప్రజాదరణ తగ్గిపోయిందన్న భావనను అది ప్రభావితం చేస్తుంది. దేశ ప్రజల్లో ఉన్న ఆ అభిప్రాయం సమసిపోగలదని మోదీ ప్రభుత్వం భావిస్తున్నందున, దాని వ్యూహంలో జ్ఞానేశ్‌ ఒక కీలక వ్యక్తిగా ఉండవచ్చు. అయితే, ఎన్నికల సంఘం ఉద్దేశాలు, దాని తీరుతెన్నులపై ప్రజల్లో చాలా అనుమానాలు ఉన్నాయనేది వాస్తవం. ఒకవేళ యూపీలో బీజేపీ మళ్లీ అధికారానికి వచ్చినా ఆ విజయం కనీసం ప్రజల దృష్టిలో చట్టబద్ధమైనది, సమగ్రమైనది కాకపోవచ్చు. జ్ఞానేశ్‌ విషయంలో ఏం చేయాలన్నది నిర్ణయించుకొనేముందు, ప్రజల ఆగ్రహం ఎంతవరకు కొనసాగగలదో ప్రభుత్వం వేచి చూస్తుంది. ప్రజా వ్యతిరేకత మరింతగా పెరుగుతూ, అది దీర్ఘకాలం నిలబడితే అప్పుడు ఆయన్ని తొలగించడం అనివార్యమవుతుంది. చివరగా ఒక నిష్ఠుర సత్యాన్ని చెప్పక తప్పదు. సీఈసీకి వ్యతిరేకంగా ఉధృతమవుతోన్న ఈ నిరసనల బెడద నుంచి ప్రభుత్వం ఒకవేళ ఎప్పటికైనా బయటపడినప్పటికీ, మోదీ సర్కార్‌కు మంచి రోజులు ముగిసిపోయాయన్న భావనను ప్రజల మనసుల నుంచి చెరిపివేయడం కష్టం. పరిస్థితులు తలకిందులు అయినప్పుడు సంక్షోభాలు వస్తూనే ఉంటాయి.

వీర్‌ సంఘ్వి

సీనియర్‌ జర్నలిస్ట్‌

(ది ప్రింట్‌ సౌజన్యం)

ఈ వార్తలు కూడా చదవండి..

అమరావతి గ్రామకంఠం మినహాయింపులపై సీఆర్డీఏ స్పష్టత

సీఈసీపై పోరుకు ఇండియా కూటమి సిద్ధం.. సెప్టెంబర్ 30న కీలక సమావేశం

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 27 , 2026 | 02:40 AM